పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -25 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -25

Share This

  పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -25 

దినవహి సత్యవతి



        24 వ సర్గ

       తాటకను చంపుమని, విశ్వామిత్రుడు, రామునికి చెప్పుట…

1.      

రామలక్ష్మణులు ప్రాతఃకాలమందే మేల్కొనిరి,

ఇరువురూ ప్రాతఃకాలకృత్యాలు తీర్చుకునిరి,

పయనమైన విశ్వామిత్రుని అనుసరించిరి,

మువ్వురూ గంగానదీ తీరము చేరుకొనిరి,

అంత ఆశ్రమవాసులైన మునులచటికి వచ్చిరి, సత్య!

 

2.      

మునులొక నావతో మహర్షి వద్దకు వచ్చిరి,

రాకుమారులతోడ నావనధిరోహించుమనిరి,

కాలము మించకుండా ప్రయాణము చేయుమనిరి,

మువ్వురూ ఋషులను పూజించి నావలో కదలిరి,

నావ, నది, మధ్యకు చేర రాముడొక శబ్దము వినె, సత్య! 

3.      

నీరు బ్రద్దలైనట్లున్న శబ్దమదేమని యడిగెను,   

శబ్దము గూర్చి కౌశికుడు, సోదరులకు తెలిపెను,  

బ్రహ్మ మనోసంకల్పంచే సరస్సొకటి నిల్పెననెను,

అందువల్లనది మానసమని పేరు పొందెననెను,  

అందుండి పుట్టినదే సరయూనదియనె కౌశికుడు, సత్య!

4.      

సరయూనది అయోధ్యను చుట్టియున్నదనెను,

బ్రహ్మ సృజించినదగుటచే పవిత్రమైనదనెను,

సరయూనది అచ్చోట గంగలో సంగమించుననెను,

 జలసంక్షోభంవల్లే గంభీర ధ్వని కల్గినదనెను,

భక్తితో నదులకు ప్రణమిల్లుమనె కౌశికుడు, సత్య!

5.      

రామలక్ష్మణులు నదీద్వయానికి నమస్కరించిరి,

నావలో వారు గంగానదీ దక్షిణతీరము చేరిరి,

మువ్వురూ యచటనుండి శీఘ్రముగా పయనించిరి,

అచట సోదరులొక భయంకర అరణ్యం చూసిరి,  

అందు మానవ సంచారమే లేకుండుట గమనించిరి, సత్య!

6.      

వనములో ప్రవేశింప శక్యము కాకుండెను,

ఈలపురుగుల రొదచే ధ్వనించుచుండెను,

భయంకర ఘాతుకమృగాలతో కూడియుండెను,

భాసుపక్షుల వికృత కూతలతో నిండియుండెను,

పలురకాల చెట్లతో దట్టంగాయున్నదనె రాముడు, సత్య !

7.      

ఆ వనము పేరేమని రాముడు, కౌశికునడిగెను,

ఆ వనము గూర్చి మహర్షి, రామునికి చెప్పసాగెను,

పూర్వమచట సురలు రెండు దేశాలు కట్టిరనెను,

అవి మలదము, కరూశములని పేరొందెననెను,  

వాటి చరిత రామునికి చెప్పసాగె, కౌశికుడు, సత్య!

8.      

ఇంద్రుడొకప్పుడు వృతాసురుని వధించెననెను,

ఇంద్రునికపుడు, బ్రహ్మహత్యా, పాపమంటెననెను,

అతడిని అశుచిత్వం, ఆకలి పీడ పట్టెననెను,

ఋషులతనికి మంత్రోదక స్నానం చేయించిరనెను,

అట్లింద్రుని రెండు పీడలూ తొలగెననె కౌశికుడు, సత్య!

 

9.      

దేవతలు, ఇంద్రుని రెండు పీడలు తొలగించిరనె,

వాటిని తాము నిర్మించిన దేశాలకిచ్చి వేసిరనె,

ఇంద్రుడా విషయమెరింగి సంతసించినాడనె,

ఆ దేశాలు సమృద్ధాలై లోక ఖ్యాతిచెందుననె,

అవే మలద, కరూశ దేశాలనె, కౌశికుడు, సత్య!

10.  

దేవేంద్రుడట్లు రెండు దేశములను గౌరవించెననె,

దేవతలు కూడా ఇంద్రుని చర్యను మెచ్చుకొనిరనె,

రెండు దేశాలూ సర్వదా సమృద్ధములైయుండెననె,

కొంత కాలానికొక యక్షిణి ఆవిర్భవించినదనె,

ఆమె స్వేచ్ఛారూపిణియై యుండెననె కౌశికుడు, సత్య!

11.  

యక్షిణి వేయి ఏనుగుల బలముగలదనె,

ఆమె ధీమంతుడౌ సుందునికి భార్యయనె,

మారీచుడనువాడు ఆమె పుత్రుడుయనె,

వాడు ఇంద్రసమాన పరాక్రమవంతుడనె,

మారీచుడు భయంకరాకారుడనె, కౌశికుడు, సత్య!

12.  

మారీచుని బాహువులు బలంగాయుండెననె,   

వాడు, గొప్ప పరాక్రమము కలిగియుండెననె,

విశాలమౌ ముఖము, దేహము కల్గియుండెననె,  

వాడు, గొప్ప ప్రమాణము కల్గిన రాక్షసుడనె, 

వాడెల్లప్పుడూ ప్రజలను బాధించుచుండెననె, సత్య!  

13.  

మారీచుని తల్లి, తాటక, దుర్మార్గురాలనెను,

మలద, కరూశ దేశాలు నశింపజేస్తుండెననెను,

ఆమె నివాసమచటికి కొద్ది దూరానేయుందనెను,

దౌష్ట్యంతో అరణ్య మార్గాన్ని అడ్డగించుచున్నదనెను,

తాటక వనమైనందున అందెవ్వరూ పోజాలరనె, సత్య!

14.  

 విశ్వామిత్రుడు, రాముడికి, ఆజ్ఞ యొసగెను,  

బాహుబలముతో తాటకను వధింపుమనెను,

దేశమును బాధారహితముగా చేయుమనెను,

తాటక యెవ్వరెదిరింపలేనట్టి క్రూరురాలనెను,

అందరినీ భయభ్రాంతులచేస్తున్నదనె, కౌశికుడు, సత్య!

15.  

తాటక, వనమంతయూ ఆక్రమించినదనెను, 

వనమంతా పాడుబడినట్లు చేసినదనెను, 

వనమొక భయంకర ప్రాంతంగా చేసెననెను,

అయిననూ వనము విడిచిపోకున్నదనెను,

తాటక దౌష్ట్యాలు, రామునికి చెప్పె, కౌశికుడు, సత్య!

                                                            *****

                                                                              25 వ సర్గ

        తాటకను చంపుమని, విశ్వామిత్రుడు, మరల రామునికి చెప్పుట...

16.   

మహర్షివిశ్వామిత్రుడు అమేయ ప్రభావుడు,

తాటకను గూర్చి రామునికి తెలిపినాడు,

యక్షిణియగు తాటకను వధింపుమన్నాడు,

కౌశికుని పల్కులు రాముడాలకించినాడు,  

కౌశికునితో తన సందేహం వెలిబుచ్చినాడు, సత్య!

17.  

యక్షులు అల్పపరాక్రములని తెలుసునన్నాడు,  

తాటకకు నాగసహస్రబలమెట్లు వచ్చెనన్నాడు,

కౌశికుడు, రామునికావిషయం వివరించినాడు, 

తాటకకా బలము వరముచే లభించినదన్నాడు,

నాటినుండామె బలవీర్యాలతో తిరుగుచున్నదనె, సత్య!

18.  

పూర్వం సుకేతుడను పరాక్రమయక్షుడుండెననె,

సంతానముకై యతడు గొప్ప తపస్సు చేసెననె,

 సుకేతుని తపస్సు మెచ్చి బ్రహ్మ వరమిచ్చెననె,

కన్యారత్నం తాటకనతనికి ప్రసాదించెననె, 

కానీ పుత్రుని మాత్రమివ్వలేదనె, కౌశికుడు, సత్య!

19.  

బ్రహ్మ, తాటకకు వేయి ఏనుగుల బలమిచ్చెననె,  

తాటక బల, రూపయవ్వనాదులతో పెరిగెననె,  

సుకేతుడామెను సుందునికిచ్చి పెండ్లిచేసెననె,  

తాటకకు మారీచుడను కుమారుడు కలిగెననె,

శాపంచే మారీచుడు అసురుడయ్యెననె కౌశికుడు, సత్య!

20.  

అగస్త్య మహాముని, సుందుని శపించి చంపినాడనె,

తాటకమారీచులు మునినెదిరింప యత్నించిరనె,

తాటక గర్జించుచూ అగస్త్యుని భక్షింప జూసెననె,

అగస్త్యుడందుకు కోపించి తాటకను శపించెననె,

ఆమె భీకరరూపిణియౌనని శాపమిచ్చెననె, సత్య!

21.  

తాటక భయంకరముఖము కలదియగుననె,

ఆమె మానవభక్షకి కాగలదని శపించెననె,  

మారీచుడిని రాక్షసుడు కమ్మని శపించెననె,   

తల్లీసుతులట్లు అగస్త్య శాపానికి గురైనారనె,

శాపగ్రస్తయౌ తాటక, అగస్త్యునిపై కోపించెననె, సత్య!

22.  

పూర్వమీ దేశాన అగస్త్యుడు సంచరించినాడనె,

అందుచే తాటక ఈ దేశాన్ని నశింపజేస్తున్నదనె,

తాటక క్రూరురాలు,  దుష్టపరాక్రమవంతురాలనె, 

ఆమె దుర్మార్గురాలు, శాపగ్రస్తయైన యక్షిణియనె,

ముల్లోకాలందున తాటకను చంపగలవాడు లేడనె, సత్య!  

23.  

శాపగ్రస్తయౌ తాటకఁజంప, రాముడే సమర్థుడనె,  

గోబ్రాహ్మణ హితము కోరి ఆమెను సంహరింపుమనె,

స్త్రీని వధించుటేలయని సంకోచింపవలదుయనె,

రాకుమారుడు చాతుర్వర్ణాల హితం కోరవలెననె,   

అందుకేపనైనా చేయవలెనని కౌశికుడనె, సత్య!

24.  

ధర్మాత్ముడౌ రాజు, ప్రజారక్షణ చేయవలెననె,   

అందుకు పాపకార్యమైననూ చేయవలెననె,    

క్రూరమైనా కాకున్నా, దోషాలున్నా చేయవలెననె,    

ప్రజోపయుక్త కార్యమెట్టిదైనా రాజు చేయాలనె,  

అది రాజులు పాటించదగు ప్రాచీనధర్మమనె, సత్య!      

25.  

తాటక ధర్మవిరుద్ధమౌ ప్రవర్తన కల్గినదనె,

ఆమెయందు ధర్మమనునదే లేదుకదాయనె,

పూర్వం విరోచనుడనువానికొక సుతయుండెననె,

మంథరనబడు ఆమె  భూదేవిని చంపగోరెననె,   

అంత దేవేంద్రుడా మంథరను చంపెనని వింటిమనె, సత్య!

26.  

పూర్వం ఉశనయను స్త్రీ లోకంలో ఇంద్రుడుండరాదనె,      

అట్టి కోరికతో ఆమె తీవ్రవ్రతమాచరించెననె,

భృగుపత్నియైన ఉశనను విష్ణువు చంపెననె,  

ధర్మవిరుద్ధులైన  స్త్రీలను చంపుట తప్పుకాదనె,  

మహాత్ములెందరోయట్లు జేసిరనె, విశ్వామిత్రుడు, సత్య! 


***


No comments:

Post a Comment

Pages