గణపతి ముందు గుంజీళ్లుతీయుట శిక్ష కాదు..దీక్ష - అచ్చంగా తెలుగు

గణపతి ముందు గుంజీళ్లుతీయుట శిక్ష కాదు..దీక్ష

Share This

గణపతి ముందు గుంజీళ్లుతీయుట శిక్ష కాదు..దీక్ష'

-సుజాత.పి.వి.ఎల్,

సైనిక్ పురి, సికిందరాబాద్.


సామాన్యంగా ఒక్కొక్కరికి, ఒక్కో శాస్త్రానికి, ఒక్కో విషయానికి ఒక్కో గురువుంటాడు. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ విద్య, గానం, నాట్యం, కావ్యం, పురాణేతిహాసాలు, యోగవిద్య, శృతివిద్య, స్మృతి విద్య మొదలైన వాటిని బోధించేవారిని 'గురువులు' అంటారు. వీరందరూ గణపతి అంశతో అలరారుతారు. నేర్పేవానికి , నేర్చుకునే వానికి ఓర్పు ముఖ్యం . కనుకనే సహస్ర నామాల్లో గజముఖుడిని ' శాస్త్రే నమః', 'బోధాయ నమః', నాటకాయ నమః' అని వివిధ నామాలతో కీర్తించడమైనది. సహస్ర నామాల్లోని నామాలు అతిశయోక్తులు కావు సత్యోక్తులు.

సర్వ సద్గురు సంసేవితుడు గణేశుడు. ఆయన 'మెల్లని చూపులు , మందహాసం ' ఒలికించేవాడు , ఆప్యాయతను చిలికించువాడు, అనుగ్రహమును కురిపించువాడు. ఇవన్నీ పరిపూర్ణ జ్ఞానుల లక్షణం. అందుకే గణపతి గురువులకే గురువు అయ్యాడు. గురువు వద్ద వినయంగా ప్రవర్తించాలి. చెప్పింది శ్రద్ధతో ఆలకించాలి. పెద్దలను కలిసినప్పుడు చెవులను చేతితో పట్టుకుని 'ప్రవర ' చెప్పడం ఒక సత్సoప్రదాయం.

గురువులకు గురువైన గణపతి ముందు గురువులు కూడా చేతులు కట్టుకొని వినయంగా నిలబడటం మనం చూస్తుంటాం. గుంజిళ్ళు కూడా తీస్తుంటారు.  క్రమేణా ఇదొక ఆచారమైoది. ఫలితంగా గణపతి ఆలయాల్లో ప్రతి ఒక్కరు గుంజిళ్ళు తీయడం ఒక చక్కని అలవాటుగా మారింది. గుంజిళ్ళు తీయడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. కాళ్లల్లో రక్తప్రసరణ తగురీతిలో జరుగుతుంది. పాఠశాలలో విద్యార్ధి పంతులుగారి ముందు గుంజిళ్ళు తీయడం ఒక శిక్ష . కానీ, గణపతి ముందు ఎంతటి వృద్ధులైనా, గుణ ధన సమృద్ధులైనా, రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించి గుంజిళ్ళు తీయాలి. 'ప్రమాదో ధీమతామపి.  అలా గుంజిళ్ళు తీయుట శిక్ష కాదు. అదొక దీక్ష! ఎందుకంటే మనము తెలిసో, తెలీకో తప్పులు చేస్తుంటాం కదా !. జ్ఞానగంగ గురువులనుండి శిష్యులకి ప్రసరిస్తుంది కనుకనే ఎంతటి జ్ఞానులైనా, పండితులైనా గురువులకు గురువైన గణపతి ముందు మోకరిల్లడం, చెవులను చేతులతో పట్టుకుని గుంజిళ్ళు తీయడానికి కారణం ఆయన విద్యా గణపతి, గురోర్గురుతముడు. గురోర్గుతముడు అనగా గురువులకు, గుణములకు, రూపములకు అతీతుడైనవాడని అర్థం. గురుతత్వం ఎవరిలో పరిపూర్ణంగా పరిఢవిల్లుతుందో వారే గురువులు. 'విద్యలకెల్ల నొజ్జయై యుండెడి' గణపతి గురువులకే పెద్ద గురువు.

***



No comments:

Post a Comment

Pages