రీల్సు రంగమ్మ - అచ్చంగా తెలుగు
రీల్సు రంగమ్మ
భావరాజు పద్మిని




కుయిటా లో ఉండే రంగమ్మ మొగుడు కనకయ్య మాంచి ఐఫోను కొనిచ్చీసరికి, అయ్యల్లారా, అమ్మల్లారా, మా నర్సాపురంలో పదిళ్లలో పాచిపని చేసుకు బతికే రంగమ్మ రీల్సు రంగమ్మైపోయింది! ఆ కత ఇనుకోండి! 

నర్సాపురం గోగులమ్మ తల్లి గుడిదగ్గరుండే రంగమ్మొట్టి కబుర్లపోగు! ఆ ఇంటి ఇషయాలు ఈ ఇంటికి, ఈ ఇంటి ఇషయాలు ఇంకో పదిళ్లకీ, ఈళ్లందరి ఇషయాలు ఊరందరికీ మోయడంలో రంగమ్మ ఎయిర్టెల్ సిగ్నల్ తో పోటీ పడుతుంది. అసలెవరిగురించి చెప్తాందో బుర్రలో లైటెలిగే సరికి, కాంతిని మించిన వేగంతో మాయమైపోద్ది కూడానూ! మాట్టాడతా కొన్ని అక్షరాలు మింగేయడం రంగమ్మ మరో ప్రత్యేకత! 

"అమ్మ్గారఁడీ ఇదిన్నారా? ఆ పార్వతమ్మ తోడికోడలుంది కదా, ఆవిడ తమ్ముడున్నాడు కదా, ఆయన పెళ్లాం మరదలు బామ్ముంది కదండి! ఆవిడ మేనమావ భార్య మొన్న పంటెక్కుతా కాలుజారి గోదాట్లో పడిందంట. లోతెక్కువ నేదు గాట్టి సరిపోంది గానీండి, లాప్పోతే ఎంత పెమాదం! హేవిటో ఫోన్లు జూస్కుంటా కాలెక్కడెడతన్నారో జూస్కోవద్దూ! మాయదారి మొబైలు! ఇంతకీ ఈ పడ్డావిడ పార్వతమ్మకు ఏ వరసవుద్దంటారు?"

ఆ సరికి వినే వాళ్ల బుర్రలు భూమిలా గుండ్రంగా తిరుగుతుంటాయి.‌ కాస్త లౌక్యం తెల్సినమ్మలైతే దోసె తిరగేస్తా, "ఇంతకీ ఆ పడ్డావిడిప్పుడెలా ఉందే రంగమ్మా?" అనడుగుతారు.

"ఎలాగుంటదండి? రుబ్బురోలు పొత్రంలాగుంది. ఐనా పడ్డోడికెప్పుడూ వైబోగవేఁనండి. తక్కినోళ్లకే తంటా. నోటికాడికి అన్నీ అందిచ్చద్దూ. ఇదో, సరింగా ఇలాగే, మా సెల్లి కొడుకు స్నేహితుడి బామ్మర్దికి పిన్ని మనవడు మొన్నామజ్జన పాలకొల్లుకి బండేసుకుని మేఘాల మీద పారెల్తా జారిపడ్డాడు. ఆడికేం సెల్లులో సొల్లు కొట్టుకుంటా మంచంమీద కూకుని అస్తమానూ ఇకికలు పక్పక్లూ! ఆడికన్నీ అందించేతలికి ఇవతలోల్లకి పులుసు కారతాంది. అయినా ఈళ్లందర్నీ గాదు, ఆ నంగనాచి సెల్లుననాల! అన్ని ఇపరీతాలకీ కారణవఁదే!"

ఇలాంటి మాటలినగానే, తల్తిరిగిపోయిన అమ్మగోర్లు "నయం! జంతువులకి వరొసల్లేవు గానీ, ఉండుంటేనా - అమ్మగోరూ, అన్నచెల్లెళ్ల గట్టు కాడ ఎండ్రగబ్బ లేదండీ, దాని సెల్లి నత్తగుల్లుంది కదండి, అది పులస్సేప మొప్ప మీద కూకొని ఎదురీద్కుంటా మన నర్సాపురం కొండాలమ్మ రేవుకొచ్చి, షడ్డకుడి వొరసైన పిత్తబరిగ ను కలిసి డాన్సాడిందంట." అంటూ అడ్డవైన సంగతులూ జెప్పేది, బతుకుజీవుడాఁ ఇంక దీని జోలికెళ్లకూడదు, అనుకునీవారు. 

మాటల్లో అడపాదడపా సెల్లును తిట్టిపోత్తా ఉండే రంగమ్మ చేతికి కనకయ్యంపిన సెల్లు రాగానే, ముందు ఎందుకొచ్చిన గోలనుకుంది. కొడుకు సాయంతో, కనకయ్యకి ఈడియో కాల్ జేస్తా, మాట్టాడతా ఉంటే, పాణం లేచొచ్చినట్టయింది రంగమ్మకి. ఏదైనా తొందరగా నేర్చేసుకోడం రంగమ్మకో వరం! ఇగ నెమ్మదిగా ఫోనుకలవాటు పడిన రంగమ్మ సకినేటిపల్లి రేవునుంచి సీతారాంపురం దాకా, ఉన్న సంగతులన్నీ ఫోన్లో జెబుతా, చివరికి గిన్నెలు తోముతా కూడా, చెవుల్లో వైర్లెట్టుకుని, సెల్లులో కబుర్లాడే దశకొచ్చింది. "సెల్లుని తిట్టిపోసేది, ఇప్పుడొదల్టంలేదు! ఓ రకంగా మంచిదే, దీని సోద్దప్పింది!" అనుకున్నారు అమ్మగార్లంతా. 

ఓరోజు అనుకోకుండా సెల్లులో ఓ ఈడియో రంగమ్మ కంటబడ్డది.'ఆకు చాటు పిందె తడిసె' అన్న పాటకు డాన్సాడతావుంది అందులో ఒకావిడ. శ్రీదేవిలా బొడ్డు కిందకి చీరగట్టిన ఒకాఁవె పైనుంచి పైపుతో ఒకడు నీల్లోత్తా ఉంటే, తడుస్తా పూనకవొచ్చినట్టు ఊగిపోతాంది. 

"ఒరేయ్ ఎంకా, ఏందిరా ఇది, ఇట్టా ఆడతా ఉంది. కిందేం రాసారో సదూ", అంటా కొడుకుని పిలిచి అడిగింది. 

ఓ వందమందికి నచ్చిందనీ, ఓ యాభై మంది "ఆహా, ఓహో" అన్నారనీ చెప్పాడు. 

"అంటే, ఇట్టాగాడితే అందరికీ నచ్చుకుంటామా?" అనడిగింది అమాయకంగా! 

"ఇలాగాడాలే గానీ ఎవులికి నచ్చదే అమ్మా! ఇప్పుడు సదూకున్నోల్లూ, సదూకోనోళ్లు, అంతా రీల్సే! అవి జూత్తే చాలు, ఊపొచ్చీసి, పెపంచవంతా మెచ్చుద్ది! అందుకే అన్నం తినడవన్నా మాన్తారు గానీ అలవాటైనోళ్లు తీయడం మానరు, చూసేవోళ్లు చూడ్డం మానరు. ఇదో లోకం, అదో సంబడం!" అన్నాడు కొడుకు.

'అంటే, పెపంచం మెచ్చాలంటే రీల్సాడాలన్నమాట!' అనుకుంది మనసులో రంగమ్మ. ఇంకోరోజు ఇంకో ఈడియో‌ కంటబడింది. గెడకర్రకి కళ్లజోడెట్టినట్టున్న అబ్బాయి, పక్కనో గంగిరెద్దునాగా తలూపుతా ఉన్న అమ్మాయి. బలేగా ఉందనిపించి, ఎంకడిని ఇవరమడిగింది!

'ఓ, ఇతనా? మన జిల్లా వోడే! ఇదివర్లో 'టిక్టాక్' అనీ ఒకటుండీది! అందునో వచ్చీరాని డాన్సేత్తా రంగురంగుల బట్టల్తో మొగుడూపెళ్లాలు ఆడతా ఉంటే... జనం నవుకోతానికి చూసేటోరు! అల్లాగ నవుతా నవ్విత్తా ఈళ్లు చానా పేరు తెచ్చీసుకుని, లచ్చలు సంపాయించారు. మన పెబుత్వం 'టిక్టాకు' ను తరివేఁసింది. ఐనా గానీ యు ట్యూబు ఈడియోలు అయ్యీ జేసుండడం వల్ల నెలకు ముఫ్పైయేలు వత్తాందంట! రీల్సయ్యీ జేత్తన్నారిప్పుడు! అంతేగాదమ్మా... ఈళ్లను గూడా ఆ మజ్జన బిగ్ బాస్ కు పిలవాలనుకున్నారంట! పొలాలెమ్మట అజమాయిషీ జేసుకునే ఈళ్లు ఈరోజు లచ్చాధికారులు అయ్యారంటే ఈడియోల వల్లే!"

'అంటే రీల్సాడుతే డబ్బొత్తదన్నమాట! ఇక్కడొళ్లు పచ్చడయ్యీలా నేనూ, అక్కడెక్కడో కుయిటాలో కప్పులు కడుగుతా నా పెనివిటీ... కట్టబడక్కర్లేదింక! ఎలాగైనా రీల్సాడాల!' అనుకుంది రంగమ్మ.

ఆ రాత్రి రంగమ్మకి నిద్దరట్టలేదు! చిన్నప్పుడు అంతా తనను జయప్రదలాగున్నావని పొగిడింది గుర్తు తెచ్చుకుంది. అంతర్వేది తీర్థంలో డప్పులకు డాన్సాడతా ఉంటే 'భల్లేగాడతన్నావే' అని జతగాళ్లు మెచ్చుకుంది గుర్తొచ్చింది.  నేనూ ఆడతా, అదెలాగో రేపే ఎంకడ్నడిగి నేర్చుకుంటా!" అని గట్టిగా అనుకుంది!

మర్నాటి నుంచి మూడ్రోజులు పని మానేసి మరీ రీల్సు చూడడం, తీయడం నేర్చుకున్న రంగమ్మ, ముందుగా చిన్నప్పటి స్టెప్పులు నెమరేసుకుంది. గాల్లో గుద్దులు గుద్దడం, దోమలబాటుతో దోవల్దోలడం, గోడకి పిడకలు కొట్టడం, రేవులో బట్టలుతకడం, బోరింగు పంపుకొట్టడం, పేడంటిన కాలిని నేలకి రాయడం... ఇలా తెలీకండానే రోజూ ఏసే స్టెప్పులు గుర్తు తెచ్చుకుంది. ఓ రంగురంగుల కళ్లజోడు, ఉన్నవాటిలో మాంచి చీరలు తెచ్చిపెట్టుకుంది. కొడుకు చేత ఇన్స్టా, స్నాప్ చాట్ లాంటి వాటిలో 'రీల్సు రంగమ్మ' పేరుతో ఖాతాలు తెరిపించింది. 

ఇగ మా నర్సాపురం దద్దరిల్లేలా వరదల్లా రీల్సు వదలసాగింది. 'బుల్లెట్ బండి' పాట చేస్తే రోడ్డురోలరు చక్రం దొర్లినట్టుందన్నారు! 'రంగమ్మా మంగమ్మా!' పాటచేస్తే, దీన్ని చూసాకా 'గంగమ్మా గంగమ్మా', అంటా గంగలో దూకడం బెటరన్నారు. ఇలా ఎటకారాలాడతా ఉంటే పట్టుదల పెరిగిపోయింది రంగమ్మకి! 

రీల్సు జేసినోళ్ల నెంబర్లు సంపాయించి మరీ సలహాలడిగింది. ఏషబాషలు మార్చమని ఒకరు, నాలిక మడత పెట్టి ఎక్స్ప్రెషన్ ఇమ్మని ఒకరు, ఒళ్లు కనబడేలా చీరగట్టమని ఒకరూ, లొకేషన్ మార్చమని ఒకరూ... ఇలా ఎవళ్లకి తోచిన సలహాలు వోళ్లిచ్చారు. అన్నీ పాటిత్తా, పొద్దస్తమానూ రీల్సాడతా ఉంటే, రంగమ్మకున్న పన్లన్నీ పొయినాయ్! పైగా ఆ వెటకారపు ఏషాలకి చుట్టుపక్కలున్న మర్యాద కూడా పోయింది. కుర్రకారంతా ఆమె రోడ్డుమీద కొస్తే చాలు ఎంటబడి ఆటపట్టిచ్చసాగారు. రంగమ్మ కొడుకును కూడా 'ఏరోయ్, మీ అమ్మ‌ మాంచి కసక్కులాగుంటది! ఈడియో జూసాంలే!' అని ఎగతాళి చేయసాగారు. రానురాను పరిస్థితి దిగజారసాగింది.

ఓ రోజున రంగమ్మ రీలోటి తిరిగీ తిరిగీ కనకయ్యకు జేరింది. ఎంటనే నర్సాపురం రాడానికి టికెట్లు జేయించుకున్నాడు.

ఆ రోజు... అంతకు ముందే రంగమ్మ ఏషాలు తట్టుకోలేక పోతన్నావనీ, ఆళ్ల పిల్లలూ ఆ ఈడియోలు జూస్తా ఎర్రిమొర్రి ఏషాలేత్తన్నారనీ, ఆమెను ఆ కాలనీ వదిలి పొమ్మనీ గొడవపెట్టుకెళ్లారు పెద్దమడుసులు. దానితో ఇంట్లో ఒక మూల కూకొని గొల్లున ఏడవసాగింది రంగమ్మ. హఠాత్తుగా వచ్చిన కనకయ్యను చూడగానే పరుగులాంటి నడకతో వెళ్లి కావలించుకుంది. ఆమె కాస్త కుదురుకున్నాకా, ఇలా చెప్పాడు కనకయ్య!

"నువ్వంటే నాకు పాణఁవే రంగీ! అందుకే నిన్ను రోజూ చూసుకోవాలనే ఆశతో ఫోను కొన్నా కానీ, ఇలాగవుతాదనుకోలేదు! ఇలా సూడు... తేలిగ్గా వచ్చే డబ్బూ, పేరూ ఎక్కువకాలం నిలబడవేఁ! ఎవలో అదురుష్టమున్నోళ్లు పైకొచ్చారనీ మనవూఁ తోకలు కాల్చుకోకూడదే! ఒక్కమాట చెప్తా ఇను... నువ్వు పాచిపని జేసినా, నేను కప్పులు కడిగినా గౌరవంగా బతికేవోళ్లం. ఆ బతుకే బతుకు రంగీ! ఇలా దసరా ఏషాలేత్తా, కుప్పిగంతులేత్తా, ఉన్న మర్యాద పోగొట్టుకోడం రైటేనా జెప్పు? నా బంగారం కదూ, ఇయ్యన్నీ మానెయ్యవే! ఇగో, సీతారామపురంలో నేను కొన్న స్థలంలో రేకుల షెడ్డేత్తా! ఆడికే బొయ్యుండు. తోచిన పనేదో జేస్కుంటా కొత్త జీవితం మొదలెట్టు. నాకు 'రీల్సు రంగమ్మ' ఒద్దే!  చెట్టుమీద కాయకీ, సముద్రంలో ఉప్పుకీ వరసలు గట్టి అమాయకంగా కబుర్లాడే నా పాత రంగి కావాలే! తెచ్చిత్తావాఁ?" 

నవ్వూ ఏడుపూ కలగలిసిన మొగంతో తలూపుతా, కనకయ్య గుండెల మీద వాలిపోయింది రంగమ్మ.

***

No comments:

Post a Comment

Pages