నాటి ఋణం – నేటి బంధం - అచ్చంగా తెలుగు

నాటి ఋణం – నేటి బంధం

Share This

 నాటి ఋణం – నేటి బంధం

(కథ)

రచన: టి. వి. ఎల్. గాయత్రి
ఊరు: పూణే, మహారాష్ట్ర





కొత్త ఇంట్లోకి మారుతున్నారు దీపిక వాళ్లు.

“కొత్త ఇంట్లోకి పాత సామానుతో ఎందుకమ్మా? కొత్త ఫర్నిచర్ కొంటున్నాను. నీకు నచ్చినట్లు సర్దించు!” అన్నాడు కొడుకు జయంత్.

“కొత్త సామాన్లు తెచ్చి పెట్టుకున్నా నీకు మేమిద్దరం పాతవాళ్లమే!” అంది నవ్వుతూ దీపిక.

“ఊరుకోమ్మా! అలా మాట్లాడతావేంటి?” అంటూ తల్లి ఒళ్లో తల పెట్టి కూర్చున్నాడతడు.

‘ఎంత పెద్దవాడైనా తన దగ్గర మాత్రం పసిపిల్లాడిలా ఉంటాడు. పిచ్చి వెధవ!’ అనుకుంది దీపిక మనసులో మురిపెంగా.

శేఖర్, దీపికలది చిన్న సంసారం. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు. వాళ్లకు ఒక్కడే కొడుకు జయంత్.

తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో జయంత్ చాలా బాధ్యతగా పెరిగాడు. పేద కుటుంబాల నుంచి వచ్చిన శేఖర్, దీపికలు వచ్చినదాంట్లో పొదుపుగా సంసారం చేస్తూ కుటుంబ బాధ్యతలు మోసేవాళ్లు. అటూ ఇటూ కూడా అంతంత మాత్రపు సంసారాలే. అయినప్పటికీ జయంత్ శ్రద్ధగా చదివి ర్యాంకులు తెచ్చుకునేవాడు. అందువల్ల కొడుకు చదువుకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం శేఖర్ దంపతులకు రాలేదు.

మెరిట్ స్టూడెంట్ అయిన జయంత్ మెడిసిన్‌లో ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ అయ్యి, పేరున్న కార్పొరేట్ ఆసుపత్రిలో సర్జన్‌గా పనిచేస్తున్నాడు.

ఎప్పుడో ప్రభుత్వవాళ్లు ఊరి చివర ప్లాట్లు చేసి అమ్ముతుంటే ఆ స్థలం కొన్నాడు శేఖర్. ఇప్పటికి ఊరు పెరిగింది. ఆనాడు ఖాళీగా ఉన్న ప్రాంతం ఈ రోజు జనసమ్మర్దంగా మారిపోయింది. స్థలాల ధరలు పెరిగాయి. చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్‌లు వచ్చాయి.

జయంత్ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకునేవాడు. వాళ్లకు సౌకర్యంగా ఉండేలా స్వతంత్రంగా ఉండే ఇంటిని నిర్మించాడు.

సామాన్యమైన ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శేఖర్ దంపతుల స్థాయి, కొడుకు డాక్టర్ కావడంతో ఒక్కసారిగా పెరిగింది.

ఇప్పుడున్న సమస్య జయంత్ పెళ్లి.

ఎక్కువగా ధనవంతుల కుటుంబాల నుంచే సంబంధాలు వస్తున్నాయి.

“నాకు తెలిసినవాళ్లు ఉన్నారు. బాగా స్థితిమంతులు. వాళ్ల అమ్మాయి కూడా డాక్టరే. పిల్లలిద్దరూ హాయిగా ప్రాక్టీస్ చేసుకుంటారు. వియ్యంకుడు పిల్లలకు ఆసుపత్రి కట్టించి ఇస్తాడు. మీరు ఊ అంటే మాట్లాడతా!” అన్నాడు శేఖర్ అన్నయ్య కేశవ.

ఏమీ మాట్లాడలేదు శేఖర్. అతడి మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకున్నాడు కేశవ.

“నువ్వు మీనమేషాలు లెక్కవేస్తూ కూర్చున్నావనుకో! వాడికి పెళ్లి కావడం కష్టం! ఏదో ఒక సంబంధం చూసి ముడిపెట్టు! అసలే రోజులు బాగా లేవు! వాడు పని చేస్తున్న చోట ఎర్రగా, బుర్రగా ఉన్న డాక్టర్ పిల్ల కనిపించిందనుకో... కులం గిలం అని కూడా చూడరు పిల్లలు. చివరకు వాళ్ల మాటే వినాల్సి వస్తుంది” అన్నాడు గట్టిగా.

“వాడు అలాంటివాడు కాదులే అన్నయ్యా! నేను వాడితో చెప్తాను. వాడికి ఇష్టం లేకపోతే మేం బలవంతం చేయము!” అన్నాడు శేఖర్.

“ఆలస్యం చేస్తే వాడికి అసలు పెళ్లే కాకుండాపోతే ఇంకా కష్టం! మగపిల్లలు ముదిరిపోతే ఎంత డబ్బున్నా ఈ రోజుల్లో పెళ్లిళ్లు కావడం లేదు. ప్రపంచాన్ని గమనించు! ఏదో పెద్దనాన్నని, మన పిల్లవాడనుకుని నేను చెప్పాల్సింది చెప్పాను! ఆ తర్వాత నీ ఇష్టం!” అని ఫోన్ పెట్టేశాడు కేశవ.

అన్నయ్యకు కోపం వచ్చిందని అర్థమైంది శేఖర్‌కు.

దీపిక బంధువులు కూడా ఇలాంటి సంబంధాలే చెప్పారు.

“నీకు గొప్పింటి పిల్ల కోడలిగా వచ్చిందనుకో! బంగారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. కాలు కింద పెట్టక్కర్లేదు. ఆలోచించు! మొన్న ఒకావిడ కారులో మా ఇంటికి వచ్చి నీ కొడుకు గురించి గంటసేపు మాట్లాడి వెళ్లింది. మా కొంప చూశావుగా! ఎలా ఉంటుందో! ఆవిడకు స్టీలు గ్లాసులో కాఫీ ఇస్తే ఏమీ అనకుండా తాగింది పాపం! బుట్టనిండా యాపిల్ పళ్లు తెచ్చి పెట్టింది. ఆవిడ కట్టుకున్న చీర ఉందీ... పదిహేను వేలకు తక్కువ ఉండదు! నా కొడుక్కి పెళ్లయిపోయింది కానీ... ఇలాంటి సంబంధం మా ఇంటికే వస్తే కళ్లుమూసుకుని ఒప్పుకునేదాన్ని!” అంది చిన్నక్క సారిక.

వీళ్లకు ఏమని చెప్పాలో తెలియడం లేదు దీపికకు.

పెళ్లి సంబంధాల గురించి విని నవ్వాడు జయంత్.

“మీకంటే నా పెళ్లి గురించి మన బంధుగణానికి ఎక్కువ ఆరాటంగా ఉన్నట్లుంది!”

“పోనీ, నువ్వే చెప్పు! వీళ్లలో ఏ పిల్ల బాగుందో! నీ పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. నేను, మీ నాన్న కృష్ణా రామా అనుకుంటూ కాలక్షేపం చేయడమే! ఆలస్యం చేశావనుకో... మీ పెద్దనాన్న చెప్పినట్లు అసలు పెళ్లే కాకపోతే కష్టం” అంటూ ఫొటోలు చూపించింది దీపిక.

మాట్లాడలేదు జయంత్.

“పోనీ, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? మన కులం పిల్ల కాకపోయినా ఫర్వాలేదు. మాకేమీ అభ్యంతరం లేదు.”

“అబ్బా! అలాంటిదేమీ లేదమ్మా! నాకు కాస్త టైమ్ కావాలి! ఇప్పటిదాకా చదువే సరిపోయింది. గ్యాప్ లేకుండా ర్యాంకుల వెంట పరుగెత్తాను. ఇప్పుడే కొద్దిగా కెరీర్‌లో స్థిరపడుతున్నాను. నన్ను కాస్త స్థిమితంగా ఆలోచించుకోనివ్వు!” అన్నాడు.

పది రోజుల్లో కొత్త ఇంటికి మారాలనుకున్నారు వాళ్లు.

సామాన్లను సర్దుకుంటోంది దీపిక. ఇంతకాలం జీవితంలో ఒకటొకటిగా కొనుక్కున్న వస్తువులు! శేఖర్, జయంత్ కూడా వచ్చారు.

ఎప్పటి విషయాలనో చెప్పుకుంటూ ముగ్గురూ సామాన్లు సర్దుకుంటున్నారు.

పాతబడిన సామాన్లను వదిలేయొచ్చు! వాటి తాలూకు జ్ఞాపకాల పరిమళాలు మాత్రం భార్యాభర్తలిద్దరిలో ఇప్పటికీ తాజాగా గుబాళిస్తున్నాయి. వాటినెలా వదిలేయడం!

ఇంతలో అల్మారాలో జయంత్‌కు కొన్ని నోట్ పుస్తకాలు కనిపించాయి.

ఆసక్తిగా ఒక నోట్‌బుక్‌ను తీసుకుని పేజీలు తిప్పాడు. ఏవేవో కవితలు! పొందికగా రాసి ఉన్నాయి.

“అబ్బో! అమ్మ మంచి కవయిత్రి నాన్నా!”

చిన్నప్పుడు రాసుకున్న కవితల పుస్తకాలు. ఏమిటో! పాటలు పాడుకోవడం... డ్యాన్సులు చేసుకోవడం... కవితలు రాసుకోవడం... అప్పట్లో అదొక మాయాలోకంలో తిరిగినట్లుండేది.

“ఇదిగో మన ఆస్తి!” అంటూ పెళ్లి ఆల్బమ్ తీసాడు శేఖర్.

పెద్ద జడ వేసుకుని సన్నగా ఉన్న దీపిక ఫొటో చూసి పెద్దగా నవ్వాడు శేఖర్.

“అప్పట్లో నిన్ను చూసి మైమరచిపోయి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడిలా తయారవుతావని తెలీలేదు!” అన్నాడు.

“ఆ... మరే! మీ గురించి నేను కూడా ఇలా అవుతారని అనుకోలేదు!” అంటూ శేఖర్ బట్టతల మీద తట్టింది దీపిక.

ఆ ఆల్బమ్‌ను చూస్తూ అందులో ఉన్న తమ బంధువులను పోల్చుకుంటున్నాడు జయంత్.

“ఈవిడెవరమ్మా? బాగా రిచ్‌గా కనిపిస్తోంది!”

చూసింది దీపిక. అందరిలోకి ఖరీదైన పట్టు చీర కట్టుకుని, నగలు పెట్టుకుని తన స్నేహితులతో పాటు నిలబడి ఉంది భారతి.

“మాకు తెలిసినవాళ్ల అమ్మాయి భారతి. బాగా ఉన్నవాళ్లులే!”

చిన్నప్పటి నుంచి తనతో చదివిన క్లాస్‌మేట్స్‌లో చాలామంది ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉన్నారు. భారతి ఒక్కతే టచ్‌లో లేదు. కారణం, తామంతా ప్రభుత్వ కళాశాలలో చదివితే భారతి మాత్రం ప్రైవేట్ కళాశాలలో చదివింది. అప్పట్లో ఆమెతో పరిచయం కూడా చాలా తక్కువ.

కానీ భారతి ఎలా ఉందో?

ఇప్పుడు తాము కూడా స్థితిమంతుల జాబితాలోకి చేరారు. ఒకసారి భారతిని చూడాలనిపించింది దీపికకు. చూడాలనిపించడమే కాదు, తన ఐశ్వర్యాన్ని భారతికి చూపించాలనుకుంది కూడా.

ఆమె గురించి కనుక్కోవాలనే ఆలోచనతో ఆ సాయంత్రం తన స్నేహితురాలు పద్మజకు ఫోన్ చేసింది.

“ఫేస్‌బుక్‌లో చూస్తానే! ఉన్నారేమో!” అంది పద్మజ.

“ఇంటి పేర్లతో వెదుకుదాం!” అని వెదకడం మొదలుపెట్టింది దీపిక.

భారతి మాత్రం దొరకలేదు. ఇల్లు మారే పనిలో పడి ఆ విషయాన్ని మర్చిపోయిందామె.

ఒక నెల గడిచింది.

ఆ రోజు మధ్యాహ్నం దీపికకు ఫోన్ చేసింది పద్మజ.

“భారతి సమాచారం దొరికింది!” అంది ఉత్సాహంగా.

“ఎక్కడుంది?”

“తనతో మాట్లాడాను. విజయవాడలో ఉంది. మొగుడు పోయాడట! ఒక్కతే పిల్లట! పిల్లతో ఉంటోందట!”

“అయ్యో! తనను భీమవరం ఇచ్చారనుకుంటా! నా పెళ్లయ్యాకే తన పెళ్లయింది. అప్పుడే స్కూల్లో పరీక్షలు ఉండి వెళ్లలేకపోయాను. తర్వాత సంసారంలో పడి పుట్టింటికి వెళ్లడమే గగనమైపోయింది... అక్కడి విషయాలు తెలియవు. ఏం చేద్దాం! నేను కూడా ఫోన్ చేస్తానులే!” అంది దీపిక.

సాయంత్రం భారతికి ఫోన్ చేసింది.

“నువ్వెలా ఉన్నావు?” అంటూ పలకరించింది భారతి.

ఒకే ఊరి వాళ్లు కావడంతో చిన్నప్పటి కబుర్లు ఇద్దరి మధ్యా ప్రవహించాయి.

భారతి గురించి శేఖర్‌తో చెప్పింది దీపిక.

రోజులు గడుస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ స్కూలుకు వెళ్లి వస్తున్నారు.

“అమ్మా! రేపు ఉదయం విజయవాడ వెళ్లాలి. అక్కడ కాన్ఫరెన్స్ ఉంది. ఫ్లైట్ బుక్ చేసుకున్నాను” అన్నాడు జయంత్.

విజయవాడ పేరు వినగానే దీపికకు ఉత్సాహం వచ్చింది.

“నన్ను కూడా తీసుకెళ్లరాదూ! నా చిన్నప్పటి స్నేహితురాలు ఉంది. చూసి వస్తాను.”

“సాయంత్రానికి వచ్చేద్దాం!” అన్నాడు జయంత్.

భారతికి, ఆమె కూతురికి ఖరీదైన బట్టలు తీసుకుంది దీపిక.

ఇద్దరూ బయలుదేరారు.

ఎయిర్‌పోర్టులో కూర్చున్నారు. ఇంకా గంట సమయం ఉంది.

“మొన్న మాట్లాడిన చిన్నప్పటి స్నేహితురాలు కదమ్మా! ఇప్పటిదాకా కాంటాక్ట్ లేదన్నావు. మరి ఇప్పుడు చూడటానికి అంత ఉత్సాహంగా వస్తున్నావు. అప్పట్లో ఆవిడ నీకు బాగా క్లోజా?”

“నీకు తెలుసుగా! మీ తాతయ్య గుమస్తా ఉద్యోగం చేసేవారని. మేము నలుగురం పిల్లలం. ఆదాయం తక్కువ. ఖర్చులు ఎక్కువ. ఏదో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు. మాకు పెళ్లిళ్లు చేయడానికి మీ తాతయ్య దగ్గర డబ్బులెక్కడున్నాయి? జరుగుబాటుకే మీ అమ్మమ్మా, తాతయ్య అప్పులు చేస్తూ సంసారం లాక్కొచ్చేవాళ్లు.
భారతి వాళ్ల నాన్నగారు ఊళ్లోనే పెద్ద ధనవంతులు. ఆయనది పెద్ద చెయ్యి. తెలిసినవాళ్లలో పేదవాళ్లుంటే కాదనకుండా సహాయం చేసేవాళ్లు. మా అందరి పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం ఆయనే చేశారు.
ఆయనకు ఇద్దరు మగపిల్లల తర్వాత భారతి ఒక్కతే ఆడపిల్ల. అప్పట్లో ఇంటికి టీచర్ని పిలిపించి భారతికి సంగీతం నేర్పించారు. పెళ్లి కూడా బాగా ఆస్తిపాస్తులున్న కుటుంబంలో జరిపించారు.
భర్త పోయాడని చెప్పింది. బాధపడుతుందని మిగిలిన వివరాలు అడగలేదు. స్థితిమంతుల కుటుంబం కాబట్టి బాగానే ఉంటారనుకున్నాను. కానీ... ఎంతయినా భర్త లేకపోతే ఆ లోటును ఎవరు తీరుస్తారు? ఒకసారి చూసి వద్దామని...” ఆగింది దీపిక.

“నిన్ను వాళ్ల ఇంట్లో దింపి నేను కాన్ఫరెన్స్‌కు వెళ్లి వస్తాను” అన్నాడు జయంత్.

విజయవాడ చేరారు. లొకేషన్ పంపమని భారతికి ఫోన్ చేసింది దీపిక.

వన్‌టౌన్‌లో ఇల్లు.

విజయవాడ కొత్త. వన్‌టౌన్‌లో ఇరుకుగా ఉన్న వీధులు. చివరకు బ్రాహ్మణవీధిలో ఒక బిల్డింగ్ ముందు క్యాబ్ ఆగింది.

బిల్డింగ్ ముందే నిలబడి ఉంది భారతి.

అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు. బాగా వడలిపోయిన ముఖం. అక్కడక్కడా తెల్లబడిన జుట్టు. ముతక చీర.

‘భారతినే చూస్తున్నానా?’ అనుకుంది దీపిక.

“రండి! రండి!” అంటూ పై అంతస్తుకు దారి తీసింది భారతి.

“చుట్టాలా, భారతీ?” అని అడుగుతూ వచ్చిందొకావిడ.

“అవునండి!” అని దీపిక వైపు తిరిగి, “మా ఓనరు గారు” అని పరిచయం చేసింది భారతి.

దీపికకు మతి పోయింది. అద్దె ఇల్లేమిటి? అసలీ అవతారమేమిటి?

అయోమయంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. వరుసగా మూడు గదులు. అందులో చివరిది చిన్న వంటిల్లు.

ఇల్లు చూస్తే అయ్యవారి నట్టిల్లులా ఉంది. కనీసం ఒక సోఫా అయినా లేదు. ముందు గదిలో రెండు ప్లాస్టిక్ కుర్చీలు మాత్రమే ఉన్నాయి.

“కూర్చోండి!” అని లోపలికి వెళ్లి రెండు ప్లేట్లలో ఉప్మా తీసుకొచ్చింది భారతి.

“వద్దాంటీ! నేను మీటింగ్‌కు వెళ్లాలి. అక్కడ తింటాను. సాయంత్రానికి వస్తాను. ఏమీ అనుకోవద్దు!” అంటూ లేచాడు జయంత్.

“అదేమిటి? తినేసి వెళ్లండి!” అని భారతి చెప్తున్నా...

“వాడిని వెళ్లనీ భారతీ! మీటింగ్‌కు టైమ్ అవుతుంది. మళ్లీ వస్తాడులే!” అని కొడుకును పంపించివేసింది దీపిక.

జయంత్ వెళ్లిపోయాడు.

“ఇప్పుడు చెప్పు భారతీ! ఏమిటీ అద్దె ఇల్లు? మీ వాళ్లంతా ఏమయ్యారు? నిన్ను పెద్ద సంబంధంలో ఇచ్చారని విన్నాను. ఇదేమిటి?” ఆత్రంగా ప్రశ్నలను కురిపించింది దీపిక.

“చెప్తా! కూర్చొని మాట్లాడుకుందాం!” అని రెండో గదిలో ఉన్న నవారు మంచాన్ని చూపించింది భారతి.

“మా గురించి నీకు తెలుసుగా! ఊళ్లోనే గొప్ప ధనవంతులమని పేరు. మా తాతగారిలాగే నాన్నగారు కూడా బాగానే సంపాదించారు. దానధర్మాలు చేస్తూ పేరు ప్రతిష్ఠలు గడించారు.

“డబ్బులో పుట్టి పెరిగిన మా అన్నలకు మాత్రం నాన్నగారికున్న వ్యాపార దక్షత రాలేదు. మీరంతా ఉద్యోగం కోసం తపన పడుతూ చదివితే, నేను మాత్రం ఏదో డిగ్రీ అయిందనిపించాను. మా స్థాయికి తగిన సంబంధం చూసి నా పెళ్లి చేశారు నాన్నగారు.

“నాన్నగారు పోయాక మా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. అన్నయ్యలిద్దరూ ఉన్న ఆస్తిలో చాలావరకు అమ్ముకున్నారు. అలా వాళ్ల పరిస్థితి దిగజారింది.”

“అయ్యో! మంచి వాళ్లకే వస్తాయి కష్టాలు!” అంది విచారంగా దీపిక.

“ఇక మా అత్తగారింటి వైపు చూస్తే, మా బావగారు, ఈయన తర్వాత ఇద్దరు ఆడబడుచులు. వచ్చే పోయే చుట్టాలు. వ్యాపారం. మొదటి నుంచీ మా ఆయన వ్యసనపరుడు. మామగారి దగ్గర వ్యాపార మెళకువలు నేర్చుకోలేదు. డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం తెలియని మనిషి.
పిల్ల పుట్టింది. తర్వాత మా మామగారు పోయాక ఆస్తులను వాటాలేసుకుని పంచుకున్నాం. అసలే డబ్బంటే లెక్కలేని మనిషి. తాగుడు, తిరుగుడు. పక్కన చేరిన స్నేహితులు కూడా సరైనవాళ్లు కారు. హారతి కర్పూరంలా ఆస్తి కరిగిపోయింది.

ఈయన ఆరోగ్యం పాడై హార్ట్ అటాక్‌తో చనిపోయారు. చివరకు చిన్న ఇల్లు మాత్రమే మిగిలింది. మా బావగారు వాళ్లు బాగానే ఉన్నారు.
మా అత్తగారిని తోడుగా పెట్టుకుని పిల్లతో ఉంటూ సంగీత పాఠాలు చెప్పుకుంటున్నాను. పాప పేరు శృతి. ఇంజనీరింగ్ అయ్యాక ఈ ఊళ్లో రేడియో స్టేషన్‌లో ఉద్యోగం వచ్చింది. అందుకని మా ఇంటిని అద్దెకిచ్చి ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. వచ్చి రెండేళ్లవుతోంది. ఇక్కడ కూడా సంగీతం పాఠాలు చెప్పుకుంటున్నాను. పిల్ల జీతాన్ని దాని పెళ్లి కోసం దాచిపెడుతున్నాను. ఇదీ విషయం!” అంటూ చెప్పింది భారతి.

మనసంతా చేదుగా అయిపోయింది దీపికకు.

“ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో!” అని నిట్టూర్చింది.

ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటుండగా శృతి వచ్చింది.

కుందనపు బొమ్మలాంటి పిల్ల.

“సారీ ఆంటీ! ఈ రోజు ముఖ్యమైన రికార్డింగ్స్ ఉన్నాయి. అందుకని వెళ్లాను. మధ్యాహ్నం నుంచి ఖాళీనే!” అంది శృతి కలుపుగోలుగా.

భోజనం చేశాక ముగ్గురూ దుర్గగుడికి వెళ్లారు.

గలగలా మాట్లాడుతూ దుర్గమ్మ స్థలపురాణం గురించి చెబుతున్న శృతిని చూస్తే ముచ్చట వేసింది దీపికకు.

‘ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు!’ అనుకుంది.

సాయంత్రం ఇంటికి వచ్చాక, “ఏదీ, ఒక కీర్తన పాడు! విని తరిస్తాను!” అంది దీపిక ముచ్చటగా.

“రేడియో స్టేషన్‌లో అదే పని. మీ హైదరాబాద్‌లో కనీసం పది సార్లు కచేరీ చేసింది” అంది భారతి నవ్వుతూ.

తంబూరా శ్రుతి చేసి, “శోభిల్లు సప్తస్వర...” అంటూ ఆలాపనతో సహా స్వరం వేసి పాడుతుంటే తన్మయత్వంతో వినసాగింది దీపిక.

ఎప్పుడొచ్చాడో కానీ, జయంత్ తలుపు దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు.

కీర్తన అంతా అయ్యాక కొడుకును చూసింది దీపిక.

“అయ్యో! గమనించలేదు!” అంటూ కాఫీ తీసుకురావడానికి వెళ్లింది భారతి.

శృతి పాట విన్న తర్వాత జయంత్‌కు ఆమె గొంతు మనసులో మారుమోగుతూనే ఉంది. కేవలం అందంగా పాడటమే కాదు, పాటలోని భావాన్ని కూడా చక్కగా పలికించింది.

“మీరు డాక్టరట కదా, ఆంటీ చెప్పారు! రోజంతా హాస్పిటల్‌లోనే ఉంటారా?” అడిగింది శృతి.

“దాదాపు అంతే! ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా టైమ్ ఉండదు” అన్నాడు జయంత్.

“అయ్యో! మరి మీ అమ్మ మీకు భోజనం పెట్టడానికి కూడా టైమ్ దొరకదన్నమాట!” అంది నవ్వుతూ.

ఆ మాటకు జయంత్ కూడా నవ్వాడు.

“మా అమ్మకు మాత్రం నా గురించి బోలెడన్ని ఫిర్యాదులు ఉంటాయి. మీరు అడిగితే ఇంకెన్ని చెబుతుందో!”

“అయితే మీ అమ్మ దగ్గర మీ గురించి చాలా సమాచారం సేకరించాలన్నమాట!” అంది శృతి చిలిపిగా.

ఆమె మాటల్లోని చలాకీతనం జయంత్‌కు నచ్చింది. మాట్లాడుతుంటే ఎక్కడా కృత్రిమత్వం లేదు. తన పని పట్ల ఆమెకున్న శ్రద్ధ, మాటల్లోని ఆత్మీయత అతడిని ఆకట్టుకున్నాయి.

బయలుదేరేటప్పుడు శృతి అందరికీ నమస్కారం చెప్పింది. జయంత్ వైపు చూసి నవ్వుతూ వీడ్కోలు చెప్పిన ఆమెను చూస్తూ అతడూ నవ్వాడు. ఆ చిన్న పరిచయం అతడి మనసులో మాత్రం ఓ మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.

పిల్లలిద్దరూ కాసేపు తమ తమ కెరీర్ల గురించి మాట్లాడుకున్నారు.

“ఈసారి హైదరాబాద్‌లో కచేరీ ఉంటే మా ఇంటికి తప్పకుండా రావాలి!” అని భారతి దగ్గర మాట తీసుకుని కదిలారు తల్లీకొడుకులు.

ఇంటికి వచ్చాక కూడా భారతి గురించిన ఆలోచనలు వదల్లేదు దీపికను.

రోజూ రెండుపూటలా భారతితో మాట్లాడుతోంది.

నెల తర్వాత శృతికి కచేరీ ఉందని తెలిసి సంబరపడింది దీపిక.

వాళ్లను రిసీవ్ చేసుకోవడానికి కొడుకును తీసుకుని స్టేషన్‌కు వెళ్లింది.

శృతి కచేరీ ముగిసి, వాళ్లు విజయవాడ వెళ్లేదాకా వదిలిపెట్టలేదు.

శృతి మరోసారి కచేరీ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు జయంత్ హాస్పిటల్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. శృతి అప్పటికే వచ్చి దీపికతో కబుర్లు చెబుతోంది.

“డాక్టర్‌గారూ! ఈ రోజు కూడా హాస్పిటల్‌లో చాలా బిజీనా?” అంది శృతి.

“మీ కచేరీకి రాలేనంత బిజీ అయితే మాత్రం కాదు!” అని నవ్వుతూ అన్నాడు జయంత్.

ఆ మాటకు శృతి నవ్వింది.

“అయితే మా పాటలు వినడానికి మీకు ఆసక్తి ఉందన్నమాట!”

“పాటలు బాగుంటే వినకుండా ఎలా ఉంటాం?” అన్నాడు.

ఆ తర్వాత వాళ్ల మాటలు సంగీతం దగ్గర మొదలై పుస్తకాలు, సినిమాలు, ఉద్యోగాల వరకు వెళ్లాయి. ఇద్దరికీ ఒకరి అభిరుచుల గురించి మరొకరు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.

శృతి వెళ్లిపోయాక కూడా ఆమె చెప్పిన సంగతులు జయంత్‌కు గుర్తొస్తూనే ఉన్నాయి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తనకు తెలియకుండానే సమయం గడిచిపోయేది.

ఇంతవరకూ తన పెళ్లి గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడని జయంత్ మనసులో ఇప్పుడు ఒక కొత్త ఆలోచన మొదలైంది. శృతిని మళ్లీ ఎప్పుడు కలుస్తానా అని ఎదురుచూడటం మొదలుపెట్టాడు.

మరో నాలుగు సార్లు కచేరీ కోసం శృతి వచ్చింది.

ప్రతిసారీ శృతిని స్టేషన్ నుంచి ఇంటికి తీసుకురావడానికి దీపిక బయలుదేరేది. మళ్లీ వెళ్లేటప్పుడు స్టేషన్‌లో దించేది.

అది చూసి, “ఎందుకమ్మా! ప్రతిసారీ నువ్వు స్టేషన్‌కు రావడం? తనేం చిన్నపిల్లనా? వచ్చి వెళ్తుందిలే!” చిరచిరలాడేవాడు జయంత్.

“ఆనాడు వాళ్ల కుటుంబం మా పట్ల చూపిన ఆదరణను జన్మలో మరచిపోలేనురా! అందుకే ఆ పిల్లంటే ఎనలేని మమకారం!” అంటూ స్కూలుకు సెలవు పెట్టి మరీ శృతి కచేరీలకు హాజరయ్యేది దీపిక.

“నీ స్నేహితురాలి కూతురికి బాగానే సేవ చేస్తున్నావు!” అంటూ విసుక్కునేవాడు జయంత్.

శృతి కచేరీల కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా జయంత్ వీలైనంత సమయం ఆమెతో గడపడానికి ప్రయత్నించేవాడు. మొదట్లో సంగీతం గురించి మాట్లాడిన వాళ్లు, క్రమంగా తమ వ్యక్తిగత విషయాలనూ పంచుకోవడం మొదలుపెట్టారు.

జయంత్ తన వైద్యవృత్తిలో ఎదురయ్యే ఒత్తిళ్ల గురించి చెబితే, శృతి రేడియో స్టేషన్‌లో జరిగే సరదా సంఘటనలను చెప్పేది. ఒక్కోసారి ఆమె చెప్పిన చిన్న సంఘటన గుర్తొచ్చి హాస్పిటల్‌లో కూడా జయంత్ నవ్వుకునేవాడు.

ఒకరోజు శృతి విజయవాడకు తిరిగి వెళ్లిన తర్వాత, ఆమె చెప్పిన ఒక విషయం గుర్తొచ్చి జయంత్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాసేపు మాట్లాడటంతో ముగియలేదు. ఆ తర్వాత సందేశాలు, చాటింగ్‌లు మొదలయ్యాయి.

శృతితో మాట్లాడటం అతడికి అలవాటుగా మారింది. ఆమె నుంచి సందేశం వస్తే వెంటనే చూడాలనిపించేది. ఏదైనా మంచి విషయం జరిగితే మొదట ఆమెతోనే పంచుకోవాలనిపించేది.

తన మనసులో కలుగుతున్న ఈ మార్పుకు పేరు పెట్టడానికి కొంత సమయం పట్టినా, శృతి తనకు ప్రత్యేకమైన వ్యక్తిగా మారుతోందని జయంత్ గ్రహించాడు.

అయితే ఇంట్లో మాత్రం ఏమీ తెలియనట్లు ఆమెను చూసినప్పుడల్లా విసుక్కునేవాడు. తల్లి తన మనసులోని విషయం కనిపెట్టకూడదనే చిన్నపిల్లల ప్రయత్నం అది!

ఒకరోజు దీపికకు ఫోన్ చేసింది భారతి.

“శృతికి మీ వాడు మాటిమాటికీ ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చూస్తే తెలిసింది. ఇద్దరూ చాట్ చేసుకుంటున్నారు. నీకు తెలుసా?” అంది.

“అలాగా? ఇంకెందుకాలస్యం? ఆ మూడు ముళ్లు వేయిస్తే సరి!” అంది దీపిక సంతోషంగా.

ఆ రాత్రి కొడుకును అడిగింది.

బుర్ర గోక్కున్నాడు జయంత్.

“మా దగ్గర మాత్రం శృతిని విసుక్కుంటున్నట్లు వేషం వేస్తావా? మాకు తెలియకుండా ఫోన్లు, చాట్లూనా?” అన్నాడు శేఖర్ చిరుకోపంగా.

“అది కాదు నాన్నా!” అంటూ తడబడుతున్న కొడుకును దగ్గరకు తీసుకుని వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది దీపిక.

పెళ్లి సందడి మొదలైంది.

“పెళ్లి ఖర్చుకు నువ్వు ఇబ్బంది పడకు! ఆ రోజు మీ నాన్నగారు మాకు అండగా నిలబడకపోతే మా పెళ్లిళ్లు జరిగేవే కాదు. ఈ రోజు మా అక్కాచెల్లెళ్లం సంతోషంగా ఉన్నామంటే మీ కుటుంబం చూపించిన ఉదారతే కారణం! ఒక్కదానివి భీమవరంలో ఉండటం ఎందుకు? పిల్లను చూసుకుంటూ మా దగ్గరే కాలక్షేపం చేద్దువుగానీ!” అని భారతికి గట్టిగా చెప్పి ఒప్పించింది దీపిక.

రెండువైపులా పెళ్లి ఖర్చును భరించి పిల్లలకు పెళ్లి చేశారు శేఖర్ దంపతులు.

భీమవరంలో ఉన్న ఇంటిని అమ్మేసి, దీపిక వాళ్ల ఇంటి పక్కనే చిన్న ఇల్లు కొనుక్కుని సంగీత పాఠాలు చెప్పుకుంటోంది భారతి.

ప్రతిరోజూ సాయంత్రం గేటు ముందే నిలబడి స్కూలు నుంచి వచ్చే దీపిక కోసం చూడటం అలవాటయిందామెకు.

ముందు భారతితో నాలుగు మాటలు మాట్లాడి తమ ఇంట్లోకి రావడం అలవాటయింది దీపికకు.

ఒకప్పుడు ధనరూపేణా తీసుకున్న ఋణం కాలగమనంలో వాళ్లిద్దరి మధ్యా విడదీయరాని బంధంగా మారింది.

(సమాప్తం)

No comments:

Post a Comment

Pages