కనకదుర్గ ఐ.పి.ఎస్ -2 - అచ్చంగా తెలుగు

                                                                 కనకదుర్గ ఐ.పి.ఎస్ -2 

(మినీ నవల)

టేకుమళ్ళ వెంకటప్పయ్య



 

"ఏమండీ పిల్లను వచ్చే ఏడాది ఒకటో తరగతిలో కాస్త దూరమయినా సరే ఆ సెంట్ జోసెఫ్‌లో చేర్చండి. మీ ఫ్యాక్టరీలోని చాలామంది ఇంజినీర్ల పిల్లలంతా అక్కడే చదువుతున్నారట. పైగా కాలనీకి వాళ్ళ బస్సు కూడా వస్తోంది. ఇది చిన్న స్కూలు. పైగా అన్ని తరగతులకు మీ ఫ్రెండ్ శేఖరే చెబుతాడు కదా!"

"అలాగే గానీ...వాడేమనుకుంటాడో మరి.." 

"చెప్పండీ... మా యింటి ప్రక్కన అందరూ అక్కడ చదువుతున్నారు. మా అమ్మాయి గూడా అక్కడే ఇష్టపడుతోందని చెప్పండి."  మౌనంగా తలూపాడు రాఘవ.

కనకదుర్గను అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న మిషనరీ స్కూల్లో వేశాడు. అమ్మాయి కూడా సంతోషంగానే ఉంది. కాలం అలా గడుస్తూ ఉంది. మంచి మార్కులతో 60 మందిలో కూడా ఫస్ట్ వస్తోందని, ఆటల్లో కూడా అమ్మాయి ఫస్ట్ అనీ.. అందరు టీచర్లు దుర్గను మెచ్చుకుంటూ ఉంటే దంపతులిద్దరికీ సంతోషంగా ఉంది.

"మనకు ఇంకో అబ్బాయి కూడా ఉంటే బాగుండేదండీ..దుర్గకు తోడుగా ఉండేవాడు."

"నిజమే! నువ్వు దుర్గను కన్నప్పుడే మళ్ళీ కానుపు వస్తే నీకు ప్రమాదం అని  డాక్టర్లు అన్నారా లేదా?  మాధవీ.. రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా మా అమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే! వాళ్ళు మాత్రం ఆ పల్లెటూరు వదిలిపెట్టి రారు. దాన్ని జాగ్రత్తగా చదివించి ఒక అయ్య చేతిలో పెడితే అంతే చాలు.. ఈ జన్మకు" తేల్చి చెప్పేశాడు. మాధవి మళ్ళీ ఆ సంభాషణ రాకుండా జాగ్రత్త పడింది. 

దుర్గ రోజురోజుకూ సెన్సిటివ్ గా తయారవుతోందని, తనను ఎవరు ఏమన్నా అసలు ఊరుకోవడంలేదని, స్కూల్లో ఎవరన్నా చిన్నమాట అన్నా రాక్షసిలా మీద పడుతోందని, పెద్ద ఆరిందలాగా మాట్లాడుతుందనీ అడపాదడపా పిల్లలూ టీచర్లు చెప్తున్నా, రాఘవ దుర్గకు సర్ది చెప్పలేకపోతున్నాడు. మెరిట్ స్టూడెంట్ కాబట్టి  స్కూల్లో కూడా ఎవరూ పెద్దగా ఏమీ అనే అనేవారు కాదు. ఒక వైపు మేనత్తలు, మేనమామలు కూడా ఆడపిల్లకు ఆ మాత్రం స్వాభిమానం మంచిదే అని సమర్ధించేవారు. భార్యాభర్తలిద్దరూ మింగలేక.. కక్కలేక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయే వాళ్ళు. దుర్గ అలా అలా ఐదవ తరగతిలోకి ప్రవేశించింది.

ఒక రోజు స్కూలు నుంచీ రాగానే దుర్గ సీరియస్‌గా "నాన్నా..మిమ్మల్ని రేపు ఉదయం 11 గంటలకు హెడ్మిస్ట్రెస్ మేడం కలవమన్నారు" అని చెప్పేసి రూములోకి వెళ్ళిపోయింది.

రాఘవ, మాధవి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏమయిందో అర్ధం కాలేదు.

"ఒసేయ్..యిలా రా!  స్కూల్లో   నువ్వేమి  ఘనకార్యం చేశావో చెప్పు మొదట" అని గద్దించింది మాధవి.

దుర్గ బయటకు రాకుండానే "నేనేం తప్పు చెయ్యలేదు. కావాలంటే స్కూల్లో కనుక్కోండి" అనింది.

"నువ్వు ఏమీ చెయ్యకుండానే పేరెంట్స్‌ను రమ్మంటారా?"

"అవన్నీ నాకు తెలీదమ్మా... మీరే వెళ్ళి అడగండి."

"చూశారాండీ.. కనీసం ఏం జరిగింది చెప్పను కూడా చెప్పడంలేదది. లోపలనుండే సమాధానాలు చెప్తోంది. చూస్తున్నారా?”

"నువ్వూరుకో! దాన్ని ఏమీ అనకు. అంత గట్టిగా అంటున్నదంటే దీనిదేం తప్పు ఉండి ఉండదని అనుకుంటున్నాను.  నేను రేపు సాయంత్రం షిఫ్ట్‌కు వెళ్తాలే.  ఉదయం స్కూలుకు వెళ్ళి కనుక్కుంటాను. పోనీ నువ్వూ రారాదూ."

"నేను రానండీ ప్లీజ్. వాళ్ళేసే యక్ష ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేను" అని దణ్ణం పెట్టింది. 

*        *        *

"నమస్కారం మేడం! నా పేరు రాఘవ కనకదుర్గ ఫాదర్‌ను.." అన్నాడు రాఘవ హెడ్మిస్ట్రెస్ గదిలోకి ప్రవేశిస్తూ"

"నమస్తే..! కూర్చోండి. ఇప్పుడు కార్పొరేటర్ భార్య ఈశ్వరమ్మ వస్తుంది. ఇందాకనే ఫోన్ చేసింది. ఆవిడేమన్నా అరిచినా, గోల చేసినా  మీరేం రియాక్ట్ అవొద్దు. నేను మేనేజ్ చేస్తాను."

"ఇంతకీ విషయం ఏమిటి మేడం" అన్నాడు కుర్చీలో కూర్చొంటూ.

"చెప్తాను…. చెప్తాను.. మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. కానీ ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోదు. తాట తీస్తుంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈశ్వరమ్మ వచ్చాక అన్నీ డీటెయిల్డ్‌గా చెప్తాను. ఈలోపు ఆవిడ తొందరపడి మాట్లాడినా మీరేం ఆవేశపడకండి. ఆవిడ కొంచెం పల్లెటూరి టైపు మనిషి అనుకుంటా!"

"అలాగే మేడం" అన్నాడే కానీ నిన్న ఏం జరిగిందో దుర్గ చెప్పలేదు. ఈవిడేమో కార్పొరేటర్ భార్య పేరు చెప్తోంది. ఏమయిందో ఏమిటో గొడవ అనుకుంటూ మౌనంగా అర్ధం కాని అయోమయ స్థితిలో ఉండిపోయాడు. హెడ్మిస్ట్రెస్ లేచి ప్రొజెక్టరు అవీ సరిజేస్తూ ఉండగా ఈశ్వరమ్మ తుఫానులా గదిలోకి ప్రవేశించింది.

"ఎవురు? ఎవురు? నా బిడ్డను గొట్టినమ్మి? ఎక్కడది? తేలిపోవాల ఇవాళ సంగంతేందో..ఆ.." అని ఆయాసపడుతూ నిలబడింది.

"మేడం.. ముందు మీరు కూర్చోండి… మీరు పెద్దవారు..అలా కంగారు పడకండి. అన్నీ నేను మాట్లాడతా గదా! కూర్చోండి. తప్పెవరిదో విచారిద్దాం." అని చల్లని మంచినీళ్ళు యిచ్చి కొంచెం చల్లబరిచింది. ఇంతలో ప్యూన్ పుల్లారావు టీలు తెచ్చి యిచ్చాడు అందరికీ.

"ఈనేనా దాని అబ్బ.."  అని అడిగింది పెద్దగా రాఘవను చూపిస్తూ. "మేడం! మర్యాదగా..." అని రాఘవ అంటూ ఉండగానేనీకేందయ్యా..మర్యాద..నా కొడుకునే కొట్టిందంటే అది ఎంత గుండెలు దీసిన బంటు అయిండాల?" అని అరుస్తూ నిలబడింది.

వెంటనే హెడ్మిస్ట్రెస్ లేచి నిలబడి "రాఘవగారూ.. మీరూర్కోండి..  ఈశ్వరమ్మగారూ..కాసేపు మాట్లాడకండి దయచేసి... కూర్చోండి.. నేను మాట్లాడుతాను" అనేసరికి రాఘవ మిన్నకుండిపోయాడు. ఈశ్వరమ్మ కూర్చొని టీ తాగుతూ  రాఘవను గుర్రుగా తినేసేట్టు చూస్తోంది.

"ఈశ్వరమ్మగారూ..మీరు విషయం పూర్తిగా తెలుసుకోకుండా అలా మాట్లాడకూడదు. నేను అన్నీ మాట్లాడుతాను కదా!" అని బెల్ కొట్టి ప్యూన్ తో ఐదో తరగతిలో దుర్గ, రాకేష్, రమేష్‌లను వెంటబెట్టుకొని రమ్మని చెప్పింది. ముగ్గురు పిల్లలూ వచ్చి నిలబడ్డారు. వాళ్ళను దూరంగా గోడ దగ్గర నిలబడమని సైగ చేసింది.

"దుర్గా..నిన్న లంచ్ అవర్‌లో ఏం జరిగింది ఒక్కసారి అందరికీ డీటెయిల్డ్‌గా చెప్పు. నువ్వు వీళ్ళబ్బాయి రమేష్‌ను.. కొట్టావని కంప్లెయింట్ చేశారు."

"నిన్న మేడం…. మరేమో.. నేను లంచ్ అవర్లో తొందరగా తొందరగా టిఫిన్ తినేసి లెక్కల హోంవర్కు ఎక్కువగా ఉందని క్లాసులో కూర్చొని చేసుకుంటున్నానా... అప్పుడు క్లాసులో ఎవ్వరూ లేరు. ఇంతలో ఈ రమేష్ లోపలికి వచ్చి 'ఏం బిల్డప్ ఇస్తున్నావే! క్లాసులో ఫస్ట్ నువ్వే గదా ఇంకెందుకు ఈ ఓవర్ యాక్షను.. ఇంటర్వెల్‌లో కూడా లెక్కలు చేస్తూ ఫోజులు కొట్టక్కర్లేదు. ముయ్ పుస్తకాలు' అన్నాడు. నా వెనక రాకేష్ నిలబడ్డాడు. నేను అప్పటికీ ఏమీ మాట్లాడకుండా నాపాటికి నేను పని చేసుకొంటున్నా. ఈ రాకేష్ గాడు వెనక నిలబడి నా జడ లాగాడు."  అన్న దుర్గ మాట పూర్తిగాకుండానే రాకేష్.."అబద్ధం మేడం...నేను లాగలేదు మేడం" అన్నాడు.

"ఏయ్..నువ్వు ఆగు..మధ్యలో దూరకు.. దుర్గ మాట్లాడింతర్వాత నువ్వు మాట్లాడు" అని దుర్గ వేపు చూసి నువ్వు చెప్పమ్మా!" అంది హెడ్మిస్ట్రెస్.

"అప్పుడు నేను వెనక్కు చూసేసరికి, ముందున్న రమేష్ నా బుక్స్ లాక్కొని చెబుతుంటే అర్ధమవదా.. ఆపు నీ యేషాలు అన్నాడు. అప్పుడు నాకు కోపంవచ్చి నాబుక్స్ నాకు ఇవ్వు అన్నాను. వాడు ఎంతడిగినా ఇవ్వకపోయేసరికి పొట్టలో ఒక్కటి గుద్దాను. వాడు ఏడుస్తూ బయటకు పోయేసరికి, ఈ రాకేష్ గూడా వెంటనే బయటకి పరుగెత్తాడు. అంతే మేడం జరిగింది" అంది.

"ఏం రమేష్ బుక్స్ లాక్కున్నావా? నిజం చెప్పు?"

"లేదు మేడం! ఇంటర్వెల్లో ఎందుకు హోం వర్క్? రెస్ట్ తీసుకోవచ్చు గదా! ఇంట్లో చేసుకో అని మంచిగా చెప్పాను మేడం.. అంతే మేడం.."

"నా కొడుకు….ఆ యమ్మి మంచికే గదా చెప్పింది. ఎందుకు కొట్టింది? నాకొడుకునే కొట్టే కొమ్ములొచ్చాయా? నాకదంతా తెలేదు. ముందు మీరు దీన్ని స్కూల్ నుంచీ డిస్‌మిస్ చెయ్యండి. టీసీ ఇచ్చి పంపించెయ్యండి" అని పెద్ద గొంతుతో అరిచింది ఈశ్వరమ్మ.

"ఈశ్వరమ్మగారూ మీరు ఆగండి. బుక్స్ లాక్కో లేదని రమేషు, జడలాగలేదని రాకేషు చెప్తే నమ్మేస్తారా?"

"నమ్మక.. నా కొడుకు అట్టాంటి పనులు చెయ్యడు. సాక్షీకం ఏమన్నా ఉందా మీ కాడ?" అని అరించింది.

"అందరూ ఐదు నిముషాలు మౌనంగా ఉండండి" అంటూ హెడ్మిస్ట్రెస్ ప్రొజెక్టర్ ఆన్ చేసింది. దాన్లో దుర్గ రూములో లెక్కలు చేసుకుంటూ ఉండడం, వాళ్ళిద్దరూ అలా ప్రవర్తించడం, దుర్గ చివరకు రమేష్‌ను పొట్టలో గుద్దడం, వాళ్ళు బయటకు పారిపోవడం, వాళ్ళ మాటలతో సహా సినిమా చూపించినట్టు కనిపించింది.

ఈశ్వరమ్మ బిత్తర చూపులు చూస్తూ ఏం మాట్లాడాలో అర్ధం కాక నీళ్ళు నములుతూ అలా  ఉండిపోయింది.

"రమేష్..  రాకేష్…. యిప్పుడు చెప్పండి. ఏం జరిగింది?" అనగానే వాళ్ళిద్దరూ తలలు వంచుకున్నారు.

ఆడపిల్లలతో ప్రవర్తించే తీరు అదేనా? రాకేష్... జడ లాగుతావా నువ్వు.. బుద్ధిలేదా నీకు? రమేష్ ఆ పిల్ల చేతిలో బుక్స్ లాక్కునే అధికారం నీకు ఎవరిచ్చారు?" అని గద్దించింది.

"చిన్న చిన్న యిషయాలు పెద్దవి చేయడం ఎందుకు? వదిలేయండి" గొంతు తగ్గించి చిన్నగొంతుతో అన్న ఈశ్వరమ్మ మాటలకు,  "ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే మీ యిద్దరికీ టీసీలు యిచ్చి పంపించేస్తాను జాగ్రత్త ! మేనేజ్‌మెంట్ డిసిప్లైన్ విషయాల్లో చాలా స్ట్రిక్ట్. వాడెవడూ ఏంటి? అని కూడా చూడను. డైరక్టుగా టీసీ ఇచ్చేయడమే! చేరేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ రెకమెండేషన్‌తో చేరడం, తర్వాత అల్లర్లు చేయడం ఇదేనా మర్యాద?  అందుకనే నేను రాగానే అన్ని తరగతుల్లో మైకు, సీ.సీ కేమేరాలు పెట్టించాను. ఇంకో సారి యిలా జరిగితే పోలీసు రిపోర్ట్ దాకా వెళ్తుంది. మీ యిష్టం. యిద్దరూ దుర్గకు సారీ చెప్పి క్లాసురూములోకి వెళ్ళండి. అంది హెడ్మిస్ట్రెస్.

సారీ చెప్పాక ముగ్గుర్నీ క్లాసు రూముకు పంపించిఈశ్వరమ్మ గారూ.. మీవారు ఈ ఏరియా కార్పొరేటర్.   నాకు బాగా తెలిసిన వారే!  మొన్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు కూడా వచ్చారు. ఎంతో మర్యాదగా మాట్లాడారు. మీరు నిజానిజాలు తెలుసుకోకుండా యిలా అందరిమీదా అరవడం వల్ల ఆయన గౌరవం తగ్గుతుందన్న విషయం గుర్తు పెట్టుకోండి. రమేషుకు మంచీ చెడూ చెప్పండి. వాడి అల్లరి శృతి మించితే భవిష్యత్తులో  మీకే ప్రమాదం" ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టు లేచి నిలబడింది. ఈశ్వరమ్మతో పాటూ రాఘవ కూడా వెళ్ళబోతుంటే,  మీరు ఆగండి అన్నట్టు సైగ చేసింది. ఆవిడ కారులో వెళ్ళిపోయేదాకా ఏమీ మాట్లాడలేదు.

"రాఘవగారూ!  ఆడపిల్లలు ఈరోజుల్లో ఈ మాత్రం గట్టిగా లేకపోతే కష్టం. వాళ్ళను చూస్తే మగ పిల్లలకు భయం కలగాలి. నా వ్యక్తిగత జీవితంలో మెత్తదనం వల్ల నేను  చాలా కోల్పోయాను.  నన్ను మేనేజ్మెంట్ ప్రత్యేకంగా పిలిపించి మరీ ఈ పోస్టు ఇచ్చారు. సెయింట్ జోసెఫ్ అంటే ఈ ఊరిలోనే మంచి పేరున్న స్కూలు. ముఖ్య విషయం ఒకటి మీకు చెప్పాలి. వచ్చే సంవత్సరం ఎలాంగ్ అనే ఒక మలేషియా అతను స్కూల్లో కరాటే క్లాసులు పెడతానని చెప్పాడు. ఫీజు చాలా తక్కువే వుంటుంది. దుర్గను ఆరవ తరగతి నుండి కరాటేలో చేర్చండి. రాబోయే రోజులు ఇంకా భయానకంగా ఉంటాయి. ఆడపిల్లలను చాలా జాగ్రత్తగా పట్టుకొని రావాలి." అని సాగనంపింది.

*        *        *

No comments:

Post a Comment

Pages