కళా విలాపం - అచ్చంగా తెలుగు
కళా విలాపం
భావరాజు పద్మిని


అప్పటికే అరగంట నుండి ఎక్కులుపెట్టి ఏడుస్తోంది ఏడేళ్ల చిట్టి... ఏడ్చి ఏడ్చీ పాలబుగ్గలు ఎర్రగా మారిపోయి పైన కన్నీటి చారికలు పడ్డాయి.

చిట్టికి ఆడుకోవాలనుంది... 

సికిలీ స్కూల్లో తనతో చదివే చిట్టి నేస్తాలైన బన్ను గాడు, రోజా, సల్మా, సోనూ గాడు అందరూ రుస్తుం బాదా వీధి మలుపులో ఉన్న ఖాళీ జాగా లో ఆడుకుంటున్నారు. చిట్టికీ వెళ్లాలనుంది...

కానీ అమ్మేవో... వీడియో చెయ్యాలి. డాన్స్ ప్రాక్టిస్ చెయ్యి, లేకపోతే వీపు చీరేస్తానంది. అమ్మకు కోపమొస్తే కొడుతుంది కూడానూ. అందుకే అమ్మ మాట కాదని వెళ్లడవంటే చిట్టికి భయం.

అప్పుడే కొండాలమ్మగుడి నుంచి వచ్చిన చిట్టి బామ్మ త్రిపురసుందరి గారు, ఏడుస్తున్న చిట్టిని చూసి, వెంటనే చేరదీసారు.

"అరెరే, బంగారూ! ఎందుకురా ఏడుస్తున్నావు?" చిట్టి బుగ్గల మీద కన్నీటి చారికలు తుడుస్తూ అడిగారు.

"బామ్మా! మలేమోనే... నా ప్లెండ్సంద్లలూ అక్కల ఆలుకుంటున్నాలు. నాకూ వెల్లాలనుంది. కానీ అమ్మేమో వీలియో చెయ్యాలంది. బామ్మా! మలి వాల్లెవలూ వీలియోలు చేయలు, ప్లోగలాములు ఇవ్వలు. హాయిగా ఆలుకుంతాలు. నేనెందుకు చెయ్యాలో ఏమో నాకేమీ అలదం కాదు. బామ్మా, నాకీ వీలియోలవీ వద్దు. అమ్మకి, నాన్నకి చెప్పవూ!" ఎక్కులు పెడుతూనే బామ్మకి తన మనసులో ఉన్న బాధను చెప్పింది చిట్టి. 

"అంతేకదా! మా బంగారు తల్లి కోసం ఈ మాత్రం చెయ్యలేనా? అమ్మకు నేను చెప్తా గానీ, నువ్వు పోయి ఆడుకో! సరేనా?" అంటూ సుందరి గారు అనగానే, వెంటనే ఏడుపాపేసి, కన్నీళ్లు తుడుచుకుని, ఆటలకు తుర్రుమంది చిట్టి.

కాసేపటికే వంటింట్లోంచి బయటికొచ్చిన జలజ, "అత్తయ్యా! చిట్టి ఏది? కనబడదే? వీడియో కోసం డాన్స్ ప్రాక్టీసు చెయ్యాలని చెప్పానే!" అంటూ అడిగింది ఒకింత కోపంగా.

"ఆటలకు పంపలేదని చిన్నబుచ్చుకొని ఏడ్చీ ఏడ్చి దాని ముఖం ఉబ్బిపోయింది. చంటిదే జలజా! ఇంకా ఆటలమీద ధ్యాసుండదూ వెర్రిపిల్లకి. అందుకే నేనే పంపాను. కాసేపు ఆడుకున్నాక వీడియో చేస్తుందిలే, దాన్నే మనకు!" అన్నారు సుందరమ్మగారు.

"దాన్ని వెనకేసుకురావద్దని మీకు ఎన్ని సార్లు చెప్పాను? అయినా నేను ఏం చేసినా దాని భవిష్యత్తు కోసమే కదా! తల్లిగా దాని బాగోగులు నాకు తెలియదా? ప్రతిసారి ఇలా నన్ను కాదని మీరు దాన్ని పంపితే నా మాటకింక ఈ ఇంట్లో విలువ ఉంటుందా? అయినా, కళాకారులకు తెలుస్తుందండి కళ విలువ! కాళ్లు జాపుకుని జీవితాలు గడిపేసిన మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది?" అంటూ నిష్ఠూరాలాడసాగింది జలజ. 

ఇంతలో జలజ భర్త గౌరీనాథ్ ఇంట్లోకి వస్తూ ఈ మాటలన్నీ విన్నాడు. "జలజా! అమ్మ గురించి నీకేం తెలుసని అంతలేసి మాటలంటున్నావు? తనకు తెలియని కళ లేదు తెలుసా? తనూ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి వాటిల్లో అనేక రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకుంది. ఎం.ఎ మ్యూజిక్. అంతేకాదు, స్కూల్ టీచర్ గా పని చేసేటప్పుడు అనేకమందికి ఈ కళల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి పిల్లలంతా ఏదో ఒక కళ పట్ల ఆసక్తి చూపేలా చేసింది. మా అమ్మ నిండు కుండ. తెలిసీ తెలియకుండా మాట్లాడకు" అన్నాడు ఒకింత కోపంగా.

"పోన్లేరా! నేను రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నెలేగా అయింది. జలజకు మాత్రం ఏం తెలుస్తుంది? ఊరుకో" కొడుకుని సమాధాన పరిచింది త్రిపుర సుందరి.

మర్నాడు "అత్తయ్యా! ఇది చూడండి, మన చిట్టి వీడియోకి లక్ష వ్యూస్ వచ్చాయి. ఎప్పటికైనా వన్ మిలియన్ వ్యూస్ కార్డ్ రావాలన్నది నా ఆశయం! చిట్టి ఫేమస్ కావాలి. చిట్టి తల్లిదండ్రులుగా మేము కూడా గుర్తింపు పొంది పొంగిపోవాలి." ఉబ్బిపోతూ చెప్పింది జలజ.

సుందరికి జలజ అమాయకత్వాన్ని చూసి నవ్వాలో, ఏడవలో తెలియలేదు. "బాగుందమ్మా!" అని ఊరుకుంది. ముక్కుపచ్చలారని పిల్లతో దాని ఒళ్లు విరిగేలా ఐటెం డాన్సులకి స్టెప్పులేయించి, వీడియోలు పెట్టడం ఏవిటో, అవి ఇతరులు మెచ్చారని మురిసిపోవడం ఏమిటో! కోడల్ని ఏమీ అనలేక, కొండాలమ్మ గుడి వద్ద ఉన్న గోదారి మెట్ల‌మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయింది.

త్రిపురసుందరి స్కూల్ టీచర్ గా కొన్ని తరాలను చూసింది. ఆ తరాలతో పాటే మనుషుల్లో, మనస్తత్వాల్లో వచ్చిన మార్పును, టెక్నాలజీ వల్ల వ్యాపించిన జాడ్యాలను కూడా చూసింది. ఎందరిని చూసినా, తాను రిటైరయ్యే సరిగ్గా నెల రోజుల ముందు జరిగిన సంఘటన ఇంకా ఆవిడ స్మృతి పథాన్ని పీడకలలా వీడలేదు...

హరి అనే ఆరవ తరగతి పిల్లవాడు ఉండేవాడు... చాలా చురుగ్గా అన్నిట్లో మేటిగా ఉండేవాడు. స్నేహితుల ప్రభావంతో ఎలాగో టిక్ టాక్ వీడియోలు చెయ్యడం అలవాటైంది. కొందరు పుణ్యానికి 'ఆహా, ఓహో' అనడంతో నెమ్మదిగా అదే వ్యసనంగా మారిపోయింది. చదువు వెనకబడింది.

చాటుగా స్కూల్ కి ఒకరోజు మొబైల్ తెచ్చి పట్టుబడ్డాడు. ఏవిటని నిలదీస్తే లంచ్ బెల్‌లో వీడియో లు చెయ్యాడానికని సమాధానం! పిల్లాడికి మొబైల్ ఇవ్వద్దని, చదువు పాడవుతోందని, హరి తల్లిదండ్రులకు పిలిచి చెప్పింది. వాళ్లూ అలాగే చేసారు. కానీ, అప్పటికే  ఆలస్యమయిపోయింది. 

మొబైల్ కు అలవాటు పడ్డ హరి, అది ఒక్కసారిగా లాక్కునేసరికి పిచ్చెక్కునట్లుగా అయిపోయాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు, సమయానికి తినేవాడు కాదు, నిద్రపోయే వాడు కాదు. స్కూల్ కు రావడం పట్ల ఆసక్తి చూపేవాడు కాదు. కొన్నాళ్లు తరువాత ఆ స్థితిని 'డిప్రెషన్' అంటారని తెలిసింది. అదృష్టవశాత్తూ, మంచి కౌన్సిలర్ దొరకడం వల్ల, అతి కష్టం మీద పిల్లవాడిని ఆ దశ నుంచి బయటకు తేగలిగారు.

ఇప్పుడు పిన్నలు, పెద్దలు అన్న తేడా లేకుండా చాలా మందిది ఇదే స్థితి. సరదాగా మొదలుపెట్టిన వ్యాపకాలు వ్యసనాలుగా మారుతున్నాయి. ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే, వచ్చీరాని ఆ కళను చూసి అందరూ లైకులు, కామెంట్లు పెట్టేసరికి అరకొర జ్ఞానంతో ఉన్న తామే గొప్పవాళ్లమనీ, ఇంక అభ్యాసం అక్కర్లేదనీ భావిస్తున్నారు. కానీ, వాళ్లకు తెలీని విషయం ఏమిటంటే ప్రతి రంగంలోనూ నిష్ణాతులుగా మనం‌ భావించే వారంతా ఈనాటికీ ప్రతి రోజూ సాధన చేస్తారు. తమను తాము మెరుగు పెట్టుకోడానికి ప్రయత్నిస్తారు.

తన చిన్నతనంలో సంగీతం మాష్టారు వేంకటేశం గారు చెప్పి‌న మాటలు ఇంకా సుందరి చెవుల్లో మారుమ్రోగుతున్నాయి....

"నేర్చుకోవడం మానేసిన రోజున మనం మరణించినట్లేనమ్మా సుందరీ! నీతో నేను ప్రదర్శనలు ఇప్పించట్లేదని నీకు కోపంగా ఉందని నాకు తెలుసు‌. కానీ, ఒక్క విషయం గుర్తుంచుకో! ఏ కళలోనైనా 80% అభ్యాసం ముగిసేవరకూ, ప్రదర్శనలు ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే ప్రేక్షకుల్లో ఎంతోమంది ఉద్ధండులు, రసజ్ఞులు ఉంటారు. వాళ్ల ముందు వచ్చీరాని ప్రదర్శన ఇవ్వడం, హనుమంతుని ‌ముందు కుప్పిగంతులేయడం లాగా ఉంటుంది. అది గురువుకూ, శిష్యునికీ కూడా మంచిది కాదు. కళలు మనోల్లాసం కోసం సృష్టించబడ్డాయి, హృదయానికి సంబంధించినవి. ఏ కళనైనా చిత్తశుద్ధి తో అభ్యసిస్తే లౌకికంగా మనలో ఉత్సాహాన్ని నింపడం మాత్రమే కాక, భగవంతుని చేరడానికి కూడా అవి తోడ్పడతాయి. ఇంతటి గొప్పవైన, పవిత్రమైన కళల స్ధాయిని మెప్పుకోసం, అవార్డుల కోసం తగ్గించడం సబబుకాదు. నా మాటలు గుర్తుంచుకో, నీకిప్పుడు అర్థం కాకపోయినా తర్వాతైనా వీటి వెనకున్న లోతు తెలుస్తుంది!" 

దబ్బున గోదాట్లో ఏదో పడ్డ శబ్దమైంది. ఆలోచనల నుంచి సుందరి తేరుకుని చూసేలోగా అల్లంత దూరాన కొట్టుకుపోతూ ఎవరో పాప! ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకి ఆ పాపను పట్టి తెచ్చింది, ఈతొచ్చిన సుందరి. అదృష్టవశాత్తూ, నది నీటి వడి తక్కువగా ఉండడంతో ఆమె పని సులువయింది. ఒడ్డుకొచ్చాకా చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, తమకు రెండిళ్లవతల కొత్తగా కట్టిన అపార్ట్ మెంట్లో ఉండే పన్నెండేళ్ల సంధ్య! ఊళ్లో వాళ్ల సాయంతో ఆ పాపను వారింటికి చేర్చింది సుందరి. 

వీణ నేర్చుకుంటూ ఈమధ్యన తరచుగా ఊళ్లో ప్రదర్శనలిస్తోంది సంధ్య. ఆ మధ్య శ్రీరామనవమి పందిట్లో ఆమె వాయించగా వింది. అన్నీ తప్పులతడకలు. ఒక్క స్వరం సమంగా పడకపోడంతో అక్కడ ఉండలేక, ఇంటికి వెళ్లిపోయింది సుందరి. చదువు కూడా బానే ఉంటుందని తెలిసింది. మరింతలో ఏమైంది? ఎందుకిలా ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసం చేసింది?

సంధ్యను కాపాడినందుకు సుందరికి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెప్పారు ఆమె తల్లిదండ్రులు. విషయం తెలిసిన జలజ కూడా అక్కడికి వచ్చింది. కాసేపటికి సంధ్యకు స్పృహ వచ్చింది. ఆమె తేరుకున్నాకా, ఆమెను దగ్గరకు తీసుకుని, అనునయించి, ఆమె ఇలా ఎందుకు చేసిందని అడిగారు సుందరిగారు. ఎక్కులు పెట్టి ఏడుస్తూ ఇలా చెప్పింది సంధ్య...

"మా వీణ టీచర్ కి ప్రోగ్రాముల పిచ్చి. పిల్లలతో ప్రదర్శనలు ఇప్పిస్తానని అందరి దగ్గర బోలెడంత డబ్బులు తీసుకుంటుందట. ప్రతి వారం మాకు ప్రయాణాలే! ఎక్కడో అక్కడ ప్రదర్శనలే! వాటికోసం మా పేరెంట్స్ ని ఒప్పించి, మాకు మంచి పేరొస్తోందని, ఆపద్దని చెప్పి, తీసుకువెళ్లేది. ఇంతా చేస్తే ఎక్కడ వాయించినా మాకొచ్చింది ఆ నాలుగు పాటలే! ప్రాక్టీస్ చేసి చేసి వేళ్ళు తెగిపోయేవి. ప్రయాణాలు చేసి చేసి నీరసం కమ్మేసేది. ఇదంతా ఒకపక్క! మరొక పక్క తరచు ప్రయాణాలతో స్కూల్ క్లాసులు మిస్ అయ్యేవి. చదువులోనూ వెనకబడ్డాను. మార్కులు తక్కువ వస్తున్నాయని టీచర్లు అందరి ముందు అవమానించేవారు. ఎంత చెప్పాలని ప్రయత్నించినా ఇంట్లో అమ్మానాన్న కానీ, స్కూల్లో టీచర్లు గానీ నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. ఇంక ఎవ్వరూ నామీద పెడుతున్న ఒత్తిడిని అర్థం చేసుకోరని తెలిసిపోయింది. అందుకే గోదాట్లో దూకి చచ్చిపోదాం అనుకున్నాను." అంటూ భోరున‌ ఏడవసాగింది సంధ్య.

"చూసారా! మీ ఆకాంక్షలతో పిల్లలెంత నలిగిపోతున్నారో! తల్లిదండ్రులుగా పిల్లల్ని రక్షించక పోయినా పర్వాలేదు, కానీ మీరిచ్చే టార్గెట్లతో ఇలా శిక్షించి, భక్షించకండి. స్వతహాగా వచ్చిన ఆసక్తి వేరు, బలవంతంగా వాళ్ల నెత్తిన రుద్దేవి వేరు! ఈనాటి ప్రపంచంలో తెల్లారి లేస్తే పోటీ... పోటీ... ఒకరితో ఒకరు పోటీలు పడుతూ వెర్రి పరుగులు! వాటితో పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నారు. పిల్లలు ఆల్రౌండర్లు అవక్కర్లేదు, అసలు కళ్లముందు బతికుంటే చాలు! పిల్లలు ఏదోటి చేసి, ఉన్న పళంగా పేరు తెచ్చేసుకుని వెలిగిపోవక్కర్లేదు. తమకున్న చిన్ని ప్రపంచంలో బంగారు బాల్యాన్ని ఆస్వాదిస్తూ ఆడుతూ పాడుతూ ఆనందంగా, ఆరోగ్యంగా పెరిగితే చాలు. అటుపైన నచ్చిన రంగంలో వారంతట వారే రాణిస్తారు. సరైన గురువు చేతిలో పెట్టిన పిల్లలు మంచి కళాకారులు అవుతారు. తమ కళా విలాసంతో అందరినీ మురిపిస్తారు. అలా కానప్పుడు చేసేది, ఇదిగో సంధ్య విషయంలో లాగా కళా విలాపమే! అది తెచ్చేది ప్రమోదం కాదు, ప్రమాదం!" అక్కడున్న జలజను, సంధ్య తల్లిదండ్రులను చూస్తూ అంది సుందరి.

అపరాధ భావనతో సాలోచనగా తలదించుకున్న జలజను చూసి, తృప్తిగా నిట్టూర్చింది త్రిపురసుందరి.

No comments:

Post a Comment

Pages