ప్రేమంటే ఇదే - అచ్చంగా తెలుగు

 ప్రేమంటే ఇదే

     - కొడాలి సీతారామా రావు



 

  సుశ్రుత మనసు

నాకు మా శ్రోత్రియ్ బావంటే చాలా చాలా ఇష్టం చిన్పప్పటి నించీ.ఎంతిష్టం అంటే నా మీద నాకన్నా మా బావంటేనే ఇష్టం.

బావా వాళ్ళు బందరులో వుంటారు.బావకి సెలవలప్పుడు మా అత్త,బావ వచ్చేవారు.మా మామయ్య  రెండు రోజులుండి వెళ్ళిపోయేవారు. అత్తంటే మా నాన్న చెల్లెలు.

నాకు మా బావ ఇష్టం అవటానికి మా అమ్మా నాన్నే కారణం.బావ నా చిన్నప్పటి నించీ ఎలా చూసేవాడో,ఎలా ఆడించే వాడో చెప్తుండేవారు.మా నాన్న   ఫొటోగ్రాఫర్ కావటంతో నాకు ఎన్ని ఫోటోలో. ఫొటోల్లో బావ నన్ను ఆడించటం,మరీ చిన్నప్పుడు ఒళ్ళో పడుకోపెట్టుకుని నవ్వించటం,ఆడించటం వుండేవి.

అత్తయ్య చెప్పేది నీ గురించే అస్తమానూ శ్రోత్రియ్ కలవరిస్తాడే అని.నీ కోసమే ఏలూరు వస్తాడే.సెలవులు ఇవ్వగానే సుశ్రుత వాళ్ళింటికి  వెళ్ళిపోదాం  అంటాడే.’

మా అమ్మకి సంగీతం వచ్చు.ఇంటి దగ్గరే పాఠాలు చెప్పేది.అలా నాకూ సహజంగా సంగీతం వచ్చింది. మా అత్తయ్య,బావ ఎన్ని సార్లు పాటలు పాడించేవారో.

వేసవి సెలవులలో వస్తారు. వారం రోజులు వుంటారు.నేను బావ పక్కనే పడుకునేదాన్ని.బోలెడు కథలు,విశేషాలు చెప్పేవాడు.మేమూ బందరు వెళ్ళేవాళ్ళం.

చదువుకి స్కూలులో చేరాక నాకు అర్థంకాని పాఠాలు ఎంత బాగా చెప్పేవాడో.బావ పదో తరగతిలోకి వచ్చాక ఏలూరు రావటం లేదు.పబ్లిక్ పరీక్షలు కావటం,సెలవులలో కూడా ఏవో పరీక్షలు రాయవలసి రావటంతో.

మేమే వెళ్ళేవాళ్ళం.ఐతే బావ ఇదివరకటంత ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు.ఎప్పుడూ చదువుకోటం,స్నేహితులతో ఆటలకి,లైబ్రరీకి వెళ్ళేవాడు.

ఐతే అప్పుడప్పుడూ నన్ను గుడికి,తన స్కూలుకి,పార్కుకి,లైబ్రరీకి తీసుకు వెళ్ళేవాడు. పుస్తకాలు చదవాలి అనేవాడు.బందరు గురించి చాలా గొప్పగా చెప్పేవాడు.కొన్నాళ్ళు బందరులో వుంటే ఎవరైనా అక్కడే వుండాలను కుంటారనేవాడు.నిజం చెప్పాలంటే నాకూ బందరంటే ఇష్టం ఏర్పడింది. అందుకు కారణం బావ అక్కడ వుండటం !!అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను.

బావ పదో తరగతి,ఇంటర్ స్టేట్ రాంకులలో పది లోపే వున్నాట్ట. తరువాత   ఇంజినీరింగ్ లో పీజి కూడా చేసి, పి హెచ్ డి కూడా అందుకున్నాడు.

అప్పుడు నాకు పదహారేళ్ళు.ఇంటర్ కి వచ్చాను.అప్పుడు బావని చూస్తే ఎంత అందంగా వున్నాడనిపించేది.సన్నటి మీసకట్టు, ఆజానుబాహువు చూస్తున్న కొద్దీ చూడాలనిపించేది.

వయసులో నాకు బావంటే ప్రేమ భావం కలగటం మొదలైంది.ఐతే బావని కలుసుకోవటం ఏదైనా శుభకార్యాలకి వెళ్ళినప్పుడే.అప్పుడు కూడా బావ నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు.కనపడగానే ఆప్యాయంగా పలకరించేవాడు.బాగా చదువుకోమనే వాడు.

బంధువులలో ఎవరైనా వయసులో వున్న ఆడపిల్లలు బావతో మాట్లాడుతుంటే వాళ్ళతో ప్రేమలో పడతాడేమోనని భయం వేసేది.నేను వారికి దగ్గరలోనే తచ్చాడేదాన్ని. ఆడపిల్లలు ఎవరైనా బావని ప్రేమలో పడేస్తారేమోనని భయపడేదాన్ని.ఎందుకంటే నేను గొప్ప అందంగా వుండను.బాగుంటాను.అంతే.

ఓసారి అలా కలుసుకున్న సందర్భంలో నేను బావతో ప్రేమిస్తున్నట్టు చెప్పా.నా వంక చూస్తూచదువుకునే సమయంలో  ఇలాంటి విషయాల జోలికి వెళ్ళకు.బాగా చదువుకో. నువ్వు చక్కగా ఉద్యోగం చెయ్యాలి.అప్పుడు ఆలోచించు.ఇప్పుడు ధ్యాస మరలితే చదువు కొండెక్కుతుంది.నీ జీవితమే పాడౌతుంది.’చాలా కూల్ గా చెప్పి నా భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు.

క్షణంలో నాకనిపించింది ఇప్పటి కిప్పుడు ఎవరినైనా ప్రేమించేసి అతనితో జంటగా  బావ ముందే తిరగాలనిపించింది.కాసేపటికి  ఆవేశం తగ్గింది వేరే పనుల హడావిడిలో.ఛీ, ఎవరినో ఎందుకు ప్రేమించాలి.చిన్నప్పటి నించీ ఇష్టపడిన బావనే ప్రేమిస్తా.ఎప్పటికైనా బావతోనే నా పెళ్ళి.అంతే.

గమ్మత్తేవిటంటే ఇంతవరకూ మా ఇంట్లో  ఎప్పుడూ బావతో నా పెళ్ళి చేయాలి అని గానీ ,సుశ్రు

 తని నా కోడలు చేసుకుంటానని మా అత్తగానీ మాట వరసకు కూడా అనలేదు.వాళ్ళకి ఇష్టమైనా కాకపోయినా నా నిర్ణయం మారదు.

నేను డిగ్రీ చివరి ఏడాదిలో వున్నప్పుడు నాకు పెళ్ళి సంబంధాలు చూడాలనుకుంటున్నట్టు అమ్మ చెప్పింది. ’ఉద్యోగంలో చేరాక చేసుకుంటాఅని చెప్పా.బావ కోరిక కూడా అదేగా.

కానీ అమ్మ చెప్పింది వెంటనే కుదిరిపోవు కనుక ఇప్పటి నించీ చూద్దాం.పరీక్షలు అయ్యాకే పెళ్ళి చేద్దాం అని అప్పుడు నా నిర్ణయం చెప్పా శ్రోత్రియ్ బావనే చేసుకుంటాఅని.మా నాన్న వెంటనే  బందరు వెళ్ళి మాట్లాడతానన్నారు.

అమ్మా,నాన్న బందరు వెళ్ళారు అత్తామామతో మాట్లాడటానికి ఆదివారం. రోజంతా నా మనసు రోజూ కన్నా సంతోషంగా వుంది.తొందరలో నాకు బావతో పెళ్ళి జరుగుతుంది..... తరువాత బావతో నా ఊహలు హద్దులు దాటాయి.నాకే సిగ్గేసింది.కానీ వూహలు ఎంత మధురంగా వున్నాయి.

రాత్రికి అమ్మానాన్న వచ్చారు.కానీ కమ్మని కబురుతో కాదు.అత్తకీ,మామకీ ఇష్టమే.కానీ బావే ఒప్పుకోలేదు.మేనరికం చేసుకోవటం వల్ల సంతానం అవకరంగానో,మానసిక ఎదుగుదల లేకుండానో పుడతారట.

మా నాన్న ఎన్నో ఉదాహరణలు చూపారట మా బంధువులలోనే అలా లేనివారి గురించి.అయినా బావ వప్పుకోలేదట.అత్తా మామ కూడా నచ్చ చెప్పబోయారట.వినలేదుట.అమ్మానాన్ నిరాశగా వచ్చారు.నన్ను ఓదార్చారు.

క్షణంలో బావ మీద కోపం వచ్చింది.ఇంత మూర్ఖుడేంటి అనిపించింది. రాత్రి నిద్ర లేదు నాకు.బావ లేని నా జీవితం ఊహించలేకపోతున్నా.ఏం చేయాలి.బావని ఎలా ఒప్పించాలి.రకరకాల ఆలోచనలు.

తెల్లవారు ఝామున బావకి మెసేజి పంపాలనుకున్నా.చిన్నప్పటి నించీ తనంటే నా కెంత ఇష్టమో రాసా. ప్రేమిస్తున్నా అని మొదటి సారి చెప్పినప్పటినించీ నా భావాలు క్లుప్తంగా రాసా.తనతో పెళ్ళి కాకపోతే ఇలాగే వుండిపోతా.ఇంకొరితో పెళ్ళి ప్రసక్తే లేదు.ఆత్మ హత్య కూడా చేసుకోను.చివరిగా రాసిన   వాక్యం బావంటే నాకెంత ఇష్టమో  చెప్తుంది.

మెసేజి పూర్తి చేసి పడుకునేసరికి తెల్లవారింది.ఇక అప్పటినించీ బావ ఎప్పుడు చూస్తాడు, ఎలా స్పందిస్తాడుఇదే ఆలోచన.రోజంతా అన్యమనస్కంగానే వున్నా.

అమ్మా నాన్న నన్ను ఊరడిస్తున్నారు బాధప డుతున్నానని. కాలేజీకి వెళ్ళిపోయాను.

***

శ్రోత్రియ్ మనసు

    ఆఫీసుకి వెళుతూ కేబ్ లో  సుశ్రుత పంపిన మెసేజి చదివాను.చాలా బాగా రాసింది.తన మనసు పరిచింది.కానీ నేను తనని పెళ్ళి చేసుకోననటానికి కారణం మేనరికం వల్ల అనర్థాల వల్లే. ఒకసారి నా మనసు గతంలోకి వెళ్ళింది                                

***

నాకు ఏడాది వయసు నించీ నా కన్నా చిన్న పిల్లలు క్యూట్ లిటిల్ బేబీస్ నా దృష్టిలో. (మా నాన్న హిందు కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్ కావటంతో నాకు ఇంగ్లీషు బాగా అలవాటైంది.)అంచేత వాళ్ళకేం తెలీదు అనుకునే వాడిని.వాళ్ళని ఆడించేవాడిని.

నాకు ఆరేళ్ళ వయసులో సుశ్రుత పుట్టింది.పురిటి గదిలోనే చూసాను.కళ్ళు తెరవలేదు.పిడికిళ్ళు బిగించి నవ్వుతూ వుండేది.మధ్యమధ్యలో చప్పరించేది. అంతలో ఏడుపు మొహం పెట్టేది.నాకు నవ్వు వచ్చేది.

బాలసారె రోజు నించీ సుశ్రుతని నా వొళ్ళో పడుకో పెట్టుకునే వాడిని.  అన్నం తినిపిస్తుంటే నా వొళ్ళోనే కూచోపెట్టుకునే వాడిని.

ముద్దు ముద్దు మాటలు బాగుండేవి.అందుకే సెలవులు ఇవ్వగానే ఏలూరు వెళ్దామనేవాడిని.కథలు చెప్పా.తెలియని పాఠాలు చెప్పా.బోలెడు ఆటలు నేర్పా.

బందరొస్త అంతా తిప్పి చూపించా.చిలకలపూడి పాండురంగడి గుడి తనకి చాలా ఇష్టం.అక్కడ జీళ్ళు ఇష్టం.సినిమాలు చూసేవారం అందరం కలిసి.

పదో తరగతి తరువాత ఏలూరు వెళ్ళటం తగ్గింది.సెలవులలో వేరే పరీక్షలు రాయవలసి రావటం వల్ల.అప్పుడు ఎక్కువగా అత్తయ్య,సుశ్రుత వచ్చేవారు.

మామయ్యంటే మా అమ్మకి అన్నయ్య.వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది తక్కువే.అత్తయ్య,అమ్మ ఎక్కువ.ఏలూరు వెళితే మా అమ్మని వంటింట్లో స్టూలు మీద కూచోమంటుంది అత్తయ్య పనీ చేయనీయదు.’ ఇంటి ఆడపడుచువిఅంటుంది.బందరు వస్తే తను పెద్దదాన్ని తను చెప్పినట్టు వినాలంటూ సగం పని అత్తయ్యే చేస్తుంది.వాళ్ళిద్దరినీ బయటి వాళ్ళెవరైనా చూస్తే అక్కా చెల్లెళ్ళనుకుంటారు.మా నాన్న,మామయ్య స్నేహితులలా వుంటారు.

అత్తయ్య చెప్పేది సుశ్రుత గోల పెడుతుంది బందరు వెళదాం అని.అత్తయ్య వెళ్ళిపోయినా తను వుండేది.తరువాత నేను తీసుకెళ్ళేవాడిని.ఇదివరకటిలా నేను తనతో మాట్లాడటం లేదు.చదువుకోవటమో,లైబ్రరీకి వెళ్ళటమో,స్నేహితులతో ఆటలు.పైగా తను పెద్దవుతోంది.

కానీ కార్యక్రమంలో తను చెప్పింది నన్ను ప్రేమిస్తున్నానని. వయసులో అలాగే అనిపిస్తుంది. ఆలోచన పక్కన పెట్టి చదువుకో బాగా అని చెప్పాను.ఉద్యోగం కూడా చేయాలి అన్నాను.తనకి కోపం వచ్చిందేమో తెలియదు.

నేను సంఘటనే మనసులో పెట్టుకోలేదు. వయసులో సినిమాలు,తోటి స్నేహితుల ప్రభావం బాగా వుంటుంది.కానీ విఙ్నతతో ఆలోచించకపోతే జీవితం నష్టపోతారు.

రోజు అత్తమామ వచ్చారు.సుశ్రుత నన్నే పెళ్ళి చేసుకుంటానంటోంది అన్నారు.అమ్మానాన్నలకీ ఇష్టమే.మేనరికం అయితే చిన్నప్పటి నించీ తెలుసు కనుక మా మధ్య కానీ,వారితో కానీ అభిప్రాయబేధాలు రావని,బంధుత్వం కూడా కలుపుకోవచ్చని.

నేను ఇష్టపడలేదు. మా ఇద్దరి మధ్య ఆరేళ్ళు తేడా.పైగా మేనరికం వల్ల కలిగే నష్టాలగురించి చెప్పాను.అటూ ఇటూ ఎన్నో ఉదంతాలు చూపించారు అలా అవకరాలు లేవని. కానీ నా భయం నాది.తరువాత అందరూ బాధపడాలి.నేను నా స్నేహితులని చాలా మందిని చూసాను.ఒకతను విడాకులు ఇచ్చాడు.వాళ్ళు బాధతో వెళ్ళిపోయారు.

కానీ ఇప్పుడు సుశ్రుత రాసిన ఉత్తరం అంతా ఒక ఎత్తు,చివరి రెండు వాక్యాలు ఒక ఎత్తు.ఆ అక్షరాల వెనుక నా మీద తనకి వున్న ప్రేమ వ్యక్తమౌతోంది.నేను ఆలోచనలో పడ్డాను.

అన్యోన్యంగా వుండే వారి మనసులు బాధపెట్టానా అని.ఆ రెండు వాక్యాలలో వున్న సుశ్రుత మనసు అర్ధం చేసుకోలేకపోతున్నానా అని.మేనరికాల వల్ల అందరికీ అన్నివేళలా ఇబ్బందులు కలగవేమో అని.

చివరికి సుశ్రుత మనసులోని ఆ రెండు వాక్యాలకి లొంగిపోయాను.ఆ రెండు వాక్యాలు ‘బావా నీతో పెళ్ళికాకపోతే ఇలాగే వుండిపోతా.మేనరికం వల్ల పిల్లలకి ఇబ్బంది ఐతే నాకు పిల్లలే వద్దు.నువ్వే కావాలి.’

***

మూడు నెలల తరువాత మా పెళ్ళి జరిగిపోయింది.తొలి రాత్రి సుశ్రుతతో చెప్పా ఇది నీ ప్రేమ విజయం అని.

( సమాప్తం)

 

No comments:

Post a Comment

Pages