పుణ్యవతి (నవల) - 13
రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
@@@#@@#@
(సృజన ద్వారా రవి గురించి తెలుసుకున్న ఆమె పిన్ని తన భర్తను సంబంధం మాట్లాడి రమ్మని పంపిస్తుంది. కూతురిని చూడటానికి వచ్చిన పెళ్ళివారిని సాగనంపుతూ, కిటికీలోంచి చూస్తున్న రవిని గమనించిన రంగనాధం కోపంగా అతని ఇంటికి వెళ్తాడు. గేటు చప్పుడైతే చూసినట్లు అతనితో అబద్ధం చెప్పి రవి తప్పించుకుంటాడు. రవి ఇంటికి జగన్నాధం వెళ్ళటం గమనించిన రంగనాధం తన మరదల్ని కారణం అడుగుతాడు. పెళ్ళి సంబంధం గురించి చెప్పబోయిన జగన్నాధాన్ని తన మాటల చాతుర్యంతో కంగారుపెడతాడు రవి. తరువాత....)
@@@@@@@@@@
"అబ్బాయితో మాట్లాడేరా?" జగన్నాధాన్ని భార్య అడిగింది.
"ఏమిటి మాట్లాడేది?" అంటూ సృజన వైపు తిరిగి, "నువ్వు మరోలా అనుకోకమ్మా!" అన్నాడతను. తరువాత భార్య వైపు తిరిగి, "కుర్రాడు మన రంగనాధం కన్నా తిక్కోడిలా ఉన్నాడు. ఏమాత్రం మింగుడు పడడు. మనసులో ఎవరో అమ్మాయి ఉందట! ఆ అమ్మాయి బయటపడే వరకూ తను బయట పడట్ట. తను మాత్రం ఆ అమ్మాయినే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడట. ఇతను చెప్పకుండా ఏ ఆడపిల్లయినా ఎలా బయటపడుతుంది చెప్పు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆ అమ్మాయి ఈ ఊరి అమ్మాయే! ఆ అమ్మాయిని తన గృహలక్ష్మిని చేయటానికే దేవుడు తననిక్కడ చేర్చాడట. . అదే. .ఈ ఊళ్ళో ఉద్యోగం దొరికేలా చేశాట్ట! ఇన్నాళ్ళు ఆ అమ్మాయి చదువుతోందని ఆగాట్ట. ఇప్పుడు పరీక్షలు అయిపోయాయి గనుక విషయం తనే చూసుకొంటాడట. చెప్పకూడదు కానీ కుర్రాడు గట్టిపిండమే! ఇతగాడు కన్నేసిన ఆ పిల్ల ఎక్కడ ఉందో? . . .సరె! అన్నయ్యేడి?"
"దేవాలయానికి వెళ్ళాడు బాబాయి! రేపు గుళ్ళో అభిషేకం చేయిస్తే, నాకు పెళ్ళవుతుందని అనంతశయనంగారు చెప్పారట!" తలొంచుకొని చెప్పింది సృజన.
"సుధ పోయాక నిన్ను కాపాడుకోవాలని మీ నాన్న ఎంత తాపత్రయపడుతున్నాడే! వాడు చేసే పూజల వల్ల నువ్వు మంచి కుటుంబంలోనే పడతావురా! ఎవడో కాదు, ఈ ఇంట్లో కుర్రాణ్ణే ఈడ్చుకొచ్చి నీకు తాళి కట్టిస్తాను. పుణ్య నడిగి ఈ అబ్బాయి ప్రేమ వ్యవహారమేంటో తేల్చుకొని, అతని అమ్మగారి అడ్రస్సు తీసుకొని అటునుంచి వస్తా! కాకపోతే ఈ కథలో విలన్ మీ నాన్నే! ఆ గదిలో కుర్రాడంటే ఒప్పుకోడు. వాణ్ణి ముందు కారెక్టర్ రోల్‌కి మార్చాలి. చూద్దాం" ఆన్నాడు జగన్నాధం.
"మీ బాబయ్య పంతం పట్టారంటే వదిలిపెట్టరు. బెంగపడకు. వస్తాం" సృజనకి ఆమె పిన్ని ధైర్యం చెప్పింది. తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
"మనసులో ఎవరో అమ్మాయి ఉందట! ఆ అమ్మాయి బయటపడే వరకూ తను బయట పడట్ట. తను మాత్రం ఆ అమ్మాయినే చేసుకోవాలని నిశ్చయించకున్నాడట.. . .కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆ అమ్మాయి ఈ ఊరి అమ్మాయే! ఆ అమ్మాయిని తన గృహలక్ష్మిని చేయటానికే దేవుడు తననిక్కడ చేర్చాడట. ." జగన్నాధం చెప్పిన మాటలను నెమరువేసుకొంది సృజన.
"అది రవిగారు అన్యాపదేశంగా బాబయ్య చేత తనకు పంపిన సందేశమా?" అకస్మాత్తుగా సృజన కళ్ళలో ఆనందంతో నీళ్ళు నిండాయి. ఇంతకాలం ఊగిసలాడే ఆమె మనసులో స్థిరమైన అభిప్రాయం నెలకొంది. "ఎవడో కాదు, ఈ ఇంట్లో కుర్రాణ్ణే ఈడ్చుకొచ్చి నీకు తాళి కట్టిస్తాను" బాబయ్య ఇచ్చిన భరోసా ఆమె మనసుని తేలికపరచింది.
మంచంపై కూర్చుని సుధ వ్రాసిన పుస్తకాన్ని చదివిందామె. తన మనసులో చిత్రమైన ఊహ మెదలగానే, వెంటనే కాగితంపై పెట్టిందామె. ఆ కాగితాన్ని తన అక్క పుస్తకంలో పెట్టుకొని, ఇంటికి గొళ్ళెం పెట్టి, రవి ఇంటికి వెళ్ళింది. ముందు తటపటాయించినా మూసిన తలుపుని తోసి, ఆ గదిలో కుడి కాలు పెట్టిందామె. ఆమెను చూసి రవి గుండె ఝల్లుమంది. వెంటనే పరుగులాంటి నడకతో బయటకెళ్ళి చూసి వెనక్కి వచ్చాడు.
"నాన్న ఉంటే నేనింత ధైర్యం చేస్తానని మీరెలా అనుకున్నారు?" సృజన నవ్వుతూ అడిగింది.
"అది నిజమే అనుకోండి! కానీ ఆయన అకస్మాత్తుగా వస్తే నాకు మూడినట్లే! ఇప్పుడే కిటికీలోంచి పెళ్ళివారిని చూసినందుకు హెచ్చరించి వెళ్ళారు. మీరిక్కడ ఉన్నట్లు చూస్తే ఏం చేస్తారో?"
"ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేయమంటారు. వెంటనే మీరీ ఇల్లు ఖాళీ చేసి మా యింటికి వచ్చేస్తారు."
"ఎంత తేలిగ్గా చెప్పారండీ! కిటికీలోంచి చూస్తేనే గొడవ చేసినాయన, తిన్నగా మీ యింటికొచ్చేస్తే ఊరుకుంటారా?"
"ఊరుకోరు. తిన్నగా మీ ఊరెళ్ళి 'మీ అబ్బాయి వ్యవహారమేమీ బాగులేదు. అతన్నలా ఒంటరిగా వదిలేస్తే లాభం లేదు. ఎవరికైనా కట్టబెట్టేయండి ' అని చెబుతారు. వెంటనే మీ అమ్మగారు 'నేను తిరగలేను అన్నయ్యగారూ! ఆ పనేదో మీరే చేసెయ్యండి ' అంటారు."
"వెంటనే మీ నాన్నగారు ఇద్దరి మీదా అక్షింతలేసి శుభం అంటారు. భలే సినిమా కథ చెప్పారండీ!" నవ్వుతూ అన్నాడు రవి.
"ఏ ఇద్దరి మీద?" సృజన ప్రశ్నకు రవి కంగారుపడ్డాడు.
"చూడండి. నాన్న బయటకెళ్ళారు. రావటానికి గంట పైనే పడుతుంది. సరదాగా నేనొక బొమ్మ గీసాను. దానికి మీరేదైనా వ్యాఖ్య చెబుతారేమోనని తెచ్చాను. దానితో పాటు మీరు అడిగిన అక్కయ్య కవితల పుస్తకం కూడా తెచ్చాను" అంటూ తన చేతిలోని పుస్తకాన్ని అతనికి ఇచ్చింది.
రవి పుస్తకంలోని బొమ్మ గీసిన పేజీని చూసాడు. "ఏమో అనుకున్నాను. మీరు బొమ్మలు బాగానే గీస్తారే!" మెచ్చుకోలుగా అన్నాడు.
రెండు 'ఆడ 'చేతులు దోసిలితో పూలను 'మగ ' పాదాలపై ధారగా పోస్తున్నాయి - అదీ బొమ్మ.
"ప్రేమాభిషేకం. . .తోడు నడిచే పాదాలకు ఆడతనం అర్పించే కుసుమాంజలి" రవి వ్యాఖ్య చెబుతూంటే సృజన మనసు పొంగిపోయింది. అది గమనించని రవి ఆ బొమ్మ వంకే చూస్తూ, "బొమ్మ బాగుంది. కానీ ఒక్కటే లోపం. దిద్దమంటారా?" అడిగాడు. ఆమె బదులిచ్చే లోపు తనే తిరిగి అన్నాడు, "మరేం లేదు. మీ వేలికి నేను ఉంగరం తొడుగుతున్నాను" బల్లపై పెన్ను తీసుకొని, బొమ్మలోని వేలికి ఉంగరం దిద్ది తలపైకెత్తాడు.
సృజన ఆనందం విరిసిన కళ్ళతో అతన్నే చూస్తోంది. "నిజంగానే నా వేలికి ఉంగరం తొడగాలనుకుంటున్నారా?"
కొద్ది క్షణాలు సృజన కళ్ళలోకి చూసి రవి తలను పక్కకు తిప్పాడు. "మీకు అభ్యంతరమైతే చెప్పండి. మనం స్నేహితులుగా మిగిలిపోదాం."
రవి మాటలకేమి చెప్పాలో సృజనకు తోచలేదు.
"ప్రేమ పేరుతో పార్కులకు, పార్టీలకు తిప్పే మనస్తత్వం కాదు నాది. "వాలెంటైన్స్ డే" లస్ట్ కన్నా హోలీ అనురాగానికి విలువనిస్తాను నేను. ఇంటిలో అమాయకత్వం నటించి, ప్రక్క వీధిలో అందాలు ప్రదర్శించే ఆడవాళ్ళంటే నాకు ఏవగింపు. తల్లిదండ్రులను మోసం చేసి ప్రదర్శించే ప్రేమలు, చివరికి బజార్లో మనం అల్లరిపాలవటానికే దోహదిస్తాయని నా నమ్మకం. పిక్నిక్కులో మిమ్మల్ని కలిసినప్పుడే ఇష్టపడ్డాను. అనుకోకుండా మీ ఇంటికి వచ్చి మీ చేత చివాట్లు తినటం, మీరు కూడా జరిగిన దానికి బాధపడి పుణ్య ద్వారా నాకు క్షమాపణ చెప్పాలని రావటం, తన వల్ల మనం అప్పుడప్పుడు ఇలా కలిసే అవకాశం రావటం. . .మీరు నాన్నగారి కన్ను గప్పి వచ్చినప్పుడల్లా నాకు బాధ అనిపించేది. కానీ తప్పదు. మన మనసులు కలుపుకోవటానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. మిమ్మల్ని బజారులో కలవటం నాకిష్టం లేదు. తరచుగా బజార్లో కలుస్తుంటే, అక్కడ మన వయసు వాళ్ళు చేసే వెధవ పనులు . . . సారీ! దాన్ని మీ భాషలో కుర్రచేష్టలు అంటారనుకుంటా .. . మనకీ చేయాలనిపించవచ్చు. అంతేగాక మనం చాటుగా బజారులో కలుస్తున్నామని మీ నాన్నగారికి తెలిస్తే ఆయన బాధపడతారు, మిమ్మల్ని కేకలేస్తారు. మీరు నా కోసం ఆయన మీద తిరగబడతారు. ప్రేమ కోసం కన్నవారిపై తిరగబడే ఆడపిల్లను ఆదరించే వాళ్ళ కన్నా, మన సమాజంలో ఆడుకొనే మగవాళ్ళే ఎక్కువ. సారీ! ప్రేమ కబుర్లకు బదులు పాఠాలు చెబుతున్నానని తిట్టుకుంటున్నారేమో! ఇందాక మీ బాబయ్యగారొచ్చి నా ముందు నటించబోయారు. పెద్దాయన్ని ఇబ్బంది పెడుతూ, కాసేపు సరదాగా ఆడుకున్నాను. ఆ ఆటలోనే నా మనసులోని సందేశం మీకు పంపాలనుకున్నాను. రచయితని కద! అందుకు మీరేమీ అనుకోకండి. ఒక మృగం వల్ల కన్నబిడ్డను పోగొట్టుకున్న మీ నాన్నగారిని చూస్తే జాలేస్తుంది. జీవితంలో మీరు చాలా పెళ్ళిచూపులు చూసి ఉంటారు. ఇన్నాళ్ళూ మీ చదువు గురించి నేను ఆగాను. ఈ మధ్యలో మీ పెళ్ళయి ఉంటే నా ప్రేమను నాలోనే సమాధి చేసుకునేవాణ్ణి. ఆ దేవుడు మనిద్దరం కలిసి బతకటానికే నన్నిక్కడకు చేర్చాడని నమ్ముతున్నాను. ఇక మీరెలాంటి మనస్తాపానికి గురి కానక్కరలేదు. రెండు రోజుల్లో మా ఊరెళ్తున్నాను. అక్కడ కొన్ని పనులు ఉండటం వల్ల వారం, పది రోజులు మీకు కనిపించను. తరువాత అమ్మని తీసుకొచ్చి మీ బాబాయిగారితో మాట్లాడిస్తాను. ఎలాగైనా మీ నాన్నగారిని ఒప్పించే ఈ పెళ్ళి చేసుకుందాం. సరేనా?" రవి మౌనం వహించగానే సృజన బయటకు వెళ్ళిపోయింది. ఆమె మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అతనికి అర్థం గాక పిచ్చెక్కింది. తలుపు దగ్గరకెళ్ళాడు. వాళ్ళ గుమ్మంలో ఆమె కనిపించలేదు. వెనక్కి వచ్చి ఆమె వదిలి వెళ్ళిన పుస్తకాన్ని తెరిచాడు.
"ఇన్నాళ్ళూ జీవితం ఎలా మారుతుందోనని నిత్యం భయంతో గడుపుతున్నాను. చిన్నప్పుడు అక్కయ్య వ్రాతలు పిచ్చివి అనిపించేవి. కానీ చిన్న వయసులోనే అది జీవితాన్ని, సంఘాన్ని ఎంత బాగా చదివిందో ఇప్పుడు అర్థం అవుతోంది. దేవుడు దానికి చాలా అన్యాయం చేసాడు. దాని జీవితంలో మీరు తగిలి ఉంటే, అది గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకొనేది. మన సంఘంలోని ఈ పెళ్ళిచూపుల వ్యవస్థపై దాని వివరణ అద్భుతం.
ఆశ్రమాన సీతలా ఆ రాముని కోసరం
ప్రతి కన్నె ఎదురుచూచు వలపు వాకిట -
ఈ ఆరామంలోనే ఆ రాముడు. . .నా రాముడు ఉన్నాడనుకోవచ్చునా? అదే నిజమైతే, ఆ రామునికి ఈ ఆరామం. . .అదే ఈ తోటలోని పూలతో ఈ కరాలు అర్పించే జీవితాంజలి - సృజన."
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment