పుణ్యవతి (నవల) - 15
రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
@@@#@@#@
(సుధ కవిత్వాన్ని చదివిన రవి చిన్న వయసులోనే కన్నుమూసిన ఆమెను తలచుకొని బాధపడ్డాడు. కూతురికి చూసిన సంబంధం నచ్చలేదని వచ్చిన ఉత్తరానికి కలవరపడ్డ రంగనాధం, ఆ ఉత్తరాన్ని పుణ్యవతి ఇంటికి వచ్చి చూపిస్తాడు. తరువాత...)
@@@@@@@@
ఉత్తరం చదివిన పుణ్య అతని వైపు చూసింది. "ఈ ఉత్తరం చదివి బాధపడుతున్నారా? పిన్ని అంతా చెప్పింది. పెళ్ళిచూపుల్లో వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తించారట! అలాంటి వారికి పిల్లను ఇవ్వకపోవటమే మంచిది. సృజనకేం నాన్నా! బంగారంలాంటి సంబంధం వస్తుంది. మీరు దర్జాగా కాలు మీద కాలేసుక్కూర్చోండి. నేను, బాబయ్య ఆ సంగతి చూసుకుంటాం. దానికి మున్ముందు నేనే అసూయపడేటంత మంచి సంబంధం చూస్తాను. నా మీద నమ్మకం లేదా నాన్నా?"
పుణ్య మాటలు వినిపించుకొనే స్థితిలో లేడతను. "వాళ్ళ బంధువుల అబ్బాయి వల్ల కదమ్మా నా కూతురు చనిపోయింది! బజారులో అతను నాపై చేయి చేసుకున్నాడని కదా నా పిచ్చితల్లి ఆత్మహత్య చేసుకుంది! అతను మావగారిని కొట్టడం మర్యాదా? నా కూతురు అతన్ని రోడ్డుకీడ్చక, ఆత్మహత్య చేసుకొంటే అమర్యాదా? సుధ చావు వల్ల తన సంబంధం తప్పిపోయిందని తెలిస్తే, సృజన ఎంత బాధపడుతుందో? సుధ మీద ఎంత కక్ష పెంచుకుంటుందో?"
"అదేనా మీ బాధ? దానికి నేను చెబుతానులెండి! సృజన బంగారం నాన్నగారూ! ఈ సంబంధం తప్పిపోయిందని మనం కాదు నాన్నా, మున్ముందు ఆ పెళ్ళివారే బాధపడతారు."
"అమ్మా! నాకో మాటిస్తావా?" ఏమిటన్నట్లు రంగనాధం వైపు చూసిందామె.
"రేపు నాకేదైనా అయితే, సృజీని కంటికి రెప్పలా చూసుకొంటావు కదూ! అది ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతావు కదూ!" చెబుతున్న రంగనాధం గొంతు బొంగురుపోయింది.
"ఈ ఉత్తరం మీ మనసుని చాలా కష్టపెట్టినట్లుంది. చూడండి! దానికి ఇంతకాలం ఎన్ని సంబంధాలు చూడలేదు? అవి కుదరనప్పుడు లేని బాధ ఇప్పుడెందుకండీ?"
"దానికి దగ్గరలోనే మంచి సంబంధం అవుతుందని అనంతశయనంగారు చెప్పారమ్మా! ఆయన చెప్పినట్లు చాలామందికి జరిగింది. అలాగే దీనికి జరుగుతుందని ఆశపడ్డాను. నా దౌర్భాగ్యమే నా కూతుళ్ళిద్దరికీ పట్టినట్లుంది. అది అలా నీటిపాలయ్యింది. దీనికిలా జరిగింది. ఏమ్మా! నాకేదైనా అయితే సృజీని జాగ్రత్తగా చూసుకుంటావుకదూ!"
"మళ్ళీ అదే మాట! మీకేం కాదు నాన్నా! నెల్లాళ్ళలో దానికి పెళ్ళి కుదురుతుంది. అప్పుడు ఈ వేదాంతం మానేసి మనవలెప్పుడు పుడతారా అని ఆశగా ఎదురుచూస్తావ్! నా మాట మీద నమ్మకం లేదా నాన్నా?"
"నీది సరస్వతీవాక్కురా! అందుకే నీ దగ్గర మాట తీసుకుందామని వచ్చాను. నీ నోటివాక్కున అదొక ఇంటిదవ్వాలి" అంటూ రంగనాధం లేచాడు.
"ఈ ఉత్తరం మిమ్మల్ని చాలా బాధపెట్టింది. ఏమనుకోకండి" అంటూ పుణ్యవతి ఆ ఉత్తరాన్ని చింపేసింది. తెలియకుండానే ఆమెకు మనసులో ఏదో బాధ కలిగి ఆయన్ని వెనక్కి పిలిచింది.
"నాన్నగారూ! మిమ్మల్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. పోనీ ఈ రాత్రికి ఇక్కడ ఉండిపొండి. ప్రక్కింటి బుజ్జిగాణ్ణి పంపి, సృజీని కూడా పిలిపిస్తాను" అందామె.
"లేదమ్మా! రవి కూడా ఊరెళ్ళాడు. మేమిద్దరం ఇక్కడ ఉండిపోతే, అక్కడ నా సుధ ఒంటరిదైపోతుంది. అది చనిపోయినా, దాని ఆత్మ ఆ పూలమొక్కల గాలిలో కలిసి నన్నెప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది" అంటున్న రంగనాధాన్ని చూసి ఆమె మనసు చలించింది.
పుట్టిబుద్ధెరిగాక ఆమె నాన్నను చూడలేదు. ఆమెకి ఊహ వచ్చేసరికి అమ్మ, అన్నయ్య నాన్న పోయిన ఊరినుంచి ఈ ఊరికి మారిపోయారు. అప్పటినుంచి రంగనాధం దగ్గరే ఆమె తండ్రి ప్రేమను చవిచూసింది. తన ఇద్దరి కూతుళ్ళతో పాటు ఈమెక్కూడా బట్టలు, బొమ్మలు కొని ఇచ్చేవారాయన. తన కూతుళ్ళకి తల్లి లేని లోటు తీరుస్తూ, నలుగురితో నవ్వుతూ చలాకీగా ఉండే రంగనాధం, ఏడాది క్రితం జరిగిన సుధ మరణంతో ఇలా అయిపోతాడని ఎవరూ అనుకోలేదు. రవి విషయం రంగనాధానికి చెప్పి ఓదార్చాలనుకొంది పుణ్య. కానీ ఆ ఇంట్లో అద్దెకుండే వ్యక్తి వల్లే తన కూతురు చనిపోయిందన్న సెంటిమెంటుతో అతను ఈ పెళ్ళికి ఒప్పుకోడు. పైపెచ్చు ఈ పెళ్ళిచూపుల వేళ తను కిటికీలోంచి చూసినందుకే తనపై దెబ్బలాటకు వచ్చారని, తన చాకచక్యం వల్ల పెద్ద గొడవ తప్పిపోయిందని రవి చెప్పాడు. ఇప్పుడు రవి విషయం చెబితే, అతనే కావాలని సుధ చనిపోయిన విషయం పెళ్ళివారికి చెప్పి, ఈ సంబంధం చెడగొట్టినట్లు ఆయన అనుకునే ప్రమాదం లేకపోలేదు. తన తల్లితో రవి మాట్లాడి వచ్చాక, జగన్నాధం ద్వారా రంగనాధాన్ని బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పించవచ్చని ప్రస్తుతం ఆ విషయం కదపలేదామె.
"ఉదయం నుంచి నిన్ను చూడాలని నా మనసు కొట్టుకొందిరా!" రంగనాధం మాటలు పదే పదే గుర్తొచ్చి ఆ రాత్రి పుణ్యవతికి నిద్రపట్టలేదు.
"భగవంతుడా! సృజీ పెళ్ళయ్యేవరకూ రంగనాధంగారికి ఏమీ జరగకుండా చూడు!" అని ప్రార్థించిందామె. అప్రయత్నంగా మనసులో కలిగే కలవరానికి పదే పదే తనను తిట్టుకొంది.
@@@@@@@
పొద్దుపోయి ఇంటికి వచ్చిన తండ్రిపై చిరాకుపడింది సృజన. ఆమె మాటలకు బదులీయక ముభావంగా ఇంట్లోకి నడిచాడతను. రాత్రి బాగా పొద్దుపోతున్నా, నిద్రపోక పెరట్లోని చెట్ల చుట్టూ తిరుగుతున్న తండ్రిపై విసుక్కొంది. రంగనాధం అప్పుడప్పుడు వింతగా ప్రవర్తించటం అలవాటే గనుక పెద్దగా పట్టించుకోలేదామె. మరునాడు ఉదయం తండ్రి ఇంటిలో కనిపించలేదు. వీధి తలుపు చేరవేసి ఉండటంతో, మనశ్శాంతి కోసం తండ్రి ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళాడనుకుందామె. తన నిద్ర పాడుచేయటం ఇష్టంలేక తలుపు దగ్గరకు చేరవేసి వెళ్ళుంటాడు. "పిచ్చినాన్న!" అనుకుంటూ సృజన గుమ్మంలో కళ్ళాపి చల్లి ముగ్గేయసాగింది. మధ్యలో తలెత్తిన ఆమెకు దూరంగా గులాబీపొద దగ్గర ఎవరో ఉన్నట్లు కనిపించి త్రుళ్ళిపడింది.
"ఎవరది?" తన అరుపులకి అటునుంచి జవాబు రాకపోవటంతో, భయపడ్డ ఆమె పక్కిళ్ళకు వెళ్ళి నలుగురిని పోగేసి తీసుకొచ్చింది.
"ఎవడ్రా ఇంట్లో దూరింది?" అంటూ నలుగురు మగాళ్ళు అరుస్తూ గులాబీపొద దగ్గరకు వెళ్ళారు. అక్కడ గులాబీచెట్టు పక్కన నిద్రపోతున్నట్లు పడి ఉన్న రంగనాధం కనిపించాడు. నిర్జీవంగా పడి ఉన్న తండ్రిని చూసి సృజన కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల నలుగురూ సాయంపట్టి, రంగనాధాన్ని గుమ్మంలో పడుకోబెట్టారు. ఈలోపున జగన్నాధానికి కబురెళ్ళటం, డాక్టరొచ్చి రంగనాధం హార్ట్ ఎటాక్‌తో పోయాడని చెప్పటం జరిగింది. రాత్రంతా కలతనిద్ర పోయిన పుణ్యవతి ఉండబట్టలేక, ఉదయాన్నే అన్నయ్య శేఖర్ అనుమతితో సృజన ఇంటికొచ్చింది. అంతవరకూ నిగ్రహించుకొని ఉన్న సృజన పుణ్యను చూసి భోరుమంది. కళ్ళ ముందు కనిపించే నిజానికి తట్టుకోలేక పుణ్యవతి నిస్త్రాణగా అరుగుపై గోడకు జేరబడిపోయింది. తండ్రి కోసం విలపించే సృజీని పట్టుకోవటం చుట్టుపక్కల ఆడవాళ్ళకు చాలా కష్టమైపోయింది.
"వయసులో భార్య చనిపోతే, మరో పెళ్ళి చేసుకోకుండా పుట్టిన ఇద్దరు బిడ్డల్ని కన్నతల్లిలా సాకాడు. గుండెలో బాధల్ని దాచుకుని ఎప్పుడూ నవ్వుతూ తిరిగే రంగనాధం, పెద్దకూతురు పోయాక మానసికంగా దెబ్బతిన్నాడు. వంట్లో బాగుండటం లేదు, త్వరగా రెండవ అమ్మాయి పెళ్ళి చేసెయ్యాలని కంగారు పడేవాడు. చివరికి కూతురి పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోయాడు. పెద్దకూతురు అంటే వాడికి ప్రాణం. అందుకే ఆ అమ్మాయి చేసుకుంటానన్న వాడికే కట్టబెట్టాడు. చివరికి సుధమ్మ ప్రాణంగా పెంచిన గులాబీమొక్క దగ్గరే ఊపిరి వదిలాడు. రెండో కూతుర్ని అనాధను చేసిపోయాడు" వచ్చినవాళ్ళ మాటలు వినే కొద్దీ సృజనలో బాధ పెరిగిపోతోంది. 'రాత్రి తండ్రి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు తను. పైపెచ్చు ఎన్నడూ లేనంత కటువుగా మాట్లాడింది. 'అందుకే తనని కాదని అక్కయ్య పెంచిన మొక్క దగ్గరే పడుకుని నాన్న ప్రాణాలు వదిలాడు.'
"అమ్మా! మాది ఆత్మహత్యలు చేసుకొనే కుటుంబమా?" రంగనాధం ప్రశ్న గుర్తుకొచ్చి పుణ్యవతి కళ్ళు జలపాతాలయ్యాయి. "అమ్మా! నాకో మాటిస్తావా? రేపు నాకేదైనా అయితే సృజీని కంటికి రెప్పలా చూసుకుంటావు కదూ! అది ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతావు కదూ!" తన మీద అంత పెద్ద బాధ్యత పెట్టి తప్పుకున్నాడాయన.
"పుణ్యా! ఏమిటమ్మా అలాగైపోయావ్?" నిస్త్రాణగా గోడకు వాలిపోయిన పుణ్యవతి భుజంపై చేయి వేసి కుదిపింది జగన్నాధం భార్య.
ఆ కుదుపుతో పుణ్య ఇహంలోకి వచ్చింది. "పిన్నీ! నాన్న. . .నిన్న సాయంత్రం నిన్ను చూడాలనిపించి వచ్చారా? అన్నాడు. నాకేదైనా అయితే సృజీని నువ్వే చూడాలి అని నా మీద పెద్ద బాధ్యత పెట్టి వెళ్ళిపోయాడు. 'అదోలా ఉన్నారు, రాత్రికి ఇక్కడ ఉండిపొండి ' అంటే, 'నేనిక్కడ ఉండిపోతే, నా సుధ ఒంటరిదై పోతుందిరా' అన్నాడు. నాన్నను కాపాడుకోలేకపోయాను పిన్నీ!" అంటూ గత సాయంత్రం జరిగిందంతా చెప్పి ఆమె ఒళ్ళో వాలిపోయింది పుణ్యవతి.
మనసులో బాధను అణచుకొంటూ జగన్నాధం అన్నగారి అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నాడు. విషయం తెలిసిన శేఖర్ అఘమేఘాల మీద రంగనాధాన్ని చూడటానికి వచ్చాడు. సుమారు గంటసేపు ఆ యింటి వాతావరణమంతా గగ్గోలుగా మారిపోయింది.
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment