శంఖుడు -లిఖితుడు - అచ్చంగా తెలుగు

 శంఖుడు -లిఖితుడు

అంబడిపూడి శ్యామసుందరరావు


"అంతరంగ మందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు ,ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరు గడ, విశ్వదాభిరామ వినురవేమ "అనేది నేటి నీతి మనము చేసిన తప్పుమనకు తెలుసు కానీ నేనేమి చేయలేదు అని బుకాయిస్తాము. పైపెచ్చు అదేమీ పెద్ద తప్పుకాదులే అని మనలను మనమే సమర్ధించుకుంటాము.ఈ తప్పొప్పుల గురించి ఒక నీతి కద భారతము లోని  శాంతి పర్వములో ఉంది ఇక్కడ ధర్మమూ తప్పని వాడీకే పుణ్యగతులు ప్రాపిస్తాయని ఈ కధలోని నీతి అంతే కాకుండా చక్కగా రాజ ధర్మము పాటించటమే విష్ణు పద ప్రాప్తికి మార్గము అని కూడా ఈ కధ చెపుతుంది.అంటే ఈ కధలో ఇహము పరము రెండు ఉన్నాయి. కురు క్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రుసమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు. దాంతో స్వయంగా వేదవ్యాసుడే ధర్మరాజుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘దర్మరాజా ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. ఒక రాజుగా ధర్మస్థాపన కోసం యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో శత్రువులని సంహరించడం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నువ్వు శత్రువులని వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపమూ అంటదు. ఇక నీ బాధ్యతని నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది?’ అంటూ వ్యాసుడు ధర్మరాజుని ఓదార్చాడు.అందుకు ఉదాహరణగా శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరుల కధ చెపుతాడు.  


 ఈ కథ సుద్యుమ్నుడు అనే రాజు పాలన లో జరిగింది  పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వాళ్లు ఇద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే! త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడినవారే! వారిద్దరూ కూడా బహుదానదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తున్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచిచూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆశ్రమంలో విరగకాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పళ్లని చూడగానే అతనికి నోరూరింది. వెంటనే కాసిన పళ్లని కోసుకున తినసాగాడు. శంఖుడు పరద్రవ్యం అనుమతి పొందకుండా తీసుకొన్న దోషం పొందిన తమ్ముడి పైన ఆగ్రహించాడు.పరుల సొత్తు పాము వంటిది.. అనీ , పరద్రవ్యము రాయితో సమానము  అనీ మన విశ్వాసం , మనది కానిదాని పైన ఆశ కలగడం పతన హేతువు.మనసెపుడూ నిర్మలంగా ఉండాలి.కాబట్టి తమ్ముణ్ణి శుద్ధుణ్ణి  చేయడానికీ రాజదండన అనుభవించి రమ్మన్నాడు. లిఖితుడూ విజ్ఞుడే కాబట్టి, శిక్ష అనుభవించడం పాప విమోచన మార్గం అని సంతోషించాడు.


తమ్ముడూ రాజు దగ్గరకు చేరాడు. విప్రోత్తముడు వచ్చాడని ఆనందపడి పోయాడు. ఏమిచ్చి సేవ చేసుకో మంటారు?. అని వినయం చూశాడు రాజు. " రాజా నేను చెప్పినట్టు చేయాలి. మాట ఇచ్చారు గదా!" అన్నాడు లిఖితుడు జరిగిన సంగతి చెప్పి "మా అన్న మీ శిక్షతో పావనుణ్ణయి రమ్మని ఆదేశించాడు. నాకు శిక్ష వేయడం మీ విధి.".అన్నాడు.రాజు తల్లడిల్లి పోయాడు." వేద వేత్తలు..మీకు నేను శిక్ష విధించడమేమిటి?. నన్ను క్షమించండి "అన్నాడు రాజు.కానీ లిఖితుడు పాప పరిహార్దము శిక్ష వేయవలసినదే అని రాజును బలవంతపెట్టాడు.లిఖితుడు "అందరికి ఒకటే శిక్ష ఉండాలి ఆ శిక్ష కూడా  వెంటనే అమలు చేస్తే ఈ పీడా ఇంతటితో  విరగడై నా మనసును దహించదు సత్కర్మల అనుభవానికి ఈ పాపమూ అడ్డురాదు " అని లిఖితుడు రాజును తన రెండు చేతులు ఖండిచమని ఆదేశించాడు.


రాజు ఇక తప్పక ముని ఆదేశానుసారం  లిఖితుని బాహులను(చేతులను) ఖండించమని ఆదేశించాడు లిఖితుడు తెగిపోయిన చేతులతో పాపము పరిహారము అయింది అన్న ఆనందముతో అన్న శంఖుని ఆశ్రమానికి చేరాడు.శంఖుడు లిఖితునితో,"వేళ  అయింది నదికి పోయి పితృ తర్పణము చేసిరా  "అని చెప్పాడు నదికి చేరిన లిఖితుడు స్నానము చేసి భక్తి పూర్వకముగా అర్ఘ్యము ఇవ్వబోయినాడు చేతులు యధాప్రకారముగా సహకరించి పోయిన చేతులు మళ్లి వచ్చాయి   పోయిన బాహులను ఇచ్చిన నదీమ తల్లి కాబట్టి ఆ నది "బాహుదా" నదిగా ఆనాటి నుండి పిలవబడుతుంది.ఆ విధముగా లిఖితుడు తన తప్పుకు శిక్ష పొంది పునీతుడయినాడు రాజు కూడా తగిన దండన వేసి రాజ్య పాలనలో ఏ విధమైన పక్ష పాత దొరణి  లేకుండా పాలన సాగించే సుకృతము కలిగింది.వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్లి ‘అన్నగారు! ఖండితమైన నా చేతులని కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా! మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా! ఆ రాజు గారి దగ్గరకు వెళ్లమని ఎందుకు ఆదేశించారు?,’ అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు శంఖుడు చిరునవ్వు చిందిస్తూ- ‘సోదరా! ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవడం మన ధర్మం. పాలన చేయడం, పాపులను శిక్షించడం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురుపత్నిని మోహించడం, సాధువులను హత్య చేయడం, సురాపానం, చెడుసావాసం చేయడం వంటి పాతకాలకి రాజదండన అనుభవించాల్సిందే! అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను,’ అంటూ చెప్పుకొచ్చాడు.


అంప శయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో," రాజు పదవి చాల యోగ్యమైనదనీ దాన్ని చక్కగా నిర్వర్తించి పుణ్యం సంపాదించుకో అని , ఏదో తప్పు చేశానని అనవసరమైన చింతతో కుమిలి పోవద్దు అని ధైర్యం చెబుతూ, తాను గతంలో విన్న పుణ్య కథగా దీన్నికూడ చెప్పాడు.ఉదాత్తుణ్ణి చిన్న తప్పైనా దహిస్తుంది.. దానికి ప్రాయశ్చిత్తం చేసుకొన్నపుడు అపరిమిత ఆనందం కలుగుతుంది. అది భౌతిక లౌకిక వస్తువుల చేత లభ్యమయ్యేది కాదు. ఏ ఇంద్రియాలకూ (ఇక్కడ లిఖితుడు జిహ్వకు వశుడైనాడు) లొంగి పోక వాటిని తన వశంలో ఉంచుకొన్న వాడు తన నిత్య బ్రహ్మానందం నుండి పతనం కాడు. పై కథ చదివాక... చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్షా! అన్నగారు మళ్లీ తల్చుకోగానే చేతులు తిరిగివస్తాయా! లాంటి ప్రశ్నలకు రావడం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటివారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెబుతోంది. అది సొంత సోదరుని సొత్తయినా కానీ, అతని అభీష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవూ ఉంది. అన్నింటికీ మించి... ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది.

***

No comments:

Post a Comment

Pages