కనకదుర్గ ఐ.పి.ఎస్ -5 - అచ్చంగా తెలుగు

   కనకదుర్గ ఐ.పి.ఎస్ -5

(మినీ నవల)

టేకుమళ్ళ వెంకటప్పయ్య


"అలా మొగవాళ్ళ మీద నువ్వు చేయి చేసుకోవడం తప్పు!" గర్జించాడు ఎస్సై. దుర్గ మొదట కొంచెం భయపడ్డా  వెంటనే రియాక్ట్ అయి తేరుకుంది.

"అవును… నన్ను కారులోనికి రమ్మనడం.. నా చేయిపట్టుకొని  కార్లోకి లాగడం… ఇవన్నీ తప్పు కాదు కదా సార్... నేను వాళ్ళను కొట్టడమే తప్పు" అని దుర్గ కూడా పెద్దగా అరిచింది.

" షటప్! అరవకు! మాకు రిపోర్ట్ చెయ్యాలి. నీకు కొట్టే అధికారం లేదు" అరిచాడు.

"జరగకూడని తప్పు జరిగిపోయాక సినిమాల్లో వచ్చినట్టు వస్తారా సార్! మీరు స్టెయిల్‌గా" అని వ్యంగ్యంగా నవ్వుతూ అడిగింది.

"ఏయ్..నోరుమూసుకో! నువ్వు ఆడపిల్లవు. చాలా ఒవర్‌గా మాట్లాడుతున్నావు. బొక్కలో వెయ్యాల్సి ఉంటుంది. బీ కేర్‌ఫుల్! నువ్వు ఒక ఎస్సై తో మాట్లాడుతున్నావన్నది మరచిపోతున్నావు." పెద్దగా కేకలు పెట్టాడు.

హెడ్మిస్ట్రెస్ కలుగజేసుకొని "నువ్వు కాసేపు మాట్లాడకమ్మా  ఆగు! నేను మాట్లాడుతాను. ఎస్సై గారూ.. చూడండి. నాకు డి.ఎస్.పి గారు బాగా తెలుసు. మా స్కూలు ఓల్డ్ స్టూడెంట్ కూడా! ఫోన్ చెయ్యమంటారా?" అనే సరికి ఎస్సై తగ్గాడు.

"అది కాదు మేడం.. వాళ్ళలో యిద్దరు హాస్పిటల్లో క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నారు. రెడ్డిగారి కొడుకు కూడా అందులో ఉన్నాడు. ఆ మాజీ ఎం.ఎల్.ఎ వూళ్ళో లేడు గాబట్టి సరిపొయింది. చాలా గొడవవుతుంది. అర్ధం చేసుకోండి. ఆ పిల్ల అలా మాట్లాడడం సబబా చెప్పండి? లోపలేస్తే ఏంచేస్తుంది? ఆడపిల్లని చూస్తున్నా."

"ఏం భయంలేదు ఎస్సై గారూ! భయపెట్టకండి! మాదగ్గర వందమంది స్టూడెంట్లు, పదిమంది టీచర్లు సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. వీడియోల్లో అంతా రికార్డయింది. సీ.సీ కెమెరాలు కూడా సాక్ష్యం చెప్తాయి. మీరే కేసు పెట్టినా నిలిచేది కాదు. తర్వాత మీ యిష్టం. వాడు అలా  నా హయాంలో... నేను ప్రిన్సిపాల్‌గా ఉండగా...  ఈ అమ్మాయిని నా స్కూలుకొచ్చి కార్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నించడానికి వాడికి ఎంత ధైర్యం? మేము యిప్పుడే డి.ఎస్.పి దగ్గరకు వెళ్ళి విషయం మొత్తం చెప్పి సాక్ష్యాలు హ్యాండవర్ చేస్తాం."

"మీరు తొందర పడకండి మేడం.. నేను కేసు లేకుండా డీల్ చేస్తాను. ఓల్డ్ స్టూడెంట్లు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారని, కొంత మంది పారిపొయ్యారని రాస్తాను ఎఫ్.ఐ.ఆర్ రాస్తాను. సంతకం చెయ్యండి."

"అలా కుదరదు ఎస్సై గారు. సీ.సీ కెమెరాల్లో రికార్డ్ అయింది కదా!"

ఎస్సై ఏం చెయ్యాలో తోచక తలపట్టుకొని కూర్చున్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది.

“ఎస్.సార్….సరే సార్...అలాగే సార్" అని పెట్టేసి "ఆ మాజీ ఎమెల్యే గోవిందారెడ్డి ఫోను..ఎలాగైనా వాళ్ళ అబ్బాయిని కొట్టిన వాళ్ళను అరెస్టు చేయ్యాలి అంటున్నాడు. ఢిల్లీ నుండి మూడు రోజుల్లో వస్తాడట."

"మేము అరెస్టు చేయాల్సినంత తప్పు ఏమి చేశాం?" అడిగింది హెడ్మిస్ట్రెస్.

"మీరు వెళ్ళిపోండి..నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను" అన్నాడు. 

వెంటనే స్కూలుకు వెళ్ళిన ముగ్గురు పోలీసులను పిలిచి, రెడ్డి వచ్చినప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంతా వివరంగా చెప్పాడు.  పెద్దవాళ్ళతో వ్యవహారం. ఎఫ్.ఐ.ఆర్ డీ.ఎస్.పీ గారిని కలిసి వచ్చాక రాద్దాం. అంటూ వెంటనే జీపు ఎక్కి కూర్చొని, హాస్పిటల్ కు వెళ్ళమని డ్రైవరుకు చెప్పాడు.  అక్కడ ఉన్న డాక్టర్లు ఎస్సైని సాదరంగా తీసుకొని వెళ్ళి అల్‌మోస్ట్ అందరూ తేరుకున్నారని, గోవిందారెడ్డి కొడుకుకు దెబ్బ గట్టిగా తగలడంతో బాగా సమస్య అయిందని, సంసారానికి పనికి రాకపోవడానికే ఎక్కువ ఆస్కారం ఉందని,  ఆపరేషన్ చెయ్యాల్సి రావచ్చని,  ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని హామీ ఇచ్చారు.  ఈ విషయాలన్నీ రెడ్డిగారికి గానీ,  కొడుక్కు గానీ చెప్పవద్దని, స్కూల్లో పాత విద్యార్ధుల ఘర్షణ అని, మామూలు ఆపరేషన్ అని చెప్పమని వాళ్ళకు గట్టిగా చెప్పి బయటపడ్డాడు. డ్రైవరుకు వెంటనే జీపు డి.ఎస్.పి దగ్గరకు తీసుకొని వెళ్ళమని చెప్పాడు. 

డి.ఎస్పీ గారి క్యాబిన్‌లో ఎవరో ఉన్నారని ఆగమని పి.ఎ. చెప్పడంతో బయట సోఫాలో కూర్చున్నాడు. పది నిముషాల తర్వాత హెడ్మిస్ట్రెస్, కనకదుర్గ బయటకు వచ్చేసరికి, వాళ్ళను అలానే చూస్తూ లోపలికి వెళ్ళాడు.

"సిట్ డవున్. అంతా విన్నాను. ఆ గోవిందారెడ్డికి డబ్బు మదం, అహంకారం ఎక్కువ. తగిన శాస్తి జరిగింది. నువ్వేం విచారించకు. హాస్పిటల్ డాక్టర్లు నాకు ఫోన్ చేశారు. అలాంటివాడు సంసారానికి పనికి రాకపోవడమే మంచిది. వాళ్ళకు కూడా చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాను. రెడ్డి గొడవచేస్తే నన్ను కలవమను. గతంలో నేను ఒకసారి వాడి కొడుకును బ్రోతల్ కేసులో అరెస్టు చేసిన విషయం వాడికి గుర్తుండే ఉంటుంది కాబట్టి, నా దగ్గరకు అంత తొందరగా రాడు. అవాయిడ్ చేస్తాడు. వాడికి నన్ను చూస్తే భయం. నన్ను ట్రాన్స్ఫర్ చెయ్యించాలని ట్రై చేసినా పై అధికారులు ఒప్పుకోలేదు.  నువ్వు నిశ్చింతగా ఉండు."

"సార్..మరి ఎఫ్.ఐ.ఆర్ అదీ.." నసిగాడు.

"నువ్వు నాకు ఇందాక ఫోనులో చెప్పినట్టే రాయి. హెడ్మిస్ట్రెస్ నాకు అన్నీ చెప్పింది. ఈ వీధి రౌడీలను కాపాడ్డానికి నువ్వు రెడ్డి దగ్గర లంచం లాంటివి తీసుకొని ఆడపిల్లలను అరెస్టు గట్రా ఏమైనా ట్రై చేశావంటే నక్సలైట్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను జాగ్రత్త!" అనేసరికి ఎస్సైకి ఎ.సి రూములో కూడా చెమటలు పట్టాయి.  "అలాగే సార్! ఉంటాను" అని సెల్యూట్ కొట్టి బయటకు వచ్చాడు.  

*        *        *

గోవిందారెడ్డి ఊళ్ళోకి రావడంతోటే రంకెలు కేకలు వేసుకుంటూ పదిమంది రౌడీలను తీసుకొని స్టేషనుకు వచ్చాడు. "చూడు ఎస్సై..నా కొడుక్కి ఇంత జరిగినా ఎవ్వరినీ అరెస్టు చేయలేదట..ఎందుకని?" గర్జించాడు.

"సార్..కొంచెం శాంతంగా ఉండండి. కూర్చోండి. అన్నీ నిదానంగా చెప్తాను. ఇది కుర్రాళ్ళ పోట్లాట. వాళ్ళల్లో రెండు వర్గాలున్నాయట. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని పోలీసులు వెళ్ళేసరికి ఆ కొట్టిన బ్యాచ్ పారిపోయారట. వాళ్ళను పట్టుకవడానికే ప్రయత్నిస్తున్నాం. మన వాళ్ళు మాత్రం గాయాలతో క్రింద పడి ఉన్నారు. వెంటనే  పోలీసులు కల్పించుకొని హాస్పిటల్లో చేర్పించారు. "

"కొంతమంది ఎవరో ఆడపిల్ల కొట్టిందని చెప్తున్నారు?"

"అబద్ధం సార్..  ఒక ఆడపిల్ల నలుగురు మొగవాళ్ళను ఆ విధంగా కొట్టిందంటే మీరు నమ్ముతారా?"

"అవుననుకో! మా అబ్బాయిని ఎవరో దుర్గ అనే అమ్మాయి కొట్టిందని పొద్దున హాస్పిటల్లో దెబ్బలుతిన్న వాళ్ళల్లో ఒకడు  చెప్పాడు."

"సార్.. అది శుద్ధ అబద్ధం. కొట్టిన వాళ్ళు పారిపోయారని బయట జనం అంతా చెప్తున్నారు. మీకు అలా చెప్పిన వాడికి క్రిందపడ్డప్పుడు తలపై పెద్ద గాయమయింది.  మతిస్థిమితం లేదు. బ్రెయిన్ ప్రాబ్లమో ఏమిటో! ఒక్కోసారి ఒక్కోరకంగా చెప్తున్నాడు.  అవన్నీ నమ్మకండి. కొంచెం తేరుకోనివ్వండి. నేనే ఎంక్వైరీ చేసి అరెస్టు చేస్తాను. కావాలంటే డీ.ఎస్పీ దొరగారితో మీరే స్వయంగా మాట్లాడొచ్చు."

"వద్దులే.. ఆయనకూ మనకూ పడదు. మనం మనం సెటిల్ చేసుకుందాం. చూడు ఎస్సై. డబ్బుకు వెనుకాడకు. దోషులను పట్టి బంధించు."

"అలాగే సార్. ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టాలన్నా మీ అబ్బాయికి   స్టూడెంట్స్ చేతుల్లో తన్నులు తిన్నాడంటే ఎంత నామర్దాగా ఉంటుందో చెప్పండి. అందుకే కోర్టులో పెట్టలేదు ఈ కేసును."

"మంచిదే గానీ.. మా వాణ్ణి కొట్టింది ఎవరో నాకు తెలియాలి. వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.

వెంటనే ఎస్సై జరిగినదంతా ఫోనులో డీ.ఎస్పీకి పూసగ్రుచ్చినట్లు వివరించాడు. ఆయన చెప్పింది విని "అలాగే సార్.." అని ఫోను పెట్టేశాడు.

*        *        *

చూడమ్మా! ఈ గొడవలు..పోలీసులు…. ఇవన్నీ మనకు అవసరమంటావా?" అంది తల్లి మాధవి.

"నా తప్పేమీ లేదమ్మా.. వాళ్ళు అంత చెండాలంగా మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరికే ఉండమంటావా?"

"అది కాదు దుర్గా..వాళ్ళు… డబ్బు పలుకుబడి ఉన్నవారు. పైగా మాజీ ఎమ్మెల్యే కొడుకు. వాణ్ణి అలా కొట్టడం వల్ల భవిష్యత్తులోనైనా నీ మీద పగ తీర్చుకుంటారేమోనని నా భయం" అన్నాడు రాఘవ.

"నాన్నా.. మీరు అనవసరంగా కంగారుపడి.. నన్ను కూడా కంగారు పెట్టకండి. జీవితం అంటేనే పోరాటం. గెలుస్తామా ఓడిపోతామా అని కాదు. జీవితంలో పోరాటం ఉండి తీరాలి. అంతే!"

"నిజమే నువ్వు ఆడపిల్లవు! ఇవన్నీ ఎటుదిరిగి ఎటువస్తాయో భయంగా ఉంది. ఒక్కోసారి ఈ వూరునుండి వెళ్ళిపోదాం అనేంత భయమేస్తుంది."

"నాన్నా.. ఎక్కడకు వెళ్ళినా మనం మనుషులతోనే గడపాలి.  మనుషులంటే సమాజం.  భయపడితే ఈ సమాజం మరింత భయపెడుతుంది. ఒక్కసారి ఎదురు చూడు. తోక ముడిచి పారిపోతారు. ఒక దుర్మార్గుడు చెలరేగితే దానికి కారణం మన పిరికితనమే! అర్ధం చేసుకోండి నాన్నా  ప్లీజ్.."

"ఏమోనమ్మా…. నీవు చాలా ఎదిగిపోయావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సినిమాల్లో డైలాగులు గుర్తొస్తున్నాయి నాకు.  రోజూ పేపరు చూస్తున్నావు కదా! ఎన్ని నేరాలు! ఎన్ని ఘోరాలు! జాగ్రత్తగా ఉండాలి తల్లీ!"

"నా జాగ్రత్తలో నేను ఉంటాను నాన్నా! మీరు భయపడకండి. నన్ను భయపెట్టకండి. ప్లీజ్. నాకు పదో తరగతి పరీక్షలు ఇంక మూణ్ణెల్లు మాత్రమే ఉన్నాయి. ఈ టైములో నా మనసు వికలం చేయకండి. దణ్ణం పెడతాను" అంటూ గది లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది.

*        *        *

No comments:

Post a Comment

Pages