జగత్పోషణే దైవత్వం - అచ్చంగా తెలుగు

 జగత్పోషణే దైవత్వం

సి.హెచ్. ప్రతాప్




మన పాదాలను మోసే పవిత్ర భూమిలో, ఆకలి మంటలను చల్లార్చే నవధాన్యంలో, పచ్చగా చిగురించే చేలో దైవానుగ్రహాన్ని గుర్తించగలిగితే మానవ జీవితం నిత్య కృతజ్ఞతామయమవుతుంది. భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో విశ్వాంతరాళాల్లో ఉన్నాడనే భ్రమ నుంచి, మన అనుక్షణ ఉనికికి, పోషణకు ఆయనే పరమాధారమనే పరంజ్యోతి దిశగా నడిపిస్తుంది భగవద్గీత పదిహేనవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకం.

గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ।
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ॥

"భూగోళంలో నా ప్రాణశక్తితో ప్రవేశించి సమస్త ప్రాణికోటిని ధరిస్తున్నాను. అలాగే రసస్వరూపుడైన చంద్రుడనై సమస్త సస్యాలను, ఓషధులను పోషిస్తున్నాను" అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడు. ఇక్కడ 'ఓషధులు' అంటే కేవలం మూలికలు మాత్రమే కావు; సమస్త జీవకోటి జీవనానికి ప్రాణాధారమైన ధాన్యాలు, వృక్షజాలం దీని పరిధిలోకి వస్తాయి. అమృత రసస్వరూపుడైన చంద్రుని ద్వారా మొక్కలకు పోషణను, రసాత్మక శక్తిని ప్రసాదించి, భూమిలోని సుపోషక శక్తి ద్వారా జగత్తును నిలబెడుతున్నది ఆ భగవత్ చైతన్యమేనని ఈ శ్లోకం తేటతెల్లం చేస్తోంది.

మానవుడు తన ఐహిక విజయాలను, సంపదలను కేవలం స్వయంకృతాపరాధమైన అహంకారంతో తన శ్రమ ఫలితంగానే భావిస్తుంటాడు. కార్యసాధనకు శ్రమ ఆవశ్యకమే అయినప్పటికీ, ఆ శ్రమ ఫలించడానికి కావలసిన మట్టి, నీరు, గాలి, ఆహారధాన్యాలను మానవుడు సృష్టించలేడనే సత్యాన్ని విస్మరిస్తున్నాడు. ఈ యథార్థ అవగాహన మన శ్రమను తక్కువ చేయదు; మనలోని అహంకారాన్ని పటాపంచలు చేసి అత్యున్నతమైన వినయ విధేయతలను, జీవకారుణ్యాన్ని పెంపొందిస్తుంది. మనకు లభిస్తున్న ఈ నిరంతర పోషణ వెనుక ఉన్న దివ్యశక్తిని గ్రహించినప్పుడు, సమాజంలో ఆకలితో అలమటించే తోటి జీవుల అవసరాలను తీర్చాలనే ధర్మబద్ధమైన బాధ్యత అంతరంగంలో స్వయంచాలకంగా మేల్కొంటుంది.

తైత్తిరీయోపనిషత్తు “అన్నం న నింద్యాత్; తద్వ్రతమ్” అని దివ్యోపదేశం చేస్తోంది. అంటే ఆహారాన్ని తృణీకరించకూడదని, అన్నాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి పూజించడమే ముముక్షువుకు మహత్తర వ్రతమని పేర్కొంటోంది. ఈ ప్రాచీన సనాతన సందేశాన్ని అనునిత్య ఆచరణలోకి తెచ్చినప్పుడు—పాత్రలో అవసరమైనంత మాత్రమే వడ్డించుకోవడం, అన్నాన్ని వృథా చేయకపోవడం, ఆకలిగొన్నవారికి అన్నదానం చేయడం మన నైతిక ధర్మాలుగా మారుతాయి. ప్రతీ అన్నపు ముద్ద వెనుక భగవంతుని సృష్టి వైభవం, ప్రకృతి సహకారం, కష్టజీవియైన రైతు నిస్వార్థ శ్రమ ఇమిడి ఉన్నాయని స్మరించుకోవాలి.

భగవాన్ రమణ మహర్షి తమ ఉపదేశసారంలో “జగత ఈశధీయుక్తసేవనమ్” అని ఉద్ఘాటించారు. ఈ సమస్త విశ్వాన్ని అష్టమూర్తి స్వరూపుడైన ఈశ్వరుని ప్రత్యక్ష రూపంగా భావించి సేవించడమే అత్యుత్తమమైన దైవారాధన అవుతుందని స్పష్టం చేశారు. ఈ రమణీయ బోధను గీతాశ్లోకంతో సమన్వయపరిస్తే, జీవకోటిని పోషించే ప్రకృతిని పరమేశ్వర స్వరూపంగా పూజించడం, సంరక్షించడమే నిజమైన భక్తియోగమని ప్రస్ఫుటమవుతుంది.

స్వామి వివేకానంద తమ రామేశ్వరం ప్రసంగంలో “సాక్షాత్ దరిద్రులలో, ఆకలితో అలమటించే వారిలో, రోగులలో శివుణ్ని దర్శించి సేవించడమే అత్యుత్తమమైన శివపూజ” అని గర్జించారు. సమస్త జగత్తును అనుక్షణం పోషిస్తున్న జగన్నాథుని స్మరించే సాధకుడు, ఆకలి బాధతో నడిచే తోటి మనుషుల పట్ల ఉదాసీనంగా ఉండకూడదని, మానవ సేవే మాధవ సేవగా జీవించాలని వివేకానందుల బోధనలు ప్రబోధిస్తున్నాయి.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి "సర్వజీవులకు అన్నదానం చేయడం, ప్రేమతో ఆహారాన్ని అందించడం భగవంతుని పోషణోత్సవంలో భాగస్వాములు కావడమే" అనే దివ్యామృత సందేశం ఈ గీతాంతర్యాన్ని మరింత విస్పష్టం చేస్తుంది. మన ఆకలి తీరినప్పుడు లభించే తృప్తిని ఇతర జీవులకు పంచినప్పుడే ఆ దివ్యత్వం మన యందు పరిపూర్ణంగా వికసిస్తుందని బాబా వివరిస్తారు.

ఒక కర్మయోగియైన రైతు తన పుత్రునితో స్వర్ణమయంగా పండిన పొలంలో నడుస్తూ, "నాయనా! మనం పడే శ్రమను ఆ పరమాత్మ శక్తితో అనుసంధానించినప్పుడే ఈ పంట చేతికి వచ్చింది. నేల, నీరు, వెలుగు ఆ దేవుడి ప్రసాదాలు. వీటిని వృథా చేయకుండా కాపాడుకోవడం, మనకు లభించిన ధాన్యాన్ని ఆకలిగొన్నవారితో పంచుకోవడమే ఆయనకు మనంర్పించే నిజమైన నమస్కారం" అని బోధించే సన్నివేశం ఈ తత్త్వానికి సజీవ నిదర్శనం.

దైవస్మరణ కేవలం పూజామందిరాలకే పరిమితం కాకుండా మన నిత్యజీవిత నిర్ణయాల్లో ప్రతిబింబించాలి. తినే ఆహారాన్ని దైవప్రసాదంగా స్వీకరించడం, దాన్ని పండించే రైతు శ్రమను గౌరవించడం, ఇతర జీవుల పట్ల అపారమైన దయానుకంపాభావాలను కలిగి ఉండటం ఆధ్యాత్మిక సాధనకు సార్థకతను చేకూరుస్తాయి. మనకు లభించిన అమృత పోషణను సమాజహితం కోసం తిరిగి అందించే కరుణాకల్పవృక్షాలుగా మనం మారినప్పుడే ఆధ్యాత్మికత సాధకునిలో పరిపూర్ణమవుతుంది.

No comments:

Post a Comment

Pages