చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 27 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 27

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 27

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery 
నవలా రచయిత : Carolyn Keene
 


(అపరిచితుడు వెంట పడ్డ నాన్సీ సెల్లార్ కి వెళ్ళే వెళ్ళే వృత్తాకారపు మెట్ల వద్దకు చేరుతుంది.  ఆమె ఎక్కడినుంచో క్రీక్ మన్న శబ్దాన్ని వింటుంది.  నెడ్ ఆమెను అక్కడే ఉండమని సెల్లారులోకి దిగుతాడు.  నాన్సీని కిందకు రమ్మని పిలిచిన అతనికి ఆమె ప్రతిస్పందన ఉండదు.  నెడ్ ను కలిసిన మిగిలినవాళ్ళు నాన్సీ మాయమైందని తెలిసి, అబ్బాయిలంతా కిందకు వెళ్తారు.  మెట్ల దగ్గర నిలబడ్డ బెస్, జార్జిలకు గోడలోంచి శబ్దం వినిపిస్తుంది.  చివరకు బర్ట్, డేవ్ లు అక్కడ గోడలో రహస్య ద్వారాన్ని కనుగొంటారు.  తరువాత . . .)
@@@@@@@@@ 

తరువాత ఫ్లాష్ లైటుని ఎత్తి పట్టుకొని, కాంతిని తలుపు మీద కేంద్రీకరించగా, బర్ట్, డేవ్ చప్పుడు కాకుండా గొళ్ళాన్ని తీసి తలుపుని బలంగా లాగారు.

 తెరుచుకొన్న తలుపులోంచి నాన్సీ బయటకు తూలిపడింది!

  నాన్సీ కుంటుతూ వచ్చి నెడ్ చేతుల్లో వాలింది.   కొన్ని సెకన్ల పాటు అందరి కళ్ళు నాన్సీపై పడ్డాయి, తరువాత నాన్సీ బయటకొచ్చిన తలుపుకేసి బర్ట్ చూపుని మరల్చాడు.  చిన్న అరలాంటి గది బయటపడింది.  లోపల బుంగమీసాల వ్యక్తి నిలబడి ఉన్నాడు.  అకస్మాత్తుగా జరిగిన సంఘటనలకు అతను తెల్లబోయాడు.  తనను పట్టుకొన్న వాళ్ళ నుంచి బయటపడటం కష్టం అనిపించింది.  

  "ఎవరు నువ్వు?" అతని చేతిని పట్టుకొని బర్ట్ అరిచాడు.  అతను లోపల ఉన్న వ్యక్తిని చేయి పట్టుకొని బలంగా లాగటంతో,  యిద్దరు అదుపు తప్పి మెట్ల మీద నుంచి కిందకు దొర్లిపోయారు.  డేవ్ దొర్లిపోతున్న వాళ్ళ వెనుక ఉరుక్కొంటూ కిందకెళ్ళాడు.   మెట్ల మీద నిలబడ్డ బెస్, జార్జ్ లకు కింద జరుగుతున్న దొమ్మీ వినిపించింది.  

  ఇంతలో నాన్సీని నెడ్ లేవదీసి ఆరుబయటకు  తీసుకెళ్ళాడు. తాజా  గాలి తగిలి ఆమె వెంటనే కోలుకొంది..

"ఓహ్! నాన్సీ! ఏమైందే?" బెస్ బయటకు వస్తూ అడిగింది.  

  దీర్ఘశ్వాసల మధ్య నాన్సీ జరిగినదంతా వివరించింది.  ఆమె సెల్లార్ కెళ్ళడానికి మెట్లు దిగుతుండగా, అకస్మాత్తుగా రహస్య తలుపు తెరుచుకోవటంతో ఆమె బిత్తరపోయింది.  బుగ్గమీసాలవ్యక్తి ఆమెను పట్టుకొని ముక్కు కింద ఒక చిన్న సీసాను ఉంచాడు.  సీసానుంచి వచ్చిన పొగకు  మైకం కమ్మటంతో, ఆమె పారిపోలేకపోయింది.  "అప్పుడు అతడు నన్ను ఆ చిన్న గదిలోకి లాగి తలుపుని మూసాడు."

  "ఓ! ఎంత దయనీయం!" బెస్ అంది.  

  ప్రస్తుతం బర్ట్, డేవ్ తాము పట్టుకొన్న వ్యక్తితో అక్కడకు వచ్చారు.  అతను ఆ యువతను చిరచిరలాడే ముఖంతో చూసాడు.  "ఇప్పుడు మీ కథ చెప్పండి" నెడ్ అతన్ని ఆదేశించాడు.  

  బందీ గుడ్లు మిటకరించాడు.  వాళ్ళు అతన్ని పేరు అడిగారు, కానీ దాన్ని చెప్పటానికి నిరాకరించాడతను.  అతను ఆ కోటలో నివసిస్తున్నాడో, లేదో కూడా చెప్పలేదు.  

  నెడ్ అతని జేబులో చేయి పెట్టి, ఒక సీసాను బయటకు తీసాడు.  దానిమీద లేబుల్ చదివి, ఉపశమనంతో నిట్టూర్చాడు.  "ఇది ఖచ్చితంగా హానికరం కాదు" చెప్పాడతను.  "ఒక వ్యక్తికి యిది కేవలం మగత నిస్తుంది." 

  తరువాత ఖైదీ వైపు తిరిగి, "దీన్ని మీతో తీసుకెళ్ళే అలవాటు ఉందా?" నెడ్ అడిగాడు.

  "ఒక వ్యక్తికి కొంత రక్షణ హక్కు ఉంటుంది" ఆ మనిషి చిరాకు పడ్డాడు.  తరువాత అక్కడ ఎందుకు నివసిస్తున్నాడంటూ అతనికి వేసిన ప్రశ్నలన్నింటినీ ఉపేక్షించాడు.  

  కొద్దిగా కోలుకొన్నట్లు భావించిన నాన్సీ, "ఈ వ్యక్తి నన్ను అపహరించినందుకు సంతోషిస్తున్నాను.  లేకపోతే, అతన్ని పోలీసుల దగ్గరకు తీసుకెళ్ళటానికి సరైన కారణం ఉండేది కాదు."

  "పోలీస్!" ఆ వ్యక్తి బొబ్బలెట్టాడు.  "మీరు నన్ను పోలీసుల దగ్గరకు తీసుకెళ్ళలేరు! నేనేం నేరం చేయలేదు!  ఈ అమ్మాయి చాలా చురుకు.  అందుకే తనని నేను నిశ్శబ్దంగా ఉంచాల్సి వచ్చింది."  

  ఈసారి యువత అయన్ని పట్టించుకోలేదు.  బర్ట్, డేవ్ ఖైదీని కారులో పట్టణంలోకి తీసుకెళ్ళటానికి ముందుకొచ్చారు.  అతన్ని అధికారులకు అప్పగించి, తరువాత మిగిలినవారి కోసం వెనక్కి వస్తామన్నారు. 

  "మంచిది" అంది నాన్సీ.  "నేను ఆ బురుజుని పరిశోధించాలనుకొంటున్నాను."   

  "లేదు! లేదు! మీరు ఆ పని చేయకూడదు!" ఖైదీ అరిచాడు.  "మీరు అక్కడకు వెళ్ళలేరు!"

  "ఎందుకు చేయకూడదు?" నాన్సీ అడిగింది.

  "అది ప్రమాదకరం!  మీరు యిబ్బందుల్లో పడతారు!" ఆ వ్యక్తి బదులిచ్చాడు.

  "పదండి!" బర్ట్ ఆ వ్యక్తితో ఆవేశంగా అన్నాడు.  అతను, డేవ్ ఆ బందీ భుజాలను పట్టుకొని, నెడ్ కారు వైపు నెట్టుకొంటూ వెళ్ళారు.  

  "ఓయ్! ఇదిగో కారు తాళాలు" నెడ్ పరుగెత్తుకొంటూ వెళ్ళి, డేవ్ చేతులకు తాళాలిచ్చాడు.  

  అతను తిరిగొచ్చాక, నెడ్ బురుజుపైకి ఎక్కటానికి నాన్సీకి నిజంగా ఓపికుందా అని అడిగాడు.  తను ఎక్కగలనని పట్టుబట్టిందామె.  కాబట్టి నెడ్, ముగ్గురు అమ్మాయిలు కోట దగ్గరకు తిరిగి వచ్చి, రెండవ అంతస్తు వరకు ఎక్కారు. 

  "మనకు మళ్ళీ ఆ గబ్బిలాలు ఎదురుపడవని నేను నమ్ముతున్నాను"  బెస్ భయంగా అంది.  "ఈ బురుజే వాటి యిల్లైతే, మనం దాన్ని వదిలేలోగా అవి తిరిగి రావచ్చు."

  "మనం అవకాశాన్ని తీసుకోవాలి" జార్జ్ ఆమెతో అంది.

  బెస్ యింకేమీ చెప్పలేదు.  బురుజు యొక్క తలుపు యింకా తెరిచే ఉంది.  యువజనమంతా మెట్లు ఎక్కారు.  పైన రాతి గోడలతో ఉన్న వృత్తాకారపు గది ఉంది.  దానిలో మంచం, కిరోసిన్ స్టవ్, ఒక బల్ల, కుర్చీ ఉన్నాయి.  

  "ఆ ముసలాడు యిక్కడే నివసిస్తున్నాడు" నెడ్ వ్యాఖ్యానించాడు.  

  బురుజు పైకప్పుకి వెళ్ళే దారి ఉందేమోనని నాన్సీ తన కళ్ళతో చుట్టూ చూసింది.  ఒక మూలలో గోడకి యినుప నిచ్చెన ఆనించి ఉంది.  దానిపైన నేలతలుపును చూసిందామె.  నాన్సీ మిగిలినవాళ్ళకు దాన్ని చూపించింది. ముందుగా నెడ్ ఎక్కటం  ప్రారంభించాడు.  

  "నిలబడే జాగా తప్ప యిక్కడేమీ లేదు" అని పిలిచి చెప్పాడతను.

  "ఏమైనా క్లూలు ఉన్నాయా?" నాన్సీ అడిగింది.

నెడ్ చుట్టూ చూసి, తనకేమీ కనిపించలేదని నివేదించాడు.  అతను దిగగానే, నాన్సీ ఆ గది మొత్తం శోధించటం ప్రారంభించింది.  మంచం కింద ఒక కాగితపు ముక్క కనిపించి, దాన్ని తీయటానికి కిందకు దూరింది.  దాని మీద ఈ పదాలు టైపు చేయబడి ఉన్నాయి: 
 
"మన సంకేతపదం 'చంద్రమణి లోయ ' అవుతుంది."

ఇతరులు దీన్ని చూసిన తరువాత బెస్ మొదలెట్టింది. "మళ్ళీ యిక్కడ చంద్రమణి లోయ!" ఆశ్చర్యపోయిందామె.  

  "నాన్సీ !  ఇక్కడకు రావటం ప్రమాదకరమని ఆ వ్యక్తి నీతో చెప్పి నిన్ను పిచ్చిదాన్ని చేయలేదు.   ఇది ఏదో ఒక ముఠా యొక్క రహస్య స్థావరం అయి ఉండాలి.”  

  "నువ్వన్నది నిజమే!" జార్జ్ అందుకొంది.  "అంతేగాక, వాళ్ళకు ఈ ప్రాంతం యొక్క పాత పేరు తెలుసు."

 నాన్సీ ఆలోచనలో ములిగిపోయింది.  ప్రస్తుతం ఆమెకు అర్దమైనదేమిటంటే, ఈ కోట, ఆ బుంగమీసాల వ్యక్తి, తను అందుకొన్న చంద్రమణి, దుర్మార్గుల కూటమి, వీటన్నింటికీ ఎంతో కొంత సంబంధం ఉందన్నది ఖచ్చితం.  అయితే ఆ కూటమి సభ్యులెవరు?  మిస్టర్ సీమన్, అతని స్నేహితులు ?

    ఆమె, మిగిలిన వాళ్ళు ఆ గదిని పూర్తిగా శోధించారు కానీ వాళ్ళకి మరో క్లూ ఏదీ దొరకలేదు.  దూరంనుంచి వారికి కారు శబ్దం వినిపించింది.  అబ్బాయిలు తిరిగి వచ్చారని వాళ్ళు ఊహించారు.  

  "పోదాం" బెస్ భయంతో అంది.  

  సమూహమంతా కాలినడకన తిరిగి కందకం మీద వంతెన దగ్గరకు చేరుకొన్నారు.  బర్ట్, డేవ్ అక్కడ వాళ్ళను కలుసుకొన్నారు.  ఖైదీ కటకటాల వెనుక ఉన్నట్లు అబ్బాయిలు నివేదించారు.  

  "నాన్సీ! భోజనం తరువాత చీఫ్ నీతో మాట్లాడుతానన్నాడు" చెప్పాడు బర్ట్.

  "భోజనం" అన్న పదం వినగానే యువత అంతా తామెంత ఆకలి మీదున్నారో గ్రహించారు.  జార్జ్, వెంటనే బ్రాస్ కెటిల్ హోటల్ని సూచించింది.  బర్ట్, డేవ్ లతో ఎక్కువగా ఊసులు చెప్పినా, మనసు మంచిదైన వృద్ధ మహిళతో పరిచయం చేస్తానని ఆమె చెప్పింది.  మొదట అమ్మాయిల అంగరక్షకులు ముఖాలను చిట్లించారు.  కానీ ఎప్పుడైతే ఈ మిస్టరీ పరిష్కరణలో ముందుకు వెళ్ళటానికి మిసెస్ హేంస్టెడ్ నిజంగా సాయపడిందని విన్నారో, అబ్బాయిలు మెత్తబడ్డారు.  

  వృద్ధ మహిళ ఎప్పటిలా తన సాధారణ స్థలంలో లేకపోవటంతో, అమ్మాయిలు ఆశ్చర్యపోయారు.  ఊగే కుర్చీ ఖాళీగా ఉంది.  తన తల్లికి ఆరోగ్యం బాగులేదని, అందువల్ల తన గదిలోనే ఉండిపోయిందని మిసెస్ హేంస్టెడ్ కూతురు చెప్పింది.

(సశేషం)

No comments:

Post a Comment

Pages