పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -18 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -18

Share This

   పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -18

బాలకాండ

                                                                                                       దినవహి సత్యవతి



 

17 వ సర్గ 

బ్రహ్మదేవుని ప్రేరణతో వానరుల సృజన...

269.

     విష్ణువు సత్యసంధుడు, మహావీరుడు, సురహితుడు, 

సురలు కోరగా దశరథపుత్రుడై జనించినాడు,   

విష్ణువుకు సాయము చేయుటకై  బ్రహ్మ తలచినాడు, 

బలాఢ్యులను  సృజింపుమని సురలకు చెప్పినాడు, 

కామరూపులైన వానరుల సృజింప బూనుకొమ్మనె, సత్య! 

270.

     మాయోపాయులు, వాయువేగముకల  సుతులను,  

పరాక్రములు, వివిధోపాయాలుకల సుతులను, 

దివ్యశరీరులు, చంపశక్యముకాని సుతులను, 

శూరులు, ఆయుధసమమైన శక్తికల సుతులను, 

క్షుత్పిపాసాదులు లేని పుత్రుల సృజింపుమనె, బ్రహ్మ, సత్య! 

271.

     దేవతా సమానులౌ పరాక్రములను సృజించమనె,  

అప్సర, గంధర్వ స్త్రీలయందు వారిని సృజించమనె,  

వారందరినీ వానర రూపులుగా సృజించమనె, 

జాంబవంతుని తాను మునుపే సృజించితిననె,   

తన ఆవలింతనుండి అతడు పుట్టెననె, బ్రహ్మ, సత్య! 

272.

      బ్రహ్మ ఆజ్ఞపై, దేవతలు, వానరులను సృజించిరి, 

      వీర్యవంతులౌ ఋషులు, సిద్ధులటులే జేసిరి,  

విద్యాధరులు కూడా వానర పుత్రులను సృజించిరి, 

ఉరగ, చారణులూ వానరవీరులను సృజించిరి,   

విష్ణువుకై, వీరులౌ వానరులట్లు సృజింపబడిరి, సత్య! 


273.

     వానరేంద్రుడు వాలిని, ఇంద్రుడు సృజించెను,   

తేజశ్శాలి సుగ్రీవుని, సూర్యుడు సృజించెను,  

తారుడను వానరుని, బృహస్పతి సృజించెను,   

గంధమాదనుడను వానరుని, కుబేరుడు సృజించెను,  

నలుడనువాడు విశ్వకర్మచే సృజింపబడెను, సత్య! 

274.

     సౌందర్యసంపదయున్నవారు అశ్వినీదేవతలు, 

మైందుడు, ద్వివిదుడు వారు సృజించిన వానరులు, 

సుషేణ, శరభుల సృజించిరి వరుణ, పర్జన్యులు, 

రావణ వధకై  సృజింపబడిరెందరో వానరులు, 

వాయుదేవుని సుతునిగ  హనుమ జన్మించె, సత్య! 

275.

     ఋక్షస్త్రీలకు ధృఢకాయులైన పుత్రులు,    

గోలాంగు, ఋక్ష, కిన్నెర, స్త్రీలకు పుత్రులు,    

దేవతలకు వారి వారి రూపగుణాలతో పుత్రులు,    

దేవతలకునూ పరాక్రమవంతులైన పుత్రులు,  

విష్ణు సహాయకులుగా, వానర రూపులై, జన్మించిరి సత్య!   

276.

     దేవతలు, మహర్షులు అప్సరసలయందు, 

కింపురుష, యక్షులు, గంధర్వస్త్రీలయందు, 

సిద్ధ, విద్యాధరులు, విద్యాధరస్త్రీలయందు, 

తార్ష్య, నాగ, ఉరగలు నాగస్త్రీలయందు, 

విష్ణువుకొరకు వేలాది వానరులను సృజించిరి, సత్య! 

277.

      వానరులు పరాక్రమవంతులు, బలాఢ్యులు,  

వనాలలో స్వేచ్చగా సంచరించు కామరూపులు,  

దర్పబలంచే సింహ శార్దూలసములు వానరులు, 

శిలలు, వృక్షాలు, గోర్లు, కోరలు వారి ఆయుధాలు, 

సకలాస్త్రాల గూర్చి ఎరిగినవారు వానరులు, సత్య!  

278.

     వానరులు మహాపర్వతాలు ఊపివేయగలరు, 

స్థిరములైన మహావృక్షాలు పెకిలించగలరు, 

వేగముచే కడలిని కూడా కలచివేయగలరు, 

ఆకాశంలో ప్రవేశించి మేఘాలు పట్టుకోగలరు, 

పాదాలచే భూమిని చీల్చగల్గువారు వానరులు, సత్య!  

279.

      అరణ్యాలందు మత్తగజాలను పట్టుకొనగలరు,

తమ అరుపులతో పక్షులను నేలకూల్చగలరు, 

కామరూపులు, సేనానాయకులు జనించినారు,  

సేనానాయకులు ఇంకనూ వానరుల సృజించినారు,  

వారు ఋక్ష పర్వతంపైన, కానలందూ వసించిరి, సత్య! 

280.

     వానరులు బలముకలవారు, సమర్థులు, 

ఇంద్ర సూర్య కుమారులౌ నల నీలులు, 

హనుమ, వాలి, సుగ్రీవ వానరశ్రేష్ఠులు, 

తదితర సేనానాయకులైన వానరులు,  

ఇతర వానరులచేత సేవింపబడుచుండిరి, సత్య!  

281.

      వానరులు స్వేచ్ఛగా సంచరించుచుండిరి, 

దర్పముచే వన్యమృగాలను పీడించుచుండిరి,

వాటికి భయము కలుగునట్లు వర్తించుచుండిరి, 

స్వయంగా జాంబవంతునిచే రక్షింపబడుచుండిరి,

వాలి, అధికార పరాక్రమవంతుడు, బాహుబలి సత్య! 

282.

     వానరులు మేఘాలగుంపుతో సమమైన వారు, 

బలవంతులు, పర్వతశిఖర సమమైన వారు, 

వానరులు భయంకరదేహములు కలవారు, 

రామునికి సహాయపడుటకై  జనించినవారు, 

అట్టి వానరులచే భూమి ఆవరింపబడియుండె, సత్య! 


 *****


No comments:

Post a Comment

Pages