కనకదుర్గ ఐ.పి.ఎస్ - 3 - అచ్చంగా తెలుగు

 కనకదుర్గ ఐ.పి.ఎస్ -3

(మినీ నవల)

టేకుమళ్ళ వెంకటప్పయ్య 





దుర్గ ఎనిమిదవ తరగతిలోకి ప్రవేశించింది.  రోజూ ఉదయాన్నే  6 లోపు స్నానం చేసి, తండ్రి చెప్పినట్లు  ఇంగ్లీషు తెలుగు పేపర్లను చదివి డైరీలో నోట్ చేసుకునేది. అర్ధం కాని పదాలను నిఘంటువులో చూసి రాసుకునేది. అనేక విషయల్లో దుర్గ సాధించిన జ్ఞానానికి రాఘవ విస్తుపోయే వాడు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ యిలాంటి కూతురు పుట్టదని యిద్దరూ పొంగిపోయేవారు. మాధవి కూడా కూతురు ఏమైనా మాట్లాడితే దాని వెనుక ఉన్న అసలు వ్యవహారం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేది. చీటికి మాటికి దుర్గపై అరవడం మానుకుంది.

ఒకరోజు బాత్ రూంలో స్నానం చేస్తూ "అమ్మా! అని పెద్దగా అరిచింది. మాధవి వెళ్ళి దుర్గను బయటకు రమ్మని "దూరంగా అక్కడ చాప మీద కూర్చో! మళ్ళీ నేను చెప్పేవరకూ  ఎక్కడికీ కదలకూడదు. స్కూలుకు కూడా నేను చెప్పేవరకూ వెళ్ళకూడదు."

ఈలోపు రాఘవ కూరల సంచీతో వచ్చి "ఏమిటి? ఏమైంది? దాన్ని స్కూలుకు వెళ్ళొద్దని అంటున్నావేమిటి? “

"నేను అన్నీ వివరంగా చెప్తాను కానీ, మీరు మళ్ళీ బజారుకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక్క సారి క్యాలండరు తీసుకొని, ఇవాల్టి తేదీ, తిధి నక్షత్రం, సమయం ఉదయం 6.30 అని కాగితం మీద నోట్ చెయ్యండి" అంది నవ్వుతూ.

అప్పటికి కానీ రాఘవకు విషయం అర్ధం కాలేదు. అర్ధమవగానే చిరునవ్వు నవ్వుతూ "ఏమేం సరుకులు కావాలో లిస్టు రాసియ్యి. అలాగే ఇవాళ సెలవు పెడుతున్నట్టు పర్సనల్ మేనేజరు రామాచారికి చెప్పి లీవ్ లెటర్ ఇచ్చి రావాలి"అన్నాడు.

"ఏకాదశి, శుక్రవారం, అశ్వని నక్షత్రం, ఉదయం పూట కాబట్టి నాకు తెలిసినంతవరకూ అన్నీ శుభ ఘడియలే! రాహుకాలం కానీ దుర్ముహూర్తం కానీ లేదు. అమృత ఘడియలే! పైగా తెల్ల బట్టలు ధరించి ఉంది కాబట్టి శుభమే!" అంది సంతోషంగా.

"ఏంటి నాన్నా! ఇదంతా నా మీద  నాలుగు అక్షింతలు జల్లి  మూల ఈ చాపమీద కూర్చోబెట్టింది. నాలుగు రోజులు యిలాగే ఉండాలట. కదలగూడదట. ఈ గోలంతా ఏమిటో అర్ధం కావడం లేదు" అన్న దుర్గ మాటలకు రాఘవ "ఆడపిల్లలకు ఈ శిక్ష తప్పదమ్మా.. అమ్మ చెప్పినట్టు విను అంతే! " అన్నాడు చిరునవ్వుతో.

"పో నాన్నా..నువ్వూ అమ్మకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నావు" అంది.

"నువ్వు కాసేపు నోరు మూసుకోవే!" అని దుర్గను సున్నితంగా కోప్పడుతూ "ఏమండీ.. అయినా ఒక సారి పంతులు గారు చూస్తే మనకు సంతృప్తిగా ఉంటుది కదా!" అన్న మాధవి మాటలకు "సరేలే వెళ్ళొస్తాను. ఆ చీటీ యిలా ఇవ్వు!అన్నాడు మాధవి రాసిన లిస్టు చేతికి తీసుకుంటూ.

"వెళ్ళి రండి. శుభం" అంది నవ్వుతూ.

ఉన్నంతలో చుట్టుప్రక్కల క్వార్టర్స్‌లో ఉన్న పెద్దముత్తైదువలను పిలిచి కార్యక్రమం సింపుల్‌గా ముగించింది మాధవి.  ఒక వారం తర్వాత స్కూలుకు బయలుదేరింది దుర్గ.

"ఇదుగో జాగ్రత్త! ఇదివరకు లాగా మొగపిల్లలతో ఆటలాడడం, మాట్లాడ్డం చెయ్యకు. జాగ్రత్త! చెప్పినవన్నీ గుర్తున్నాయా?" అంది  మాధవి.

"అలాగే అమ్మా!" అని స్కూలుకు చేరుకుంది.

లంగా ఓణీ ధరించి స్కూల్లోకి అడుగుపెట్టిన తనను స్కూల్లో చిన్నా పెద్దా ఏదొ వింత వస్తువును చూసినట్టు చూడ్డం గమనించింది. ఆడపిల్లలైతే  ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. పెద్ద క్లాసుల్లో ఉన్న మొగపిల్లలు కూడా తనను అదో రకంగా చూడ్డం గమనించకపోలేదు దుర్గ. ఇంటర్వెల్ టైములో హెడ్మిస్ట్రెస్ పిలిచిందని లోపలికి వెళ్ళింది. హెడ్ మిస్త్రెస్ తన గదిలోకి తీసుకొని వెళ్ళి గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే ఏమిటి? అనే విషయాలు వివరంగా చెప్పింది. అలాగే పడుకునే సమయంలో నాన్న అయినా, అన్న అయినా, తమ్ముడయినా, బాబాయయినా, మగవాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గరా పడుకోగూడదనీ చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చాలా వివరంగా చెప్పింది. స్కూల్లో ఏమైనా సమస్య అనుకుంటే వెంటనే తన వద్దకు రమ్మని చెప్పింది. ఇంతలో మధ్యాహ్నం బడిగంట కొట్టడంతో క్లాసులోకి వెళ్ళింది దుర్గ.

పదవ తరగతిలో ఉన్న గోపాలాచారి అంతకు ముందు కంటే తనను వింతగాచూడ్డం, ముసి ముసి నవ్వులు నవ్వడం కనకదుర్గ దృష్టికి రాకపోలేదు. అయితే,  ఆవిషయం అంతటితో ఆగితే గొడవయ్యేది కాదు. గోపాలం రోజూ స్కూలు వదలి పెట్టాక తనతో బస్సులో వచ్చి,  తన ఇంటి దగ్గర దిగడం, బస్సులో తననే చూస్తూ ఉండడం, ఇంటిదాకా రావడం, తను ఇంట్లోకి ప్రవేశించగానే ఐదు నిముషాలు బయట ఉండి వెళ్ళిపోవడం, గమనిస్తూనే ఉంది. అలా వారం గడిచాక, ఇక లాభంలేదని గ్రహించి, ఒకరోజు విషయం తల్లికి చెప్పి  బయట నిలబడ్డ గోపాలాన్ని కిటికీలో నుంచీ రహస్యంగా చూపించి, వాళ్ళిల్లు కూడా ఇక్కడ కాదు అని విషయం మొత్తం చెప్పింది.

"వాళ్ళ యిల్లు ఎక్కడ?" అంది.

"ఏమోనమ్మా బడి ప్రక్కన ఉన్న రామాలయంలో వాళ్ళ నాన్న పని చేస్తాడని ఆయా చెప్పింది. అంతకు మించి నాకేం తెలీదు. వాడు నా వెంట పడకుండా చూడు చాలు. వాడు బాగా చదువుతాడు. పదో తరగతిలో వాడే ఫస్టు. మొన్నటిదాకా బాగానే ఉండేవాడు. ఈమధ్యనే యిలా చేస్తున్నాడు. ఏం తెగులు పుట్టిందో వాడికి."

రేపటినుంచీ వాడు నీవెంట రాకుండా నేను మాట్లాడుతాను. భయపడకు! మంచి స్టూడెంట్ అంటున్నావు కాబట్టి హెడ్మిస్ట్రెస్‌కు గానీ,  మీ నాన్నకు గానీ చెప్పకు. గొడవలవుతాయి. నువ్వు తొందరపడి  వాణ్ణి కొట్టడం లాంటివి చెయ్యకు! నేను మాట్లాడుతాను.

"సరే అమ్మా! 

(ఇంకా ఉంది)

*        *        *

No comments:

Post a Comment

Pages