ఒకనాటి ఆయుర్వేదం గురించి క్లుప్తంగా - అచ్చంగా తెలుగు

ఒకనాటి ఆయుర్వేదం గురించి క్లుప్తంగా

Share This

 ఒకనాటి ఆయుర్వేదం గురించి క్లుప్తంగా

 - కర్లపాలెం హనుమంతరావు



 

అనాదిగా వస్తున్న ఆయుర్వేద సంప్రదాయాలు, కాలపు వైద్యుల క్రమశిక్షణ, ఆతురాలయాల (ఆసుపత్రుల) నిర్వహణ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

 

అప్పట్లో రెండు  ప్రధాన వైద్య సంప్రదాయాలు ఉండేవి.

 

 ఆత్రేయ సాంప్రదాయం : ఇది కాయచికిత్స (Medicine) కు ప్రాధాన్యతనిస్తుంది. అశ్వనీ దేవతలు, భరద్వాజుడు, చరకుడు వంటి మహర్షులు దీనికి మూలస్తంభాలు.

 

 ధన్వంతరి సాంప్రదాయం: ఇది శస్త్రచికిత్స (Surgery) కు ప్రసిద్ధి. కాశీరాజు దివోదాస ధన్వంతరి, సుశ్రుతుడు మార్గానికి ఆద్యులు.

 

కాలంలో వైద్య విద్య కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాలేదు. ఏడవ ఏటనే విద్య ప్రారంభమయ్యేది. వైద్య వృత్తిని చేపట్టే వారికి రెండోసారి  ఉపనయనం చేసి 'ద్విజులుగా' పరిగణించేవారు. ఉత్తమ వైద్యుడికి కొన్ని లక్షణాలు నిర్దేశించారు.

 

నిర్మలమైన ముఖవర్చస్సు, శుభ్రమైన వస్త్రధారణ, కత్తిరించిన గోళ్లు కలిగి ఉండాలి. ఓర్పు, ధైర్యం, జ్ఞాపకశక్తి,  భూతదయ ప్రధానం. వైద్యం వ్యాపారం కాకూడదు. స్వార్థం కోసం కాక, లోక కల్యాణం కోసం చికిత్స చేయాలి. పేదలకు, మిత్రులకు ఉచితంగా సేవ చేయాలి.శాస్త్ర జ్ఞానం (Theory),  కర్మ పథం (Practice) - రెండూ పక్షికి రెండు రెక్కల వంటివి. ఒక్కటి తక్కువైనా వైద్యుడు రాణించలేడు అని గురువులు బోధించేవారు.

 

జీవకుడు అనే ఒక రాజవైద్యుడి కథ చరిత్ర నేటి వైద్యులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

 

క్రీ.పూ. 6 శతాబ్దంలో గౌతమ బుద్ధునికి  సమకాలికుడు   జీవకుడు. గొప్ప శస్త్రవైద్యుడు. మగధ నుండి 1000 మైళ్ల దూరంలో ఉన్న తక్షశిల విశ్వవిద్యాలయానికి వెళ్లి ఏడేళ్లు చదువుకున్నాడు. విద్యా బోధన పూర్తి అయింది. గురువుగారు ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు.

 

 "వైద్యానికి పనికిరాని మొక్కను తెమ్మని" ఆయన ఆదేశం. జీవకుడు నగరం చుట్టూ గాలించి  వచ్చి " ప్రపంచంలో ఔషధ గుణం లేని వస్తువే లేదు" అని సమాధానమిచ్చాడు. విజ్ఞానమే ఆయన పట్టా!

 

 ఆయన చేసే శస్త్రచికిత్సలు ఆశ్చర్యం కలిగించేవి.  తల పుర్రెను చీల్చి పురుగులను తొలగించే 'బ్రెయిన్ సర్జరీ'లు, ప్రేగుల మెలికలను సరిచేసే 'అబ్డామినల్ సర్జరీ'లు చేసేవాడని  బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి.

 

అవంతి రాజు ప్రద్యోతునికి నెయ్యి అంటే పడదు. కానీ జీవకుడు నెయ్యి రంగు, రుచి మార్చి ఔషధంగా ఇచ్చి ఆయన కామెర్ల వ్యాధిని నయం చేశాడు.

 

చరక, సుశ్రుత సంహితలలో ఆసుపత్రుల నిర్మాణం గురించి శాస్త్రీయమైన వివరణలు కనిపిస్తాయి.

 

ఆసుపత్రి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. ధూళి, పొగ దరిచేరకూడదు. వంటశాల, స్నానశాలలు ప్రత్యేకంగా ఉండాలి.

 

రోగులకు పాలిచ్చే సాధువైన గోవులను అక్కడ పెంచేవారు.

 శారీరక వ్యాధులకే కాక, రోగి మనసును ఆహ్లాదపరిచేందుకు సంగీత విద్వాంసులు, కథలు చెప్పే పురాణ పండతులు ఉండేవారు. ఇది నేటి 'మ్యూజిక్ థెరపీ'కి ప్రాచీన రూపం.

 

 అశోక చక్రవర్తి వంటి రాజులు మనుషులకే కాక జంతువులకు కూడా వైద్యశాలలు నిర్మించారు. విదేశాల నుండి అరుదైన మొక్కలు తెప్పించి పెంచేవారు.

 

చైనా యాత్రికులైన ఫాహియాన్, హ్యున్ త్సాంగ్ రాతల ప్రకారం.. భారతదేశంలో ధనవంతులు, గ్రామ పెద్దలు పేదల కోసం ఉచిత వైద్యశాలలను నడిపేవారు. దక్షిణ భారతదేశంలోని తిరుముక్కూడల్, మల్కాపురం వంటి గ్రామాల్లోని శిలాశాసనాల్లో కాలపు ఆసుపత్రులు, వాసాహరీతకీ, బిల్వాది ఘృతము వంటి మందుల జాబితా వివరాలు కనిపిస్తాయి.

 

ఆయుర్వేదం అంటే కేవలం కొన్ని మూలికల మిశ్రమం కాదు; అది ఒక పరిపూర్ణ జీవన వేదం. వేల ఏళ్ల క్రితమే మెదడు, పొట్ట కోసి ఆపరేషన్లు చేసిన విజ్ఞానం మనది. మన ప్రాచీన విజ్ఞానాన్ని తక్కువగా చూడకుండా, దానిలోని సత్యాన్ని గ్రహించి గౌరవించడమే మనం మన పూర్వీకులకు మయం ఇచ్చే నిజమైన నివాళి.

***

No comments:

Post a Comment

Pages