మానసవీణ -42 - అచ్చంగా తెలుగు

 మానసవీణ -42

అద్దేపల్లి  జ్యోతి


హాస్పిటల్ లో నుంచి బయటికి వస్తున్న మానస చెయ్యి పట్టుకొని గబగబా బయట మొక్కల దగ్గరికి లాక్కుని పోయాడు అనిరుధ్.

"ఏమిటిది, వస్తున్నాగా, ఏంటా తొందర? పడి పోగలను," అతని ఆత్రం చూసి నవ్వుతూ అంది మానస.

"నువ్వు పడవు, నన్ను పడేసావు‌, నీ ప్రేమలో అన్నాడు. ఆమెను బెంచ్ మీద కూర్చోబెట్టి ఆమె పాదాల దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని ఆమె మోములోకి తదేకంగా తన్మయంగా చూస్తూ, భగవంతుడు అందమైన మనసుని , అందమైన రూపాన్ని ఒకే చోట ఇవ్వడు.  కానీ నీ విషయంలో నా కోసం రెండూ ఇచ్చాడు" అన్నాడు మురిసిపోతూ.

"ఏంటి అబ్బాయిగారు హుషారుగా ప్రేమపాఠాలు వల్లె వేస్తున్నారు, ఏంటి విశేషం?" అని ఏం తెలియనట్టుగా నవ్వుతూ అడిగింది మానస.

"అన్ని మంచి విషయాలూ నీ విషయంలో కూడబలుక్కుని వచ్చాయి, అందుకే అభినందిస్తున్నాను. అమ్మానాన్నల ప్రేమకోసం తపించే దానివి కదా, ఆ దేవుడు నీ మొర ఆలకించి ఆ ఆనందాన్ని నీకు సొంతం చేశాడు. ఇక మన జీవితం, 

'మానస వీణ మధు గీతం...

మన సంసారం సంగీతం...'

అంటూ ఆలపించాలి మనమిద్దరం" అన్నాడు ఉద్వేగంగా.

"అబ్బో ,అబ్బో నీలో పాటగాడు ఉన్నాడా?" అంటూ ఆశ్చర్యం ఆనందం కలగలిసిన  గొంతుతో, అతని చేయి పట్టి లేపి, పక్కన కూర్చోబెట్టుకుని, అతని భుజం పై వాలి, "ఈ మధుర క్షణాలు కోసం ఎన్నాళ్ళుగా నిరీక్షించానో నేను, తెలుసా?" అంది ఆనందంతో. 

"నాకు తెలుసు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మానాన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమగా చూసే విధానం  ఆశగా చూసే దానివి. అవి పొందిన వారి కన్నా కోల్పోయిన వారికే వాటి విలువ ఎక్కువ తెలుస్తుందని నాకు అపుడు తెలియదు, కానీ నీ బాధ నాకు ఏదో అర్ధమయినట్లు ఉండేది, అందుకే నీకు నా స్నేహాన్ని ఎప్పుడూ అందించాను, విశేషమేంటంటే నువ్వే నాకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చేదానివి. ధైర్యంగా ఉండే దానివి, దయ, జాలి, ప్రేమ, సాయపడే గుణం, ప్రశ్నించే తత్వం, అన్నీ మూసపోసిన

 సుగుణాల రాశివి. కాబట్టే, తాత గారిని కూడా మన్నించి ఆయనకు సేవ చేస్తున్నావు. "రియల్లీ ఐ లవ్ యు, ప్రౌడ్ అఫ్ యు డియర్" అన్నాడు సమ్మోహనంగా .

"ఏంటి నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకుని వచ్చినట్టు ఉన్నావు, సరేగానీ పద, అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది, రేపు నువ్వు కూడా వస్తావా, కరోనా వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఫుడ్ ఇద్దాం" అంది.

"తప్పకుండా, సదా మీ సేవలో" అని లేచి నిలబడి, తలవంచి ఎయిర్ ఇండియా యామ్బలమ్ లా సెల్యూట్ చేస్తూ అన్నాడు.

పకపకా నవ్వింది మానస అతని భంగిమను చూసి.

"నిజం మానస, తాతగారిని క్షమించటం అనేది చాలా పెద్ద విషయం" అన్నాడు లేచి బైక్ స్టార్ట్ చేస్తూ.

"అది విధి ఆడిన వింత నాటకంలో ఆయన పాత్ర  అంతే, రాములవారిని అడవికి పంపమన్నది కైక అని తెలిసి లక్ష్మణుడికి కోపం వచ్చి కైక ని తిట్టబోతే రాముడు అడ్డుపడి కైక పాత్ర నామమాత్రం, ఆడించేది విధి అంటాడు. అదే  గుర్తొచ్చింది" అంది మానస పరిపక్వతతో ఆలోచిస్తూ.

"రామాయణం, భగవద్గీత తెలిసినా, ఆచరణలో ఎంతవరకూ సాధ్యం? ఆలోచనా పరిధి, విశాల హృదయం, క్షమాగుణం, ఇన్ని లక్షణాలు నీలో ఉండటం నిజంగా నా అదృష్టం" అన్నాడు మురిసిపోతూ.

"ద్వేషంతో చేయలేనిది, ప్రేమతో చేయగలం అని మా చిన్నప్పుడు చెప్పేవారు మాష్టారు. అది నా మనసులో నాటుకుపోయింది, నాకు ఇన్ని తెలియటానికి పరోక్షంగా మా తాతగారే కదా కారణం, లేదంటే నీలా గూటిలో గువ్వలా, అమ్మానాన్నల సంరక్షణలో ఇంటికే పరిమితమై పోయేదాన్ని. ఇంత విశాల ప్రపంచాన్ని ఇన్ని రకాలుగా చూసేదాన్ని కాదు కదా, అంతా మన మంచికే అనేది బాగా నమ్ముతాను. విశాల విశ్వాన్ని ప్రేమిస్తే మనకు కావలసిన దాన్ని అదే మనకు అందిస్తుంది అట, మరి నా విషయంలో అలాగే గా జరిగింది. అమ్మానాన్నలు దొరికారు, నీ ప్రేమ దొరికింది" అంది నవ్వుతూ.

"విశ్వాన్నంతా ప్రేమించు, అందులో నన్ను ఇంకాస్త ఎక్కువ ప్రేమించు" అన్నాడు నవ్వుతూ ఇంటిదగ్గర దింపుతూ.

"రా లోపలికి, భోంచేసి వెళ్ళు" అంది మానస.

(సశేషం)

No comments:

Post a Comment

Pages