స్వీకారము
– డా.
లక్ష్మీ రాఘవ
మొబైల్ ఎత్తగానే వినిపించిన గొంతు
విని “హలో అమృతా.. ఎప్పుడొచ్చావే??” సంతోషంగా అడిగిoది వర్ధని. 
“వచ్చి ఒకరోజు అవుతుంది. పిన్నికి
బాగలేదంటే చూసిపోవడానికి వచ్చాను. నీవు ఇక్కడనే ఉన్నావని తెలిసి  ఫోను చేశాను..”
“భలే వచ్చావే.. నాకు నీతో
మాట్లాడేది చాలా ఉంది. ఎందుకో తెలుసా నేను అమెరికా వెడుతున్నాను. మా అబ్బాయికి
రెండో బాబు పుట్టబోతున్నాడు. కోడలి తల్లికి ఈ సారి వీలుకాదంట. నన్ను రమ్మన్నారు..”
“అలాగా.. మీ అబ్బాయి శేషుకి ఇదివరకే
ఒక అమ్మాయి ఉండాలి కదా. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇంకో బాబు కావాలనుకున్నారన్న
మాట..”
“అవునే వారసుడు అని మేమూ సంబరంగానే
ఉన్నాము. పదకొండేళ్లక్రితం అమ్మాయి పుట్టినప్పుడు వెళ్ళాను.. మళ్ళీ వెళ్ళలేదు.
ఇప్పుడు తప్పని సరి వెళ్ళాలి. నీవేమో అమెరికాలో నీ కూతురి దగ్గరికి వెడుతూనే ఉంటావట
కదా. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ అలవాట్లకు సర్దుకోవడం కష్టమైంది. అందుకే
ఎన్నిసార్లు రమ్మన్నా వెళ్ళలేదు. ఇన్నేళ్లలో ఇంకా చాలా మార్పులు వచ్చేసి వుంటాయి  కదా..నిన్నే అడుగుదామని అనుకున్నా. సరిగ్గా ఫోను
చేశావు ఒక్కసారి నాదగ్గరకు వచ్చి ఒక్క పూట ఉండిపోవే.. కలిసి ఉన్నట్టూ ఉంటుంది...
విషయాలు మాట్లాడుకోనూ వచ్చు”
“సరే అయితే ఇవ్వాళ సాయంకాలం వస్తా.
రాత్రికి నీదగ్గరే ఉండిపోతా... సరేనా”
“తప్పకుండా రా. మా ఆయన కూడా వాళ్ళ
అక్కదగ్గరకు వెళ్లారు. మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు.”
   
అన్నట్టుగానే సాయంకాలం అమృత అయిదు గంటలకల్లా వర్ధని వాళ్ళ ఇంటికి
వచ్చింది.. చిన్నప్పటి కబుర్లు ఒక గంటసేపు మాట్లాడుకున్న తరువాత వంట ప్రయత్నం చేసి
మళ్ళీ తీరిగ్గా కూర్చున్నారు.. 
“అమృతా, పోయినసారి నేను అమెరికా
వెళ్ళినప్పుడు చాలా విషయాలు నచ్చలేదు”
“అంటే ...”
“అదే మనకున్న అలవాట్లకి భిన్నంగా...
తాగే నీరు సింకులో ఉండే కొళాయి లో పట్టుకోవడం మొదటిది అనుకో.. నేనైతే వాటిని మళ్ళీ
వేడి చేసి పెట్టుకునేదాన్ని. పొద్దున పద్దతిగా స్నానం, పూజ తరువాతే టిఫిన్లు..
ఇవన్నీ వాళ్లకు చాదస్తంగా అనిపించినా సరే మానలేదు నేను.. ముఖ్యంగా రోజూ బట్టలు
ఉతుక్కోవడం ఉండదు. పోనీ మూడురోజులకొక్కసారి అంటే  పరవాలేదు కానీ వారానికో, పది రోజులకో మోపెడు
బట్టలు వాషింగ్ మిషన్ లో వేయటం, వాటిని మడత పెట్టుకోవడానికి రెండు గంటలు..ఈ పద్దతులు
నాకు కష్టమని పించినవి. ఎవరికీ తెలియకుండా చీర పిండుకుని ఇంటి పక్కగా ఉన్నడెక్  మీద ఆరేస్తే ఒకరోజు శేషు చూసి తిట్టాడు. బట్టలు
బయట ఆరేసుకుంటే బాగుండదట.. కెనడాలో అయితే ఫిర్యాదు కూడా ఇస్తారట...” అన్నది వర్ధని
 
“ఇంకా..” అమృత కుతూహలంగానే అడిగిoది. 
“ఒక రోజు కోడలు ఫ్రిజ్ లో ఒక వంకాయి
ఉంది ఎందుకు? అని ప్రశ్నిస్తే ‘మొన్న సాంబారు చేశాక ఒకటి మిగిల్చాను.. పచ్చడి
చేసుకోవచ్చు‘ అని అన్నానో లేదో.. ‘పచ్చడికి కావాల్సివస్తే ఇంకా కొని తెచ్చుకుని
చేసుకోవచ్చు .. ఇలా ఒకటీ అరా మిగల్చకండి..’ అని కోడలు అంది. మనమేమో ఉన్నదాన్లో  కొంచెం మిగుల్చుకుని బతికిన వాళ్ళం కదా అదే
చెప్పబోయాను. మా అబ్బాయి అడ్డుకుని ‘ఇప్పుడు ఏదీ మిగుల్చుకునే అవసరం లేదమ్మా...
ఎన్నయినా కొనుక్కోగలం’అన్నాడు పెళ్ళానికి మద్దతుగా. నాకు చాలా బాధేసింది. మేము అలా
బతకబట్టే కదా వాడు చదువుకుని ఇంతదాకా వచ్చాడు...’ అని చెప్పాలనిపించింది. అనవసర
వాదన ఎందుకని వూరుకున్నాను.. “ బాధగా అంటూన్న వర్ధనితో 
“ఇది మన మధ్యతరగతి తల్లిదండ్రులకి
ఎదురయ్యేదే... “
“అదే నిన్ను అని అడగాలనుకున్నా. ఈ
వయసులో వారి ముందు చిన్న బోవడం నాకిష్టం లేదు. ఇప్పుడు  వయసు 60 ఏళ్లు అవటం లో అంత ఓపిక కూడా లేదు నాకు.
మొదటిసారి వెళ్ళి వచ్చాక మనం ఇక్కడ ఉంటేనే మేలు. అన్నీ మనపద్దతిలో, మనo అనుకున్నట్టు
జరుగుతాయి. పనికీ, వంటకీ మనుషులు వచ్చినా మనకిష్టం వచ్చినట్టు ఉండవచ్చు అనిపించింది.
అన్నట్టు మొన్న మన భాగ్య వచ్చింది నన్ను చూడటానికి. దాని  పిల్లలు అమెరికాలోనే వుంటారట. అది నన్ను ఇంకా
భయపెట్టింది తెలుసా..”
“అలాగా, భాగ్య ను ఈ మధ్య నేను కలవనే
లేదు. అదేమి చెప్పింది?”  
 “చాలా హెచ్చరికలు చేసింది. ‘అక్కడకు  వెడితే బిడ్డపని కూడా వారికి ఎలా సమ్మతమో అలా
చేయి.  ఏదైనా  వాళ్ళ పద్దతులు తప్పు పట్టకు. అనవసరంగా ఏది
చెప్పినా అది తప్పవుతుంది..కాళ్ల మీద బిడ్డనేసుకుని స్నానం లాటివి వారికి  నచ్చక పోవచ్చు... అలాగే పిల్లలకు ఏమైనా జ్వరం
లేదా నొప్పి వచ్చినా ఎలా ఉందని  పదే పదే  అడగటం ఇక్కడ మనకున్న అక్కర తెలుస్తుంది. అక్కడ
అలా కాదు .. ఒక విధంగా ఎవరి జీవితం వారిది.. ఉద్యోగాలలో ఎదగడం ముఖ్యం వారికి.  కావాల్సినవి తక్కువ కాకుండా అమర్చుకోవడం
వుంటుందే తప్ప  మన విషయాలలో పట్టించుకోవడం
ఉండదు” ఇలా చెప్పేసరికీ చాలా బాధేసింది. ఒక కుటుంబం వాళ్ళం మంచీ చెడూ మాట్లాడ్డానికి
కూడా స్వాతంత్ర్యం లేదనుకుంటే ఎలా ఉంటాము? ఇంతగా మారిపోయారా? అందుకే నీతో
మాట్లాడాలని అనుకున్నాను” 
 “ఒకరు చెప్పింది విని అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు
వర్ధినీ..ఒకసారి వెళ్ళివచ్చిన దానివి..ఇప్పుడెలా ఉంది అని అందరినీ అడిగేదెoదుకు? ముందుగా
అన్నీ అతిగా ఆలోచించడం మానుకోవాలి. కొడుకు కోసం  వెళ్ళాలి.. వుండాలి .. తప్పదు అన్నప్పుడు వెళ్ళి
మనకు తోచిన రీతిలో ఉండటమే. జీవితం లో ఎన్నో మార్పులు చూసినవాళ్ళం. మంచి ఉద్దేశ్యం
తోనే ఉందాం.... ఎప్పుడో ఏదో అయిపోతుందని, మనకు గౌరవం ఇవ్వరని ఆలోచనలు మాని  ప్రస్తుతం లో మనం ఏమి చేయాలి అని మాత్రమే
ఆలోచించు... మన పెంచిన పిల్లలు వర్ధినీ, ఎవరో ఏదో చెప్పారని బుర్ర పాడు చేసుకోవడం
ఎందుకు ? మన వయసు పెరిగినట్టే భావనలూ మారాయి. దేనికైనా  మంచే జరుగుతుంది అన్నసానుకూల దృక్పథం తో వెడితే బహుశా
ఈ సారి నీకు మంచి ఎక్కువగా కనిపించవచ్చు.. లేదా నీవే అక్కడ దానికి అలవాటు పడచ్చు అంటే
స్వీకరిస్తావు అనే   కదా “ అని అమృత వర్ధిని వైపు చూసింది...
 అమృత చెప్పింది అంతా విన్నాక హాయిగా అనిపించి 
”అవును వెళ్ళి చూస్తే నాకూ మార్పు
కావచ్చు”అంది వర్ధని స్థిరమైన కంఠం తో 
ఆ క్షణం ఏదైనా అనుకూలంగా ఆలోచించడం నేర్చుకోవాలన్న
పాఠo స్కూల్ రోజులను గుర్తుకుతెచ్చింది! 
******8*****
 
 
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment