పుణ్యవతి - 9వ భాగం - అచ్చంగా తెలుగు

పుణ్యవతి - 9వ భాగం

Share This

 పుణ్యవతి - 9

రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)




@@@@@@@@@
(తమ ప్రాంగణంలో ఉన్న ఇంట్లో రవికి అద్దెకివ్వటానికి రంగనాధాన్ని ఒప్పిస్తుంది పుణ్యవతి. చదువు పూర్తయి ఇంట్లోనే ఉంటున్న సృజన తమ ఇంట్లో అద్దెకు దిగిన రవిని గమనించటం ఒక అలవాటుగా పెట్టుకుంటుంది.ఒక రోజు రవి అలికిడి వినబడక తండ్రి ఇంట్లో లేని సమయంలో అతని గదికి వెళ్తుంది. తరువాత ...)
@@@@@@

"ఏం? మీ పుస్తకం పుణ్య తప్ప నేను చదవకూడదా?"

"మీ వరకు ఫరవాలేదు. కానీ మీ నాన్నగారు చూస్తేనే. . .మరో ఇల్లు వెతుక్కొనే ఓపిక లేదండీ!"

"మీకా కష్టం కలిగిస్తానని మీరెందుకు అనుకుంటున్నారు? మొదటినుంచి చూస్తున్నాను. ఈ ఇంట్లో దిగి ఏడు నెలలైంది. ఒక్కసారైనా మా ఇంటి వైపు కన్నెత్తి చూడటం లేదు. నెల కాగానే అద్దె మాత్రం పుణ్య చేతుల మీదుగా నాన్నకి అందజేయిస్తున్నారు. ఎంతసేపూ ఈ మూల కొంపలో మీరెలా ఉన్నారోనని నేను ఆలోచించటమే తప్ప. . ."

"నా గురించి మీరెందుకు ఆలోచించాలండీ?" అకస్మాత్తుగా రవి వేసిన ప్రశ్నకు బదులీయలేక ఆమె తడబడింది. "సరె! నా గురించి ఆలోచించే మీరున్నారని ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి, 'నాకు బాగులేదు. కాస్త గ్లూకోజు కలిపి ఇవ్వండి ' అని మిమ్మల్ని అడగగలనా? అలా అడిగితే మీ నాన్నగారు ఊరుకుంటారా? వెంటనే ఇల్లు ఖాళీ చేయించరా? చెప్పండి."

రవి ప్రశ్నకు ఆమె తటపటాయించింది.

"పుణ్యవతి పిన్ని కొడుకునని నమ్మి, మీ నాన్నగారు అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. అందుకే నేను మీ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు చెప్పండి, నా గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు?"

"ఎందుకంటే. . . ఇప్పుడు చూడండి. మీకొంట్లో బాగోలేదు. ప్రొద్దున్నుంచి బయటకు వెళ్ళలేదు. డాక్టరు దగ్గరకెళ్ళి..." ఆమె పూర్తిచేసే లోపునే అతను మూలనున్న మందులను పైకెత్తి చూపించాడు.

"రాత్రి ఉన్నట్లుండి ఒంట్లో వేడి పెరిగింది. గదిలో ఒక్కణ్ణీ ఉన్నాను గనుక ఉదయం పరిస్థితి ఎలా ఉంటుందోనని తలుపు గడియ తీసి పడుకున్నాను. ఉదయాన్నే మీ నాన్నగారు నేనింకా లేవలేదని తలుపు తోసి లోనికొచ్చారు. జ్వరంతో బాధపడే నన్ను చూసి మందుల దుకాణం నుంచి మందులు, హోటలునుంచి టిఫిను తెచ్చిపెట్టారు."

రవి చెబుతుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. "తనకు తెలియకుండానే నాన్న ఇన్ని చేసాడా?" తనలో అనుకుందామె.

"చూడండి. వయసులో ఉన్న మనం చాలా ఆదర్శవంతులమని జబ్బలు చరుచుకుంటాం. కానీ కొన్ని ఛాందస భావాలు ఉన్న మీ నాన్నగారిలాంటి వయసు మళ్ళిన వాళ్ళలోనే త్యాగధనం, మానవత్వం ఉంటాయని నా అభిప్రాయం. తండ్రిగా తన బాధ్యత నెరవేర్చటానికి నాపై ఇంత నిఘా ఉండే మీ నాన్నగారే, పుణ్యవతి తన చేతుల్లో పెట్టిన నన్ను, ఆమె పిన్ని కొడుకునన్న భావనతో జాగ్రత్తగా చూసుకొనే బాధ్యత కూడా తీసుకున్నారు. కనుకనే ఉదయం నాకా సాయం చేసిపెట్టారు."

"నా కన్నా మా నాన్నను మీరే బాగా అధ్యయనం చేసారు" మెచ్చుకోలుగా అందామె.

"మీరు నన్ను ములగచెట్టు ఎక్కించేస్తున్నారు. తీరా చెట్టెక్కాక దిగటం రాక, పైనుంచి దూకి కాళ్ళు విరక్కొట్టుక్కోవాలేమో!" నవ్వుతూ అన్నాడు రవి.

"దూకే ముందు నాలుగు ములక్కాడలు కోసి మరీ దూకండి. కాళ్ళు విరిగినా ఫరవాలేదు, పథ్యం తిన్నప్పుడు చారులో నమలటానికి నాలుగు ములక్కాడ ముక్కలైనా దక్కుతాయి." సృజన మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు.

ఇంతలో ఆమె హఠాత్తుగా బయటకు పరుగెత్తింది.

"కొంపతీసి రంగనాధంగారు రాలేదు కదా!" అంటూ కంగారుగా బయటకెళ్ళిన రవికి, తమ ఇంటి తాళం తీస్తున్న సృజన కనిపించింది. పక్కన రంగనాధం లేడు. మరి ఆమె ఎందుకలా పరిగెత్తిందో అతనికి బోధపడలేదు.

"తండ్రీకూతుళ్ళిద్దరూ వింత మనుషుల్లాగ ఉన్నారు!" అనుకుంటూ తన గదిలోకి నడిచాడతను. మూసేసిన పుస్తకం తెరిచి తల్లికి వ్రాస్తున్న ఉత్తరాన్ని పూర్తిచేసాడు. ఈలోపున భుజాన ఫ్లాస్కుతో సృజన ప్రత్యక్షమైంది.

"ఏమిటండో ఇది?" రవి అడిగాడు.

"దీన్ని ఫ్లాస్కు అంటారండీ!" ఫ్లాస్కుని బల్లపై ఉంచుతూ చెప్పిందామె.

"అది తెలుసులెండి. కానీ దానిలో ఏమి తెచ్చారని?"

"రోగం వచ్చినప్పుడు మందులు ముఖ్యంగా ఏంటీబయోటీక్స్ వాడినప్పుడు, వాటి మలినాలు శరీరంలో ఉండిపోతే, రాళ్ళుగా మారతాయట! అలా జరక్కుండా ఉండాలంటే, వాటిని వాడే రోజుల్లో బార్లీ ఎక్కువగా తాగాలని ఎక్కడో చదివాను. అందుకే బార్లీ కాచి తెచ్చాను."

"మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు."

"ఏం? నాన్న, పుణ్యయే తప్ప నేను సాయం చేయగూడదా?" ఆమె గొంతులో మార్దవానికి రవి గుండె ఝల్లుమంది.

"మరేం లేదు. అనుకోకుండా కలిగిన ఈ పరిచయం ఎంతవరకూ వెళ్తుందోనని భయపడుతున్నా!"

"ఎంత దూరం వెళ్ళినా, మిమ్మల్ని ఈ ప్రహారీ దాటనివ్వను లెండి!"

"అంటే, ఇందాక కాళ్ళు పోయినా ఫరవాలేదు, ములక్కాడలు కోసి మరీ చెట్టు మీద నుంచి దూకమన్నారు. ఇప్పుడీ ప్రహారీ దాటనీయనంటున్నారు. చూస్తుంటే నా కాళ్ళకేదో మూడినట్లుంది."

"మీ కాళ్ళు విరక్కొడతానని కాదు నా భావం. నేనే సాయం చేసినా, నాన్న మిమ్మల్ని ఈ ఇంట్లోంచి గెంటేయకుండా చూస్తానని నా తాత్పర్యం" నవ్వుతూ అందామె.

"అంతేనా? ఇంకా నన్నీ ఇంట్లో ఏ గుంజకో తాడేసి కట్టేస్తారనుకుంటున్నాను!"

"తాడు నేను మీకు కడతానో, మీరు నాకు కడతారో కాలమే నిర్ణయిస్తుంది లెండి!" ఆమె మాటలకు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. అంతవరకూ కలుపుగోలుగా మాట్లాడిన ఇద్దరిలో ఏదో కంగారు. సిగ్గుతో మనసు మెలితిరుగుతుంటే, ఆమె అతన్ని సూటిగా చూడలేక తలపైకెత్తి గోడలను చూసింది. గోడ మీద ఒక చిత్రం. .నిజంగానే చిత్రమనిపించింది.

స్కూటరు మీద ఇద్దరు వ్యక్తులు వెడుతున్నారు - అదీ చిత్రం. దాని క్రింద వ్యాఖ్య మరీ విచిత్రంగా ఉంది. "లోకంలో రెండే వర్గాలు. ముందుండి నడిపేవారు, వారిని అనుసరించేవారు. వరల్డ్ ఈజ్ ఆఫ్ టూ కేటగిరీస్. ద లీడర్స్ అండ్ ద ఫాలోయర్స్."

"మీరు బొమ్మలు కూడా వేస్తారా?" సృజన ప్రశ్నకు రవి లేదన్నట్లు తలూపాడు.

"మరి ఆ బొమ్మ? బొమ్మ కన్న వ్యాఖ్య మరీ బాగుంది."

ఆమె మాటలకు కూర్చున్న కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడతను.

"కాలేజీలో ఉత్తంరాజు అని నాకో మిత్రుడు ఉండేవాడు. వాడు బొమ్మలేసి నా చేత వ్యాఖ్యలు వ్రాయించేవాడు. సినీరంగంలో బాపూ రమణల్లా ఇద్దరం జంటగా ఎదగాలని ఆశపడేవాళ్ళం" రవి మాటలకు సృజన అడ్డుపడింది.

"ఈ బొమ్మ మరీ విచిత్రంగా ఉంది. భావకవి.. ప్రేయసి నుదుట కైతల సిరి..భార్య ఆశలకు తాళిబొట్టే ఉరి. ." ఆమె వ్యాఖ్య చదివిన బొమ్మలో ఒక వ్యక్తి కుడిచేతిలోని కలంతో ఒక ఆడపిల్ల నుదుట తిలకం దిద్దుతూ, ఎడమచేతితో మరొక ఆడపిల్ల గొంతుకు తాళినే ఉరిగా చేసి లాగుతుంటాడు.

ఆ బొమ్మను చూసి రవి నవ్వుతూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

"మా కవులపై వాడు సంధించిన విమర్శనాస్త్రం ఆ బొమ్మ. కలం పట్టిన ప్రతివాడు ఒక స్వప్నసుందరిని ఊహించుకుని, 'ప్రేయసీ! ఇసీ! తుసీ! నా అందాలరాశీ! ఎన్నాళ్ళు ఈ కన్నులు కాయలు కాసి, నా కొమ్మను కోయిల కూసి పండించుకొమ్మంటావ్! పాడించుకొమ్మంటావ్!' అని కలవరిస్తాడట! ఇంట్లో ఉన్న భార్యను మాత్రం హింసించి చంపుతాట్ట!"

"ఆ చిత్రకారుడికి నా అభినందనలు చెప్పండి."

"ఆ పని చేయాలంటే నేను పైకి పోవాల్సిందే!" అంటూ రవి చూపుడువేలితో గది పైకప్పుకేసి చూపించాడు.

"అంటే?"

అతను తిరిగి కుర్చీలో నుంచి లేచి కిటికీ వద్దకెళ్ళాడు. "వాడు ఆత్మహత్య చేసుకొన్నాడన్నారు" చెబుతున్న రవి గొంతు బాధతో బొంగురుపోయింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages