పెద్దలు విచ్చేసినచొ - సూక్తి కథ
రచన: ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి
కలముఁ పేరు: నాగిని
ఊరు: హైదరాబాద్
చరవాణి: 9963998955
"నమస్కారం ఆంటీ", ఓ పన్నెండేళ్ళ పిల్ల, రెండు జడలను వేసుకుని, ఆ జడల మధ్య గుబాళించే మల్లెల మాలను తురుముకుని, ఆకు పౘ్చ పట్టు లంగా లో మెరిసి పోతోంది!
"ౘూడ ముౘ్చటగా ఉంది, ఎవఱి పిల్ల, క్రొత్తగా కనపడుతోంది, ఎప్పుడూ ౘూడలేదే!", అనుకుంటూ, "ఎవరమ్మా నువ్వు?", అడిగింది మాలతి.
"నా పేరు శ్రావ్య ఆంటీ, మీ ఎదురు ఫ్లాట్ లోకి పొద్దున్నే దిగాము, అమ్మా నాన్నా ఇల్లంతా సర్దుతున్నారు, నేను ఊరికే ఆడుకుంటూ ఇటు వచ్చాను", తూనీగ లా మళ్ళీ ఎగురుకుంటూ, కారిడార్ అంతా తిరుగుతూ, ఆడుకుంటోంది, ఈ లోగా, పాపను వెతుక్కుంటూ, ఆమె బామ్మ బయటకు వచ్చింది!
కారిడార్ లోనే కనపడటంతో, ఊపిరి పీల్చుకుంది!
"నమస్కారం అండీ" , ఈ సారి, మాలతి పలకరింపు, ఆ పెద్దావిడ తో మాట కలుపుతూ!
"నమస్కారం తల్లీ, క్రొత్తగా వచ్చాం కదా, ఆడుకుంటూ, పాప ఎటు వెళ్ళి ఉంటుందో అని ౘూసుకుంటూ ఉన్నాను", చెప్పారావిడ.
"మన కారిడార్ లో ఈ రెండు ఫ్లాట్లే ఉన్నాయి, కారిడార్ కు గేటు ఉంది, కనుఁక ఇబ్బంది లేదు, ఈ ౘోటే ఉంటుంది పిన్ని గారూ, మీకు అంతా ఇల్లూ అదీ సర్దుతున్నట్లు ఉన్నారు, కాస్త మీ ఎదురు ఫ్లాట్ లోకి వచ్చి, ఇలా గదిలో నడుం వాలుద్దురు కానీ, మీరు లేచాక, కాఫీ, మజ్జిగా, మీరు ఏది తీసుకుంటానంటే అది ఇస్తాను", చెప్పింది మాలతి!
"అయ్యో, ఫర్లేదమ్మా!", వారించారు పెద్దావిడ!
"మొహమాటం పడకండి పిన్ని గారూ, మీ అమ్మాయి ఇల్లే అనుకోండి, రండి పిన్ని గారూ!", అని తీసుకుని వెళ్ళింది మాలతి.
లోపలికి వెళుతూనే, "అనిరుధ్, అమ్మమ్మ గారికి కాసిని మంచినీళ్ళను తీసుకుని రామ్మా", అంటూ పిలిచింది మాలతి.
టి.వి.లో కార్టూన్ చానెల్ ౘూడటం లో మునిగి పోయిన పిల్లవాడు అసలు ఈ విషయాల స్పృహ లోనే లేడు! అదే చెబుతూ బాధ పడింది మాలతి, పిన్నిగారితో.
ఆవిడ లోపలికంటా వెళ్ళకుండా, హాల్లోనే సోఫాలో మోకాళ్ళ నొప్పులతో కూలబడినట్లు కూర్చుంటూ, టివిని సౌండ్ మాత్రం మెల్లగా తగ్గింౘమని,
తనలో తనే పాడుకుంటున్నట్లు, " ౘప్పట్లోయి, పుల్లట్లోయ్, ఆహాహాహా రుచి భళిరా", అనటం మొదలు పెట్టేరు".
ఆ పాటికే టీవీ వాల్యూం ను మెల్లిగా తగ్గించింది మాలతి.
అప్పటికి ఈ లోకం లోకి వచ్చిన అనిరుధ్, పాట వింటూ అమ్మమ్మ గారి వడి లోకి చెంగు చెంగున ఎగురుతూ వెళ్ళాడు.
ప్రేమగా వాడి తల నిమురుతూ, మఱి రెండు సరదా కబుర్లను చెబుతూ, వాడిని మచ్చిక చేసుకున్నారు.
అలా బుౙ్జగిస్తూనే, ఇప్పుడు ఓ పద్యాన్ని పాడుతాను, విని, అర్థాన్ని విడమర్చగలవా, సవాల్ ను చేస్తూ అడిగారు!
ఉడుకుమోతుతనంతో, "ఎందుకు చెప్పలేను, పద్యాన్ని పాడండి అమ్మమ్మా!" అన్నాడు అనిరుధ్.
ఆసక్తిగా మాలతి కూడా గమనిస్తోంది, " ఈవిడేం పాడతారా, వీడే మాత్రం చెప్పగలడా!", అని.
మంచి నీటిని త్రాగి, గొంతును సవరింౘుకుని, పాడారావిడ.
"పెద్దలు విచ్చేసినచొ
బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్
హద్దెరిగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!"
" 'పెద్దలు, బద్ధకం, ముద్దు కుమారా!', ఏవో కొన్ని అర్థమయ్యాయి, పూర్తిగా తెలియట్లేదు అమ్మమ్మా!", బిక్క మొహం వేసాడు అనిరుధ్.
ఈ లోగా పళ్ళెం లో తాను ఇంట్లో చేసిన కలకండనూ, ఉప్పూ, మిఱియం పొడీ, ౘల్లి, నిమ్మ రసం పిండిన ఉడికించి వేయించిన మొక్క జొన్న విత్తులనూ, పసుపు పొడి వేసిన పాలనూ ఇద్ధఱికీ అందించింది మాలతి.
ముద్దుగా పిల్లవాడికి కలకండను తినిపిస్తూ, "ౘూడు, మీ అమ్మ నీ కోసం, ఆరోగ్యం కోసం, ౘక్కగా ఇంట్లోనే చిరుతిళ్ళను, అదీ ఆరోగ్యకరమైనవి తయారు చేస్తారు కదా, మఱి నువ్వు తనకు తగ్గట్టుగా, ఎంత శ్రద్ధగా ఉండాలి?
ఈ టీవీలవీ ౘూడకుండా, ౘక్కగా ౘదువుకుంటూ, ఇంట్లో పనులకు అమ్మకు సాయంగా ఉంటూనే నువ్వూ పనిని నేర్చుకుంటూ, ఉండాలి కదా!" అన్నారు!
" అవును అమ్మమ్మా!" బదులిచ్చాడు అనిరుధ్.
" మఱి నువ్వు నేను వచ్చిన విషయం అయినా కనీసం గమనింౘకుండా, టివిని ౘూడటంలో మునిగి పోయావు! అది తప్పు కదా!", అడిగారావిడ.
"సారీ బామ్మా!", చెప్పాడు అనిరుధ్.
"ఇప్పుడు పర్లేదు, కానీ, ఇక మీదట, పెద్దలు ఎవఱైనా వచ్చినప్పుడు, నువ్వు ఎంత పని ఒత్తిడి లో ఉన్నా కూడా, లేచి వాఱికి నమస్కారాలను తెలిపి, ఏమన్నా కావాలేమో గమనింౘుకుంటూ అందిస్తూ ఉండాలి! తెలిసిందా! ఈ పద్యం అర్థం అదే!", చెప్పటం పూర్తి చేసి, ఆపారావిడ.
" సరే అమ్మమ్మా!, ఈ సారి నుంచి జాగ్రత్తగా ఉంటాను", చెప్తూ, అమ్మమ్మవీ, తనవీ, పళ్ళాలనూ, లోటాలనూ తీసి, అంట్లలో వేసి, వచ్చి టివిని కట్టేసాడు బుల్లి అనిరుధ్, అమ్మమ్మ సూచనలతో.
" పిల్లలకిలా, సూక్తులూ, సూత్రాలూ, సోదాహరణంగా చెబితే ఎంత బాగా అర్థం చేసుకుంటారో!", అనుకుంటూ, " పిన్ని గారూ, మీ మనవళ్ళతో పాటూ, అనిరుధ్ కు కూడా రోౙూ ఇలాగే సద్బోధలను చేస్తూ ఉండరూ!", అంటూ అడిగిన మాలతి తలను నిమిరి, " తప్పకుండా ", అంటూ బొట్టును పెట్టింౘుకుని తన ఇంటికి బయలుదేరారావిడ.
***




No comments:
Post a Comment