గాయత్రీ టీచర్
ప్రతాప వేంకట సుబ్బారాయుడు
ఇంకొక్క కిలోమీటరు వెళితే నేను పదేళ్ళ క్రితం ఉన్న ప్రాంతం రామకిష్టాపురంలోకి వెళతాను. చెప్పడానికి అందరం హైదరాబాదు అని చెప్పుకున్నా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, ఒక ఊరికి ఇంకో ఊరికి ఉన్నంత దూరం ఉంటుంది. ఇక ట్రాఫిక్ సంగతి సరేసరి. హైదరాబాదులో నా చిన్నప్పుడు చదువుకునేటప్పటి నుండి పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టేదాకా ఐదిళ్లు మారాం. ఎప్పుడన్నా గతంలో నేనున్న ప్రాంతం చుట్టు పక్కల పని పడితే కచ్చితంగా వెళ్ళి ఆయా ఇళ్లను చూడ్డం నాకిష్టం. నాకు తెలిసినవాళ్ళు అప్పటికీ అక్కడుంటే ఆప్యాయంగా పలకరిస్తాను. ఎందుకంటే ఆ ఇల్లు, అక్కడి వాళ్లతో నా అనుభవాలు, అనుభూతులు పెనవేసుకుని ఉంటాయి గనక. కొన్ని ప్రాంతాలు, ఇల్లు మారిపోయి కొత్త సొబగులు దిద్దుకున్నా, మరికొన్ని అలాగే ఉన్నా... అక్కడి నా జ్ఞాపకాలు మాత్రం ఆపాతమధురాలే.
నా చిన్నప్పుడు మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్ లో పనిజేసేవారు. ఆ తర్వాత అందులోంచి బయటకొచ్చి బాలానగర్ లోని ఒక ప్రభుత్వ సంస్థలో సెక్యూరిటీ డిపార్ట్ మెంట్లో చేరారు. అందువల్ల నా చదువు, ఎదుగుదల ఇక్కడే జరిగింది. ఒకసారెప్పుడో మాటల సందర్భంలో, మా అమ్మానాన్న పెళ్లయిన కొత్తలో హకీంపేట క్వార్టర్లలో ఉండేవారన్న విషయం తెలుసుకుని వాళ్లకి నేనప్పటికి పుట్టకపోయినా, సికింద్రాబాదుకు శివారు ప్రాంతమే కాబట్టి ‘ఆ క్వార్టర్లు ఎలా ఉంటాయో చూడాలనుంది, వెళ్ళి చూసొద్దామ’ని పట్టుపట్టాను. అందరం వెళ్ళాం. అవే క్వార్టర్లు పెద్ద మార్పేమీ లేదట అమ్మానాన్న చెప్పారు. అప్పట్లో తామున్న ఆ ఇంటికి వెళ్ళి మా అమ్మ ఆనాటి ఇతర రాష్ట్రాల ఇరుగుపొరుగును, అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకుంటే, మా నాన్న తన స్నేహితులని, అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. పైగా గతంలోకి వెళ్ళే అవకాశం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకునే అవకాశం కల్పించానని చిన్నవాడినైనా నన్ను మెచ్చుకున్నారు.
ఆలోచనల్లో ఉన్న నేను సరిగ్గా అప్పుడే ఒక మలుపు దగ్గర గాయత్రీ మేడమ్ ను చూడ్డంతో ఈ లోకంలోకి వచ్చాను. అప్పట్లో వాళ్ళు ఇక్కడికి దగ్గర్లో ఉన్న మా ఎదురింట్లో ఉండేవారు. చాలా మంచివాళ్ళు. ఎన్నాళ్ళ నుండో ఒక దగ్గరే ఉన్నా మాకూ వాళ్లకీ మాటామాటా వచ్చింది లేదు. అప్పటికే మా నాన్న, అమ్మా చనిపోవడంతో, మాకు పెద్దదిక్కుగా సహాయం చేయడానికి ముందుండే వాళ్ళు. వాళ్ళున్నారన్న ధైర్యంతో మా ఆవిణ్ణి, పిల్లల్ని వదిలి ఎంతకాలమైనా ఆఫీసు టూర్లలో గడిపేవాణ్ని. వాళ్ళాయన డిఫెన్స్ లో డ్రైవర్ గా పనిచేసేవాడట, పద్దాక ట్రాన్స్ ఫర్లు ఉండడం వల్ల ఏ ఊళ్లోనూ సెటిలవలేకపోతున్నామనుకుని బయటకొచ్చి, ఇక్కడ మా నాన్న పనిజేసే సంస్థలోనే డ్రైవరుగా చేరాడు. ఆవిడ ప్రైవేటు స్కూళ్లో టీచరుగా పనిచేసేది. ఇంగ్లీషులో అనర్ఘళంగా మాట్లాడేది. వాళ్లిద్దరిదీ లవ్ మ్యారేజ్ ట. వాళ్లకిద్దరు పిల్లలు. కొడుక్కి చదువబ్బలేదు. బహుశా పండితురాలి పుత్రుడవడం వల్లనేమో. కూతురు మాత్రం చక్కగా చదువుకునేది. మేమక్కడ ఉండగానే వాళ్లబ్బాయి గాలికి తిరుగుతూ గుట్కాలు వేసుకుంటూ, చిన్న చిన్న దందాలు, బెట్టింగులూ చేసేవాడు. అప్పుడప్పుడు వాళ్ల నాన్న వాడిని తిట్టే అరుపులు ఆ ఇంట్లోంచి వినిపిస్తుండేవి. కొంతకాలం తర్వాత మేము ఆ ఇల్లు ఖాలీ చేసి దూరంగా వెళ్లిపోయాం. ఇన్నాళ్లూ ఇక్కడికి రావడం కుదరలేదు. ఇప్పుడే రావడం. మళ్ళీ జ్ఞాపకాల తరంగాలకి అడ్డుకట్టేసి గాయత్రీ మేడం పక్కగా కారాపి దిగి-
"మేడం...." అని నన్ను నేను ఆవిడకి పరిచయం చేసుకున్నాను.
ఆవిడ ఆశ్చర్యానందాలతో ‘తమ ఇల్లు అక్కడే’ అని నన్ను తీసుకెళ్ళింది. అది డిఫెన్స్ కాలనీ, చాలా ప్రశాంతంగా ఉంది. పూలు పళ్ళ చెట్లతో విశాలంగా ఉన్న ఒక పెద్ద బంగ్లాలో అవుట్ హౌస్ లాంటి దాంట్లో వీళ్ళుంటున్నారు. ‘మరి ఆ కాలనీలో మా ఇంటి ఎదురుగా ఉండే వీళ్ల సొంత ఇల్లు ఏమయింది?’ మనసులో అనుకుంటూ ఆవిడ చూపించిన కుర్చీలో కూర్చున్నాను. ఆవిడ లోపలికెళ్ళి వాళ్లాయన్ని తీసుకు రావడంతో పాటు ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆయనా, ఆవిడ నా ముందు పేము కుర్చీల్లో కూర్చున్నారు.
"మాకు సంబంధించి నీ మనసులో రకరకాల ఆలోచనలు కలుగుతున్నాయని నాకు తెలుసు. మావాడి సంగతి నీకు తెలుసు కదా! చిన్నప్పుడే దారి తప్పాడు. ఎంత ప్రయత్నించినా వాణ్ని సరిచేయలేమని అప్పుడే అర్థమైంది. మా భవిష్యత్తును తల్చుకుంటే భయం వేసేది. అరకొర జీతంతో ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, రేపు రిటైరయ్యాక పెన్షన్ తక్కువొస్తుంది, నాకసలు పెన్షనే రాదు. అందుకని ఎవరికీ తెలియకుండా మాకంటూ డబ్బు కూడ బెట్టుకున్నాం. ఇద్దరం రిటైరయ్యాక వాడు మరీ పేట్రేగిపోయాడు. బాధ్యతలు తెలుస్తాయని పెళ్లి చేశాం. వాడిలో ఏ మార్పూ లేదు. వ్యాపారం చేయడానికి డబ్బుకావాలి, ఇల్లమ్మమని ఒకటే గొడవ. మా అబ్బాయి, కోడలు పేరుమీద ఆ ఇల్లు రాసిచ్చేశాం. ఆమె అందులోనే ఒక షాపు పెట్టుకుని నడుపుతోంది. ఇది వాయుపురి. ఇక్కడందరు డిఫెన్స్ లో పనిచేసి రిటైరైనవారే. ఈ ఇంటి యజమాని డిఫెన్స్ లో చేసేటప్పుడు మా ఆయనకి తెలిసున్నవాడట. చాలా మంచివాడు. మా విషయాలన్నీ తెలిసిన మీదట మామీద దయతలచి ఉచితంగా ఉండడానికి నీడనిచ్చాడు. అలా ఉండడం ఇష్టం లేక మేమే నెలకి ఎంతో కొంత ఇస్తూంటాం. మేమిలా ఈ అస్తమించే జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఇదిగో ఈ అవుట్ హౌస్ లో ఉంటున్నాం. వాడిక్కడికి రాలేడు...మమ్మల్ని ఇబ్బంది పెట్టలేడు కారణం, ఇక్కడ వీళ్లు ప్రశాంతంగా ఉంటారు. ఏ మాత్రం అల్లరి చేసినా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు.
మా అమ్మాయికి లా ప్రాక్టీసుచేసే అబ్బాయి సంబంధం వచ్చింది. పెళ్లయ్యాక తను కూడా లా చేసింది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ నా మనసును దొలిచే ప్రశ్న ఏమిటంటే, టీచరుగా ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన నేను నా కొడుకుని సంస్కరించుకోలేకపోయాను. అందుకే బహుశా మన పెద్దలు ’పిల్లల్ని కంటాంగాని వారి రాతల్ని కాదుగా..’ అని అంటారేమో. అయిందేదో అయింది. ఇప్పుడు...ఈ వయసులో మా జీవితాలు ప్రశాంతంగా ముగించాలి...అందుకే ముందు చూపుతో ఆ ఇంటికీ, వాడికీ ఇలా దూరంగా వచ్చేశాం. ఇప్పుడు ఏ బరువు బాధ్యతలూ లేవు. స్వేఛ్ఛగా ఉన్నాం. ఒక రకంగా ఇది మా ఇద్దరికీ వానప్రస్థం." అందావిడ భారంగా నిట్టూర్చి.
నేను వారి నుంచి వీడ్కోలు తీసుకుని కారెక్కాను. గాయత్రీ మేడం ముందుచూపును మనసులో ప్రశంసించలేకుండా ఉండలేకపోయాను.
నాకు తెలిసిన చాలా మంది పెద్దలు అవసరానికి మించి పెన్షన్ డబ్బు వస్తున్నా పిల్లలకు(?) చాకిరి చేస్తూ, జీవచ్ఛవాలై మానసికంగా నలిగిపోతున్నారు. ఇక పెన్షన్, ఇతరత్రా డబ్బులొచ్చే మార్గం లేని వాళ్ల సంగతి సరేసరి, ఒకప్పుడు దర్జాగా బతికిన వాళ్లు, జవసత్వాలుడిగి దయనీయ పరిస్థితుల్లో దుర్భరజీవితం గడుపుతుంటారు. ఎంతైనా గాయత్రీ మేడం టీచర్ కదా, కొడుకు జీవితాన్ని మార్చలేకపోయినా, తమ జీవితాల్ని చక్కబెట్టుకుంది. ఆ వృద్ధ దంపతులు ఎన్నాళ్లుంటారో తెలియదు కాని ఉన్నంతకాలం ఆనందంగా ఉంటారు.
నాకెందుకో మొట్టమొదటిసారి కాలనీకెళ్ళి మేమప్పట్లో ఉన్న ఇంటిని చూడాలనిపించలేదు. అక్కడ గాయత్రీ మేడం వాళ్లు లేని బోసిపోయిన వాళ్ల ఇంటిని చూడవలసి వస్తుందన్న బాధ కారును యూటర్న్ తీసుకునేలా చేసింది!




No comments:
Post a Comment