ఆమెకూ అవసరాలుంటాయి! - అచ్చంగా తెలుగు

ఆమెకూ అవసరాలుంటాయి!

Share This

 ఆమెకూ అవసరాలుంటాయి!

భావరాజు పద్మినీ ప్రియదర్శిని

 


'ఏమేవ్! ఆ దోశె అపసవ్య దిశలో తిప్పుతూ వెయ్యోద్దని ఎన్నిసార్లు చెప్పాను?' విసుక్కున్నాడు వామన మూర్తి.

 

'అబ్బబ్బబ్బ! మీ వాస్తు కాదు కానీ, వాయించేస్తున్నారు. పిండి రుబ్బేటప్పుడు, దోసెలేసేప్పుడు సవ్యవేఁవిటీ... అపసవ్యవేఁవిటీ? టైం కు కడుపులోకి పదార్థం పోయిందా లేదా అన్నదే ముఖ్యంగానీ!' విసుక్కుంది గార్గేయి.

 

'ఆఁహా! చూడబ్బోతే గడియారాన్ని, గ్రహాలని కూడా అపసవ్యంలో తిప్పమనేట్టున్నావే! ఎదురాడక చెప్పింది చెయ్యు!' ఉరిమాడు మూర్తి.

 

"అసలు మిమ్మల్ని కాదండి! మీకు వాస్తు పిచ్చి అంటించిన ఆ గవర్రాజుననాలి. హాయిగా ఉజ్జోగం చేసుకునీవారు, మానేసి, ఇప్పుడు కంచంలో వాస్తు, కుంచంలో వాస్తు అని వేపుకు తింటున్నారు. ఇల్లుకాలిందని ఒగడేడుస్తా ఉంటే... ఎక్కడా, నా చుట్టకు నిప్పంటించుకుంటా అన్నాట్ట ఒకడు! అలా మనకొంప అంటించడఁవే కాక, ఊళ్లోవాళ్ల కొంపలకు, స్థలాలకు సలహాలోటి! ఐబాబోయ్, మీతో నావల్ల కాదిక!"

 

అమ్మానాన్నలు మాటామాటా అనుకోడం చూసి, "మళ్లీ మొదలెట్టారా! అమ్మోయ్, ఆయనకు సవ్యంగా దోసెలు ఆనక తీరిగ్గా వేద్దూగానీ, ముందు నాకెలాగోలా వేసి పెట్టవే, ఆఫీసుకు లేటైతే మా బాసు దిక్కులు పిక్కటిల్లేలా తిట్లు తిడతాడు!" అంటూ టేబుల్ మీద వచ్చి కూచున్నాడు రామం.

 

ఈళ్లిలా మాట్లాడుకుంటా ఉండగానే, హఠాత్తుగా అత్తారింటినుంచి వచ్చింది భార్గవి. ఆమె రామం చెల్లెలు. ఆమె‌ వదనం చిన్నబోయి ఉంది.

 

"ఏయ్, ఏంటే... ఉరుములేని పిడుగులా ఊడి పడ్డావు? అంతా బాగేనా?" ఆత్రంగా అడిగాడు రామం. మౌనంగా తలూపి, సోఫాలో కూలబడింది భార్గవి.

 

"ఏమే నువ్విప్పుడొచ్చావంటే, నిన్న మంగళవారం రాహుకాలంలో బయల్దేరుంటావ్! వారం, వర్జం చూసుకోవక్కర్లా?" గసిరాడు వామనమూర్తి.

 

'అట్లకాడిచ్చుకు ఊచిపుచ్చుకు ఒకటి కొడితే, వెళ్లి శూన్యంలో పడతారు. అక్కడ బాగా వెతుక్కోవచ్చు దిక్కులు, ముహూర్తాలు...' మనసులో తిట్టుకుంటూ, "ఏమ్మా, మంచివేళకు వచ్చావు, రా దోసెలు తిందూగానీ" అంది ప్రేమగా గార్గేయి.

 

"మొహం కడుక్కుని వస్తానుండమ్మా!" అంటూ  తనగదివైపుకు దారి తీసింది భార్గవి.

 

"సరేనే, నాకొక అర్జంట్ మీటింగుంది. సాయంత్రం కలుస్తా! రెస్ట్ తీసుకోమరి!" అంటూ భార్గవితో అన్నాడు రామం. ముభావంగా తలూపి లోనికెళ్లింది భార్గవి.

 

తల్లీకొడుకులు ప్రశ్నార్థకంగా ఒకరిమొహాలొకరు చూసుకున్నారు.

 

"చూడొరె! దానికేదో దిగులు పట్టుకున్నట్టుంది. ఇవాళ హాఫ్ డే లీవ్ పెట్టొచ్చెయ్, నువ్వొచ్చాకా విషయం కదుపుదాం! అందాకా విశ్రాంతి తీస్కోనీ!" స్కూటర్ స్టార్ట్ చేస్తున్న రామంతో అంది గార్గేయి. "సరేనమ్మా!" అంటూ కంగారుగా బయల్దేరాడు రామం.

***

సాయంత్రం పెరట్లోని మామిడిచెట్టు కొమ్మకు వేసిన ఉయ్యాలలో కూర్చుని, టీ తాగుతున్న చెల్లిని చూసి, 'ఎక్కేసావా నీ సింహాసనం! అమ్మా, నాకూ నీచేత్తో కాస్త టీ ఇద్దూ!' అంటూ చెట్టుకిందున్న చెప్టా మీద కూలబడ్డాడు రామం.

 

అన్న మాటలకు చిన్న నవ్వు నవ్వి, మళ్లీ తలొంచుకుని టీ తాగసాగింది భార్గవి.

 

"ఇప్పుడు చెప్పరా! ఏమైంది? బావ నీతో ప్రేమగా ఉంటున్నాడా? ఏదైనా గొడవైందా?" లాలనగా అడిగాడు రామం.

 

ఆ మాటలకు కళ్లలో గిర్రున నీళ్లు తిరగ్గా, అన్నను చూసి చప్పున తలదించేసుకుంది భార్గవి.

 

"నీ సమస్య ఏదైనా నాతో చెప్పరా! అలా‌ఏడుస్తూంటే పరిష్కారాలు దొరకవు కదా, మాట్లాడు" ఉయ్యాల దగ్గరకెళ్లి చెల్లితో అన్నాడు రామం.

 

ఇంతలో రెండు టీకప్పులతో వచ్చిన గార్గేయి, కొడుకుతోసహా చెప్టామీద కూచుంది. నెమ్మదిగా తేరుకుని, ఇలా చెప్పసాగింది భార్గవి.

 

"అమ్మా! అమలాపురం సంబంధమని, పద్ధతైన కుటుంబవనీ, మీరు చెప్పగానే విని, వాళ్ల‌కోరిక ప్రకారం, చేస్తున్న టీచరుజ్జోగం కూడా మానేసి మరీ, ఆయన్ను పెళ్లిచేసుకున్నాను. అన్నీ బానే ఉన్నాయి. కానీ, డబ్బు జాగ్రత్తకీ, పిసినారితనానికీ మధ్య చిన్న గీత గీస్తే, మీ అల్లుడు మాధవ పిసినారనే అంటానేను. ప్రతీ దానికీ లెక్కలు. రోజూ కుక్కర్లో పెట్టే బియ్యం నుంచి, కూరలూ, పళ్లదాకా ప్రతీదీ ఇంతలోనే... తేవాలనుకుంటారు.‌ పుచ్చో చచ్చో రాత్రి సంత మూసే వేళకెళ్లి ఆయనే అన్నీ తెచ్చి పడేస్తారు. చాలా విసుగ్గా ఉంది." చెబుతూ ఒక్కనిముషమాగింది భార్గవి.

 

"దీన్లో బాధపడేదేముందే! ఏదోటి లోటు లేకుండా తెస్తున్నాడుగా!" తేలిగ్గా అన్నాడు రామం.

 

"ఇక్కడే, నీలాంటి మగవాళ్ళంతా మమ్మల్ని అర్థం చేసుకోలేక పప్పులో కాలేస్తున్నారు. మీ ఇష్ట ప్రకారం అన్నీ అమరిస్తే చాలని అనుకుంటారు కాని, మాకూ ఇష్టాలు, అవసరాలు ఉంటాయని గుర్తించరు. ఉదాహరణకు నీకొక సంఘటన చెప్తాను విను.

 

గత ముప్ఫై ఏళ్ళుగా మా మావిడితోటలో కాపరముంటూ, నమ్మకంగా పని చేసే హనుమంతు కూతురి పెళ్లి కుదిరింది.  పెళ్ళికి డబ్బు తగ్గిందని ఒక యాభైవేలు చేబదులు అడిగాడు. ఈయన ససేమిరా అన్నారు. నోటు రాసిస్తానని వాడు కాళ్ళా వెళ్ళా పడినా, కరగలేదు. ఊళ్లో అక్కడా ఇక్కడా ప్రయత్నించినా కుదరక, చివరికి పీటల దాకా వచ్చిన పెళ్లి, ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ గుడ్లప్పగించి చూస్తూ ఉంటే, ఒక ఆడపిల్ల జీవితం పాడవకూడదని, నా చేతికున్న బంగారు గాజులు తీసి ఇచ్చి, సర్దుబాటు చేసాను. అవి కూడా మీరు పెట్టినవే! అంతే, మూడు రోజులు పెద్ద రాద్ధాంతం చేసారు. ‘నీకేంటి సంబంధం’ అంటూ అత్తింటి వారంతా కలిసి, నానా మాటలూ అన్నారు. కొత్త కాపురం కదా, చిన్న విషయాలు పెద్దవి చెయ్యడం ఎందుకని, మీదాకా రానివ్వకుండా సర్దుకున్నాను. నెల తిరిగే సరికి హనుమంతు కుదువ పెట్టిన నా గాజులు విడిపించి తెచ్చి, నా కాళ్ళమీద పడి, కృతఙ్ఞతలు చెప్పాడు. అప్పుడు నా మనసులో కలిగిన సంతృప్తిని మాటల్లో చెప్పలేను.

 

 

ఇంకోసారి నాతో పాటు చదువుకున్న కావేరి అమలాపురంలో తమ అత్తగారింటికి వస్తే, భోజనానికి పిలిచాను. ఆమె వెళ్ళాకా “ఇంకెప్పుడూ నాకు చెప్పకుండా ఎవరినీ భోజనానికి పిలవకు. ఇవాళ మనం పిలుస్తాం, రేపు వాళ్ళు పిలుస్తారు. మళ్ళీ వచ్చిన వాళ్లకి జాకెట్టు గుడ్డలు, చీరలు అనవసరం మొహమాటాలు. నాకిలాంటివి నచ్చవు.” అన్నారు కటువుగా! ఆశ్చర్యంగా ఉంటుందేమో కాని, ఆయనకు పెద్దగా స్నేహితులే ఉండరు. పిలిచి భోజనం పెట్టాల్సి వస్తుందేమోనన్న బెంగేమో, అసలు స్నేహాలే చెయ్యరు! నా స్నేహితులు, చుట్టాలని రానివ్వరు. ఇది నా పరిస్థితి మాత్రమే కాదు, ఎంతో మంది ఇల్లాళ్ళ పరిస్థితి కూడానూ!

 

మాకూ, నోటికి ఏదన్నా హితవుగా వండుకొని తినాలనిపిస్తుంది. ఇంద్రధనస్సు రంగుల్లా వారానికి ఏడు కూరలు ఏరుకొచ్చి, ఇవే వండాలంటే ఎలా? పాలు, పెరుగులూ లెక్కగా వాడాలంటే ఎలా? మాకూ భర్తకొన్న చీర కాకుండా, నచ్చిన చీర ఎంచుకుని కొనాలనిపిస్తుంది. మార్కెట్లో ఏవైనా చిరుతిళ్లు కనిపిస్తే తినాలనిపిస్తుంది. ఎండలు మండుతూంటే వీధిలోకొచ్చిన షోడా తాగాలనిపిస్తుంది. సరదాగా ఓ సినిమాకో, షికారుకో వెళ్లాలనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు శుభకార్యాలకు ఏవైనా చందాలు కావాలని అడిగితే, పదోపరకో ఇవ్వాలనిపిస్తుంది. ఇరుగుపొరుగు అమ్మలక్కలతో ఏదైనా పెళ్లి పేరంటానికి వెళ్ళినప్పుడు, వాళ్లకి ఏదైనా కానుక ఇవ్వాలనిపిస్తుంది. ఇవే కాదు, ఈ రోజుల్లో, అదనంగా ఏదైనా పని చెప్పినప్పుడు పని మనుషులు, పాలవాళ్లు అదనంగా డబ్బివ్వాలని ఆశిస్తున్నారు. దసరా పండుగకు మామూలు ఇవ్వాలని పోస్ట్మాన్ దగ్గర నుంచి, పాలవాళ్ల వరకూ ఆశిస్తున్నారు. వీటికి భర్త డబ్బు ఇవ్వనప్పుడు, ఒక‌ఇల్లాలికివన్నీ ఎలా‌ సమకూరుతాయి? పోనీ లేదాపోదా అంటే, కలిగినవాళ్లే! ఉండీ ఇంత పీసుతనమెందుకో తెలీడంలేదు! ప్రతీదానికీ చెయ్యిచాచడం, లేదనిపించుకోవడం నాకు చచ్చే సిగ్గుగా ఉంది.‌ ఆ పిసినారితో నాకు చాలా కష్టంగా ఉంది." కళ్లొత్తుకుంటూ అంది భార్గవి.

 

"ఓస్! ఇంతే కదే, దానిదేముంది? నెలకో 2000 నీ అకౌంట్లో వేస్తాను. అవి నీ భర్తకు తెలియకుండా నీ ఖర్చులకు వాడుకో, సరేనా?" అన్నాడు రామం.‌ చుర్రున చూసింది భార్గవి.

 

"చూడన్నా! కొన్నాళ్ళు నువ్వు ఇస్తావు సరే. ఆ తర్వాత ఎవరిస్తారు? కష్టాలు ఉన్నాయని చెప్పి, మీ దగ్గర డబ్బు దండుకోవడానికి, నేనిప్పుడిక్కడికి రాలేదు. ఆ మాటకొస్తే, ఒక భర్త బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే, అతని కష్టానికి ఒక విలువ కట్టి, జీతం ఇస్తారు. మొత్తం ఇంటినంతా నడుపుతూ, తెల్లారి లేస్తే శుభ్రంగా సర్దడం దగ్గర్నుంచీ, కావల్సిన పదార్థాలు వండి వార్చడం, కమోడ్లు కడగడం దాకా నానా చాకిరీ చేసే ఇల్లాలి కష్టానికి ఏ విలువా కట్టరు. ఇంతని లెక్కగట్టి డబ్బివ్వరు. ఆమెకూ అవసరాలుంటాయని గుర్తించరు.

 

ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న నేను, పెద్దల మాటలకు విలువిచ్చి, ఈ వివాహం చేసుకున్నాను. ప్రతి భర్తా, తన భార్యకు ఆర్థిక, సామాజిక, భావ స్వాతంత్ర్యాలను ఇవ్వాలి.  అప్పుడే పుట్టింట్లో వేళ్లూనుకుని, మొగ్గతొడిగిన మొక్కలా ఉన్న ఆమె, అత్తింట్లో వృక్షమై పుష్పిస్తుంది. చాలామంది స్త్రీలను చూడండి, వసంతాల్లా కోటి ఆశలతో పెళ్లై వెళ్ళినవారు, శిశిరాల్లా మోడు వారి, యాంత్రికంగా జీవనాలు సాగిస్తూ ఉంటారు. కారణం... అత్తింటి వారి నియంత్రణ, మాటిమాటికీ తప్పులు ఎంచడాలు, దెప్పిపొడవడాలు... ఆమె ఆత్మలోని జీవాన్ని చంపేస్తాయి. అలా  మోడులా, బీడులా బతకాలని నాకు లేదన్నయ్యా! అందుకే..‌. నేనొక నిర్ణయానికొచ్చాను.

 

నాకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. అమలాపురంలో ఉన్న ఒక స్కూల్లో ఒక ఉద్యోగం చూసుకున్నాను. కానీ, దానికి మీబావొప్పుకోడం లేదు. అలాగని, మీకో ఆయనకో భారంగా ఉండటం నాకిష్టంలేదు.  అందుకే, ఆయన మనసు మారే దాకా, మా ఫ్రెండ్ పనిచేస్తూన్న తాడేపల్లిగూడెంలోని రెసిడెన్సియల్ స్కూల్ లో జేరిపోదామనుకుంటున్నాను. వెళ్లేముందు మీకు చెప్పిపోదామని ఇలా వచ్చాను.

 

మీ నిర్ణయానికి కట్టుబడ్డ నాకు నిరాశే మిగిలింది. కనుక, ఇప్పటికై‌నా నాదారి నన్ను చూసుకోనివ్వండి!" ధృడమైన స్వరంతో పలికింది భార్గవి.

 

"అంతమాటనకు భార్గవీ! నువ్వు లేకుండా నేనుండలేను!" అంటూ అక్కడొకిచ్చాడు మాధవ. అతన్ని చూసి ఆశ్చర్యపోయారంతా.

 

"భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే, పుట్టే పిల్లల ఆలనా పాలనా సరిగ్గా లేక, పిల్లలు మానసికంగా రుగ్మతలతో నలిగిపోవడం నా మిత్రుల కుటుంబాలలో చూశాను. అందుకే ఇంటిపట్టున ఉండే భార్య కావాలనుకున్నాను. అనవసర పరిచయాలు హోదా, క్లబ్బులు, పబ్బుల దాకా వెళ్ళడంతో జీవితాలు నాశనం అవడం మనం చూస్తూనే ఉన్నాము. అందుకే అందరితో తక్కువ కలుస్తాను. అప్పులిచ్చి మా తాత ఆస్తులన్నీ హుళక్కి కాగా, ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది, అందుకే ఎవరికీ అప్పులు ఇవ్వకూడదన్న సిద్ధాంతం పెట్టుకున్నాను. డబ్బు మనిషినాడిస్తుంది కనుక, జాగ్రత్తగా ఉంటే, మన భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందని, ఇన్నాళ్లూ అనుకున్నాను.

నా జీవితానుభవాల వలన నేనీ పధ్ధతి అలవర్చుకున్నాను గాని, నేనేమీ రాక్షసుడిని కాదు. మిగతా విషయాల్లో నేను ప్రేమగానే ఉంటానని, నీకూ తెలుసు. కానీ, నా పొదుపు నిన్ను ఇలా బాధ పెడుతుందనీ, నువ్వు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందనీ, నీ మాటలు వినేదాకా నాకు తెలియలేదు. నాకే కాదు, ఆ మాటకొస్తే, పాతకాలం పద్ధతిలో, తల్లిదండ్రుల నియంత్రణలో, పెరిగిన చాలామంది మగవాళ్లకు ఇంత ఆలోచన ఉండదు.

భగవంతుని దయవల్ల, ఇప్పటికే నేను తగినంత పొదుపు చేయడంతో, మనకు డబ్బుకి ఏమీ లోటు లేదు.  ప్రాణంగా ప్రేమించే నిన్ను ఆనందంగా ఉంచడానికి, నేను ఏమైనా చేస్తాను. ఇకనుంచి మన మామిడితోట, కొబ్బరి తోటల లెక్కలు నువ్వే చూసుకో! ఆ డబ్బంతా నీ బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చేస్తాను. అంతేకాక, సెంటర్ లో మనకున్న షాపుల అద్దె కూడా నీకే చెల్లించేలా చూస్తాను. నీకు కావలసినట్టు వాడుకో! లెక్కలు నేనడగను. ఇకపై నీకు ఎటువంటి నిబంధనలు ఉండవు. నామాట విని, ఒక రెండు మూడు నెలలు చూడు, ఇబ్బందులు ఉంటే నాతో మనసువిప్పి చెప్పు! అప్పటికి నీకు ఉద్యోగం చేయాలనిపిస్తే అమలాపురంలో నీకు నచ్చిన స్కూల్లో చేరు. మా వంశానికి నువ్వొక దీవెనగా, ఫలపుష్పాలతో కళకళలాడే మహావృక్షంగా ఉండాలని భావిస్తున్నాను. ఇకపై నిన్నెప్పుడూ బాధించను, ప్లీజ్ నన్నొదిలి ఎక్కడికీ వెళ్లకు! నేను భరించలేను!" భార్గవి కూర్చున్న ఉయ్యాల దగ్గరకొచ్చి, మోకాళ్లపై కూర్చుని, అభ్యర్థనగా కన్నీళ్ళతో ఆమె కళ్లలోకి చూస్తూ, అన్నాడు మాధవ.

 

"సరేనండీ, అలాగే వస్తాను. ఎలాగూ వచ్చాముకదా, రెండురోజులుండి, వెళ్దాము." అంది భార్గవి భర్తను ఒడిలో పొదువుకుంటూ.

 

వాళ్లిద్దరినీ మురిపెంగా చూసుకుంటున్న తల్లీకొడుకులు, "ఏమేవ్! కాలిజోళ్లు తూర్పువైపుకు విప్పిన ఆ తలకుమాసిన వెధవెవరు? ఎవడొచ్చాడింటికి?" అంటూ లోనికొచ్చి, అల్లుడ్ని చూసి అవాక్కై నిల్చున్న వామనమూర్తిని చూసి, పగలబడి నవ్వసాగారు.

***

No comments:

Post a Comment

Pages