అసలు కంటే వడ్డీ ముద్దు
కాశీవిశ్వనాధం పట్రాయుడు
9494524445
ఒకరోజు సాయంత్రం లచ్చవ్వ ఇంటి అరుగుమీద కూర్చొని ఒత్తులు చేసుకుంటోంది. ఇంతలో రామవ్వ పాయసం గిన్నెతో అక్కడికి వచ్చింది.
“ఇదిగో లచ్చవ్వా! ఇంట్లో పాయసం చేశాను. నీకోసం కొంచెం తెచ్చాను” అంటూ గిన్నెను ఆమె చేతిలో పెట్టింది రామవ్వ.
లచ్చవ్వ పాయసం గిన్నెను కోడలికి అందిస్తూ,
“ఇది దాచిపెట్టు. హరి ఆడుకోవడానికి వెళ్లాడు. వాడికి పాయసం అంటే చాలా ఇష్టం. వాడు రాగానే పెడదాం” అంది.
కోడలు ఆశ్చర్యంగా,
“మీ అబ్బాయికి కూడా పాయసం అంటే చాలా ఇష్టం కదా! మరి హరి కోసమే దాచిపెడుతున్నారేంటి?” అని అడిగింది.
లచ్చవ్వ నవ్వుతూ,
“ఏమోమ్మా! వాడంటే నాకు చాలా మురిపెం” అంది.
అది విన్న రామవ్వ నవ్వుతూ,
“ఔనమ్మా... అసలుకంటే వడ్డీయే ముద్దు!” అంది.
“అసలుకంటే వడ్డీ ముద్దా? అదెలా రామవ్వమ్మా?” అని అడిగింది లచ్చవ్వ కోడలు.
రామవ్వ నవ్వుతూ,
“డబ్బు అప్పుగా ఇస్తే అసలు కంటే వడ్డీ మీదే కదా కన్ను! అలాగే కొడుకు కంటే మనవడిపై తాతామామ్మలకు మురిపెం కాస్త ఎక్కువ. అందుకే ‘అసలు కంటే వడ్డీ ముద్దు’ అంటారు” అంది.
కోడలు నవ్వుతూ,
“అంటే... కొడుకు అసలు అయితే, మనవడు వడ్డీ అన్నమాట!” అంది.
“అంతే మరి! కొడుకుపై ప్రేమ ఉంటే... మనవడిపై ఆ ప్రేమకు వడ్డీ కూడా చేరుతుందన్నమాట!” అంది రామవ్వ.
ఇంతలో బయట నుంచి హరి పరుగెత్తుకుంటూ వచ్చాడు.
“అవ్వా! పాయసం వాసన వస్తోంది!” అంటూ లచ్చవ్వ దగ్గరకు చేరాడు.
“రా నాయనా! నీ కోసమే దాచిపెట్టాను” అంటూ లచ్చవ్వ గిన్నె తీసి హరిని దగ్గరకు తీసుకుంది.
“అవ్వా! నాకు జీడిపప్పు ఎక్కువగా పెట్టు” అన్నాడు హరి.
“నీకు నచ్చినట్టే పెడతాను నాయనా!” అంటూ లచ్చవ్వ ప్రేమగా పాయసం తినిపిస్తూ మురిసిపోయింది.
అది చూసిన కోడలు నవ్వుతూ,
“అత్తయ్యా! ఇప్పుడు సామెత నిజమని తెలిసింది!” అంది.
“ఏమిటమ్మా?” అంది లచ్చవ్వ.
“అసలు కంటే వడ్డీ ముద్దే కదా!” అంది కోడలు.
లచ్చవ్వ నవ్వుతూ హరిని మరింత దగ్గరకు తీసుకుంది. అలా ‘అసలు కంటే వడ్డీ ముద్దు’ అనే సామెత ప్రాచుర్యం పొందింది.
***




No comments:
Post a Comment