పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -9 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -9

Share This

                                      పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -9

బాలకాండ

దినవహి సత్యవతి



126.
     అయోధ్యలో అనుపయుక్తమైన స్థలమే లేకుండెను, 
మిట్టపల్లం లేని విశాల భూమిపై నిర్మింపబడెను, 
నగరిలో వరిబియ్యం సమృద్ధిగా లభించుచుండెను, 
జలము, చెఱకురసమువలె మధురంగా యుండెను, 
గృహాలు, బారులుతీర్చి, చక్కగా నిర్మించబడెను, సత్య!  
127.
      వీణాది మధురవాయిద్యాలు సదా మ్రోగుచుండెను,   
నగరాన మంగళధ్వనులు మిన్నుముట్టుచుండెను,   
భువిలో అదే ఉత్తమ పట్టణమనిపించుచుండెను,   
అయోధ్య, ఉత్తమమనుష్యుల నివాసమై యుండెను, 
సిద్ధతపోశక్తిచే నిర్మిత స్వర్గవిమానంలాయుండె, సత్య!
128.
     నగరిలో వేలాది మహారథులైన వీరులుండిరి, 
బాణ ప్రయోగంలో హస్తలాఘవం కలిగియుండిరి, 
అయినా ఒంటరులను బాణముతో కొట్టకుండిరి, 
పారిపోవు వానిని కూడా బాణంతో కొట్టకుండిరి, 
నిస్సహాయులను కూడా బాణంతో కొట్టకుండిరి, సత్య!
129.  
      శబ్దము బట్టి బాణంతో కొట్టే వీలున్నా కొట్టకుండిరి, 
 క్రూరమృగాలనే తీక్ష్ణశస్త్రాలతో చంపుచుండిరి, 
 బాహుబలము చేతనూ మృగాలను చంపుచుండిరి, 
      అట్టి నిబద్ధులౌ మహావీరులు అయోధ్యలోయుండిరి, 
                 అట్టి అయోధ్యయే నివాసంగా దశరథుడు పాలించె, సత్య !  
130.
      అయోధ్యలోని ద్విజులంతా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు,  
 వారు మహా బుద్ధిశాలులు, అనంత దానశీలులు, 
 ఆహితాగ్నులు, సద్గుణవంతులు, సత్యనిరతులు, 
 అయోధ్యలోని ద్విజులంతా  వేదవేదాంగ నిష్ణాతులు,  
 అందు కొందరు మహర్షులు, కొందరు సాక్షాత్తూ ఋషులే, సత్య! 
****** 
6 వ సర్గ  
      దశరథుడి రాజ్యము, పరిపాలన... 
131.
దశరథుడు అయోధ్యాపురిలో నివసించెను,
మనువువలెనే రాజ్యమును  పరిపాలించెను, 
వేదవేత్త దశరథుడు శూరులను గౌరవించెను, 
పండితులను దానాదులచే వశము చేసికొనెను, 
జరుగబోవు విషయాలు గ్రహింపగల రాజతడు సత్య! 
132.
దశరథమహారాజు గొప్ప పరాక్రమవంతుడు,
పౌరులకు, జానపదులకు బహు ఇష్టమైనవాడు, 
          ఇక్ష్వాకు వంశరాజులలోనే యతడు అతిరథుడు,
          ఎన్నో యజ్ఞయాగములను నిర్వహించినవాడు,  
          ధర్మమునందు ఆసక్తియున్న రాజు దశరథుడు, సత్య! 
133.
దశరథుడు రాజుగానుండియూ ఋషియైన వాడు,
ముల్లోకాలలో ప్రసిద్ధుడు, గొప్పసైన్యం కలవాడు,
వైరులనణచినవాడు, మిత్రసంపద కలవాడు, 
సర్వ జనులనూ వశములో యుంచుకొనినవాడు, 
ఇంద్రియములను జయించినవాడు దశరథుడు, సత్య! 
134.
ధన, ధనేతరములలో ఇంద్ర, కుబేర, సమానుడు, 
సత్యమునందు పట్టుదల కలిగియున్నవాడు, 
త్రి పురుషార్థాలకు సమ ప్రాధాన్యతిచ్చినవాడు, 
పురుషార్థములన్నీ నిష్ఠతో అనుసరించినవాడు, 
ఇంద్రుడమరావతినేలినట్లు, ఇతడయోధ్యనేలె, సత్య! 
135.
అయోధ్యపుర నివాసితులు సంతోషవంతులు, 
చక్కగా శాస్త్రాభ్యాసం చేసినవారు, ధర్మాత్ములు,
తమకు ఉన్నదానితో తృప్తి చెందినట్టి పౌరులు, 
ఆశలేని వారలు, సదా సత్యమే పలికేవారలు,
దశరథ రాజ్య నివాసితులు గొప్పవారలు, సత్య! 
136.
కాముకుడు, లోభి, క్రూరుడు, నాస్తికుడైనవాడు,   
ధర్మార్థకామ పురుషార్థాలు సాధించనట్టివాడూ, 
విద్యావిహీనుడూ, అశ్వ, గో సంపద లేనివాడూ,
ధనధాన్యములు లేనట్టి వాడౌ కుటుంబీకుడూ, 
అయోధ్యా నగరిలో ఒక్కడు కూడా కానరాకుండె, సత్య! 
137.
అయోధ్యలో స్త్రీలు, పురుషులూ ధర్మశీలురు, 
మంచి ఇంద్రియనిగ్రహం కలిగియున్నవారు, 
సుస్వభావము, నడవడికతో ఒప్పెడివారు,  
మహర్షులవలె వారు పరిశుద్ధమైనవారు, 
అయోధ్యలో రాజభక్తి లేనివారె కానరారు, సత్య! 
138.
కర్ణ, శిరో భూషణములు లేని పౌరులూ,  
పుష్పమాలలు ధరించనట్టి పౌరులూ,  
అభ్యంగన స్నానమాచరించని పౌరులూ,  
భోగాలలో కొరత కలిగియున్నట్టి వారలూ, 
అయోధ్య నగరములో మచ్చుకైనా కానరారు,  సత్య! 
139.
అయోధ్యలో, సుగంధ ద్రవ్యాలు సేవించనివారు, 
శరీరమునకు అంగరాగము పూయనివారు,
కడుపునిండని వారూ, దానము చేయనివారు, 
బాహుపురులు, ముంజేతికి అలంకారం లేనివారు, 
కంఠాభరణాలు ధరింపనట్టి వారే కానరారు, సత్య! 
140.
ఆహితాగ్ని కానివాడూ, యాగం చేయని వాడూ,
నీచుడూ, దొంగ, వర్ణ సంకరం చేసినవాడూ, 
నాస్తికుడూ, అసమర్థుడూ, అసూయాపరుడు,
అసత్యవాది,  శాస్త్రాభ్యాసము చేయనట్టివాడు,  
విషయజ్ఞాని కానివాడు, అయోధ్యలో లేకుండె, సత్య!  



No comments:

Post a Comment

Pages