శ్రీథర మాధురి - 144 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 144

Share This

                                                                   శ్రీథర మాధురి - 144 

(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)


శ్రీరామచంద్రునితో యుద్ధం చేసే ముందు, ఒకసారి రావణుడు బలిచక్రవర్తిని కలిసి, ఆయన యొక్క ఆశీస్సులు పొందడం కోసం పాతాళలోకానికి వెళ్ళాడు.

బలి అతడిని స్వాగతించి ఆ గదిలో ఒక మూలగా ఉన్న కుర్చీని లాక్కుని కూర్చోమన్నాడు.

రావణుడు ఆ కుర్చీని ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ తన సామర్ధ్యం కొద్దీ ప్రయత్నించినా కూడా ఆ కుర్చీ అంగుళం కూడా కదల్లేదు.

బలి నవ్వి ఇలా అన్నాడు 'ఇది కుర్చీ కాదు, నీ ముత్తాత అయిన హిరణ్యకశిపుని యొక్క కర్ణ కుండలము(చెవి రింగు). బలి ఇంకా ఇలా అన్నాడు, 'నీవు ఎత్తలేని హిరణ్యకశిపుని యొక్క కర్ణకుండలాన్ని, నృసింహస్వామి ఒక తాపు తన్నాడు. నృసింహ రాఘవునిగా అవతరించిన అటువంటి నృసింహ స్వామిని నీవు చంపాలని ఆశిస్తున్నావా? కనీసం ఆయనను శరణాగతి వేడు, ఆయన నిన్ను ప్రాణాలతో వదిలేస్తారు.'

రావణుడు భంగపడ్డాడు.

***

రావణుడు చనిపోయే ముందు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, 'లక్ష్మణా! రావణుడు చనిపోబోతున్నాడు. నీవు నేర్చుకోగలిగినదంతా వెళ్లి అతడి నుంచి నేర్చుకో! అతడు పూర్తి జ్ఞానంతో ఉన్నాడు. ఆ జ్ఞానం వృథా కాకూడదు. దయచేసి అతని వద్దకు వెళ్లి, ఈ సమయంలో అతను నేర్పగలిగినది నీకు నేర్పమని అభ్యర్ధించు.

 

లక్ష్మణుడు రాముడిని ఇలా అడిగాడు 'అతనికి నా కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నదా?'

రాముడు 'అవును' అన్నాడు.

లక్ష్మణుడు రావణుడి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, 'హే రావణా! నా సోదరుడైన రాముడు నీకు అపరిమితమైన జ్ఞానం ఉందని చెప్పాడు. ఆ జ్ఞానాన్ని నాకు అందించు.'

 లక్ష్మణుని యొక్క అహంకారాన్ని చూసిన రావణుడు, 'అత్యంత శక్తివంతుడైన నారాయణుడే నీ సోదరుడు. ఆయనతో ఉండి కూడా నీవు వినమ్రత నేర్చుకోలేదా? ఒక గురువు నుంచి విద్యను నేర్చుకోవడానికి సంప్రదించే విధానం ఇదేనా? రాముడు నారాయణుడు అయినా కూడా, ఎంత వినయంగా ఉన్నాడో చూడు. వినమ్రత ను పెంపొందించు కోకుండా నీవు భగవంతునికి సేవకుడిగా ఉన్నందు వల్ల ఉపయోగం ఏముంది? నీవు ఆ మర్యాద పురుషునికున్న మంచి పేరును పాడు చేయడం చూసి, నేను సిగ్గు పడుతున్నాను. నీకు నేర్పడానికి నా వద్ద ఏమీ లేదు. విద్య యొక్క సారమే వినయము. కనీసం భవిష్యత్తులో అయినా వినయాన్ని అవలంబించు.

ఇలా అంటూ రావణుడు ఈ లౌకిక జగతిని వదిలేశాడు.

***


No comments:

Post a Comment

Pages