పుణ్యవతి - 11
రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)
(రవి తన స్నేహితుడు ఉత్తంరాజు ఆత్మహత్య గురించి చెబుతాడు. ఆడది చెప్పే కన్నీటి కథలను మగవారు నమ్మినట్లుగా ఆడవాళ్ళు నమ్మరని సృజన చెబుతుంది. వెళ్ళిపోతున్న ఆమెను సృజనా అని రవి మార్దవంగా పిలవటంతో ఆమె హృదయం తీయగా స్పందిస్తుంది. ఆమె కళ్ళలో కనిపించిన వెలుగు వల్ల కలిగిన భావసంచలనానికి అతను కవితా రూపమిస్తాడు. తరువాత ఆమె వదిలిపోయిన ఫ్లాస్కుని చూసి, దాని లోని బార్లీని వేరే గిన్నెలో పోసి సృజన ఇంటికి వెళ్ళి ఆ ఫ్లాస్కుని ఇచ్చేస్తాడు. తరువాత . . . .)
@@@@@@@@@@@
ఉదయాన్నే హోటల్లో టిఫిన్ తిని ఇంటికి వచ్చాడు రవి. సృజన ఇంట్లో జరుగుతున్న హడావిడిని గమనించిన అతనికి గుండె ఝల్లుమంది. వెంటనే పరుగులాంటి నడకతో తన ఇంటికి చేరుకొని, కిటికీలోంచి రంగనాధం ఇంట్లో సందడంతా గమనించసాగాడు. ఆ రోజు ఆఫీసుకి సెలవు కావటంతో తీరుబడిగా నిలబడి అక్కడ జరిగే తంతంతా గమనించే వీలు చిక్కింది.
@@@
పెళ్ళిచూపుల పేరుతో సృజన అనేక రకాల పరీక్షలకు లోనౌతోంది. కళ్ళపరీక్ష కోసం ఆమె చేత న్యూస్ పేపరు చదివించారు. నలుగురి మగాళ్ళ ముందు ఆమె కట్టుకున్న చీరను పైకెత్తి బోదకాలు లేదని నిర్ధారించుకున్నారు. కుంటిది కాదని నిర్ధారించటానికి తమ ముందు అటూ యిటూ కాసేపు నడిపించారు. పాట పాడమన్నారు. సుమారు ఇరవై ఏళ్ళ క్రితం పెళ్ళిచూపుల్లో ఆడపిల్లకి జరిగే పరీక్షలన్నీ ఆమెకిప్పుడు జరిగాయి. దానికి కారణం ఆ బృందంలో చేదస్తం మూర్తీభవించిన ముసలి ముత్తయిదువ ఉండటమే. ఆ పరీక్షలకు సృజన మనసుకి కష్టం అనిపించినా, తండ్రి గౌరవం కోసం బాధను మనసులోనే అణిచేసుకుంది. ఆమె పిన్ని మాత్రం కోపంతో రగిలిపోతూ, భర్తని పక్కకు పిలిచింది.
"ఇలాంటి వాళ్ళను తెచ్చారేంటండీ? వాళ్ళు పిల్లను చూడ్డానికొచ్చారా? పేషంటుని చూడ్డానికొచ్చారా? అంతమంది మగాళ్ళ ముందు అలా చీర పైకెత్తి. . .ఛీ..ఛీ..ఇప్పుడే పరీక్షల పేరుతో ఇంత హింస పెట్టినవారు, పెళ్ళయితే అమ్మాయిని ఇంకెంత ఏడిపిస్తారో? వాళ్ళు చేసుకుంటామన్నా మనకీ సంబంధం అక్కరలేదు. మరో సంబంధం చూడండి."
"ఇంట్లో కూర్చుని కబుర్లాడే మీకేం తెలుస్తుంది, సంబంధాల కోసం తిరగటం ఎంత కష్టమో? ఊరుకో! వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి మనం చాటుగా మాట్లాడుకోవటం మంచిది కాదు. వాళ్ళు వెళ్ళాక ఏమి చేయాలో ఆలోచిద్దాం" భార్యకు చిరాకుగా చెప్పి, పెళ్ళివారి ముందుకెళ్ళాడు జగన్నాధం.
"ఆవిడేదో అంటున్నారు?" ముసలి ముత్తయిదువ ప్రశ్నకు జగన్నాధం కంగారుపడ్డాడు.
"ఏంలేదండీ! అబ్బాయి పదేళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా! పెళ్ళి ఆలశ్యానికి కారణం అడగమని...." గొణిగాడాయన.
"ప్రమోషనొచ్చేవరకూ పెళ్ళి చేసుకోనని ఆగాడు. అందుకే ఆలస్యమైంది. ఇంకా ఏమన్నా అడగాలంటే అడగండి. మొహమాట పడొద్దు. ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం కూడదని మన పెద్దలు అంటూంటారు. మేమేదో మీ అమ్మాయిని పరీక్షిస్తున్నామని మీరనుకోవచ్చు. ఇప్పుడే అన్నీ చూసుకోవాలి తప్ప పెళ్ళయ్యాక గొడవపడటం మాకు నచ్చదు. మా బంధువుల్లో ఒక అబ్బాయికి సంబంధం చూసాం. పిల్ల రతనాల బొమ్మే! పెళ్ళిచూపుల్లో వాళ్ళు అమ్మాయిని తలుపు దగ్గరే కుర్చీలో కూర్చోపెట్టారు. అంతా మాట్లాడుకుని తాళి కట్టాక తెలిసింది ఆ పిల్లకి పోలియో వల్ల కుడికాలు వంకరపోయిందని, అది బయట పడకూడదనే వాళ్ళు పెళ్ళిచూపుల్లో పిల్లను తలుపు దగ్గరే కూర్చోపెట్టి చూపించారని. కారణం ఏదైనా, బొడ్డూడని పిల్ల వెధవక్కూడా అదేదో ఎయిడ్సు రోగమంట.. అదొచ్చే రోజులు. రోజులలా ఉన్నాయి మరి! . . .సరె! మీ అన్నయ్యగారికి ఒక్కర్తే ఆడపిల్ల అంటున్నారు. దత్తపుత్రులు కానీ, అభిమాన పుత్రులు కానీ ఎవరైనా ఉన్నారా?"
ముసలావిడ ప్రశ్నకు జగన్నాధం లేరని బదులిచ్చాడు.
"అయితే ఇల్లంతా అమ్మాయికే వస్తుందన్న మాట!" అంటూ ఆమె లేచి ఇల్లు, పెరడు కలియదిరిగింది. "బాగుంది. ఆ మూల ఏదో కొంప ఉన్నట్లుంది?" అంటూ రవి ఉంటున్న ఇంటి వైపు వెళ్ళబోయింది.
"అది అద్దెకి ఇచ్చామండీ!" ఆమె అటు వెళ్ళకుండా అడ్డుపడ్డాడు జగన్నాధం.
"సరే! అది తరువాత చూద్దాం" అంటూ వచ్చి సోఫాలో చతికిలబడిందామె. పెళ్ళిచూపులకి వచ్చిన వాళ్ళ ప్రతినిధిగా ముసలావిడ ప్రశ్నలతో దంచేస్తూంటే, మిగిలినవాళ్ళు మూగ ప్రేక్షకుల్లా చూస్తున్నారు.
"చూడండి! నాకు దాపరికాలు నచ్చవు. నేను వీడి అమ్మమ్మని. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. పుట్టినప్పటినుంచి ఇద్దరూ రామలక్ష్మణుల్లా కలిసి ఉంటున్నారు. ఇంత పొజిషన్లోకి వచ్చినా వీడు అన్నగారి మాట జవదాటడు. ఇక ముందు కూడా వీళ్ళిలాగే కలిసి ఉండాలని మా కోరిక. అందుకే మా ఇంటికొచ్చిన అమ్మాయి మా ఉమ్మడి కుటుంబంలో కలిసిపోవాలి. మా ఇంట్లో మడి ఆచారాలను పాటించాలి. మా యింట్లో ఏనాడూ విడిగా ఉంటామన్న మాట రాకూడదు. ఆ మాట వస్తే అమ్మాయిని పంపించేస్తాం. ఆ విషయాన్ని ముందుగా మీరు ఆలోచించుకోండి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలంటారు పెద్దవాళ్ళు."
ముసలావిడ మాటలకు సృజన మనసు ఆవేశంతో రగిలిపోతోంది. కానీ మౌనంగా పక్కన నిలబడ్డ తండ్రి చేయి తన తలపై పడగానే, కంట్లో పొంగిన నీటిని అక్కడే ఆపేసింది ఆమె. వాళ్ళ అనుమతితో కుర్చీలోంచి లేచి, లోనికి వెళ్ళబోయింది సృజన. కూర్చున్న ముసలావిడ హఠాత్తుగా లేచి సృజన జడను పట్టుకు వెనక్కి లాగింది. ఆ చర్యకు సృజన తూలి వెనక్కి పడబోయి ఎలాగో నిలదొక్కుకుంది.
"ఏంలేదు. జడ అసలుదా, సవరమా అని చూసాను" కోపంగా చూసిన జగన్నాధం భార్యకి చెప్పింది ముసలావిడ.
పెళ్ళివారు లేచి వెళ్ళిపోతుంటే, తండ్రి చేతులు కట్టుకొని వారి వెనుకే వెళ్ళటం చూసిన సృజన కళ్ళు చెమ్మగిల్లాయి. స్త్రీని దేవతగా ఆరాధించే దేశంలో, ఆడపిల్ల తల్లిదండ్రుల ఈ దేవురింతలకు అంతం లేదా? వెళ్ళిన వారిని గేటు వరకూ దిగబెట్టి రంగనాధం సోదరులు వెనుదిరిగారు.
"సృజీ! ఈ సంబంధం విషయంలో నీ అభిప్రాయం ఏమిటి?" ఆమె పిన్ని అడిగింది.
"నా అభిప్రాయంతో పనేముంది పిన్నీ? అతను చేసుకుంటానంటే ఒప్పుకోవాల్సిందేగా! కాదంటే ఈ కుటుంబం పరువు ఉంటుందా?"
"నిజమేనమ్మా! ఈ దేశంలో ఆడపిల్ల పుట్టింటి పరువు కోసం, తండ్రి గౌరవం కోసమే తప్ప తన యిష్టం కోసం పెళ్ళాడకూడదు. పిల్లాడి సంగతేమో కానీ, ముసలిది రాచి రంపాన పెట్టే దానిలా కనిపిస్తోంది. మీ బాబయ్యతో చెప్పి మరో సంబంధం చూడమంటాను" అంటున్న ఆమె మాటలు అప్పుడే వారి వద్దకొచ్చిన జగన్నాధం చెవుల్లో పడ్డాయి.
"చాల్లే! కూతురి పెళ్ళి త్వరగా చేయాలని అన్నయ్య తొందర పడుతుంటే, నువ్వు అడ్డుపుల్ల వేస్తావేంటి? పెళ్ళి అన్నాక నాలుగూ చూసుకోవాలని ఆ ముసలావిడ తాపత్రయం. అంతమాత్రానికే సంబంధం చెడగొట్టుకుంటారా?" భార్యపై చిరాకు పడ్డాడతను.
"ఏమిటి చూసుకొనేది? మగాళ్ళ ముందు ఆడపిల్లని అంతలా పరీక్ష చేసి చూడాలా? రోజు బాగుంది గనుక సరిపోయింది కానీ వెళ్తున్న అమ్మాయి జడ పట్టి వెనక్కి గుంజితే, అమ్మాయి వెనక్కి పడి తలకు గాయమైతే ఎంత ప్రమాదమో ఆలోచించిందా? జడ ఒరిజినలా, సవరమా చూసిందంట! ఏళ్ళు రాగానే సరికాదు. కొంచెం మానం, మర్యాద కూడా ఉండాలి. మూడు పదుల వయసొచ్చినా, ఆ పిల్లాడు పెళ్ళెందుకు చేసుకోలేదో మనం చూడనక్కరలేదా? . . . అది సరె! బావగారేరి?"
"పెళ్ళివారిని గేటు వరకూ సాగనంపి వస్తూంటే, అద్దెకి ఉంటున్న కుర్రాడు కిటికీలోంచి చూడటం కనిపించింది. వెంటనే గొణుక్కుంటూ అన్నయ్య అటెళ్ళాడు."
జగన్నాధం మాటలకు సృజన ఉలిక్కిపడింది. "నాన్న రవిగారి ఇంటికెళ్ళాడా? అక్కడ ఏదైనా గొడవ చేస్తాడేమో? నువ్వెళ్ళి నాన్నను తీసుకురా బాబాయి!"
"గొడవ చేయటానికి ఇక్కడేమి జరిగిందని?" జగన్నాధం అడిగాడు.
"ఆయన కిటికీలోంచి చూడటం నాన్న గమనించారుగా! నాన్న దృష్టిలో అది తప్పే! మొదట్లో నాన్న అతనికి ఇల్లు అద్దెకివ్వనన్నారు. కానీ పుణ్యవతి బలవంతంపై అద్దెకిచ్చారు. ఇన్నాళ్ళు నాన్న నిఘాని ఆ అబ్బాయి గనుక భరిస్తున్నారు. నేనైతే ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసేదాన్ని..."
సృజన మాటలకు జగన్నాధం భార్య అడ్డు తగిలింది. "పుణ్య బలవంతంపై ఇల్లు అద్దెకు ఇవ్వటమేంటి? అంటే అతను పుణ్యకు చుట్టమా?" ఆమె ప్రశ్నకు అవునన్నట్లు తలూపింది సృజన.
"మరి చెప్పవేం? ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నామన్న మాట! తలకు మాసిన సంబంధాలెందుకండీ అమ్మాయికి చూడటం? బావ గారి నిఘా భరిస్తూ గౌరవప్రదంగా మసలుకొంటున్నాడంటే, కుర్రాడు మంచివాడన్నమాట! అందులోనూ పుణ్యకి చుట్టమంటున్నారు. అటునుంచి నరుక్కురండి!" భర్తతో అందామె.
భార్య మాటలకు చిరాకుపడ్డాడు జగన్నాధం. "గమనించావా? మీ పిన్నితో ఇదే గోల! సంబంధం కలుపుకు రండి అనక, నరుక్కు రమ్మంటోంది. వయసు మళ్ళినా దీనిలో ఆ విప్లవ ధోరణి మాత్రం పోలేదు. ఇన్నాళ్ళూ ఈ విషయం నాతో చెప్పలేదేరా?" జగన్నాధం ప్రశ్నకు సృజన కంగారుపడింది. పుణ్యకు, రవికి ఉన్న అసలు చుట్టరికం తమ ముగ్గురికే తెలుసు. ఇలా అల్లుకుపోతున్న ఈ అబద్ధం ఎంత దూరం వెళ్తుందో అని మనసులో ఒక భయం. అయినా ఏదో ఒకటి చెప్పక తప్పదు.
"ఏం చెప్పను బాబాయి? ఆ ఇంట్లో అద్దెకు ఉన్న కుర్రాడి వల్లనేగా అక్కయ్య చనిపోయింది. అందుకని నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోడు!"
"కానీ ఆ కుర్రాడు ఈ కుర్రాడు కాదుగా! అందరు కుర్రాళ్ళు మోసగాళ్ళే అవుతారా? మీరెళ్ళి ఆ కుర్రాడితో మాట్లాడి రండి!" భార్య మాటలకు చిరాకుపడ్డాడు జగన్నాధం.
"వెళ్తాను లేవే! ఇదమ్మా మీ పిన్ని వరస. నోట్లో మాట నోట్లో ఉండగానే పరుగులు పెట్టిస్తుంది. ఈ వయసు మళ్ళిన ఆడవాళ్ళు ఉన్నారే! ఎవడైనా పెళ్ళి కాని కుర్రాడు కనిపిస్తే చాలు, వాణ్ణి తమ బంధువుల్లో కలిపేసుకొనేవరకూ నిద్రపోరు. దీని సంగతి సరె! నీ ఉద్దేశం ఏమిటి?" జగన్నాధం ప్రశ్నకు సిగ్గుపడింది సృజన.
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment