Saturday, March 22, 2014

thumbnail

నన్నయ్య నాగ స్తుతి పద్యాలు భావరాజు పద్మినీ ప్రియదర్శిని

నన్నయ్య నాగ స్తుతి పద్యాలు
భావరాజు పద్మినీ ప్రియదర్శిని


నన్నయ్య వ్రాసిన ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలోని ఉదంకోపాఖ్యానంలోని నాలుగు నాగస్తుతి పద్యాలు శబ్దార్థ సంధానంలో అపురూపమైనవి. ఉదంకుడు నాగరాజులైన అనంతుడు, వాసుకి, ఐరావతులు, తక్షకుడులను నలుగురిని నాలుగు పద్యాల్లో స్తుతించే సందర్భం! నిజాయితీగా చెప్పాలంటే నాగజాతి ప్రముఖులను స్తుతించే ఈ విధానం నాగప్ప నాగన్న నాగరాజా... మా కష్టమంత బాపు తండ్రి నాగరాజా...! అనే జానపదుని హృదయ స్పందనే! అయితే నన్నయ్య నడిపిన చంపకోత్పల వృత్తాలు సాహిత్యంలో ఒక ఒరవడిని సృష్టించాయి.
ఏ సహృదయుణ్ణి అయినా రసప్లావితుణ్ణి చేస్తాయి. సర సర మనే సర్పాల చలనాన్ని, బుస్సు బుస్సు మనే శబ్దాల్ని అవే శబ్దాలతో అర్థాన్ని కూడా సాధించి పాముల పద్యాల్ని వ్రాయడం నన్నయ్య పద్యశిల్పంలోని ప్రత్యేకత. ఊష్మాక్షరాలైన శ, ష, స, హలతో ఖ్ఛిఝజీ గౌఠ్ఛీజూట ఖ్ఛిఝజీ ఇౌట్ఛౌ్టట అయిన అంతస్థాలతో (య ర ల వ) నాలుగు పద్యాలూ బుస్సు బుస్సుమని నాలుగు పాములై కొన తోక మీద నిలబెడతాయి. శబ్దార్థాలు ఆది దంపతులవంటివన్న కాళిదాసు మాటను సార్థకం చేశాయి (వాగర్థావివ... రఘువంశం మొదటి శ్లోకం). అసాధారణమైన ఈ ధారణ ఎంతో ప్రయత్నించినప్పటికీ తమకు సాధ్యం కాలేదని చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి చెప్పారు.

బహువన పాదపాబ్ధి కులపర్వతపూర్ణ సర స్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిదాల్చి దు
స్సహతరమూర్తికి న్జలధిశాయికి పాయకశయ్యయైన అ
య్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్

ఎన్నో అడవిచెట్లతోనూ (పాదపము అంటే చెట్టు), సముద్రాలతోనూ (అబ్ధి), కులపర్వతాలతోనూ, పూర్ణ సరః అంటే నిండైన సరస్సులతోనూ, సరస్వతీ అంటే నదులతోనూ, సహిత=కూడిన, మహా భూభారాన్ని, అజస్ర=స్థిరమైన, సహస్రఫణాళి=వేయిపడగలతో, దాల్చి, దుస్సహరత=భరింపశక్యము కాని మూర్తి కల విష్ణుమూర్తికి నిరంతరం పాన్పుగా ఉన్న నాగరాజు అనంతుడు, దుష్కృతాంతకుడు = పాపములని అంతమొందించేవాడు, మాకు ప్రసన్నుడు అవుగాక - అని ప్రార్థన.
భావం : (భూభారాన్ని ధరిస్తూ, దుస్సహతరమైన విగ్రహం గల విష్ణువుకు ఎల్లప్పుడూ శయ్యగా ఉండే అనంతుడికి మామీద అనుగ్రహం కలుగుగాక.)

అనంతుడిని ప్రార్థించిన తర్వాత, ఉదంకుడు వాసుకిని ప్రార్థిస్తునాడు:

అరిదితపో విభూతి నమరారుల బాధలు వొందకుండగా
నురగల నెల్ల గాచిన మహోరగ నాయకుడా నమత్సురా
సురమకుటాగ్ర రత్నరుచి శోభిత పాదునకద్రినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు బ్రసన్నుడయ్యెడున్

అరిది=అపురూపమైన తపశ్శక్తితో రాక్షసుల చేత (అమరుల అరులు అంటే దేవతల శత్రువులు) బాధలు పొందకుండా నాగులందరినీ రక్షించిన గొప్ప నాగనాయకుడు, ఆనమత్=నమస్కరించుచున్న దేవ రాక్షసుల కిరీటాల చివరనున్న రత్నకాంతులచే ప్రకాశించే పాదాలు గల పార్వతీపతికి అలంకారమైనవాడు అయిన వాసుకి మాకు ప్రసన్నుడు కావాలి.
భావం : రాక్షసుల నుండి నాగులను కాపాడిన గొప్పరాజు, వంగి నమస్కరించే దేవతల, రాక్షసుల కిరీటాల పైభాగంలో ఉండే మణుల కాంతితో ప్రకాశించే పాదాలుగల శివుడికి ఆభరణమైన వాసుకి మమ్మల్ని అనుగ్రహించుగాక.
ఆ తర్వాత ఐరావతుడనే సర్పరాజుని, చివరకి తక్షకుడిని ప్రార్థిస్తాడు ఉదంకుడు.

ఉ. దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపులప్రతాపసం
భావితశక్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర
త్పావకతాపితాఖిలవిపక్షులు నైన మహనుభావు లై
రావతకోటిఘోరఫణిరాజులు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్. 1-1-106
భావం : (మహానుభావులైన ఐరావత నాగవంశంలోని కోటిసంఖ్యాకులైన సర్పరాజులకు మాపట్ల అనుగ్రహం కలుగుగాక).

ఉ. గోత్రమహామహీధరనికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతిఖేలన నొప్పి సహాశ్వ సేనుఁడై
ధాత్రిఁ బరిభ్రమించు బలదర్పపరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్. 1-1-107
భావం : (గొప్పవాడు, అశ్వసేనుడి తండ్రి అయిన తక్షకుడికి మాపై అనుగ్రహం కలుగుగాక).

భావం : ఇలా ఆ రాజులను స్తుతించి, అక్కడ తెల్లని, నల్లని దారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలను, పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను, ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్యపురుషుడిని చూసి, అర్థవంతాలైన మంత్రాలతో అతడిని స్తుతించగా అతడు ప్రసన్నుడై ఉదంకుడితో ఇలా అన్నాడు.)
(మితవచనా! నీ స్తుతులకు మెచ్చాను. నీకేమి కావాలో చెప్పమనగా)
ఉదంకుడు సంతోషించి, నాగకులం మొత్తం తన వశమయ్యేలా అనుగ్రహించమని కోరాడు. ఆ దివ్యపురుషుడు అప్పుడు, అలాగైతే ఈ గుర్రం చెవిలో ఊద"మని అన్నాడు. ఉదంకుడు అలాగే. మూలంలో ఆ దివ్యపురుషుడు ఉదంకుడికి గుర్రం అపానంలో ఊదమని చెప్పినట్లు ఉంది.
(ఆ గుర్రం సర్వేంద్రియ మార్గాల నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు పాతాళంలో వ్యాపించగా పాములన్నిటితో పాటు ఆ సర్పాల రాజు కూడా భయపడ్డాడు.)


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information