సత్కర్మ - అచ్చంగా తెలుగు

 సత్కర్మ

పి.వి.ఎల్.సుజాత 



మనది కర్మతో ముడిపడిన జీవితం. పుట్టిన ప్రతి జీవి కర్మ చేయవలసిందే.మనది కర్మ భూమి. కర్మ సిద్ధాంతం ఊపిరి పోసుకున్న భూమి. మనం ఆలోచించేది,మాట్లాడేది,చేసేది,దేనికైనా కారణమయ్యేది కర్మ. మనయొక్క కర్మ సంబంధమైన కార్యాలు, యోగ్యత..అయోగ్యతలకు కారణమై నిలుస్తాయి. ఉఛ్వాస , నిశ్వాసములు, కనురెప్పేయడం ఏ సంకల్పం తోను సంబంధం లేక వాటంతట అవే జరిగి పోతుంటాయి. ఇవి అనైచ్ఛిక కర్మలు . ఇష్టం గా చేసే కర్మ ఫలితం వాసన రూపం గా శుద్ధ వాసన, మలినవాసన అని రెండు రకాలుగా అంతః కరణలో ఉంటుంది. పాప కర్మ ఫలితం శుధ్ధ వాసన,సగుణారాధన, దైవదర్శనం, సద్గురు సేవ, సత్కార్యాల వలన మాలిన వాసనలను జీవుడు పోగొట్టుకోవాలి. దీనివల్ల శుద్ధ వాసనలు కలుగుతాయి. మళ్ళీ జన్మ పొందకుండా ఉండాలంటే శుద్ధ వాసనలు ప్రోది చేసుకోవాలి. కర్మా చరణ మీదే మన భూత, భవిష్యత్,వార్హమానాలు ఆధారపడి ఉంటాయని పెద్దలంటారు. కర్మ మూడు రకాలు...సంచితం, ఆగామి, ప్రారబ్ధం. సంచితమంటే జన్మజన్మలనుంచి కూడబెట్టినది. గత జన్మలో చేసిన పాప,పుణ్యాల ఫలం జీవుడిని అనుసరించి వస్తుంది. వర్తమానంలో జరిగేది ఆగామి పుణ్యం. సంచితంలో ఒక జన్మకు సరిపడేంతటి ప్రారబ్ధ కర్మ,. ఇది స్వేచ్ఛా ప్రారబ్ధమని, పరేచ్ఛా ప్రారబ్ధమని రెండు రకాలు. స్వేచ్ఛా ప్రారబ్ధం లో మన ఇచ్ఛా ప్రకారం, పరేచ్ఛా ప్రారబ్ధంలో ఇతరుల ఇచ్ఛానుసారం మనకు అనుభవాలు కలుగుతుంటాయి. 

పరేచ్ఛాప్రారబ్ధం అనుభవిస్తున్నప్పుడు సాధకుడు సమాధిలో ఉన్నప్పటికీ ఇతరుల ఇష్టప్రకారం కార్యాలు చేస్తుంటాడు. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన కర్మ సిద్ధాంతం మనందరికీ అనుసరణీయమైనది. కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు. ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతి జనిత గుణాల వలన అన్ని కర్మలు అవసరార్థం చేయబడుతున్నాయి. జ్ఞానేంద్రియాలను మనసు ద్వారా నిగ్రహించి, కర్మేంద్రియాల ద్వారా కర్మ యోగాన్ని ఎవరు ప్రారంభిస్తాడో, అతడు విశిష్ఠుడు అవుతాడు. నీ విద్యుక్త కర్మాన్ని నీవు చెయ్యి. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే సృష్టి లో శరీర ఉద్దేశ్యం నెరవేరదు. ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహించబడతాయి. అహంకారం వలన వాటికి కర్త తానే అని మూర్ఖుడు తలపోతాడు. ప్రతి ఇంద్రియ విషయం లోను రాగ ద్వేషాలు ఉంటాయి. కర్మ యోగి వాటికి లోబడరాదు . అవే అతని శత్రువులు లోక కల్యాణాన్ని దృష్టిలో ఉంచుకునైనా కర్మ చేయడం మేలు. మానవులు ఎంతటి ఉత్తమ వంశంలో పుట్టినా, మంచి చెడ్డల గురించి పరిజ్ఞానం కలిగి ఉన్నా, పూర్వ జన్మ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదన్న మాట అక్షర సత్యమే. ఫలం కర్మాధీనం , దైవంతో మాకేంపని..దైవం కూడా తప్పించుకునే వీలులేని కర్మకి నమస్కారం!...అంటాడు భతృహరి. కర్మ అనేది మన కార్యాలన్నింటిని సమిష్టిగా సూచించి వాటికి ప్రస్తుత జీవితంలోనూ గత జన్మలలోను అనుసరించివున్న ప్రతిస్పందనలు సూచిస్తుంది. ఇవన్నీ మన భవితవ్యాన్ని నిర్ధారిస్తాయి. మనం ధర్మపథం అనుసరిస్తే సత్కర్మలతో ఉత్తమ ఫలితాలందుతాయి.

***

No comments:

Post a Comment

Pages