బంగారు ద్వీపం - 15 - అచ్చంగా తెలుగు
"బంగారు" ద్వీపం (అనువాద నవల) -15
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Writer : Enid Blyton



 (ఇంతకాలం సముద్రం అడుగున ఉన్న ఆ ఓడలో ఏదైనా సంపద దొరకవచ్చునని కొంతమంది గజ ఈతగాళ్ళు ప్రయత్నించి విఫలమయ్యారని జార్జి చెబుతుంది. సముద్రంలో ఆటు పోట్లు తగ్గనందున ప్రస్తుతం చిన్న పడవలో ఆ శిధిలమైన ఓడ చేరిన గట్టుకి తాము వెళ్ళలేమని, అందువల్ల మరునాడు ఉదయాన్నే వచ్చి ఆ ఓడను శోధించాలని పిల్లలు అనుకొంటారు. ఇంట్లో భోజనాల దగ్గర అన్నె ఓడ గురించి చెప్పబోతుంటే, జూలియన్, డిక్ బల్ల కింద ఆమెను కాలితో తన్నుతారు. అది చూసి ఫానీ పిన్ని వారిని కేకలేసి అన్నెను చెప్పదలుచుకొన్నది చెప్పమంటుంది. దానితో అన్నె తప్పుని సరిదిద్దుకొంటూ ఆ దీవిని పెద్ద అలలు చుట్టుముట్టాయని చెబుతుంది. తరువాత. . . .)
@@@@@@@@@@@@@@@@@@@@

"కుందేళ్ళు చాలా చనువుగా మసులుతున్నాయి" జూలియన్ గట్టిగా చెప్పాడు.

"అక్కడ మేము సముద్రం కాకులను చూసాము" అన్నాడు డిక్. అదే సమయంలో జార్జి కూడా అతని మాటల్లో మాట కలిపి చెప్పింది.

"జాక్డాలు ఎలాంటి శబ్దం చేసాయో.! అవి 'చాక్, చాక్' అంటూ అదే పనిగా ఒకటే అరుపులు."

"సరె! నిజానికి మీరు కూడా ఆ జాక్డాల్లాగే ఉన్నారు. అందరూ ఒకేసారి మాట్లాడి గోల చేస్తున్నారు" ఫానీ నవ్వుతూ అంది. "ఇప్పుడు మీరు తినటం అయిపోయిందా? బాగుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ జిడ్డు చేతులు కడుక్కోండి. అవును జార్జి! అవి జిడ్డుగా ఉన్నాయని నాకు తెలుసు. ఎందుకంటే, నేను వాటిని సొంటిపొడి, బెల్లం కలిపి చేసాను. నువ్వు మూడు ముక్కలు తీసుకొన్నావు కదా! ఇప్పుడు మీరు వేరే గదిలోకి వెళ్ళి మెల్లిగా ఆడుకోండి. ఎందుకంటే వాన పడుతోంది, అందువల్ల మీరు బయటకు పోలేరు. కానీ, జార్జ్! మీ నాన్నను అల్లరి పెట్టకు. ఆయన తన పనిలో తలమునకలై ఉన్నారు."

పిల్లలు చేతులు కడుక్కొందుకు వెళ్ళారు. "ఇడియట్!" జూలియన్ చెల్లెలు అన్నెను కేకలేసాడు. "దాదాపు రెండుసార్లు బయట పెట్టేసేదానివి."

"నేను మొదటిసారి నువ్వనుకొన్నది చెప్పాలనుకోలేదు" అన్నె కోపంగా అంది.

జార్జి మధ్యలో కలగజేసుకొంది.

"టింకి సంబంధించిన నా రహస్యం కంటే, ఆ శిధిలమైన ఓడ గురించి చెప్పేస్తావని నేను భావించాను" అందామె. "నీకు నోరు జారే అలవాటు ఉందని నాకు అనిపిస్తోంది."

"అవును ఉంది" చెబుతున్న అన్నె గొంతు జీరబోయింది. "భోజన సమయాల్లో మాట్లాడటం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. నేను టిమ్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. అందుకే అతని గురించి మాట్లాడకుండా ఆపుకోలేను."

వాళ్ళంతా వేరే గదిలో ఆడుకోవటానికి వెళ్ళారు. జూలియన్ పెద్దశబ్దంతో ఒక బల్లను తలకిందులుగా పడేశాడు. "ఇప్పుడు మనం శిధిలమైన ఓడ దగ్గర ఆడుతున్నాం" అని చెప్పాడతను. "ఇది శిధిలమైన ఆ ఓడ. ఇప్పుడు మనం దీనిని అన్వేషించబోతున్నాం."

ఇంతలో ధడేలున తలుపు తెరుచుకొంది. దాని మధ్యనుంచి చిరచిరలాడుతున్న ముఖం కోపంగా తొంగిచూసింది. అది జార్జి తండ్రి!

"ఏంటా చప్పుడు?" అడిగాడతను. "జార్జి! నువ్వు బల్లను తిరగదోసావా?"

"నేను చేసాను" జూలియన్ చెప్పాడు. "క్షమించండి సార్! మీరు ఫోన్ చేసుకొంటున్నారన్న విషయాన్ని మరిచిపోయాను."

"ఇంకేమైనా శబ్దం చేస్తే నేను మిమ్మల్నందరినీ రేపటివరకు మంచమెక్కేలా చేస్తాను" బాబాయి క్వెంటిన్ అన్నాడు. "జార్జినా! నీ కజిన్లను నిశ్శబ్దంగా ఉండేలా చూడు."

తలుపు మూసుకుని క్వెంటిన్ బయటకు వెళ్ళాడు. పిల్లలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

"మీ నాన్న చాలా భయంకరంగా ఉన్నాడు కదా?" జూలియన్ అన్నాడు. "క్షమించు. ఆ అల్లరి చేసింది నేను. నేనిలా అవుతుందనుకోలేదు."

"మనం ఏ పనైనా నిశ్శబ్దంగా చేయటం మంచిది" జార్జి చెప్పింది. "లేదంటే అతను తన మాట నిలబెట్టుకొంటాడు. రేపు మనం శిధిలాలను అన్వేషించాలనుకొన్నాం. ఆ పని కాకుండా మంచాన పడతాం."

ఇది భయంకరమైన ఆలోచన. అన్నె ఆడుకోవటానికి తన బొమ్మల్లో ఒక దాన్ని తెచ్చుకొందుకు వెళ్ళింది. ఆమె యిక్కడకు వచ్చేటప్పుడు చాలా బొమ్మలనే తెచ్చుకోగలిగింది. జూలియన్ వెళ్ళి ఒక పుస్తకం తెచ్చాడు. జార్జి చెక్కతో తను చెక్కిన ఒక అందమైన పడవ బొమ్మను తెచ్చింది. డిక్ ఒక కుర్చీలో వెనక్కి వాలి ఉత్తేజకరమైన ఆ శిధిలపు ఓడ గురించి ఆలోచిస్తున్నాడు. వాన ఆగకుండా కుమ్మరించినట్లు పడుతోంది. మరునాడు ఉదయానికల్లా అది ఆగిపోతుందని అందరూ ఆశిస్తున్నారు.

"మనం ఎలాగైనా చాలా ముందుగా లేవాలి" ఆవులిస్తూ అన్నాడు డిక్. "ఈ రాత్రి పెందరాళే పడుకోవటం గురించి ఏమంటారు? పడవ నడపటం వల్ల నేను బాగా అలసిపోయాను."

మామూలుగా చెప్పాలంటే తొందరగా పడుకోవటం పిల్లలెవరికీ యిష్టం లేదు. కానీ అలాంటి ఉత్తేజకరమైన దాని కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకు ఆ రాత్రి పెందరాళే పడుకోవటం భిన్నంగా అనిపించింది.

"కాలం త్వరగా గడిచిపోతోంది" ఆడుకొంటున్న బొమ్మను కింద పెడుతూ అన్నె అంది. "ఇప్పుడు మనం వెళ్దామా?"

"టీ అయిపోయాక వెళ్ళినట్లయితే అమ్మ ఏమనుకొంటుందని మీరు భావిస్తున్నారు?" జార్జి అడిగింది. "మనమంతా అనారోగ్యం పాలయ్యామని ఆమె అనుకొంటుంది. లేదు. రాత్రి భోజనం అయిన వెంటనే పడుకొందాం. అప్పుడు మనం పడవ నడపటం వల్ల అలసిపోయామని చెప్పొచ్చు. అది యదార్ధం కూడా! రాత్రి గాఢనిద్ర పడుతుంది. దానివల్ల రేపు ఉదయానికి సాహసయాత్రకు మనం సిద్ధంగా ఉంటాం. ఇది నిజంగా సాహసయాత్రే అని మీకు తెలుసు. ఎప్పుడూ సముద్రం అడుగున పడి ఉండే అలాంటి శిధిలమైన నౌకను అన్వేషించే యిలాంటి అవకాశం చాలామందికి దక్కదు."

కాబట్టి రాత్రి ఎనిమిది గంటలకు, ఫానీకి అనుమానం కలిగించకుండా, పిల్లలందరూ మంచమెక్కారు. అన్నె వెంటనే నిద్రలో ములిగిపోయింది. జూలియన్, డిక్ కూడా ఎక్కువసేపు మెలకువగా లేరు. కానీ జార్జి కొంతసేపు మెలకువగా ఉండి తన దీవి, శిధిలమైన తన ఓడ గురించి ఆలోచించింది. తనకు యిష్టమైన కుక్కను కూడా తలచుకొంది.

"టింని కూడా తీసుకెళ్ళాలి" నిద్రపోతూ తనలో అనుకొందామె. "పాత టింని దీనికి దూరంగా వదిలిపెట్టను. ఈ సాహసయాత్రలో అతను కూడా పాలుపంచుకొంటాడు!"

@@@@@@@@@@

మరునాడు ఉదయం జూలియన్ ముందుగా నిద్రలేచాడు. సూర్యుడు తూరుపు దిఙ్మండలం పైకి లేస్తూ, ఆకాశాన్ని బంగారు రంగులో నింపేసిన సమయంలో అతను నిద్రలేచాడు. లేవగానే జూలియన్ ఒక క్షణం పాటు యింటి లోకప్పుని చూస్తూ పడుకొని, గత దినం జరిగినదంతా ఒకసారి వేగంగా నెమరువేసుకొన్నాడు. తరువాత మంచంపై నిటారుగా కూర్చుని సాధ్యమైనంత నెమ్మదిగా పిలిచాడు.

"డిక్! నిద్ర లే! మనం ఓడ శిధిలాలను చూడటానికి వెళ్తున్నాం! నిద్ర లేరా!"

డిక్ మేల్కొని నవ్వుతూ జూలియన్ వైపు చూసాడు. అతనిలో ఆనందం పాకిపోయింది. వాళ్ళు సాహసయాత్రకు వెళ్తున్నారు. అతను మంచం మీద నుంచి దూకి ఆడపిల్లల గదిలోకి పరుగెత్తాడు. అతను తలుపును తెరిచాడు. ఇద్దరు అమ్మాయిలు గాఢనిద్రలో ఉన్నారు. అన్నె దుప్పటి కింద పందికొక్కులా ముడుచుకు పడుకొంది.

డిక్ జార్జిని కుదిపి, అన్నె వెనుక పొడిచాడు. వాళ్ళు లేచి కూర్చున్నారు. "త్వరగా లెండి" అని డిక్ మెల్లిగా గొణిగాడు. "సూర్యుడు పైకి లేస్తున్నాడు. మనం తొందరపడాలి."

ముస్తాబవుతూన్న జార్జి నీలికళ్ళు మెరిసాయి. అన్నె తనకున్న కొద్ది బట్టల్లోకి మారింది. స్నానానికి ధరించే సూటు, జీన్స్, జెర్సీ, పాదాలకు తోలు బూట్లు ధరించింది. వాళ్ళ ముస్తాబుకి ఎంతోసేపు పట్టలేదు.

"ఇప్పుడు కిర్రుమనకుండా మెట్లు దిగాలి. దగ్గవద్దు, ముసిముసి నవ్వులు కూడా వద్దు" బయల్దేరటానికి అంతా నిలబడగానే జూలియన్ హెచ్చరించాడు. అన్నె విపరీతంగా నవ్వుతుంది. ఏవైనా రహస్య ప్రణాళికలు ఉన్నా, ఆవేశం పట్టలేక అకస్మాత్తుగా బయటపెట్టేస్తుంది. కానీ ఈసారి ఆ చిన్నపిల్ల మిగిలినవాళ్ళలాగే గంభీరంగాను, జాగరూకతతోను ఉంది. వాళ్ళు పాకుతూ మెట్లు దిగి, ముందున్న చిన్న తలుపును చప్పుడు కాకుండా తెరిచారు. మెల్లిగా దాన్ని మూసి ముందున్న తోట దారిలో నెమ్మదిగా గేటు దగ్గరకు చేరుకొన్నారు. ఆ గేటు ఎప్పుడూ కిర్రుమంటుంది గనుక, దాన్ని తెరవటానికి బదులుగా మీదకు ఎక్కారు.

సూర్యుడు తూర్పు దిక్కున ఆకాశంలో పైకి లేవనప్పటికీ, ప్రకాశవంతంగా మెరుస్తున్నాడు. వాతావరణం అప్పటికే వెచ్చగా ఉంది. ఆకాశం స్వచ్ఛమైన నీలిరంగుతో మెరవటం చూసి, అప్పుడే ఉతికినట్లు ఉందని అన్నె వ్యాఖ్యానించకుండా ఉండలేకపోయింది.

"ఇప్పుడే లాండ్రీనుంచి వచ్చినట్లు కనిపిస్తోంది" మిగిలినవాళ్ళతో అందామె.

వాళ్ళంతా కీచుమన్న శబ్దంతో నవ్వారు. ఆమె కొన్ని సమయాల్లో చిత్రమైన విషయాలను చెబుతూంటుంది. కానీ ఆమె భావం ఏమిటో వారికి తెలుసు. ప్రకాశవంతమైన నీలి ఆకాశంలో మేఘాలు గులాబీ రంగుని సంతరించుకొంటే, సముద్రం మృదువుగా మరియు తాజాగా కనిపిస్తోంది. దాని తీరుతెన్నులు చూస్తే, ముందు రోజు అది కల్లోలంగా ఉన్న విషయాన్ని ఏమాత్రం ఊహించలేము.

జార్జి తన పడవను సమీపించింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages