పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -17 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -17

Share This

   పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -17

బాలకాండ

                                                                                                       దినవహి సత్యవతి 



16 వ సర్గ

      ప్రాజాపత్య పురుషుడు, దశరథునకు, పాయసము ఇచ్చుట...

258.

     రావణుని దుశ్చర్యలు విష్ణువుకు తెలియవచ్చెను,  

దేవతల కోర్కెపై వానిని  సంహరింపదలచెను, 

అందుకై నరుడి రూపు ధరింప సంసిద్ధుడయ్యెను, 

రావణు జంపు ఉపాయమేమని సురలనడిగెను, 

వారెట్లు చెప్పిన అటులే చేసెదననె విష్ణువు, సత్య! 

259.

     రావణుడు, బ్రహ్మకొరకు తీవ్రతపస్సు చేసెను, 

బ్రహ్మ మెచ్చి రావణుని వరం కోరుకొమ్మనెను, 

తనకెవ్వరిచే చావుండరాదని యతడు కోరెను,   

వారిలో నరుల పేరు జేర్చక నిర్ల్యక్షం చూపెను,  

రావణునికి నరులనిన అనాదరముండెను, సత్య! 

260.

     వరాలుపొంది రావణుడు అకృత్యాలకు పాల్పడెను,  

వానిని జంప, విష్ణువు నరుడై జనింపదలచెను, 

అపుడే దశరథుడు పుత్రకామేష్టి చేయుచుండెను, 

విష్ణువు దశరథసుతుడిగా జనింపదలచెను, 

బ్రహ్మాదిదేవతలు, మహర్షుల వీడ్కొని వెడలె, సత్య! 

261.

     దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయుచుండెను, 

అంత యజ్ఞకుండంనుండి భూతమావిర్భవించెను, 

భూతమసాధారణ పరాక్రమాలు కలిగియుండెను,

నలుపు, ఎరుపు రంగు వస్త్రాలు ధరించియుండెను, 

భూతముయొక్క ముఖము ఎర్రని కాంతితోయుండెను, సత్య! 

262.

     భూతము పలుకు దుంధుభి ధ్వనివలెయుండెను, 

రోమములు, మీసాలు సింహపుజూలువలెయుండెను, 

భూతం పర్వత శిఖరోన్నత్యము కలిగియుండెను,

దాని నడక పెద్దపులిని బోలి దర్పంగాయుండెను, 

భూతము సూర్యునివలె ప్రజ్వలించుచుండెను, సత్య! 

263.

     భూతం చేతిలో మేలిమి బంగారు పాత్రయుండెను, 

ఆ పాత్ర దివ్యపాయసముతో నిండియుండెను, 

బంగారు పాత్రపై వెండిమూత కూడా యుండెను, 

బంగారు పాత్ర చూడనత్యద్భుతంగా యుండెను,

భూతమాపాత్రను అత్యాదరంతోగొనివచ్చెను, సత్య!

264.

     ప్రజాపతి పంపగా వచ్చితినని భూతమనెను,  

అపుడు దశరథుడు భూతరాజుకు ప్రణమిల్లెను,  

భూతమచటికి వచ్చిన కారణం తెలియగోరెను,

ప్రాజాపత్యపురుషుడు, పాత్ర, దశరథునకిచ్చెను, 

అది దశరథుని దేవతార్చన ఫలమని తెలిపె, సత్య! 

265.

     పాత్రలో పాయసము దేవతలు నిర్మించినదనె,

పాయసం సంతానమును, ధనమును ఇవ్వగలదనె,

ఆరోగ్యమిచ్చు పాయసం దశరథుని తీసుకొమ్మనె,

బాధ్యతతో, పాయసమును తగినవారికిమ్మనె,

అపుడతని భార్యలకు పుత్రులు కలుగుదురనె, సత్య! 

266.

     స్వర్ణపాత్రలో అన్నంతో వండిన పాయసముండెను,

దశరథుడు నమృడై పాయసపాత్ర అందుకొనెను,

ధనం దొరికిన పేదవలెనతడు ముదమొందెను, 

సంతసముతో ప్రాజాపత్యపురుషునకు కైమోడ్చెను, 

పాత్రనందించి భూతము అంతర్థానమయ్యె, సత్య! 

267.

     దశరథుడు, పాయసపాత్రతో, అంతఃపురమేగెను,

పాయసములో సగభాగము కౌసల్యకిచ్చెను,

మిగిలిన దానిలో సగము సుమిత్రకొసగెను,  

ఆపై మిగిలిన దానిలో సగము కైకకొసగెను, 

పాత్రలో ఇంకనూ మిగిలినది సుమిత్రకిచ్చెను, సత్య!  

268.

      దశరథపత్నులు పాయసం గైకొని సంతుష్టులైరి, 

 అది తమకొక  గొప్ప బహుమానంగా భావించిరి,

 పాయసముగొని అగ్న్యాదిత్యుల తేజస్సుతో ఒప్పిరి, 

 కొంతకాలానికి రాణులు మువ్వురూ గర్భవతులైరి, 

 శుభవార్తను విని దశరథుడు సంతసించెను, సత్య! 


***

No comments:

Post a Comment

Pages