సూక్తి కథ -2
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
"లహరీ! ఏఁమి కూర ఇదీ", విసుక్కుంటూ పిలిచింది అత్త సుందరమ్మ!
"కూర్చున్న ౘోట నుంచీ కదలదు కానీ, ఈ నొక్కులకేం తక్కువ లేదు", ఘాటుగా ౙవాబునిస్తోంది సుందరమ్మకు కూతురు పద్మిని. మఱదలిని ఎవ్వఱైనా ఒక్క మాట అంటే ఊరుకోదు పద్మిని, అదీ తల్లీ, తమ్ముడూ దూషిస్తే అస్సలు ఊరుకోదు!
"దేశం నలుమూలలా, ఈ ప్రతిష్టాత్మక పరికరం ఇప్పుడు స్థాపించబడుతోంది, శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశ అభివృద్ధిని సూచించే ఈ అభివృద్ధి పట్ల ప్రజలు, నేతలు అమితానందాన్ని, ఆసక్తిని కనబరుస్తున్నారు", దూరదర్శిని లో వార్తలు ౘదువుతోంది, ప్రయోక్త.
తల్లి మాటలకు, తన తమ్ముడు అయిన ఆమె భర్త "ఏం తిట్లు తిడతాడో", అని భయం మొహంలో పెట్టుకుని ఉన్న లహరి వంక సానుభూతిగా ౘూస్తున్న పద్మిని, ఒక్కసారిగా ఈ వార్త వింటూ, ఉత్సాహంగా అటు చూస్తోంది.
అక్క పద్మిని కి జడిసి, భారీ మీద నోరు పారేసుకోకుండా కూర్చున్న తమ్ముడు నిగమ శర్మ, ఒక్కసారిగా పద్మిని వార్తలు వంక ౘూస్తుండటంతో, తను భార్య వంక పళ్ళు బిగించి ౘూడసాగాడు.
అలాగని పద్మిని మాత్రం మౌనంతో ఉండలేదు.
" చూడమ్మా, ఇంట్లో కోడలు గచ్చు సరిగ్గా తుడవలేదు, కూరలో నీకు నచ్చిన దినుసులు లేవు", అంటే నస పెట్టడం కాదు.
నిజంగా అవతల వాళ్ళు పనితనం నచ్చకపోతే, వాళ్లతో మనకి పెద్దగా సంబంధం లేకపోతే, "ఒకటి అరసార్లకే కదా వీళ్ళ పనితనంతో నాకు ఇబ్బంది" , అని సర్దుకుపోయి ఊరుకోవాలి.
లేదు వాళ్ళు మనవాళ్ళే అయితే, వాళ్ళు చేసేది సరైన పద్ధతి అయినా కూడా ఊరుకోవచ్చు, తప్పులేదు. సరైన పద్ధతి కానప్పుడు మాత్రమే, అంటే, కందిపప్పు కి బదులు గన్నేరు పప్పు వాడితేనో, ఏదైనా పద్ధతిగా లేకపోతేనో, మనం మొదట చెప్పి చూడాలి, వినకపోతే జీవితాంతం నస్కుతూ కూర్చోకుండా, ప్రమాదాలు జరగకుండా, వారిని మార్చడానికి, సరిదిద్దడానికి దారులు వెతకాలి.
వాళ్ళు చేస్తుంద సరైనదే అయినప్పుడు, ఈ నసుగుడు దేనికమ్మా, కేవలం మన 'అహం తృప్తి' పడటం కోసమేనా?
మనుషులుగా మనకు ఇంతకన్నా వేరే కర్తవ్యం ఏమీ లేదా అమ్మా? మాట్లాడటం మనుషులకు మాత్రమే దేవుడు ఇచ్చిన వరం అన్నప్పుడు, దాన్ని ఇలా, 'హింస' పెట్టడానికి వాడాలా అమ్మా?
ఎంతసేపూ ఈ 'ౘట్రం' నుంచీ బయటకు రాకుండా ఉంటే, ఇక 'కొత్తదనం' ఎలా ఉంటుంది?
'జరామరణ చక్రాలు చాలని' మోక్షం కోసం ప్రార్థిస్తాం. ఎందుకు ఒకచోటనే ఉండలేక కదా? ఇంత పెద్ద ఉదాహరణ కూడా అక్కర్లేదమ్మా, పొద్దుగూకులు ఇంట్లో ఉంటే విసుగు వస్తుందని బయటకు వెళ్తాము, సౌకర్యంగా ఉంటుందని రోజంతా మంచం మీదనే ఉండము, ఏ పనినీ చేయకపోయినా, ఇల్లంత కలియ తిరుగుతూ ఉంటాం, కొత్త కొత్త నేస్తాల కోసం ప్రయత్నం చేస్తాము, కానీ ఈ 'అహం అనే చట్రం' నుంచీ మాత్రం బయటకు రాము, ఇది మాత్రం విసుగు రావట్లేదా అమ్మా!
ఒక్కసారి ఇందులో నుంచి బయటకు వచ్చి చూడండి, సరి కొత్త ప్రపంచం ఎంత బాగుంటుందో! పోనీ బాగోదంటారా, ఆ విషయం మీరు స్వయంగా అనుభూతిస్తేనే కదా తెలిసేది, ఎలా ఉంటుందో!
పోనీ నీకు ఇలా ఉండాలీ అని తెలియక పోతే, ఎలా ఉండాలో తెలపటానికి మన భాషా సౌందర్యం కలిగిన పద్యాలనూ, సూక్తులనైనా వినమ్మా!
"వేళాకోళంబులు గ
య్యాళితనంబులును జగడ మాడుతలును గం
గాళీపోకలుఁ గొందెము
లాలోచించుటయుఁ గూడదమ్మ కుమారీ!"
"ఇలాంటి మన పూర్వీకులు అందించిన మంచి సూక్తులనూ, నేటి శాస్త్రవేత్తలందిస్తున్న పరిజ్ఞానాన్నీ, దేన్నీ పట్టుకోకుండా, పోనీ మనసునైనా చికాకు గా ఉంౘుకోకుండా, ఇంట్లో వాళ్ళకీ మనఃశాంతి నశింప చేసి, మనుష్యుల మధ్య తగాదాలు పెట్టీ ఏం సాధిద్దామని అమ్మా!? ",
మఱదలు లహరి పట్ల సానుభూతి గొంతును తడిపేయగా, ఇక మాటలనాడలేక, మౌనాన్ని ఆశ్రయించింది, పద్మిని. ఆ మౌనమే అక్కడ అంతా పరౘుకుంది.
వదిన పట్ల కృతజ్ఞత తో లహరీ, "తగాదాలు పెట్టీ..", అమ్మ తనకూ, తన భార్యకూ మధ్య తగాదాలు పెడుతోందన్న జ్ఞానము అందాక, తల్లి పట్ల విముఖత కంటే, "తన జడత్వమే అందుకు అవకాశం ఇచ్చింది", అని నిగమ శర్మ తన మీద తనే విరక్తితో కూడిన దీర్ఘమైన మౌనం లోకి ౙారుకున్నాడు.
ఆ మౌనాన్ని ఛేదిస్తూ, "అద్భుతాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ౙరుగుతాయేమో కానీ, ఒక్క మాట తోనో, ఒక్కళ్ళ పోరాటం తోనో, ఒక్కే రోౙు లోనో ఎవ్వఱి మనసుల్లో మార్పు వచ్చేయటమనే అద్భుతం ౙరగదు, మీ అమ్మ సుందరమ్మ తీరు కూడా అంతే తల్లీ, ఇప్పుడే కాక పోయినా, ఎప్పటికి అయినా మారుతుందని కాదు కదా, కనీసం 'మానవత్వం' తో మెలుగుతుందనీ చెప్పలేము, అయితేనేం, ఒక్కో అడుగునూ పేర్చాలనే తపనతో నువ్వో వత్తిని వెలిగించావు తల్లీ, నీ మాటల చమురు తో, నీ 'బాధ్యత అనే ప్రమిద'లో! ఆనందంగా ఉంది!", మెౘ్చుకుంటూ అన్నారు, 'సుందరమ్మ భర్త' గా పేరొందిన 'సుందరయ్య గారు!', కూతురు పద్మినితో.
"అందఱూ అగౌరవ పరచే మన భాషనూ, అందులో ఇమిడి ఉన్న జీవన సూత్రాలనూ ఆకళింపు చేసుకుని, ఇవ్వాళ నువ్వు వాటిని జీవితానికి అన్వయిస్తున్నావు, సమయానుకూలంగా ప్రస్తావిస్తూ, వాటి ఉపయోగాన్నీ ప్రజలకు అందిస్తున్నావు!", అని తన సంభాషణను ముగించారు సుందరయ్య గారు.
"మార్పు కోసం ఎదురు ౘూడటం లో తప్పు లేదు,అందుకు ఓర్పే తొలి మెట్టు", అనుకుంటూ, శాస్త్రవేత్తల బృందం లో సభ్యుడైన తన భర్తకు శుభాకాంక్షలు తెలపటానికి చరవాణిని అందుకుంది పద్మిని!
***



No comments:
Post a Comment