పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -15
బాలకాండ
దినవహి సత్యవతి
14 వ సర్గదశరథుడు అశ్వమేధయాగము చేయుట...
220.
సరయూ, ఉత్తరతీరాన యజ్ఞభూమి వెలసెను,
అచటనే దశరథుడు యాగమునారంభించెను,
ఋష్యశృంగుడు, యజ్ఞానికి ప్రధానఋత్విక్కయ్యెను,
బ్రాహ్మణశ్రేష్ఠులచే విద్యుక్తకార్యాలు చేయబడెను,
అశ్వమేధాంగాది కర్మలు శాస్త్రానుసారం చేయబడె, సత్య!
221.
న్యాయప్రకారం ఋత్విక్కులు కర్మలు నిర్వర్తించిరి,
అదిగాంచి మునిశ్రేష్ఠులు సంతుష్ఠాంతరంగులైరి,
పిదప వారు ఆహూతులైన సురలను పూజించిరి,
ప్రాతః సవనాది కర్మలు యథావిధి నిర్వర్తించిరి,
హవిర్భాగాలు ఇంద్రునికి సమర్పించి పూజించిరి, సత్య!
222.
ద్విజులు నిర్దుష్టమైన సోమలత నలుగగొట్టిరి,
ఆ రసంతో మాధ్యందిన సవనం యథారీతి చేసిరి,
దశరథుని తృతీయ సవనం యథారీతి చేసిరి,
యజ్ఞ, హోమాది కర్మలన్నీ మంత్రపూర్వకంగా చేసిరి,
శాస్త్రప్రకారం, క్షేమకరమై యుండునట్లు చూసిరి, సత్య!
223.
యాగదినాలలో అలసినవాడు అగుపించలేదు,
విద్యావిహీనుడైన బ్రాహ్మణుడే కనిపించలేదు,
వంద శిష్యులు కూడా లేని గురువు కానరాలేదు,
తృప్తిగా భుజంచని పౌరుడొక్కడూ కనబడలేదు,
యజ్ఞదినములలో నిరంతర అన్నదానం జరిగె, సత్య!
224.
అలంకృతులైన పురుషులు ద్విజులకు వడ్డించిరి,
మణికుండలధరులు వడ్డించువారికి తోడ్పడిరి,
వారిలో బుద్ధి, వాక్చాతుర్యంగల బ్రాహ్మణులుండిరి,
సమయం వచ్చినపుడు శాస్త్రచర్చలు చేయుచుండిరి,
బ్రాహ్మణ నిపుణులు యజ్ఞకర్మలు నిర్వర్తించిరి, సత్య!
225.
వసిష్ఠాదుల పర్యవేక్షణలో యజ్ఞం జరుగుచుండె,
శాస్త్రానుసారం సర్వకర్మలు నిర్వర్తింపబడుచుండె,
యజ్ఞశాలలో షడంగవేత్త కానివాడు లేకుండె,
వ్రతానుష్ఠానము చేయనట్టివాడొక్కడూ లేకుండె,
బహుశాస్త్ర పరిచయం లేని బ్రాహ్మణుడే లేకుండె, సత్య!
226.
మాఱేడు కఱ్రతో చేసిన ఆరు యూపములు,
చండ్ర కర్రతో చేసినట్టి ఆరు యూపములు,
మోదుగ కఱ్రతో చేసిన ఆరు యూపములు,
దేవదారు చెట్టు కఱ్రవి రెండు యూపములు,
శ్లేషాత్మిక కఱ్ర యూపస్థంభాలు యజ్ఞంలో నిల్పిరి, సత్య!
227.
యజ్ఞ ప్రవీణులచే యూపస్థంభాలు చేయబడెను,
రెండు యూపముల నడుమ బారెడు దూరముండెను,
ఇరువదొక్క యూపములు స్వర్ణమయమై యుండెను,
యూపస్థంభాలు ఇరువదొక్క అరత్నుల ఎత్తుండెను,
యూపములు వస్త్రాలచే చుట్టి అలంకరింపబడెను, సత్య!
228.
శిల్పులు, స్థంభాలను, నున్నగా ధృఢంగా నిర్మించిరి,
స్థంభాలకు ఎనిమిది అంచులుండునట్లుగా చెక్కిరి,
యూపములన్నింటినీ యథాశాస్త్రముగా నిలిపిరి,
యూపములు పుష్పసుగంధాదులతో అలంకరించిరి,
అవి ఆకసాన సప్తర్షులవలె ప్రకాశించినవి, సత్య!
229.
శాస్త్రానుసార కొలతలతో ఇటుకలు నిర్మించిరి,
శుల్బకర్మలో నిపుణులు అగ్నివేదికలు కట్టిరి,
దశరథుని చిత్యాగ్నికై గరుడవేదిక కట్టిరి,
అందు పద్దెనిమిది వరుసల ఇటుకలు ఉంచిరి,
అది ఇతర వేదికలకంటే పెద్దదిగా యుండెను, సత్య!
230.
శాస్త్రానుసారం దేవతలకై జంతువులు కట్టబడె,
అందు సర్పాలు, పశుపక్ష్యాదులు, జలచరాలుండె,
కొన్ని పశువిశనమునకై స్థంభాలకు కట్టబడె,
ఋత్విక్కులచే మున్నూరు పశువులట్లు కట్టబడె,
దశరథుని ఉత్తమాశ్వమూ యూపానికి కట్టబడె, సత్య!
231.
కౌసల్య, యజ్ఞాశ్వమునకు, ప్రదక్షిణ చేసెను,
మూడు కత్తులను తన చేతిలో నిడుకొనెను,
ధర్మ, శ్రద్ధావతియైన కౌసల్య, అశ్వమును చంపెను,
శాస్త్రరీతి, ఆమె, రాత్రి, ఆ అశ్వము చెంత నిద్రించెను,
అప్పుడు కూడా కౌసల్య స్థిరచిత్తురాలై యుండెను, సత్య!
232.
రాజుతో రాజ్యాభిక్తురాలౌ భార్య పట్టమహిషియౌను,
రాజు ఉపేక్షించిన భార్య పరివృత్తియనబడును,
రాజుచే భోగింపబడిన స్త్రీ వావాతయనబడును,
యజ్ఞమందా మువ్వురినీ ఋత్విక్కులకీయవలెను,
హోత, అధ్వర్యువు, ఉద్గాతలు యాగఋత్విక్కులు, సత్య!
233.
ఆదిగ, ఋత్విక్కులా స్త్రీలను పరిగ్రహించవలెను,
పిదప మువ్వురినీ రాజుకు తిరిగియీయవలెను,
బదులుగా వేరే వస్తువేదైన తీసుకొనవలెను,
శాస్త్రానుసారమిది యజ్ఞములో పాటింపవలయును,
ఋత్విక్కులు జ్ఞానము, ఇంద్రియనిగ్రహం కలవారు, సత్య!
234.
ఋత్విక్కు, యజ్ఞపు వపను పక్వము చేయును,
దశరథుడు తగు సమయమునకై వేచియుండెను,
పిదప వపాధూమగంధమును వాసన చూసెను,
అట్లు శాస్త్రానుసారం పాపమును తొలగించుకొనెను,
పదార్గురు ఋత్విక్కులు అశ్వాంగాలు హోమంలో వేసిరి, సత్య!
235.
యజ్ఞములలో హవిస్సు ప్రాధాన్యమైనదియగును,
దానిని జువ్వికొమ్మలపై యుంచి సంస్కరింపవలెను,
అశ్వమేధంలో ప్రబ్బిలితీగపై సంస్కరింపవలెను,
అశ్వమేధము కల్పసూత్రానుసారంగా చేయు యజ్ఞము,
అదియూ మూడుదినాల్లోనే చేయవలసిన యజ్ఞం, సత్య!
236.
అశ్వమేధ యాగము మూడు రోజులు జరుపబడును,
మొదటి దినము చతుష్టోమమని పిలువబడును,
రెండవ దివసము ఉక్థ్యమని పిలువబడును,
మూడవ దినము అతిరాత్రమని పిలువబడును,
యాగంలో విహితములౌ క్రతువులెన్నియోగలవు, సత్య!
237.
దశరథుడు శాస్త్రరీతి క్రతువులన్నీ చేయించెను,
అందులో జ్యోతిష్టోమ ఆయుర్యాగము చేయించెను,
అభిజిద్యాగ, విశ్వజిద్యాగాలు కూడా చేయించెను,
అపోర్త్యామమను మహా క్రతువు కూడా చేయించెను,
రెండు అతిరాత్రములు కూడానతడు చేయించెను, సత్య!
238.
తూర్పు దిక్కునందున్న దేశమును హోతకు,
పశ్చిమ దిక్కునందున్న దేశమును అధ్వర్యునకు,
దక్షిణ దిక్కునందున్న దేశమును బ్రహ్మకు,
ఉత్తర దిక్కునందున్న దేశమును ఉద్గాతకు,
దశరథమహారాజు దక్షిణగా ఇచ్చివేసెను, సత్య!
239.
అశ్వమేధయాగములో దక్షిణ ఈయవలెను,
అట్టి నిర్ణయము పూర్వము బ్రహ్మ విధించెను,
దశరథుడు అశ్వమేధయాగము పూర్తిచేసెను,
యజ్ఞఫలము పరిపూర్ణముగా పొందదలచెను,
అందుకై భూమినంతా ఋత్విక్కులకు దానం చేసె, సత్య!
240.
అపుడు ఋత్విక్కులు భూమి తమకు వలదనిరి,
తాము స్వాధ్యాయాధ్యయనం చేయువారమనిరి,
దశరథుడే భూమినంతనూ రక్షింపగలడనిరి,
భూమికి బదులు, స్వల్పముగా ధనమిమ్మనిరి,
స్వర్ణమాణిక్యాలు, గోవులవంటివిమ్మని కోరిరి, సత్య!
241.
వేద బ్రాహ్మణుల కోరిక దశరథుడు మన్నించెను,
వేయివేల ఆవులు, శతకోటి స్వర్ణటంకాలిచ్చెను,
నాలుగువందలకోట్ల వెండినాణెములిచ్చెను,
ఆ ధనము ఋష్యశృంగ, వసిష్ఠులకివ్వబడెను,
బ్రాహ్మణోత్తములా ధనం పంచుకొని సంతసించిరి, సత్య!
242.
ఆహూతులౌ బ్రాహ్మణులనూ రాజు సత్కరించెను,
శ్రద్ధాసక్తుడై వారికి కోటి స్వర్ణనాణెములిచ్చెను,
అపుడే ఒక దరిద్ర బ్రాహ్మణుడు యాచింప వచ్చెను,
దశరథుడతనికి తన హస్తాభరణమిచ్చెను,
వారు తృప్తులగుటగని దశరథుడు సంతసించె, సత్య!
243.
అశ్వమేధయాగం సర్వపాపములూ తొలగించును,
యాగకర్తను స్వర్గమునకు తీసుకుని వెళ్ళును,
అట్టి యాగం ముగించి దశరథుడు సంతసించెను,
పిమ్మటతడు ఋష్యశృంగునికి నమస్కరించెను,
తన వంశాభివృద్ధికి హేతువౌ కర్మలు చేయుమనె, సత్య!
*****




No comments:
Post a Comment