కనకదుర్గ ఐ.పి.ఎస్ -4 - అచ్చంగా తెలుగు

                                                                  కనకదుర్గ ఐ.పి.ఎస్ -4

(మినీ నవల)

టేకుమళ్ళ వెంకటప్పయ్య 




"మీరు.." ఇంట్లోకి వస్తున్న మాధవిని చూసి గోపాలాచారి తల్లి ఆండాళమ్మ అడిగింది.

"నా పేరు మాధవి. మీ గోపాలం చదివే స్కూల్లోనే మా అమ్మాయి కనకదుర్గ కూడా ఎనిమిదో తరగతి చదువుతోంది. మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను."

"అయ్యో! నిలబడే ఉన్నారు. కూర్చోండి. మంచి నీళ్ళు కావాలా?"

"అక్కరలేదు. మీరూ అలా కూర్చోండి! మీ వారున్నారా?"

"లేరండీ ఊరు వెళ్ళారు. చెప్పండి పర్వాలేదు"  అంది కూర్చుంటూ.

విషయం అంతా చెప్పి, యుక్త వయసులో ఇవన్నీ మామూలే! మీరు ఎక్కువగా రియాక్ట్ అయి వాణ్ణి దండించకండి. చదువు అనేది చాలా ముఖ్యం. ఒకసారి చెడు మార్గం పడితే ఇంక అంతే!  విషయం మీ అబ్బాయికి వివరంగా అర్ధమయేట్టు చెప్పండి చాలు. ఈ వయసులో మీరూ నేనూ కూడా యిలాంటి అనుభవాలను స్కూలు, కాలేజీలలో ఎదుర్కొన్న వాళ్ళమే! అయితే ఒక్క విషయం చెప్పాలి మీకు.  మా అమ్మాయి అందరు అమ్మాయిల్లా సెన్సిటివ్ కాదు. దానికి కోపం వస్తే ఏం చేస్తుందో ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నేను ఊహించలేను.  మీ అబ్బాయిని మీరే మెల్లిగా చెప్పి కంట్రోల్లో పెట్టుకోండి. అది యాక్షన్లోకి  దిగకముందే మీకు చెప్పాలని వచ్చాను.  ఇంకా మావారికి కూడా చెప్పలేదు. మగవారికి యిలాంటి విషయాలు తెలిస్తే చాలా గొడవలు అవుతాయి. వస్తాను" అని బయటపడింది మాధవి.

ఆండాళమ్మ భర్తకు చెప్పి గోపాలాచారిని ఆ స్కూలులో టీ.సీ తీసుకొని, అంత వెంటనే వేరే మగపిల్లల బడిలో చేర్పిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. హెడ్మిస్ట్రెస్ మంచి స్టూడెంటును వదులుకోలేక ఎంత అడిగినా,  ఆండాళమ్మ విషయం బయటకు చెప్పలేదు. ఆగోడవ అంతటితో సద్దు మణిగింది.

*        *        *

కాలం ఎవరి కోసం ఆగదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. పదో తరగతి వచ్చేసరికి దుర్గ అద్భుతమైన ప్రతిభతో కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది.  ఒకరోజు హెడ్మిస్ట్రెస్ అసెంబ్లీలో దుర్గ చదువును గురించి,  సాధిస్తున్న విజయాల గురించి గొప్పగా పొగిడింది.  ఎన్.సి.సీ లో రైఫిల్ షూటింగులో జిల్లాలోనే ప్రథమ స్థానం వహించడం,   ఊర్లో వక్తృత్వ పోటీలు జరిగినా, వ్యాసరచన పోటీలు జరిగినా దుర్గే ఫస్ట్ రావడం,  వెనుక ఆ అమ్మాయి కృషిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, జాతీయ అంతర్జాతీయ విషయాలు ప్రతి రోజూ ఆరవ తరగతి నుండే దుర్గ బోర్డు మీద రాస్తున్న విషయం చెప్పి మీరూ టైం వృధా చెయ్యకుండా రోజూ ఇంగ్లీషు, తెలుగు పేపర్లు చదవాలని హితవు చెప్పింది.

దుర్గ రోజు రోజుకూ అందంగా తయారవుతోంది. చామనఛాయలో ఉన్న దుర్గ తెల్లని కాంతులీనుతోంది. స్కూల్లో టీచర్లు, విద్యార్ధులు, టీచర్లు  కూడా అసూయపడేంత అందంగా తయారవుతోంది.  ఉదయం పూట దుర్గ కాస్తా ముందుగా వచ్చి బ్లాక్బోర్డు మీద ఆనాటి వార్తలు రాసే సమయంలో మగపిల్లలు గుంపులు గుంపులుగా నిలబడి, ఆమె సోయగాల్ని తిలకించేవారు. క్లాసు రూములో మొగపిల్లలు పాఠం వినకుండా అదేపనిగా  దుర్గవంక చూడ్డం గమనించి కూడా టీచర్లు ఏమీ అనలేక పోయేవారు. రూపవతి అయిన స్త్రీకి తన అందమే తనకు శత్రువవుతుందని వేరే చెప్పనక్కరలేదు. అదే జరిగింది ఒకరోజు.

ఒక నాడు స్కూల్లోకి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక పెద్ద కారు ప్రవేశించింది. నలుగురు యువకులు దిగారు. వాళ్ళను హిందీ టీచరు గుర్తుబట్టి "వాళ్ళు నాలుగేళ్ళ  క్రితం ఈ స్కూల్లో చదివారు. పొడుగ్గా లావుగా ఉన్నవాడే సుభాష్ రెడ్డి, వాడు మాజీ ఎం.ఎల్.ఎ కొడుకు. ఇంటర్ డింకీలు కొట్టి కొట్టి, యిప్పుడు గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడని విన్నాను. పోకిరీ చేష్టలు చేస్తుంటే పోలీసు కేసులు కూడా అయ్యాయని పేపర్లలో చదివాను. బాగా తలపొగరు వాడికి" అని చెబుతుండగా దుర్గ విని అలెర్ట్ అయింది. దుర్గతో బాటూ ఐదుగురు విద్యార్ధినులు గ్రవుండులో కూర్చొని రాబోయే స్కూల్ యానివర్సరీకి ఏమేమి కార్యక్రమాలు చెయ్యాలో, మ్యాగజైన్ కూడా ఒకటి తీసుకొని రావాలన్న యోచనతో  మాట్లాడుకుంటున్నారు.

   సుభాష్ రెడ్డి తిన్నగా దుర్గ ఉన్న దగ్గరకు వచ్చాడు. వెనుక అతని బృందం. అతడు రాగానే దుర్గతో ఉన్నవాళ్ళు భయపడి ఆమె వెనుక నిలబడ్డారు.

"కనక దుర్గ అంటే నువ్వేనా?" 

"అవును. అయితే ఏంటి?"

"నీతో పనుంది. వచ్చి కారెక్కు. మళ్ళీ రెండు గంటల్లో దింపేస్తాను. పదివేలు డబ్బు కూడా ఇస్తాను. ఇష్టం వచ్చినవి కొనుక్కోవచ్చు. "

"ఎక్కడికి? మీరెవరు? అసలు నేనెందుకు రావాలి మీతో? నాకు డబ్బులు ఇవ్వడమేమిటి?. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త! ఇక్కడ దుర్గ.. కనకదుర్గ! జాగ్రత్తగా మాట్లాడండి."

"గొడవ పెట్టకుండా వచ్చి  కారెక్కవే! త్వరగా అందంగా ఉన్నావని బడాయికి పోతున్నావా? ఇంత మందిని చూశాను. కారెక్కు మర్యాదగా!" లేకపోతే నీకే ప్రమాదం!" అన్నాడు.  

"నాకు ప్రమాదమా? ఏంటిమళ్ళీ ఒకసారి చెప్పు వినాలని ఉంది." అని పకపక నవ్వి "మీకు ప్రమాదం రాకుండా చూసుకోండి మొదట. ఇక్కడనుండి వెంటనే వెళ్ళిపోండి" అనింది. కొందరు పిల్లలు దుర్గ  వెనక నిలబడి  ఇదంతా మొబైల్లో రికార్డు చేస్తున్నారు.

అప్పటికే స్కూలువాళ్ళు చాలామంది దుర్గ వెనుక చేరారు. "మర్యాదగా..మాట్లాడకుండా కారెక్కు" అని హూంకరించి దుర్గ చేయిపట్టుకుని ఐదుఅడుగుల దూరం బలవంతంగా లాగాడు  సుభాష్.

అంతే!  దుర్గ ఉగ్రరూపం దాల్చింది. "హూ.." అని ఒక పెద్ద కేకవేసి, భుజానికున్న బ్యాగులో నుండి "నుంచాకు" (ప్రముఖ కరాటే ఫైటర్ బ్రూస్లీ వాడిన గొలుసు ఆయుధం) గొలుసు బయటకు తీసింది. గొలుసు తిప్పుతూ వాళ్ళను దగ్గరకు రాకుండా నిలువరించి,  కుడికాలెత్తి ఒక్క సారి సుభాష్ రెండు తొడలమధ్య ఒక్క షాట్ ఇచ్చేసరికి నిలువునా కుప్పకూలిపోయాడు.  మరు నిముషంలో వాడి ప్యాంటు పై రక్తం కూడా కనిపించేసరికి, మిగతా ముగ్గురూ మావాణ్ణే కొడతావా? నిన్నూ.. అని మీదకొచ్చేసరికి,  దుర్గ భీకరంగా అరుస్తూ గొలుసుతో యిచ్చిన షాట్స్‌కు కుయ్యో మర్రో మంటూ ముగ్గురూ నేలమీద పడిపోయారు.

ఈలోపు స్కూలు స్టాఫు, హెడ్మిస్ట్రెస్ వచ్చి ఏమైందని విచారిస్తున్నారు. రోడ్డు మీద కాంపౌండ్ వాల్ దగ్గర కూడా చాలామంది జనం పోగయ్యారు. ఎవరో ప్రక్కనే ఉన్న పోలీసు స్టేషనుకు ఫోన్ చేసే సరికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎవరు వీళ్ళను కొట్టింది? అని అడిగేసరికి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళల్లో దెబ్బలు తిన్న ఒకడు మాత్రం తేరుకొని లేచి చేయి దుర్గ వేపు చూపించాడు.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages