బంగారు ద్వీపం (అనువాద నవల) -19 - అచ్చంగా తెలుగు

బంగారు ద్వీపం (అనువాద నవల) -19

Share This

బంగారు ద్వీపం (అనువాద నవల) -19

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)

Original: Five on a treasure Island (1942)
Writer: Enid Blyton


 
(పిల్లలకు శిధిలమైన ఓడలో దొరికిన పెట్టెను జార్జి తండ్రి క్వెంటిన్ పట్టుకుపోతాడు. అతను నిద్రపోతున్న గురక శబ్దం విని, జూలియన్ బాబాయి గదిలో దూరి ఆ పెట్టెను బయటకు తెస్తాడు. దానిలో వారికి బంగారం కాక ఒక పుస్తకం, పాతకాలం నాటి కిర్రిన్ కోట మాప్ కనిపిస్తాయి. దాని తాలూకు కాపీ గీసుకొని, ఆ పెట్టెను మాప్‌తో పాటు క్వెంటిన్ దగ్గర పెట్టెద్దామని పిల్లలు అనుకుంటారు. తరువాత . . . .)
@@@@@@@@@@@@@@@@@@

"ఎందుకైనా మంచిది, ఈ పటం యొక్క కాపీని తీసుకుందాం" అన్నాడు డిక్. "తరువాత అసలు పటాన్ని పెట్టెలో పెట్టి, దానిని తిరిగి ‌బాబయ్య దగ్గర పెట్టేద్దాం."

అదే మంచి ఆలోచన అని అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు తిరిగి కిర్రిన్ కాటేజీకి వెళ్ళి, ఈ పటం నకలుని జాగ్రత్తగా గీసారు. తమను ఎవరూ గమనించకూడదన్న ఉద్దేశంతో వారు ఆ పనిని టూల్ షెడ్ లో చేసారు. అది ఒక చిత్రమైన పటం. అది మూడు భాగాలుగా ఉంది.

"ఈ భాగం కోట కింద ఉన్న నేల మాళిగలను చూపుతోంది. ఇది పై భాగాన్ని చూపుతోంది. ఆ రోజుల్లో ఇది సురక్షితమైన ప్రాంతం అని‌ నా ఉద్దేశం. కోట కింద భాగమంతా ఈ నేలమాళిగలు ఉన్నాయి. ఇవి చిత్రమైన ప్రాంతాలై ఉండాలి. జనాలు ఆ కిందకు ఎలా దిగేవారో అని‌ నాకు ఆశ్చర్యంగా ఉంది."

"ఈ పటాన్ని మనం మరింతగా అధ్యయనం చేయాల్సి ఉంది" చెప్పింది జార్జి. "ప్రస్తుతం మనకిది గజిబిజిగా కన్పించవచ్చు. కానీ ఒకసారి మనం ఈ పటాన్ని కోటకు తీసుకుని వెళ్ళి అధ్యయనం చేస్తే, ఆ రహస్య మాళిగల్లోకి ఎలా దిగాలో తెలుసుకోవచ్చు. ఓ! ఇలాంటి సాహసయాత్రని పిల్లలు ఎవరూ చేసి ఉండరని నేను భావిస్తున్నాను."

జూలియన్ తాము గీసిన పటాన్ని భద్రంగా తన జీన్స్ జేబులో పెట్టుకున్నాడు. దానిని అతను వదిలిపెట్టాలని అనుకోవటం లేదు. అది చాలా విలువైనది. తరువాత అసలు పటాన్ని పెట్టెలో ఉంచి యింటి వైపు చూసాడు. "దీనిని తిరిగి వెనక్కి పెట్టేయటం ఎలా?" అన్నాడతను.‌ "జార్జి! మీ నాన్న యింకా పడుకున్నట్లున్నాడు?"

కానీ లేదు, అతను మేలుకొన్నాడు. అదృష్టవశాత్తూ అతను పెట్టెను గమనించలేదు. కుటుంబంతో కలిసి టీ తాగడానికి అతను భోజనాల గదిలోకి రావటంతో, జూలియన్ అవకాశాన్ని తీసుకున్నాడు. క్షమించమని గొణుగుతూ, బల్ల దగ్గర నుండి జారుకొని, తన బాబయ్య కుర్చీ వెనకాల బల్ల మీద పెట్టెను ఉంచాడు.

అతను వెనక్కి రాగానే మిగిలిన పిల్లలను చూసి కన్నుకొట్టాడు. వాళ్ళంతా ఉపశమనం పొందారు. క్వెంటిన్ బాబయ్య అంటే వాళ్ళకు విపరీతమైన భయం. అతని దృష్టిలో చెడు అనిపించుకోకూడదని వాళ్ళు కోరుకుంటారు. అన్నె భోజన సమయంలో ఒక మాట కూడా మాట్లాడలేదు. నోరు విప్పితే కుక్క గురించి గాని, పెట్టె గురించి గాని చెప్పేస్తానేమోనని విపరీతంగా భయపడింది. మిగిలిన వారు కూడా పెద్దగా మాట్లాడలేదు. టీ తాగే సమయంలో టెలిఫోన్ మోగటంతో ఫానీ పిన్ని వెళ్ళింది.

వెంటనే ఆమె తిరిగి వచ్చింది. "క్వెంటిన్! నీకే.." చెప్పిందామె. "శిధిలమైన ఆ పాత ఓడ చాలా ఉత్తేజాన్ని కలిగించింది. దాని గురించే ఒక లండన్ పేపర్ వాళ్ళు నిన్ను ప్రశ్నించాలని చూస్తున్నారు."

"ఆరు గంటలకు కలుస్తానని వాళ్ళతో చెప్పు" అన్నాడు క్వెంటిన్ బాబయ్య. పిల్లలు కంగారుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. పత్రికల వాళ్ళకు ఆ పెట్టెను తమ బాబయ్య చూపించడని వాళ్ళు ఆశించారు. అదే చేస్తే మరుగున ఉన్న బంగారం రహస్యం బయటపడొచ్చు!

"ఆ పటం నకలు తీసుకోవటం ఎంత మంచిదైంది!" టీ తాగాక, జూలియన్ అన్నాడు. "కానీ అసలు పటాన్ని పెట్టెలోనే ఉంచేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎవరైనా మన రహస్యాన్ని ఊహించవచ్చు."

@@@@@@@@@@@

మరునాడు వార్తాపత్రికలు సముద్రం నుండి బయటకు విసిరివేయబడ్డ శిధిలమైన పాత ఓడ‌ గురించి అసాధారణ రీతిలో వర్ణించాయి.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages