ఒకటైపోదామా ఊహల వాహినిలో -23 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా ఊహల వాహినిలో -23

Share This

 ఒకటైపోదామా ఊహల వాహినిలో -23

                                                                                                            కొత్తపల్లి ఉదయబాబు 




" అన్న మాట ఏమిటి... ఉన్నమాటే. నేను కన్నది ఇద్దరు కొడుకుల్ని. చదువు బాగా చదువుకుని వ్యాపారం చూసుకుంటారని నేను అనుకుంటే, పై చదువుల పేరుతో అమెరికా వెళ్లి అక్కడ వాడికి నచ్చిన దాన్ని చేసుకుని 'నీ ఆస్తి నాకు అవసరం లేదు' అని ఈ తండ్రిని దిక్కులేని వాడిని చేసి అక్కడే సెటిల్ అయిపోయాడు   నీ అన్నగారు.

  

ఇక మిగిలిన వాడివి నువ్వు. నిన్ను కూడా పోగొట్టుకుంటే  నాకు తలకొరివి పెట్టేవాడు ఎవడున్నాడురా? "  అన్నాడు గవర్రాజు.

  

 

" పది తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తుంది మనకి. మీ తాత ముత్తాతల నుంచి వ్యాపారం చేస్తూనే ఉన్నారు.. లక్షలు కోట్లు చేశారు. ఇప్పుడు రోజులు మారాయి నాన్న.

 

మన కొట్లో పనోడిగా చేరిన కుర్రాడే ఏడాది పాటు వ్యాపార మెలకువల్ని  నేర్చేసుకుని సొంత కొట్టు పెట్టేసుకుంటున్నాడు. మనం ఇచ్చే దాని కన్నా ఓ 1000  రూపాయలు జీతం ఎక్కువ ఇచ్చి మన కొట్లో కుర్రాళ్లను కూడా లాగేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వ్యాపారంలో పోటీ తత్వం పెరిగిపోయింది.

  

మనం ఎదగాలని వాళ్ళకోసం వాళ్లు తాపత్రయపడుతుంటే, మనం ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలని ఆశ పడుతూనే ఉన్నాం. 57 ఏళ్ల వయసులో మీరు ప్రతి రోజు షాపుకు వెళ్లి సంపాదించడం అవసరం అంటారా..? అన్నయ్య వెళ్లిపోయాడని, తెలివిగా రెండో షాప్ ఓపెన్ చేసి నన్ను వ్యాపారంలో ఇరికించేశారు. నా బ్రతుకు నాకు నచ్చినట్టుగా బ్రతికే అవకాశం లేకుండా చేశారు.

 

అన్నయ్య దూరంగా వెళ్లిపోయాడు కాబట్టి మీకు తోడుగా నేనుండాలి.. కరెక్టే. కానీ నాకు కూడా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది కదా.

  

చదువు పూర్తిఅయి ఐదేళ్లయింది. మూడేళ్ల క్రితం ఏదో గొడవ అయిందని ఫ్రెండ్స్ తో కలవద్దు అన్నారు. అలాగే అన్నాను. కనీసం మనసుకి నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సుఖంగా ఉందాం  అనుకుంటే, ఏ తండ్రి ఏ కొడుక్కి పెట్టని కండిషన్ పెట్టారు.

  

మీతో ఇలా పచ్చిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా బిడ్డని కనివ్వమంటే ఏ కన్నె పిల్ల అయినా ఒప్పుకుంటుందా? అటువంటప్పుడు  నేను ప్రేమించి ప్రయోజనం ఏంటి నాన్న? నేను ప్రేమించిన అమ్మాయి బతికేమైపోవాలి రేపు పొద్దున్న?

 

ఆ అమ్మాయి పెళ్లి అవకుండా గర్భవతి అవ్వడానికి ఇష్టపడడం లేదు.

  

అంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరకదు. ఇంకెందుకు నాన్న నాకు ఈ జీవితం? మీ పరువు, ప్రతిష్ట సమాజంలో నిలబెట్టుకోవడం కోసం, మళ్లీ ఏ డబ్బుఉన్న ఆడపిల్లనో నాకు అంట కడతారు. అలాంటి పెళ్లి నాకు అక్కర్లేదు నాన్న.

  

మీరు చాలా అదృష్టవంతులు నాన్నా.మీ నాన్న మీకు అమ్మలాంటి దేవతను ఇచ్చి పెళ్లి చేశాడు. ఈరోజుల్లో ఆడపిల్లలో దేవతలు తక్కువ నాన్న. అందుకే మనం ప్రేమించిన ఆ అమ్మాయినే దేవతగా మలుచుకోవాలి. ఆ అవకాశం నాకు లేకుండా చేశారు కదా.

  

ఏంటి అన్న మీరు పెట్టిన కండిషన్? మూడేళ్లు ప్రేమించుకోవాలా.. ప్రేమించుకున్న అమ్మాయి పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాలా .. అప్పుడు కూడా నేను ఆ అమ్మాయిని  ఇష్టపడితే.. తనని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా?

  

అంటే... అంటే... మీకు నా పెళ్లి చేసే ఉద్దేశమే లేదన్నమాట.మీ కోసం మీ పరువు ప్రతిష్టలకోసం నా జీవితం నాశనం చేసుకునేంత శ్రీరాముడిని కాదు నాన్నా నేను. ఎందుకంటే అలాంటి అమ్మాయి ఈ లోకంలో   సాంప్రదాయ కుటుంబాల్లో  కాగడా  పట్టి వెతికినా కనపడదు నాన్నా.  ఇంకెందుకు నాన్న ఈ వ్యాపారం.....  ఈ డబ్బు సంపాదన? మీరు పని వాళ్ళనే పెట్టుకుంటారో.. నమ్మకస్తుల్నే పెట్టుకుంటారో... పెట్టుకుని వ్యాపారం చేసుకోండి. కొడుకు సుఖం  అక్కర్లేని  తండ్రిని ఈ ప్రపంచంలో మిమ్మల్ని  ఒక్కడినే చూసాను నాన్నా.

 

దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను కాసేపు పడుకుంటాను మీరు వెళ్ళండి" అని అటు తిరిగి పడుకుండిపోయాడు విరాజ్.

  

గవర్రాజుకి కంటి చూపే తప్ప నోట మాట లేదు.

  

" అది కాదు రా అబ్బాయి నా మాట విను"

 

" అబ్బా! కనీసం ఈవేళయినా నన్ను వదిలేయండి నాన్నా. మీకు దండం పెడతాను ప్లీజ్. " అలా పడుకునే సమాధానం చెప్పాడు విరాజ్.

 

ఇక చేసేదిలేక నెమ్మదిగా బయటికి వచ్చేసాడు గవర్రాజు.

 

" ఇవి వీడి తెలివితేటలు కాదు. ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో వీడికి బాగా నూరిపోసింది. ముందు అమ్మాయిని ఎవరో తెలుసుకుని ఇంటికి పిలిపించాల" అనుకున్న గవర్రాజు గది బయటికి వచ్చేసరికి " ఏవండీ... టూ టౌన్ లో

 

నా చిన్ననాటి స్నేహితురాలు కేదారగౌరీ వ్రతం చేసుకుంటొన్దట. మీరు షాపు తీసి వెంకట్ ని నాకు తోడు ఇచ్చి పంపించండి. వాడు నన్ను దింపేసి మళ్ళీ కారు తీసుకుని  షాప్ కి వచ్చేస్తాడు. మీరు మధ్యాహ్నం మెస్ నుంచి భోజనం తెప్పించుకుని తినేయండి.

 

పిల్లాడికి ఆకలి వేస్తే వాడికి ఏం కావాలో అది తెప్పించుకు తింటాడు. నేను ఏకంగా సాయంత్రం షాప్ కి వస్తాను. సాయంత్రం షాపు తొందరగా కట్టేసి ఇంటికి వచ్చేద్దాం.సరేనా? "

 

అంది విశాలాక్షి చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ.

 

" సరే పద.నువు పిల్లాడికి చెప్పేసి రా. నేను ఈ లోపల కార్ తీస్తాను " అని గవర్రాజు తాళాలు తీసుకుని కార్ గ్యారేజ్ వైపు నడిచాడు.

 

తల్లిదండ్రుల సంభాషణ విన్న విరాజ్ పడుకున్నట్టు నటించాడు. కొడుకుని లేపడం ఇష్టం లేక తలుపు దగ్గరగా వేసి కిందకు దిగిపోయింది విశాలాక్షి. వారెక్కిన కారు టూ టౌన్ వైపు సాగిపోయింది.

  

*******

  

తల్లి తండ్రి వెళ్ళిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత  విరాజ్ వెంటనే హరితకు ఫోన్ చేశాడు.

 

" హరిత ఎక్కడున్నావ్...? "

  

" డెలివరీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏమైంది విరాజ్? "

 

" ఇవాళ షాపుకు వెళ్లలేదు. ఇంట్లోనే ఉన్నాను. ఆర్డర్ బుక్ చేస్తాను. ఆర్డర్ తీసుకుని మా ఇంటికి వచ్చేసేయ్. ఆర్డర్ డెలివరీ చేశాక అటు నుంచి అటే ఇంటికి వెళ్లిపోతానని మధ్యాహ్నం సెలవు పెట్టి వచ్చేయ్.నీతో కలిసి నా హోమ్ థియేటర్ లో మరోచరిత్ర సినిమా చూడాలని ఉంది. వచ్చేటప్పుడు బురఖా డ్రెస్ వేసుకుని మా ఇంటికి రా? "

 

" అమ్మో అమ్మకు చెప్పకుండానా? "

 

" నేను ఇక్కడ ఎవరూ కొరుక్కు  తినడానికి సిద్ధంగా లేరు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు."

 

" అలాగా. ఆ కొరుక్కు తినే వాడివి నువ్వేగా. ఆ పరిస్థితే వస్తే నన్ను  నేను రక్షించుకోవడం నాకు తెలుసులే."

 

" అంటే నువ్వు నేర్చుకున్న కరాటే విద్య నా మీదే ఉపయోగిస్తామన్నమాట " నవ్వుతూ అన్నాడు విరాజ్.

  

"చాలా సాహసం చేస్తున్నాను మరి.నన్ను ఎవరు గమనించకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. " అని ఫోన్ పెట్టేసింది హరిత.

  

*******

 

(ఇంకా  ఉంది)

No comments:

Post a Comment

Pages