'వేలి కొసల ప్రపంచం!'
సుజాత.పి.వి.ఎల్, యాప్రాల్, సికిందరాబాద్.
సామిప్య స్నేహితుల సరదా కూడికను విస్మరించి
అరచేతిలో కొలువైన మాయతెరకు లోబడి
కాంతులీనుతున్నాడు..
జీవితాన్ని మిథ్యాలోకానికి బందీ చేసి
మానవతా బంధాలను తెగతెంపులు చేసుకుని
అతను ఏకాకి అవుతున్న వింతకాలమిది..
నలుగురి నడుమ
సంభాషణామృతము గ్రోలక
ఒంటరితనపు తన్మయలీలాభావ వైచిత్రిలో
ఓలలాడడమేమిటో?
సమాజంలో మనుషుల మధ్య అగోచర గోడలు
మృగ్యమైన మమతానురాగాలు
సంఘజీవిగా తల్లడిల్లాల్సింది పోయి
వేలి కొసలతో ప్రపంచాన్ని
వీక్షించాలన్న తపనకు దాసోహమవడమేంటో
తప్పుచేయకపోయినా తనకుతానుగా 'చెర'వాణిలో
శిక్షను ఆనందానుభవం చేసుకున్న మనిషికి విముక్తెప్పుడో.
****




No comments:
Post a Comment