అనసూయ ఆరాటం -10 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం -10 

చెన్నూరి సుదర్శన్ 


రవీందర్ ఇంజనీరింగ్ సదువైపోయి.. హైద్రాబాదు పైవేటు కరంటు మీటర్ల కంపినిల నౌకరు చేత్తాండు. 

ములుగు వచ్చి పెండ్లి చేసుకొని పెండ్లాన్ని తీస్కోని హైద్రాబాదు పోయిండు.

సురేందర్ వరంగల్ల ఎమ్మెస్సి అట్ల పూర్తైందో లేదో.. నిర్మల్ల టెలిఫోన్ ఆఫీసుల నౌకరచ్చింది. 

సురేందర్ సుత ములుగు వచ్చి పెండ్లి చేస్కోని పెండ్లాన్ని తీస్కోని నిర్మల్ పోయిండు.

అనసూయ చిన్న బోయింది. వారానికోపాలి సురేందర్ వచ్చిపోతాంటే.. వచ్చినప్పుడల్లా ఆదిరెడ్డి సదువు సందెలు చెక్కుచేత్తాంటే.. నా కొడుకులు సుత తమ్ముని లెక్కనే సదువుకొని పైకి రావాలని తల్సుకునేది. 

కాని తనొకటి తల్సుకుంటే దేవుటొకటి తల్తడన్నట్టు ఏ టైంల ఏం జర్గుతదో ఎవ్వలకూ తెల్వదు.

జయమ్మకు ఐదేండ్లచ్చినై. బిడ్డను బల్లె షరీకు చెయ్యాలని అనసూయ నిత్తె మొత్తుకునేది. లింగారెడ్డి ఈ చెవుతోటి విని ఆ చెవు తోటి వదిలేసేటోడు. అనసూయ చూసీ.. చూసీ ఒక రోజు పొద్దుగాలనే.. తయారయ్యే లింగారెడ్డిని కిందికి మీదికి చూసుకుంట..

“ఆడపిల్లకు సదువు వద్దనుకుంటానవా.. ఏంది. నీ మన్సుల ఏమున్నదో సెప్పు. నేనంటే మా ఊళ్ళె వసతి లేక సదువుకోలేదు కాని నాబిడ్డ సదువుకోవద్దా.. రెండు రోజులు సూత్త. నేనే బల్లె షరీకు చేసి వత్త” అని కరాఖండిగ చెప్పింది. 

“అనసూయా.. నాకెందుకో పొద్దటి సంది పానం సతికిల పడ్డట్టున్నది. శాతనైతలేదే” అన్నడు లింగారెడ్డి. 

“మరి దుకాన్లకైతే లేసి గోచిపెడ్తవ్.. బిడ్డ.. బడి అనంగనే ముక్కులకత్తది..” 

“సైసు.. ఎప్పుడు లడ, లడ వస పిట్ట లెక్క ఒర్రుతాంటవ్.. జయమ్మను బల్లె షరీకు చేద్దామనే తయారైతాన. ఇవ్వాల దుకాన్లకు పోను”అన్నడు లింగారెడ్డి.

అనసూయ మొకం టూబు లైటు లెక్క ఎలిగింది. “గాముక్క ముందుగాల చెప్పద్దా.. మరి మందులు నిత్తె ఏసుకుంటానవా.. లేదా.. ఈ సందుల నేను సరింగ సూత్తలేను” 

సప్పుడు సెయ్యలేదు లింగారెడ్డి. 

అనసూయకు పెనిమిటి ఏమన్నడో.. ధ్యాస లేదు. దబ్బ, దబ్బ జయమ్మకు తానం సేయించి కొత్త బట్టలు తొడిగింది. కొత్త సంచిల కొత్త పలక పెట్టింది. రెండు మూడు బలపాలు చేతికిచ్చింది. లింగారెడ్డి జయమ్మ చెయ్యి పట్టుకొని బడికి తోలుక పోయిండు. 

లింగారెడ్డి మందుల సంచి తీసి చేసింది. సంచి ఖాళిగున్నది. అనసూయ పానం ధస్సుమన్నది. ఇంట్ల కర్సు పెరుగుతాందని  మందులు తెచ్చుకునుడు బందు చేసిండా.. ఏందని.. రాంగనే మందులు తెచ్చుకొమ్మని ఎంబడి పడాలె అనుకున్నది. 

పగటీలి బువ్వ తినే యాల్లైంది.. ఇంకా లింగారెడ్డి వత్తలేడేందని ఎదురి సూడసాగింది అనసూయ. దుకాన్లకు పోనన్నోడు. మల్ల దుకాన్లకే పోయుంటడని మన్సుల గులుక్కోబట్టింది. బడి రోడ్డవతల శాన దూరమాయె .. పంతుల్లు వచ్చిండ్లో.. లేదో అని ఇంకో పక్క అనుకోబట్టింది. 

ఇంతల చెమటలు కారంగ వచ్చిండు లింగారెడ్డి. తుడ్సుకుందా మంటే సుత ఓపిక లేదు. మెల్లంగ ఇంటి అరుగు ఎక్కిండు. అనసూయ లింగారెడ్డి హాలత్ సూడంగనే గుండె బేజారైంది. ఇంట్లకుర్కి గిలాసల మంచి నీల్లు తెచ్చి తాగమన్నది. గిలాస తీస్కోని ఒక బుక్క తాగి భళ్ళున రకుతం కక్కుంట.. అమాంతం అట్లనే అరుగు మీద ఇర్సుక పడ్డడు. చాతంత గుద్దుకుంట లబ్బ, లబ్బ మొత్తుకో బట్టింది. అనసూయ ఏడ్పు.. పెడ బొబ్బలకు వాడకు వాడ ఉర్కచ్చింది. రక్తం మడుగుల పడ్డ లింగారెడ్డిని చూసి ఏడ్వనోల్లే పాపం.  

ఇంటిపక్క వెంకటయ్య సైకిలు మీద దవకాన్లకుర్కి కాంపౌండరు ఖాన్‌సాబ్‌ను తీస్కచ్చిండు. ఖాన్‌సాబ్ అప్పుడప్పుడచ్చి లింగారెడ్డికి సూదులిత్తాంటడు. ఆయనకైతే లింగారెడ్డి తబియత్ సంగతి పురంగ తెలుసు. 

ఖాన్‌సాబ్ సైకిలు దిగుడు,  దిగుడే మంచాల పండుకోబెట్టిన లింగారెడ్డి తానకు పోయి హాలేసుకొని సూసిండు. చెయ్యి నాడి పట్టుకొని సూసి పెదువిర్సిండు. లింగారెడ్డి చెయ్యి కిందికి వాలిపోయింది. 

“ఫాయిదా నహ్హె.. చల్‌బసా..” అన్కుంట నొసలు పట్టుకున్నడు. 

లింగారెడ్డిని కింద సాపలేసిండ్లు. 

అనసూయ ఒక్క సారే తల్కాయె గోడకేసి దబ్బ.. దబ్బ.. కొట్టుకొని బేవోసయ్యింది. ఖాన్‌సాబ్ అనసూయ హాలత్ సూసి ఒక సూదిచ్చిండు. సూడచ్చినోల్ల కండ్లల్ల నీళ్ళు కాలనీల కాలువలై పారబట్టినై. 

జరంత సేపటికి అనసూయ తేరుకున్నది. 

సేట్లు దుకాన్లు బందు చేసి వచ్చిండ్లు. పుల్లారెడ్డిని తీసుకరాను   రమేషు శాయంపేటకు పోయిండు. 

తెల్లారితే మంగళారమని.. అదే రోజు లింగారెడ్డికి ఆదిరెడ్డితోని తల గొర్వి పెట్టిచ్చిండ్లు. నాత్రి తొమ్మిదయ్యింది. 

‘మనల్ని అన్నాల చేసిపోయిండు అన్న.. అయ్యా, అవ్వ లేని లోటు లేకుంట పెంచిండు అన్న.. తండ్రి లెక్క ముందల పడి నా పెండ్లి సేసిండు అన్న’ అని వల్లిచ్చుకుంట అనసూయ కాల్ల మీద పడి ఏడ్వబట్టిండు పుల్లారెడ్డి. 

పుల్లారెడ్డి పెండ్లాం కడుపుతోటి ఉండుట్ల సావుకురాలేదని అడిగి తెల్సుకున్నది బతుకమ్మ. 

తెల్లందాక బతుకమ్మ, అనసూయ దగ్గర్నే ఉన్నది. తెల్లంగ తెల్లారింది కాని అనసూయ ఏడ్పు ఆగలేదు. కంట్లె నీల్లు ఇన్కిపోయినై. 

బొండిగె దగ్గర పడి పిల్లి కూతలు రాబట్టినై.

దినాలుగడ్తానై..అనసూయ ఏడ్సుడూ.. పోరగాండ్లేడ్సుడు.

“గిట్లైతే ఎట్ల అనసూయా.. పిలగాండ్లు ఏమైపోతరు.. బెంగటిల్లుతరుకాదు.. మన్సు రాయి చేసుకోవాలె” అని బతుకమ్మ నిత్తె వచ్చి ఊకుండ బెట్టేది.

కాలానికి గుండెకోతలను మాన్పే మంచి మందున్నదేమో.!

దినాలు గడుత్తాంటే.. అనసూయ బొట్టు లేని బోసి మొకం కొన్నాల్లకు కాలనీల కానరాబట్టింది.  

(సశేషం)

No comments:

Post a Comment

Pages