పక్కింటమ్మాయి - అచ్చంగా తెలుగు
 పక్కింటమ్మాయి.
(కథ )
రచన :టి. వి. యెల్. గాయత్రి.
ఊరు :పూణే. మహారాష్ట్ర.
 



ఆ సాయంత్రం ఇంట్లో కూర్చుని కంప్యూటర్ లో పనిచేసుకుంటున్నాడు రాఘవ.
చిక్కుడు కాయల్ని డిష్ లో పెట్టుకొని వచ్చి అతడికి ఎదురుగా కూర్చుంది పద్మజ.

"పక్కింటి వాళ్ళని చూశారా?" 

"చూడలేదు!"అన్నాడు కంప్యూటర్ లో నుంచి తల ఎత్తకుండా రాఘవ.

"రెండు నెలల క్రితం పెళ్లయిందట!పనిమనిషి చెప్పింది."

..............................

"ఆ అమ్మాయి మెళ్ళో మంగళసూత్రం లేదు.... కాళ్లకు చెప్పులున్నాయి కాబట్టి మెట్టెలు కనిపించలేదు."

.........................................

"మరీ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తిరుగుతోంది. ఇద్దరూ  ఎవ్వరితో మాట్లాడరు!ఏం మనుషులో ఏమిటో? పక్కింట్లో ఉన్నామా!కాస్త పలకరిస్తే ఏం పోయింది?"

మాట్లాడలేదు రాఘవ.

"కింద ఇంటావిడ కోడలు పుట్టింటి కెళ్ళిందట!ఇందాక చెప్పింది. ఆవిడతో తగులాడి వెళ్లిందంటారా?" 

మౌనంగా తన పని తాను చేసుకోసాగాడు రాఘవ.

"వెనకింటి పరిమళా వాళ్ళ కుక్క భాను మనవడిని కరిచిందట!నిన్న భానుకు పరిమళకు పెద్ద తగాదా అయింది."

.......................................


"నేనేం చెప్పినా శ్రద్ధ లేదు మీకు?" అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది పద్మజ.
చిన్నగా నవ్వుకున్నాడు రాఘవ.

పద్మజా రాఘవలు ఐదేళ్ల కిందట ఆ కాలనీలో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు.
అప్పట్నించి కాలనీలోని ఆడవాళ్ళంతా సాయంత్రం పూట పార్కులో చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
రాఘవ దంపతుల పిల్లలిద్దరికి పెళ్లిళ్లయ్యాయి.
కొడుకు కోడలు లండన్ లో ఉంటే కూతురు కుటుంబం అమెరికాలో ఉంటారు.
రాఘవకు ఇంకా  రెండేళ్లు సర్వీసు ఉంది.

పక్కింటమ్మాయి పేరు కీర్తన.
ఆమె భర్త పేరు కిరణ్.
ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పొద్దున వెళ్లి సాయంత్రం వస్తారు.
ఒకసారి తలుపులు మూసుకున్నారంటే తెల్లవారి ఆఫీసుకు వెళ్లేటప్పుడే తెరవటం.
వాళ్ళ వైఖరి పద్మజకు అసహనంగా ఉండేది.

"మా పిల్లలు ఇలా కారమ్మా!పరాయి దేశంలో ఉన్నా అక్కడ అందరితో ఎలా కలిసిపోతారో!ఈ పిల్ల కేమిటో కాస్తన్నా కలుపుగోలుతనం లేదు!"అంటూ తన స్నేహితురాళ్లతో కూడా కీర్తన గురించి చెప్పటం అలవాటయిందామెకు.

ప్రతి రోజూ రాఘవ దగ్గర కూర్చుని కాలనీలో వాళ్ళ కబుర్లు చెప్పేది పద్మజ.

"మనం టి.వి.ని అమ్మేద్దాం!నీ కంటే గొప్ప న్యూస్ రీడర్ ఎవ్వరూ ఉండరు!"అనేవాడు రాఘవ.
ఈ మధ్య కేవలం పక్కింటమ్మాయి పురాణమే చెబుతోంది పద్మజ.

"నా కనుమానం ఏమిటంటే వాళ్లకు పెళ్లి కాలేదు... నాకు తెలుసు. దిక్కుమాలినట్లు లివింగ్ రిలేషన్ అంటారా? ఆ పిల్లలో ఒక్క మంచిలక్షణం లేదు. మొన్నటికి మొన్న నన్ను చూసి కూడా గమనించనట్లు బ్యాగ్ ఊపుకుంటూ వెళ్ళింది."అంటూ ఊసుపోకుండా ఆ పిల్లను ఏదో ఒకటి అంటూ ఉండేది.

"కొత్తగా పెళ్లయిన వాళ్ళు. వాళ్ళ లోకం వాళ్ళది. మరీ ఆ పిల్లను అలా ఆడిపోసుకోకు!"అంటూ మందలించేవాడు రాఘవ.

ఊహు!పద్మజలో మార్పు లేదు.

ఇప్పుడు పక్కింటమ్మాయి  ఆమెకు  పెద్ద కాలక్షేపంగా మారింది.
ఎందుకో తెలియదు కానీ ఆ పిల్ల పట్ల కించిత్తు ద్వేషభావం ఏర్పడింది పద్మజకు.

రోజులు గడుస్తున్నాయి.
ఆ రోజు ఆఫీసుకు వెళ్ళాడు రాఘవ.
కాలనీలో ఉండే పద్మజ స్నేహితురాళ్లు శ్రావణ మంగళవారమని దగ్గరగా ఉండే గుడికి వెళ్లారు.
పనిమనిషి గౌరి వచ్చి పనిచేసుకుంటోంది.
"త్వరగా ముగించు గౌరీ!నేను గుడికి వెళ్ళాలి!ఇప్పటికే అందరూ వెళ్లిపోయుంటారు."అంది గౌరిని తొందరపెడుతూ పద్మజ.

గౌరి గబగబా అంట్లు తోముతోంది.
పట్టుచీర కట్టుకొని అద్ధం ముందు నిలబడిన పద్మజకు కళ్ళుతిరిగినట్లనిపించింది.
"గౌరీ!"అని కేక పెట్టి మంచం మీద కూలబడిందామె.
పరిగెత్తుకొని వచ్చింది గౌరి.
స్పృహలో లేదు పద్మజ.
"అమ్మగారూ!......అమ్మగారూ!"అంటూ పద్మజను కుదిపింది.
ఊహు!లేవలేదు పద్మజ.
భయం వేసింది గౌరికి.
వెంటనే పక్కింటికి వెళ్ళింది.
పక్కింటి అమ్మాయి కీర్తన ఇంకా ఆఫీసుకు వెళ్ళలేదు.
విషయం వినంగానే వచ్చి పద్మజను చూసింది.
అప్పుడే కొద్దిగా కదిలింది పద్మజ.
తన ఫోన్ నుంచి కింద వాచ్ మెన్ కు ఫోన్ చేసింది కీర్తన 
వాచ్ మెన్ వచ్చే లోపల గౌరి ఫోన్ నుంచి రాఘవకు ఫోన్ చేసింది.
"అంకుల్!ఆంటీని తీసికొని వాత్సల్య హాస్పిటల్ కు వెళ్తున్నాను. మీరు హాస్పిటల్ కు రండి!"అని వాచ్ మెన్, గౌరిల సహాయంతో పద్మజను పట్టుకొని మెల్లగా తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్ కు వచ్చింది.
పద్మజను లోపలికి తీసుకొని వెళ్లారు హాస్పిటల్ సిబ్బంది.
 గౌరి, కీర్తన అక్కడే కూర్చున్నారు.
"హై బిపి వచ్చింది. డాక్టర్ చూస్తున్నారు." అని చెప్పింది నర్సు.
కాసేపటికి రాఘవ వచ్చాడు.కీర్తనకు కృతజ్ఞతలు చెప్పాడు. పద్మజను స్పెషల్ రూమ్ లోకి తీసుకొని వచ్చారు.

"నువ్వు వెళ్ళమ్మా!నేను చూసుకుంటాను!"అన్నాడు రాఘవ.
"ఫరవాలేదంకుల్!నేను సెలవు పెట్టాను!ఆంటీ లేచాక వెళ్తాను లెండి!"అంది కీర్తన.
"ఎందుకు ఇబ్బంది పడటం!నేను ఉన్నానుగా!"అన్నాడు రాఘవ.
మొహమాటంగా అనిపించింది అతడికి.
వినలేదు కీర్తన. అక్కడే కూర్చుంది.
కాసేపటికి కళ్ళు తెరిచింది పద్మజ.
రాఘవ పక్కన పక్కింటి అమ్మాయి కీర్తన కూర్చుని ఉంది.
ఒక గంట తర్వాత ఆమె మాట్లాడగలిగింది.
కీర్తన, గౌరి వెళ్లిపోయారు.

రూములో  రాఘవ మిగిలాడు.

పద్మజ కళ్ళలో నీళ్లు.
ప్రేమగా భార్య చేతిని పట్టుకున్నాడు రాఘవ.

రెండు రోజుల తర్వాత ఇంటికొచ్చింది పద్మజ.
కాలనీలోని అందరూ వచ్చి ఆమెను పరామర్శించి వెళ్లారు.
ఆ సాయంత్రం కిరణ్, కీర్తన వచ్చారు.
పొట్టి మిడ్డీ మీద బిగుతైన టీ షర్ట్ వేసుకున్న కీర్తన పద్మజకు ఇప్పుడు వికారంగా కనిపించటం లేదు.
తన కూతురి లాగా అనిపిస్తోంది.
పక్కన కూర్చున్న కీర్తనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుందామె.


(సమాప్తం )

No comments:

Post a Comment

Pages