అప్పు లేని గంజి అమృతం - అచ్చంగా తెలుగు

 అప్పు లేని గంజి అమృతం

 కాశీ విశ్వనాథం పట్రాయుడు




సాయంత్రం లచ్చవ్వ ఇంటి అరుగు మీద కూర్చుని బియ్యంలో రాళ్లు ఏరుకుంటోంది. బడి నుంచి వచ్చిన రుద్రాంశ్‌ ఆమె పక్కన కూర్చున్నాడు.


“లచ్చవ్వా! ఈరోజు ఓ మంచి కథ చెప్పవా?” అని అడిగాడు.


“సరే రా! శ్రద్ధగా విను” అంటూ లచ్చవ్వ కథ మొదలుపెట్టింది.


ఒక ఊళ్లో సోమయ్య అనే ఆసామి ఉండేవాడు. ఇతరుల ముందు గొప్పగా కనిపించాలనే తపన అతడికి ఎక్కువ. తన స్థోమతకు మించి ఆడంబరాలకు ఖర్చు చేస్తూ చాలామంది దగ్గర అప్పులు చేశాడు. అప్పులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. వాటిని ఎలా తీర్చాలో తెలియక సతమతమయ్యేవాడు.


సోమయ్య ఇంటికి ఎదురుగా ఉన్న పూరిపాకలో సిమ్మడు అనే రిక్షా కార్మికుడు నివసించేవాడు. రోజంతా రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. తన సంపాదనకు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నదానితో సంతోషంగా జీవించేవాడు.


ఒకరోజు రాత్రి సోమయ్యకు ఎంతసేపటికీ నిద్ర పట్టలేదు.


అప్పులిచ్చినవాళ్లు డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తావని అడుగుతారోనని ఆందోళన చెందుతూ ఇంటి బయట అరుగుపై కూర్చున్నాడు. ఎదురింటి ముందు మంచం మీద సిమ్మడు హాయిగా నిద్రపోతుండటం అతని కంటపడింది.


‘రోజంతా రిక్షా తొక్కి అలసిపోయే ఇతడికి ఎంత హాయిగా నిద్ర పడుతోంది! నా ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా అప్పుల ఆలోచనలతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది’ అనుకున్నాడు సోమయ్య.


మరుసటి రోజు ఉదయం సిమ్మడు రిక్షా తీసుకుని బయలుదేరబోతుండగా సోమయ్య అతని దగ్గరకు వెళ్లాడు.


“సిమ్మడూ! రోజంతా రిక్షా తొక్కి అలసిపోతావు. అయినా నిన్న రాత్రి హాయిగా నిద్రపోయావు. నీకు అంత ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతోంది?” అని అడిగాడు సోమయ్య.


“అయ్యా! నా సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటాను. ఉన్నదానితో సర్దుకుంటాను. ఎవరికీ అప్పు పడలేదు. అందుకే పడుకోగానే ప్రశాంతంగా నిద్రపోతాను. అప్పులేని గంజే నాకు అమృతం” అన్నాడు సిమ్మడు.


“మరి నీకు మంచి బట్టలు వేసుకోవాలని, రుచికరమైన భోజనం తినాలని, హాయిగా సౌకర్యాలతో జీవించాలని అనిపించదా?” అని అడిగాడు సోమయ్య.


“ఎందుకు అనిపించదు అయ్యా! కానీ నా సంపాదనకు మించి ఖర్చు చేయకుండా చూసుకుంటాను. అలా చేస్తే అప్పుల బాధ ఉండదు” అన్నాడు సిమ్మడు.


సిమ్మడి మాటలు సోమయ్య మనసును తాకాయి.


“నువ్వు చెప్పింది నిజమే సిమ్మడూ! ఇతరుల ముందు గొప్పగా కనిపించాలనే కోరికతో నా స్థోమతకు మించి ఖర్చు చేశాను. ఇప్పుడు కళ్లు మూసుకున్నా అప్పులే గుర్తుకొస్తున్నాయి. అప్పు చేసి పప్పుకూడు తినడం కంటే, అప్పులేని గంజి తాగడమే మేలని నీ మాటలతో అర్థమైంది. ఇకనుంచి అనవసర ఖర్చులు తగ్గించి, ఒక్కొక్కటిగా అప్పులు తీర్చుకుంటాను” అన్నాడు సోమయ్య.


“అదే మంచిది అయ్యా! మన సంపాదనకు తగ్గట్టుగా బతికితే అప్పుల బాధ ఉండదు” అన్నాడు సిమ్మడు.


ఆ రోజు నుంచి సోమయ్య తన మాటను ఆచరణలో పెట్టాడు. ఆడంబరాలకు స్వస్తి చెప్పి, ప్రతి నెలా కొంత డబ్బు అప్పులు తీర్చడానికి పక్కన పెట్టసాగాడు. కొంతకాలానికి అప్పుల భారం తగ్గింది. అప్పుల బాధ నుంచి బయటపడుతున్న కొద్దీ సోమయ్యకు మళ్లీ ప్రశాంతంగా నిద్ర పట్టసాగింది.


కథ ముగించిన లచ్చవ్వ వైపు చూస్తూ రుద్రాంశ్‌ అన్నాడు.


“అంటే లచ్చవ్వా! అప్పులు చేసి గొప్పగా బతకడం కంటే, ఉన్నదానితో సంతోషంగా బతకడమే మంచిదన్నమాట!”


“భలే చెప్పావురా!” అంటూ లచ్చవ్వ రుద్రాంశ్‌ను దగ్గరకు తీసుకుంది.


(అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రికకు పంపడమైంది)

No comments:

Post a Comment

Pages