గిట్టుబాటు కాని పుస్తక రచన - అచ్చంగా తెలుగు

గిట్టుబాటు కాని పుస్తక రచన

Share This

 గిట్టుబాటు కాని పుస్తక రచన

- కర్లపాలెం హనుమంతరావు




"సాహిత్య సేవతో కడుపు నిండుతుందా?" అనే ప్రశ్న ఈనాటిది కాదు. ఎంతోమంది గొప్ప కవులు, రచయితలు తమ జీవిత కాలమంతా అక్షరాల కోసం అంకితం చేసినా, వారికి లభించిన ఆర్థిక ఫలాలు మాత్రం చాలా తక్కువ.

 

దాదాపు ముప్పై ఏళ్లుగా తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవ చేసిన శేషాద్రి రమణ కవుల పేరు వినని వారుండరు. ఎంతో చిన్న వయసు నుంచే రాయడం ప్రారంభించినా, కేవలం పుస్తకాల ద్వారా వచ్చే ఆదాయంతో బతకడం సాధ్యం కాక, అన్నదమ్ములు ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకోవాల్సి వచ్చింది.

 

మిల్టన్ రాసిన 'పారడైజ్ లాస్ట్' ఒక అద్భుత కావ్యం. అంతటి గొప్ప కావ్యాన్ని రాసిన మిల్టన్,  దాన్ని అచ్చు వేయించుకోలేక, కాపీరైట్స్ని కేవలం ఐదు పౌనులకే అమ్ముకున్నాడు.

 

పారశీక కవి ఫిరదౌసీ తన చేత   'షానామా' అనే గ్రంథాన్ని రాయించిన గజనీ మహమ్మద్ ' నుంచి నజరానా రాబట్టలేక జీవితం చివరి ఘడియల వరకు ఎన్నో కష్టాలు పడ్డాడు.

 

ప్రపంచవ్యాప్తంగా కవులకు ఇచ్చే నోబెల్ బహుమతి మొత్తం చాలా పెద్దదే. కానీ, కవులు తిండి, బట్ట లేక అజ్ఞాతంలో కష్టపడుతున్నప్పుడు ఒక్కరూ వారిని పట్టించుకోరు. ఎప్పుడో వారు ప్రసిద్ధులై, ధనవంతులయ్యాక బహుమతులు వస్తాయి. అందుకే జార్జ్ బెర్నార్డ్ షా నోబెల్ బహుమతిని తిరస్కరిస్తూ – "నాకు డబ్బు అవసరమైనప్పుడు మీరెవరూ ఆదరించలేదు. ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు, మీ బహుమతీ వద్దు" అని తెగేసి చెప్పారు.

 

విదేశీ రచయితలతో పోలిస్తే తెలుగు రచయితల పరిస్థితి మరీ  హీనంగా ఉంది.

 

చిలకమర్తి లక్ష్మీనృసింహం రాసిన 'రామచంద్ర విజయము' నవలకు పోటీలో ఉత్తమ బహుమతి వచ్చింది. ఆయన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా, ఏడాదికి రూ. 3,000 కు మించి ఆదాయం రాలేదు. ఆయన రాసిన 'గయోపాఖ్యానం' లక్ష ప్రతులు అమ్ముడైనా ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి లేదు.

 

వ్యాస భారతాన్ని  ఆంధ్రీకరించిన శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి 15 ఏళ్ల పాటు దరిద్రంతో పోరాడారు.

 

మొక్కపాటి నరసింహశాస్త్రి రాసిన ప్రఖ్యాత హాస్య నవల  'బారిస్టరు పార్వతీశము' మొదటి భాగం సరిగ్గా అమ్ముడుపోకపోవడంతో, రెండో భాగం ముద్రించడానికి భయపడాల్సి వచ్చింది. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి ప్రసిద్ధి నాటకాలు ఆశించినంతగా అమ్ముడుపోలేదు.

 

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి 'కృష్ణపక్షం', 'ఊర్వశి' కనీసం మొదటి ముద్రణ ప్రతులు కూడా పూర్తిగా అమ్ముడుపోయిన దాఖలాలు లేవు. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారికి తన పద్యాలను పుస్తక రూపంలో తేవడానికే ధైర్యం చాల్లేదు.

 

ఇప్పటికీ ఇదే దుస్థితి.  ఎంతో కష్టపడి రాసిన పుస్తకాలను అచ్చు వేయించుకోలేక, పెట్టుబడి కూడా తిరిగి రాదనే భయంతో... అన్ని హక్కులనూ ఇతరులకు రాసిచ్చేస్తున్నారు. ప్రతిఫలంగా కేవలం వంద, నూట యాభై పుస్తకాలను మాత్రమే తీసుకుంటున్నారు.ఇటీవలి కాలంలో అయితే రచయితే స్వంతంగా అచ్చు వేయించుకొని  చదువరులకు బలవంతంగా అంగడుతున్నాడు.

 

కేవలం పుస్తక రచన ద్వారా వచ్చే ఆదాయంతోనే ఒక రచయిత గౌరవంగా, హాయిగా బతకగలిగే మంచిరోజులు తెలుగునాట సుదూరంలో కూడా కనిపించటం లేదు.

 ***

No comments:

Post a Comment

Pages