ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదం - అచ్చంగా తెలుగు

ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదం

Share This
ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదం 

( మొదటి భాగం)

శ్రీరామభట్ల ఆదిత్య 



ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు “దేవా! నీ రూపాన్ని ఎలా చూడగలము.” అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఉద్ధవా! భక్తిభావన యందు ఆసక్తి, దయారసము కలిగి; మితభాషణుడై, అబద్ధమాడక, సమస్త కర్మలు మదర్పణంగా చేసేవాడు భాగవతుడు అనబడతాడు. నా కథలు, నా జననం, నా లీలావిలాసాలు వింటూ నా సేవకులైన భాగవతులను తిలకించి. తమ ఇంటికి తీసుకుని వెళ్ళి, పూజించి స్నాన భోజన శయనాసనాదులతో వారిని సంతృప్తిపరచిన వాడు కూడ భాగవతుడు అనబడతాడు. చివరికి, జీవితాంత కాలం ఇదే విధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో నివసిస్తాడు.

అదీకాక శంఖచక్రగదాధరుడను, లక్ష్మీ సమేతుడను అయిన నన్ను; శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమరుపాటు రాకుండా గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ధ్యానిస్తూ శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు; అంబరీషుడు, విభీషుణుడు, రుక్మాంగదుడు మున్నగు భాగవతులు తెలుసుకున్నారు. మధురాపురానికి బలరాముడితో కలసి నేను వెళ్ళగా నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తియోగంతో నన్నే చింతించి ముక్తిపొందారు. ఇది భక్తి యోగ వివరం.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు.

అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. “ఓ ఉదాత్తచరిత్రా! భూదేవీకళత్రా! ధ్యానం ఎలా నిలుబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు.”

అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “కఱ్ఱ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా, సకల శరీరాలలోను అచ్ఛేద్యుడు అదాహ్యుడు అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు.” అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. “సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు.” అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడ తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్ళకు చెప్పాను. ఆ వివరం చెప్తాను శ్రద్ధగా విను.
పంచేంద్రియాలకూ కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి, సంసార మందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది, నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్ధం నిజం కానట్లుగా, కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది. అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి, నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా, నా మీద భక్తి ఆసక్తికలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు; శంఖమూ చక్రమూమొదలైన ముద్రలను ధరించేవాడు; హరిదివ్యనామాలు ధరించేవారికీ అన్నమూ నీళ్ళూ ఇచ్చేవాడు; విష్ణుభక్తులను కాంచి సంతోషించేవాడు కూడ భాగవతుడు అని తెలియుము. అన్ని సంగాలను వదలి, ఇతరము ఎరుగక, నన్నేతలచే మానవునకు భుక్తినీ, ముక్తినీ ఇస్తాను.” అని బోధించాడు. అంత, ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్ప మని మళ్ళీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు.
“ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని, ముక్కు చివర చూపు నిలిపి, ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి. పద్దెనిమిది విధాల ధారణా యోగసిద్ధులను తెలుసుకుని, అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను పరమాత్మతో లగ్నంచేసి, బ్రహ్మపదాన్మి పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు.
ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది, ఇలానే అడిగితే, అతనికి చెప్పిందే నీకూ చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా, నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుఱ్ఱములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వర్ణములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు.


ఇంకా వుంది....

No comments:

Post a Comment

Pages