సిగ్గే సింగారం - అచ్చంగా తెలుగు
సిగ్గే సింగారం
ప్రతాప వెంకట సుబ్బారాయుడు





మధ్యాహ్నం.
అంతకు కాసేపటి ముందే భోజనాలయ్యాయి.
"పెద్దమ్మా.."
పెద్దమ్మ నుంచి జవాబు లేకపోయే సరికి "పెద్దమ్మా.." కాస్త స్వరం పెంచి అరిచినట్టుగా పిలిచాను.
"ఆఁ..ఏంటే..గాయత్రీ" అంది నా పక్కనే మంచం మీద అటు తిరిగి పడుకుని పుస్తకం చదువుతున్న అత్తయ్య మెల్లగా ఇటు తిరుగుతూ.
"నాతో నాలుగు మాటలు మాట్లాడతావనుకుంటే, అటు తిరిగి నీపాటికి నువ్వు పుస్తకంలో మునిగిపోవడం ఏవైనా భావ్యమా?"
"చెప్పవే ఏంటి" అంది చిన్నగా నవ్వుతూ.
పెద్దమ్మ పేరు భానుమతి. నేను భాను పెద్దమ్మా అంటాను. పెద్దమ్మను ఎన్ని సార్లు చూస్తున్నా భలే ముచ్చటేస్తుంది. అలాగే చూస్తూ ఉండబుద్ధవుతుంది. ఉంగరాల జుత్తును చక్కగా దువ్వి, జడ వేసుకుని, ఒకే ఒక పువ్వు పెట్టుకుంటుంది. కనుబొమల మధ్య దిద్దుకునే గుండ్రని ఎర్రని కుంకుమ బొట్టు సూర్యబింబంలా ముఖాన్ని దేదిప్యమానం చేస్తుంది. చీరను ఎంతందంగా కట్టుకుంటుందంటే, చూడ రెండు కళ్ళు చాలవు. చీరకు తగ్గ జాకెట్టు. విత్రమేమిటంటే పెద్దమ్మను ఎప్పుడు చూసినా అలాగే అప్పుడే ముస్తాబై, ఫోటో కోసం వచ్చినట్టుగా ఉంటుంది. తనెలా ఉంటుందో మీకు మరింత విశదంగా తెలియడానికి పార్వతీ దేవి ఫోటోను చూస్తే సరిపోతుంది. మా అమ్మ పెద్దమ్మకు పూర్తిగా వ్యతిరేకం. వాళ్లిద్దరూ ఒకే కడుపున రక్తం పంచుకు పుట్టినా, వ్యక్తిత్వాల్లో భిన్న దృవాల్లా ఉండడమేంటో అర్థమయ్యేది కాదు. చిన్నప్పట్నుంచి నాకు అత్తయ్యంటే, తనకు నేనంటే చెప్పలేనంత అభిమానం. కనడం మా అమ్మే అయినా, పెరిగిందంతా పెద్దమ్మ చేతుల్లోనూ, ఇంట్లోనూ. పెద్దమ్మకు ఇద్దరు మగపిల్లలు. ఆవిడ పెంపకంలో చక్కగా చదువు సంస్కారాలు పుణికిపుచ్చుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నాకూ ఓ అన్నయ్యున్నాడు. మా ఇంటికి మోడల్ గా ఉంటాడు. అంతంత మాత్రపు చదువుతో ఓ మోస్తారు ప్రైవేటు ఉద్యోగం వెలగబెడుతున్నాడు. ఇహ మానాన్న విషయానికి వస్తే మా ఇంటి తామరాకు మీద తిరుగుతుండే వానచుక్క. ఆయనకు ఏం పట్టదు. మా అమ్మో, నాన్నో రోజూ ఏదో ఒక గొడవేసుకుంటారు. అప్పుడప్పుడూ అన్నయ్యా దాంట్లో బాగస్వామి అవుతాడు. అర్ధరాత్రి మంచం మీద వాలేదాకా ఆ గొడవ అవిశ్రాంతంగా సూటీ పోటీ మాటలతో, దెప్పుళ్లతో, గొడవలతో అలా కొనసాగుతూనే ఉంటుంది. మా నాన్నకు పూర్తిగా వ్యతిరేకం పెద్దనాన్న. ఆయనకు అత్తయ్యంటే ప్రాణం. ఇల్లంటే ఇష్టం. నన్ను సొంత కూతుర్లా చూసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇల్లు బస్టాండ్ అయితే, వాళ్లిల్లు దేవుడు కొలువుండే ప్రశాంతనిలయం.
నా అదృష్టమేమిటంటే మా పెద్దమ్మవాళ్లూ, మేము ఎప్పటి నుంచో ఒకే ఊరిలో ఉండడం. అందుచేత నేను పెద్దమ్మ కూతుర్లానే పెరిగాను. నాకలాగే ఇష్టం కూడానూ.
నాకు సంబంధం తీసుకొచ్చింది, పెళ్లి ఘనంగా చేసిందీ పెద్దమ్మాపెద్దనాన్నలే. పెళ్లిలో మా అమ్మానాన్న కొన్ని ముఖ్యమైన ఘట్టాల్లో తప్పనిసరి కాబట్టీ కనిపించి మాయమయ్యారు. 
శ్రీవారు హృదయ్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అందగాడు. తెలివైనవాడు. పెద్దమ్మావాళ్ళు పూనుకున్నారు కాబట్టి నాకు అంతమంచి సంబంధం దొరికింది, లేకుంటే గంతకు తగ్గ బొంతతో ఆ ఊళ్లోనే ఒక వీధిలో మా అమ్మలా వైవాహిక జీవితాన్ని నిత్యం ఓ పజిల్ లా సాధించడానికి కష్టపడుతూ ఉండేదాన్ని. 
కడుపుతో ఉన్న నాకు పెద్దమ్మే ఘనంగా సీమంతం చేసి మా ఇంటికి పట్టుకొచ్చింది. ఇక్కణ్నుంచి వాళ్లింటికి నేను వెళ్ళాను. కడుపులో ఉన్న బిడ్ద మీద మా ఇంటి ప్రభావం ఏమాత్రం పడకూడదని.
"చక్కని కథ చదువుతూంటే పిలిస్తివి, ఇటు తిరిగితే నా వంక చూస్తూ ఆలోచనలో పడిపోతివి. ఏమిటో చెప్పవే పిల్లా"అంది అల్లరిగా.
"పెద్దమ్మా నేను నీలా ఉండాలి, పెద్దనాన్న నిన్ను చూసుకుంటునట్టు హృదయ్ నన్ను ఎప్పటికీ ప్రేమగా, లాలనగా చూసుకోవాలి. పెళ్లనేది తప్పనిసరి బంధం అని కాకుండా చివరంటా ఒకరి కోసం ఒకరం బతకడంలోని ఆనందాన్ని అనుభవైకవేద్యం చేసుకోవాలి. నీ అనుభవాలేమైనా చెప్పవూ" అన్నాను బతిమిలాడుతున్నట్టుగా.
నా వంక ఓ పది నిముషాలు చూసి నిట్టూర్చి "చెబుతానమ్మా గాయత్రి, కానీ ఇక్కడ కాదు. రేపు ఉదయం ఏడు గంటలకు శ్రీ వేణు గోపాల స్వామి ఆలయానికి వెళదాం. అక్కడ చెబుతాను నీకు చెప్పాల్సింది" అంది.
***
మా వీధికి కొద్ది దూరంలో ఓ మోస్తరు ఎత్తైన గుట్ట మీద ఉంటుంది శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం.
ఇద్దరం ఆటోలో పైదాక వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ పక్కనే చెట్లతో, పూలతో ఆహ్లాదంగా ఉన్న తోటలోకెళ్లి ఆకాశమంత ఎత్తుకెదిగి కొమ్మలు రెమ్మలు విశాలంగా పరచుకున్న పనస చెట్టుకింద ఒత్తుగా ఉన్న పచ్చటి గడ్డి మీద కూర్చుందామనుకున్నాం. భానుపెద్దమ్మ కూర్చోగలిగింది కాని నేను అపసోపాలు పడ్డమే తప్ప కూర్చోలేకపోయాను. అక్కడే కొద్ది దూరంలో కాఫీ బండతను నా అవస్థ చూసి హడావుడిగా, షాపులో కస్టమర్ల కోసం వేసి ఉంచిన ఓ ప్లాస్టిక్ కుర్చీ తెచ్చి వేశాడు. ఆ అబ్బాయికి ‘థాంక్స్’ చెప్పి కూర్చున్నాను.   
"ఇవాళ గుళ్లో చెబుతానన్నావుగా, ఇప్పుడు చెప్పు పెద్దమ్మా" అన్నాను పెద్దమ్మ ఇచ్చిన కొబ్బరి ముక్కను కళ్లకద్దుకుని మునిపంటితో కొరుకుతూ.
"నాకు దేవుడిచ్చిన కూతురివైన నీకు కాక మరెవరికి చెబుతాను? చెబుతాను. కాని నువ్వు విన్నాక ‘ఇంతేనా’ అనుకున్నా, నవ్వి కొట్టిపారేసినా నేనేం చెయ్యలేను. నా విషయంలో నేను నమ్మింది, అవలంభించిందీ చెబుతున్నాను. నా వైవాహిక జీవిత విజయంలో దాని పాత్ర ఉందని కచ్చితంగా చెప్పగలను" అంది.
మా పెద్దమ్మ ఒకప్పుడు సస్పెన్స్ నవల్లు తెగ చదివేది. ఇప్పుడు ఆ పరిజ్ఞానం నామీద ప్రయోగిస్తోందనిపించింది.
"తొందరగా చెప్పు పెద్దమ్మా, నిన్న మధ్యాహ్నం నుంచి ఎలా గడిపానో తెలీదు. ఇప్పుడు కూడా చెప్పకుండా ఊరిస్తున్నావు" అన్నాను మారాం చేస్తున్నట్టుగా.
"అయితే విను. మా వైవాహిక జీవితం విజయవంతం కావడానికి కారణం నా ’సిగ్గు’" అంది.
"సిగ్గా" అన్నాను తెల్లబోయి.
"అవును. నేను ముందే చెప్పానా, లేదా నువ్వు సీరియస్ గా తీసుకోవని" అంది అలిగినట్టుగా బుంగమూతి పెట్టి.
"అబ్బా పెద్దమ్మా నువ్వు భలే ముద్దొస్తున్నావే. సిగ్గు ఎలా వైవాహిక జీవిత రథాన్ని సునాయాసంగా సక్సెస్ మార్గంలో నడిపిస్తుందో చెప్పవూ"
"ఆడపిల్లకి సిగ్గే సహజాభరణం. మగాడిలో ఉండకూడనిది, కనిపించనిదీ అది. అంచేత సిగ్గు ఎరతో మొగుడి మనసును కొంగుకు కట్టుకోవాలి. అది బయటకు కనిపించనంత చాకచక్యంతో భార్య వ్యవహరించాలి. ఎంతలేదన్నా, మొగుడికి తను మగాడినన్న అహంకారం ఉంటుంది. వాళ్లదేం తప్పులేదు. సమాజం వాళ్ల రక్తంలో ఆ భావాన్ని బలంగా జీర్ణింపజేసింది. దాన్ని పెచ్చుమీరకుండా అదిమి ఉంచేది భార్య సిగ్గు. జీవితంలో అప్పుడప్పుడు అవసరార్థం అభినయించాల్సిన అతి ముఖ్యమైన అంశం. ఒకప్పుడు భర్త కన్నాభార్య వయసు తక్కువగా ఎందుకుండేది? భర్త తనకన్నా పెద్దవాడు కాబట్టి సిగ్గు ఒలకబోస్తూ, గౌరవిస్తుందని. మనం చదువుతున్న చదువులు, చేస్తున్న ఉద్యోగాలు మనకి వ్యక్తిత్వాన్ని, మన కాళ్ల మీద మనం నిలబడే ధైర్యాన్ని ఇస్తున్న మాట వాస్తవం. అంతమాత్రం చేత సిగ్గును వదులుకోకూడదు. మా ఇంట్లో మా ఆయనంటే నాకు గౌరవం, నేనంటే ఆయనకు అభిమానం. ఎవరేమనుకున్నా, పెళ్లంటూ చేసుకుంటే భర్త ఎక్కువ, భార్య తక్కువ అన్న భావన ఉండితీరాలి. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. ఫలవంతమవుతుంది. లేదంటే ఒకే చూరు కింద ఉంటూ మీ అమ్మానాన్నల్లా నిత్యం కాట్లకుక్కల్లా పోట్లాడుకోవాలి. అది పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. ఆ జంట సమాజంలో చులకన అవుతుంది. ఇప్పటి తరంలోని ఆడపిల్లల్లో చాలావరకు సిగ్గు కనిపించడంలేదు. తెలుగులోని కొన్ని పదాల్లా సిగ్గు కనుమరుగవుతోంది. స్త్రీలు మగాడితో సమానం అనుకుంటున్నారు. పోటీ పడుతున్నారు. అందుకే బ్రేకప్ లు, డైవోర్స్ లు తామరతంపర అవుతున్నాయి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ వైవాహిక బంధానికి విలువిచ్చేవాళ్లకు, కట్టుబడేవాళ్లకు..అంతేకాని లివిన్ రిలేషన్ లతో కాలం గడుపుతూ, సరోగేట్ మదర్ని వెతుక్కునే జంటల కోసం మాత్రం కాదు. ఎవరి జీవితం వాళ్లది కాని ఎవరైనా విలువైన జీవితాన్ని కోల్పోకూడదు. నాకు తెలుసు ఇది పాత చింతకాయ పచ్చడి సలహా అని, కాని పత్యానికి పనికొచ్చేది, రోగానికి మందూ ఇదే. ఒక్కోసారి మగాడు తన వ్యసనాలతోనో, బరితెగించిన మగతనంతోనో రాక్షసుడిలా ప్రవర్తిస్తాడు. అప్పుడు అతడిపాలిట కాళికలా మారాలి. కాని దానికి ముందు మాత్రం స్త్రీకి సిగ్గే సింగారం, అది అందానికి అలంకరణ కావాలి. అంతే!" అంటూ ముగించింది.
చప్పట్లు కొట్టాను. కొడుతూనే ఉన్నాను. నాకు తెలుసు పెద్దమ్మ జీవితానుభవాన్ని నాకు పంచింది. నాదీ, హృదయ్ ది జన్మ జన్మల బంధం అవుతుంది. మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్. దానికి కారణం నేనే అవుతాను. 
ఒక్కసారిగా గుడిలోని గంటలు పెద్ద ఎత్తున మోగాయి. మా పెద్దమ్మ రూపంలో పార్వతీదేవి నాకు కర్తవ్య బోధ చేసిందనిపించింది. అప్రయత్నంగా చేతులు జోడించాను.
"ఏమిటే ఇది, పిచ్చిపిల్లా..పద ఇంటికెళదాం’ అంటూ లేచింది.

***

No comments:

Post a Comment

Pages