అతడి హృదయం నాతిచరామి - అచ్చంగా తెలుగు

అతడి హృదయం నాతిచరామి

Share This
 అతడి హృదయం నాతిచరామి

 కోసూరి ఉమాభారతి 


డోర్-బెల్ మోగడంతో, మరిగిన పాలగిన్నెపై మూత పెట్టి, స్టవ్‌లు ఆర్పి.. వెళ్లి తలుపు తీసింది శారద. 

ఎదురుగా విశ్వనాధ్. “నమస్తే అత్తయ్యా.” చేతులు జోడించాడు చిరునవ్వుతో.

“హలో డాక్టర్ బాబు.. రా...కూర్చో. ఈ అత్తయ్యని పలకరించి ఆరునెల్లయిందని గుర్తొచ్చి ఈ వేళప్పుడు వచ్చావా?”        అడిగిందామె అలక నటిస్తూ.  

“’మణమ్మ’ అనే ఒక పేషంటుని వీధి చివర్న వాళ్ళింట్లో దింపడానికి .. ఇటు వచ్చాను. ఇక్కడివరకూ వచ్చి మిమ్మల్ని పలకరించకుండా ఎలా వెళతాను?” అన్నాడు విశ్వనాధ్..

“పేషంటుని నీవు ఇంట్లో దింపడమేమిటి విశ్వం?” అడిగిందామె. మేనల్లుడిని 'విశ్వం' అని 'విశ్వం బాబూ' అని 'డాక్టర్ బాబు'  అని సమయానుసారంగా  పిలుచుకుంటుంది శారద. 

“ఈవేళ..మణమ్మ అనే హార్ట్ పేషంటుని చూసాను. ఆమెని తీసుకొచ్చిన యువతి.. 'పెద్దామెకి గుండె దడగా ఉందని, చెకప్ అయ్యేలోగా వచ్చేస్తానని' చెప్పివెళ్ళింది. మణమ్మ ల్యాబ్-పరీక్షలు, కాన్సెల్ట్ అయి క్లినిక్ మూసే సమయానికి కూడా ఆ యువతి రాలేదు. అందుకే అడ్రస్ కనుక్కుని ఆవిడని ఇంట్లో దిగవిడిచి ఇటు వచ్చానత్తయ్యా.” వివరించాడు విశ్వం.

“ఆయింత వీళ్ళు..వీధి చివర్న ఉండే మణమ్మ, ఆమె మనమరాలు సౌందర్య కారు కదా! బాధ్యత లేని ఆ అమ్మాయి ఆ పెద్దామెనిలా ముంచడం మామూలే. పాపం మణమ్మ.” అంటూ వాపోయింది శారద.

“ఆమె పేరు సౌందర్యా..? పేరుకి తగ్గట్టే ఉంది.  వివాహితా? లేదంటే చదువు, వయసు, వివరాలు... తెలిస్తే చెప్పండత్తయ్యా.” అడిగాడు విశ్వం ఆత్రుతగా.

“దాని వివరాలు నీకెందుకు? మందలిస్తావా? లేక అందంగా ఉందే చాలని ప్రేమ సందేశం పంపిస్తావా? సౌందర్య కన్నెపిల్లే కాని ఆ టపాకాయ జోలికి వెళ్ళకు బాబు. ఈ చుట్టుపక్కల సౌందర్యకి అభిమానులు ఎక్కువే. శత్రువులూ ఎక్కువే. అసలైనా నీవంటి మంచిబాలుడికి అటువంటి పిల్లతో పనేంటి?” అడిగింది ఆశ్చర్యంగా.

“కరక్ట్ గా ఊహించావు. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టి.. నాకీ పెళ్లి సంబంధం కుదర్చమంటాను. పెళ్ళిపెద్దగా వ్యవహరించి మాపెళ్లి చేయమంటాను. పెళ్ళయ్యాక ఆడపిల్లలు మారిపోతారులే అత్తయ్య. ఇక అంతటి అందగత్తెకి అభిమానులు ఉన్నట్టే, అసూయపరులూ ఉంటారు. పోతే, నా గురించి చెప్పేప్పుడు - త్వరలో కార్డియాలజీ ట్రైనింగ్ కోసం అమెరికా వెళుతున్నానని, అక్కడే స్థిరపడతానన్న వివరాలు కూడా వాళ్లకి తెలియజేయండి.” ఆన్నాడు ఉత్సాహంగా..

నిర్ఘాంత పోయిన శారద.. “చూడు విశ్వం బాబు.. సౌందర్యకి అహంభావం, అతిశయం, అత్యాస వంటి అవలక్షణాలన్నీ ఉన్నాయి. నిలకడ లేదు. చదువంటే శ్రద్ధ లేదు. ఫాస్ట్ గర్ల్. నీకన్నా వయసులోనూ సౌందర్య ఆరేడేళ్ళు చిన్నదే. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రికి మతిస్థిమితం లేదు. మాకు వాళ్ళు ఐదేళ్ళగా తెలుసును. మధ్యతరగతి కుటుంబం.” అన్నదామె.

“అలా అనకండి అత్తయ్యా. నా కోసం గట్టిగా ప్రయత్నించండి. మా అమ్మానాన్నల సంగతి మీకు తెలుసు.  వారు తెచ్చిన సంబంధాలు వద్దంటానని కోపంగా ఉన్నారు. ఎవరినైనా సరే నాకిష్టమైన అమ్మాయిని  పెళ్ళిచేసుకొన్నాకే అమెరికా

వెళ్ళమని  షరతు విధించారు . ఈ అమ్మాయినయితే చేసుకుంటాను. కుదిరితే రేపే మాట్లాడి రెండురోజుల్లో మేము కలిసేలా

ఏర్పాటు చెయ్యండి.” అంటూ లేచి సెలవు తీసుకున్నాడు.

 విశ్వనాధ్ కి...శారద స్వయాన మేనత్త.  ఆమె అన్న సూర్యం, వదిన రమ్యల ఒక్కగానొక్క బిడ్డ విశ్వనాధ్. రమ్య అనారోగ్యం వల్ల ఆ పసివాడిని పదేళ్ళ పాటు శారదే పెంచడంతో..మేనల్లుడులా కాక సొంత కొడుకులా మెలుగుతాడు విశ్వం.    శారద భర్త సుందరం. వారికీ ఓ కొడుకు, రాజా.  సుందరం పాతికేళ్ళగా హైదరాబాదులోని  అమెరికన్ కాన్సులేట్ లో లైబ్రేరియన్గా పనిచేసి రిటైర్ అవబోతున్నాడు. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకునే వెసలుబాటు ఉండడంతో... కొడుకు రాజా భవిష్యత్తు దృష్ట్యా అమెరికాలో స్థిరపడ్డానికి  సిద్ధమౌతున్నారు  వారు.

ఇక విశ్వనాద్ నిజంగానే మంచి బాలుడు.  చక్కగా చదువుకుని వైద్య వృత్తిలో స్థిరపడ్డాడు. ఒక్క పెళ్లి విషయంలో తప్ప.. ఎన్నడూ తల్లితండ్రుల మాట జవదాటలేదు.  సౌందర్యవతి ఐన భార్యని పొందాలన్నది అతని కల. త్వరలో వివాహం చేసుకుని అమెరికాలో కార్డియాక్-సర్జన్ గా ఎదగాలన్నది అతని కోరిక.

***

మణమ్మ, సౌందర్యలతో మాట్లాడి.. విశ్వంకి ఫోన్ చేసింది శారద. “మరో మారు హెచ్చరికే అనుకో..విశ్వం బాబు. నా దృష్టిలో నీవు, సౌందర్య తూర్పు-పడమర వంటివారు. ఐనా నీకోసం మాట్లాడాను. ఏ కళనుందో కాని నిన్ను కలిసేందుకు సుముఖత చూపింది. సాయంత్రం అమ్మావాళ్ళని తీసుకునిరా, వాళ్ళని కలుద్దాము.” అంది.

“నువ్వు గ్రేట్ అత్తయ్యా. నీవు చెప్పేది అర్ధమయింది. నేననేదేమంటే, మా పెళ్ళయ్యాక.. మేము కూడా   అమెరికాలోనే స్థిరపడతాము కదా! అప్పుడు సౌందర్యని మనకి కావలసినట్టుగా మలుచుకుందాములే శారదమ్మ.” అన్నాడు ఉత్సాహంగా విశ్వం. 

“మరిచిపోయాను విశ్వం. నీవు వెళ్ళేది హ్యూస్టన్  లోని ‘బేలార్ మెడికల్ స్కూల్’కే కదూ. మా ఆడబిడ్డ  కొడుకు రమణ.. యేళ్ళగా హ్యూస్టన్ లో ఉన్నాడు.  అక్కడ వాతావరణం మెరుగ్గా ఉంటుందట కదా.  అందుకే మేము కూడా హ్యూస్టన్ లోనే సెటిల్ అవుతామట..మరో రెండునెల్లలో మా ప్రయాణమట.  మీ పెళ్లి కుదిరితే తిరుపతిలోనే జరగాలి మరి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటాను.” అంది శారద .

***

నిశ్చితార్దం హైదరాబాదులో, వివాహం తిరుపతిలో దగ్గరుండి జరిపించాకే శారద, సుందరంలు కొడుకుతో  అమెరికాకి పయనమయ్యారు . ముందు కొన్నాళ్ళు బంధువైన రమణ ఇంట ఉంటామని విశ్వంకి సమాచారం ఇచ్చారు. విశ్వం కూడా తమ అమెరికా ప్రయాణం ఏర్పాట్లు ముమ్మరం  చేసాడు. 

***

ఆశించినట్టుగానే నాలుగు నెల్ల  తేడాతో అందరూ అమెరికా చేరారు.  ముందుగా శారద కుటుంబం, వెనువెంటే విశ్వం, సౌందర్యలు హ్యూస్టన్ నగరం చేరారు. జెనెటిక్స్ రీసెర్చ్ చేసేందుకు శారద కొడుకు రాజాకి, కార్డియాలజీ ట్రైనింగ్ దృష్ట్యా విశ్వంకి ...వీలుగా ఉండేలా ‘బేలార్ మెడికల్ సెంటర్’ సమీపంలోనే ఇరు కుటుంబాలు నివాసం ఏర్పరుచుకున్నారు .

మధ్యాహ్నం  బ్రేకులో తరచు మేనత్త, మామయ్యల వద్దకు వచ్చి వెళుతుంటాడు విశ్వం.                                   

సమయం దొరకడంతో ఆ రోజు కాస్త ముందుగానే అత్తయ్య ఇంటికి వెళ్ళాడు. “ఆకలి దంచేస్తుంది ఆత్తయ్యా.”

అన్నాడు విశ్వం.  

“అన్నీ బల్లమీదే ఉన్నాయి. వేడిగా ఉన్నాయి. వచ్చి తిను. మామయ్య ఇప్పుడే తిని వాకింగ్ కి వెళ్ళారు.” అంటూ విశ్వంకి ప్లేటు అమర్చి ఉప్మా వడ్డించింది శారద.  “గడిచిన ఆరునెల్లల్లో ఎక్కడివాళ్ళం.. ఎక్కడికి వచ్చామయ్యా విశ్వం?  అమెరికా దేశం మరో ప్రపంచంలా ఉంది నాకు.” అంటూ కప్పులోకి కాఫీ వడపోసింది.                                                                                  

“ఈ రోజునుండి పనయ్యాక, నాలుగు గంటల పాటు  పక్కనే ఉన్న ఓ కార్డియాలజీ క్లినిక్లో సహాయకారిగా పని ఒప్పుకున్నాను.” అన్నాడు టిఫిన్ కానిచ్చి.. కాఫీ సేవిస్తూ విశ్వం.

“డబ్బు చాలడం లేదంటూ... మూడో ఉద్యోగమా? నిజానికి నీ అమెరికా కల, అందమైన భార్య కావాలన్న కల.. రెండూ నెరవేరినా.. ఒకటికి మూడు ఉద్యోగాలు చేస్తూ ఏమి  సుఖపడుతున్నావు? వంట రాని భార్య. తీరికలేని బతుకు. ఏదోక సమయానికి వచ్చి నేను పెట్టింది తిని తిరిగేస్తున్నావు . పెళ్లయ్యాక, ఇక్కడికి వచ్చేలోగా..‘ఫాషన్-షో’లంటూ నీ భార్య ..నిన్ను పట్టించుకోకుండా తిరేగేదని గొడవలు. ఇక్కడికి వచ్చాక దుబారా ఖర్చే కాకుండా.. కొత్తకాపురమన్న ధ్యాస లేకుండా తన పెద్దమ్మ కొడుకు రఘుని ఇంట్లో తిష్ట వేయనిచ్చింది  సౌందర్య.  నీవా నోరు మెదపవు.  ఇదంతా నాకే మింగుడు పట్టంలేదు.  ఇక మీ అమ్మనాన్నలకి తెలిస్తే ఎంత బాధ.” ఆవేశంతో ఉడికిపోయింది శారద.

విశ్వం తలెత్తి మేనత్త వంక చూసాడు. “అలా కుమిలిపోకత్తయ్యా.  అంతా నా తలరాత. అయినా ఉద్యోగాలు చేయడం నాకు కష్టంగా లేదులెండి. సౌందర్య మనసు కుదుటపడి అమెరికా జీవనాన్ని అర్ధం చేసుకుని మానసికంగా ఎదిగితే చాలు. అంతా సర్దుకుంటుంది . కానీ ఆమె చుట్టం గురించే ఏమి చెయ్యాలో, ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. మనసు బాగోడంలేదు అత్తయ్యా.” వాపోయాడు విశ్వం.

“సరే, సరే ఆలోచిద్దాం.  నీకు కాస్త ఉప్మా, చోలే బాక్స్ లో పెట్టిస్తాను. రాత్రిలోగా తినేసేయి విశ్వం.” అంటూ వంటింట్లోకి వెళ్ళింది శారద.

***

అర్ధరాత్రి దాటాక ఇల్లుచేరడంతో.. శబ్దం చేయకుండా తాళం తీసుకుని లోనికి వెళ్ళిన విశ్వంకి ఇంట్లో సౌందర్య కానీ ఆమె అన్నయ్య రఘు కానీ లేరని అర్ధమయ్యింది . అతన్ని కోపం, భయం ఒక్కసారిగా కమ్మేశాయి. రకరకాల ఆలోచనలతో  కూలబడిపోయాడు. 

మరో ఐదు నిముషాలకి సౌందర్య నుండి ఫోన్...”విశ్వా వచ్చి మమ్మల్ని మూవీ థియేటర్స్ నుండి పికప్ చేయి.  త్వరగా వచ్చేయి. పక్కింటి పీటర్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసాడులే.” అనేసి.. ప్రశ్నలకి తావివ్వకుండా ఫోన్ పెట్టేసింది..                  

విశ్వంకి కోపం తారాస్థాయికి చేరింది.

***

వాళ్ళని పికప్ చేసుకుని దారంతా వాళ్ళ కబుర్లు వింటూ మౌనంగా ఉండిపోయాడు విశ్వం. ఇంట్లోకి అడుగు పెడుతూనే “ఎలాగూ లేటయ్యింది. ఇద్దరూ అలా కూర్చోండి.. మాట్లాడాలి.” అన్నాడు వారితో.

“అవును నేనూ చెప్పాలి.. క్రెడిట్-కార్డు పని చేయలేదు. వెంటనే దాని విషయం చూడు విశ్వా. నీవు ఎలాగూ

శనాదివారాలు రెస్టారెంట్లో పనిచేస్తావుగా! మేము గాల్వెస్టన్ వెళ్లి, మూడీ గార్డెన్స్ కూడా చూసి వద్దామని ప్లాన్.”

ఊపిరాడకుండా చెప్పుకుంటూ పోయింది సౌందర్య.

“కొంచెం ఆపుతావా? ఇప్పుడే వర్క్ నుండి వచ్చాను. ఏమైనా ఉందా తినడానికి?” అడిగాడు విశ్వం. 

         “అంటే.. ఏమీ చేయలేదు.  పీట్జా తెప్పించి తినేశాము. మొన్న చేయి కాలింది కదా!” అంది తడబడిన సౌందర్య.

“నేనివాళే మరో ఉద్యోగం మొదలెట్టాను. వచ్చేప్పటికి రోజూ ఇలాగే అర్ధరాత్రవుతుంది. క్రెడిట్-కార్డు ఇప్పుడప్పుడే సెట్ అవ్వదు.  రెండువారాలు పడుతుంది.” అనేసి రఘు వంక చూసాడు విశ్వం.

“చూడు రఘు, మేముండేది ‘బేలార్ కాలేజీ’ వారి సింగల్ బెడ్-రూమ్ క్వార్టర్స్ .  ఓక్లహోమాలో మీ చుట్టాలు, స్నేహితులు ఉన్నారని చెప్పావుగా. జాబ్ వచ్చేవరకు ఏమనుకోకుండా అక్కడే సర్దుకోండి. మేము సెటిలయ్యాక వచ్చి కొన్నాళ్ళు ఉండవచ్చు.”  గ్లాసుడు నీళ్ళు తీసుకుని లోనికి వెళ్ళిపోయాడు విశ్వం.

         ***

ఆ సంఘటన జరిగిన మూడురోజులకి మేనత్తని కలిసినప్పుడు...జరిగిన విషయమంతా వివరించాడు విశ్వం.                           “అయితే ఇంత జరిగిందా? నేనూహించలేదు విశ్వం.. నోరు మెదపని నీవు అలా కటువుగా మాట్లాడ్డం సౌందర్యకి, రఘుకి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపించిందన్నమాట . రఘన్నయ్య అనబడే శనిగాడు పరారయిపోయాడు గానీ నీ భార్య నీతో మాటపలుకు లేకుండా ఉందన్నమాట. ఏమిటో నీ అవస్థ చూస్తే బాధగా ఉంది. నీ ముఖం చూస్తే నీరసంగా ఉంది. శనివారం కదా కాస్త పులిహోర, దద్దోజనం తిని వెళ్ళు.” అని వంటింట్లోకి నడిచింది శారద.

         “ఎలాగైనా సౌందర్యని నా వైపు తిప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నా. అందుకు మీ అవసరం ఉంటే చెబుతాను అత్తయ్యా.” అంటూ లేచి చేతులు కడుక్కుని మేనత్త వెనుకే వంటింట్లోకి నడిచాడు విశ్వం.

         ***

వారం రోజులుగా సోఫా-బెడ్ పై పడుకోడంతో ఇబ్బందిపడుతూ తలనొప్పితో లేచి పనికి వెళ్తున్నాడు విశ్వం.        కానీ  ఎలాగైనా సౌందర్యని ప్రసన్నం చేసుకోవాలన్న తలంపుతో ఆదివారం సెలవు పెట్టాడు.  పొద్దుటే స్నానపానాదులు ముగించుకుని ఉప్మా చేసాడు.  ట్రేలో కాఫీ, టిఫిన్లతో బెడ్రూములోకి వెళ్లి పడక మీద కూర్చున్నాడు . ప్రేమగా భార్య వంటిపై చేయి వేసి, మార్దవంగా.. ‘సౌర్యా .. బంగారం కదూ.. లేచి నీకోసమే చేసిన ఉప్మా తిని, తేనెతో కలిపిన కాఫీ తాగు.” అన్నాడు. ఏ కళనుందో.. మౌనంగా లేచి.. కాఫీ తాగి, ఉప్మా తిన్నది సౌందర్య.

         విశ్వం ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ”చూడు సౌర్యా. నా ట్రైనింగ్ అయ్యాక, మూడేళ్ళలో సర్జెన్ గా ప్రాక్టీస్ మొదలుపెడితే... మంచి ఏరియాలో పెద్ద ఇల్లు, నీకు వేరే కారు, కావాల్సినంత డబ్బు, హోదా అన్నీ అమరుతాయి . ఇప్పుడైనా నేను మరో రెండు జాబ్స్ చేస్తుంది నీకోసమే కదా.  ఇంత అందమైన భార్యతో కావాల్సినంత సమయం గడపలేకపోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా?” అంటూ భార్య భావాలని అంచనా వేయాలని ఆమె వైపు చూసాడు.  కనీసం మౌనంగా అన్నీ వింటుందని సంతోషించాడు.

         “ఈలోగా కాలక్షేపానికి భరతనాట్యం లేదా వీణ ..నీ ఇష్టం ఏదైనా నేర్చుకో.  ఈ రెండు మూడేళ్ళలో మనకి ఓ బిడ్డ కూడా పుడితే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది.  మన పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారు.  ఎప్పుడైనా అంతా నీ ఇష్టప్రకారమే

జరుగుతుంది.. ఏమంటావ్?” అంటూ ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు.

తాచుపాములా లేచి దూరంగా జరిగిందామె.  “నా కజిన్ బ్రదర్ ఎదుట నా పరువు తీసావు.  అమెరికాలో డాక్టర్ భార్యలా ఉందా నా బతుకు?  అన్నింటికీ అడక్కు తినడమే అవుతుంది.  ఒక సరదా లేదు, సంతోషం లేదు. నీ మొహానికి నేనొక బిడ్డని కనివ్వాలా? ఏమనుకుంటున్నావు  నీవసలు.  పాతికేళ్ళు కూడా నిండని నేను నా అందాన్ని, వొంటిని పాడు చేసుకుంటానా?“ ఆవేశంతో రగిలిపోతున్న ఆమెని చూసి హడలిపోయాడు విశ్వం. హిస్టీరియాలా అన్పించి ఆమెని పొదవి పట్టుకున్నాడు.

ఒక్కసారిగా విదిలించింది. “విశ్వా... నేను ‘బ్యూటీ పేజంట్’ కి ప్రిపేర్ అవుతున్నా. నాకు చాలా అవసరాలు ఉంటాయి. నా జోలికి రాకుండా నన్ను సపోర్ట్ చేస్తానంటేనే ఉంటా..లేదా.. నేను కూడా ఒక్లాహోమాలోని మా చిన్నమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను. నా దారికి మాత్రం అడ్డుపడకు డియర్.” అతన్ని తోసుకుని టవల్ అందుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది సౌందర్య.

హతాశుడై  కుప్పకూలాడు విశ్వం.

***

ఆ తరువాత ఆరు నెల్లల్లో సౌందర్య  హ్యూస్టన్లోని ‘ఇండో-అమెరికన్ అందాల పోటీ’లో గెలుపొందింది. అయితే రాష్ట్ర పరిధిలోని ‘అందాల పోటీ’లో టాలెంట్ విభాగంలో ఓటమి పాలయింది.  అప్పటినుండీ తన సమయాన్ని ఫోన్ల మీదా, టీవీ వీక్షించడంలోనూ గడిపేస్తుంది.  ముక్తసరి జవాబులు తప్ప భరత్తో ఎటువంటీ పొత్తూ పెట్టుకోకుండా ‘నన్ను ముట్టుకోకు నా మాలకాకి’ అన్నట్టుగా, ఇష్టానుసారంగా బతికేస్తుంది. దాంతో.. పరిష్కారం తోచని సమస్యలతో, సఖ్యత లేని భార్యతో నిరాశగా మనుగడ సాగిస్తున్నాడు విశ్వం.

“భార్యాభర్తల్లా కొనసాగడం వల్ల ఇద్దరూ నష్టపోవడం తప్ప ఏమీ మిగలదు. విడిపోతేనే ఎవరి జీవితాలని  వారు చక్కబరుచుకునే అవకాశం ఉంది.” అని శారద హితవు పలికినప్పుడల్లా...

“సహనంతో సాధించుకుంటాను అత్తయ్యా. భరించువాడే భర్త అంటారు కదా, వివాహసమయంలో చేసిన బాసలకి విలువ ఉండాలి కదా. సౌందర్యకి సమయం ఇచ్చి చూడాలి.” అంటాడు విశ్వం.

మరో నాలుగు వారాలకి...ఓ అర్ధరాత్రి ఉత్తరం రాసిపెట్టి గడప దాటింది సౌందర్య. ‘అందాల పోటీలో తాను ఓటమి పాలవడం క్రుంగదీసిందని, కొంతకాలం  ఓక్లహోమాలోని తన చిన్నమ్మమ్మ గారింటికి వెళుతున్నానని, తనకిష్టమైనప్పుడే తిరిగి వస్తానని, ఈ లోగా తనని విసిగించవద్దని  రాసింది.  తన క్రెడిట్-కార్డ్ ఎకౌంటులో మాత్రం సరిపడా డబ్బు ఉంచమని’ సవినయంగా భర్తని కోరడం ఆమె సందేశానికి కొసమెరుపు అనవచ్చు.

         విశ్వం నుండి విషయం తెలుసుకున్న శారద అసహనానికి లోనయ్యింది.  “సౌందర్య బరితెగింపుకి నీవిచ్చిన అలుసే కారణం.  నీవసలు ఈమెతో వైవాహిక జీవనాన్ని నిజంగా కోరుకుంటున్నట్టయితే  ఇప్పుడైనా నా మాట విను. కొన్నాళకైనా నీ జీవితం సరయిన బాటన నడిచే అవకాశం ఉందో..లేదో తెలుస్తుంది.  ఈలోగా వాళ్ళ ఓక్లహోమా చుట్టాల విషయం కూడా కనుక్కుంటాను. సరేనా?” అన్న శారద మాట వినక తప్పలేదు విశ్వంకి.

         ***

            ఓక్లాహోమలో సౌందర్య తల్లి తరుఫు బంధువులు ఉన్నారని ఖరారయ్యాక, హైదరాబాదులోని ఆమె అమ్మమ్మ
మణమ్మతోనూ మాట్లాడి .. విశ్వం, సౌందర్యల కాపురం గురించి చెప్పింది శారద. మణమ్మతో జరిగిన సంభాషణల ద్వారా
నలభైయేళ్ళకే సౌందర్య తల్లి  బ్రెస్ట్-కాన్సర్ వ్యాధితో చనిపోయినప్పుడు .. సౌందర్యకి పదమూడేళ్ళు. తండ్రి మానసిక వ్యాధిగ్రస్తుడవ్వడంతో, ఆ అమ్మాయి .. వృద్ధులైన అమ్మమ్మా, తాతయ్యల ప్రాపకంలో పెరిగిందని తెలిసింది.
            అదంతా విన్న విశ్వం మనసులో సౌందర్య పట్ల కొత్తగా జాలి కూడా ఏర్పడింది.  ఏదేమైనా ఓ  యేడాదిపాటు మాత్రమే సౌందర్యకి ఆర్ధికసాయం కొనసాగించాలన్న శారద సూచనని తోసిపుచ్చలేదు విశ్వం. తమ వివాహబంధం నిలవాలంటే సౌందర్య తిరిగి కాపురానికి రావాల్సిందే అన్న ఆమె మాటలలోని నిజాన్ని కూడా గ్రహించాడు.  ప్రవర్తన మార్చుకుని సౌందర్య త్వరలో తిరిగివస్తుందన్న ఆశతో ఎదురుచూడ సాగాడు.  
            ***
 డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి.. వీలయినంత త్వరగా  వచ్చేయమంటూ భార్యకి సందేశం పంపుతాడు విశ్వనాధ్. ఏడాదిలోగా  కాపురానికి రాకుంటే పెద్దవాళ్ళ ఆదేశాలననుసరించి ఆర్ధిక పంపిణీ నిలిపివేస్తానని కూడా తెలియజేసాడు. 

నెలలు గడిచినా... గడువులోగా సౌందర్య రాకపోవడంతో అన్నట్టుగానే చేసాడు కూడా.  వెంటనే సౌందర్య ఫోన్ చేసి “నా జీవనానికి డబ్బవసరం కదా! డబ్బందలేదే?” అని అడిగింది.

“నీకు మరి భర్త, సంసారం అవసరం లేదా? అర్ధం లేకుండా ఎంతకాలం ఇలా నన్నొదిలి ఉంటావు? వెంటనే వచ్చేయి సౌందర్య.” అన్నాడు విశ్వం.  టక్కున ఫోన్ పెట్టేసింది. అలా మళ్ళీ మరో ఏడాది పాటు.. సౌందర్య ఎన్ని మార్లు ఫోన్ చేసినా విశ్వం జవాబులో మార్పు లేదు.

ఒకటి కాదు రెండున్నరేళ్ళు గడవడంతో..విశ్వంకి తెలియజేసాకే ఓ డివోర్స్ లాయర్ ని సంప్రదించి .. శారద రంగంలోకి దిగింది. సౌందర్యకి ఫోన్ చేసి, ”చూడమ్మా.. రెండేళ్ళగా కారణమే చెప్పకుండా భర్త నుండి దూరంగా ఉన్నావు. ఏ హక్కుతో డబ్బు పంపమని అడుగుతున్నావో తెలీడంలేదు. నీవిక రాకపోతే, మా విశ్వం  మళ్ళీ వివాహం చేసుకుంటాడు. వారం రోజుల్లో నీవొస్తేనే విశ్వం భార్యగా హక్కు నిలుస్తుంది.” అని తేల్చేసింది.

            మాసాలు గడుస్తున్నా సౌందర్య రానూలేదు, ఆమె నుండి కబురూ లేదు.  ఆమె గురించిన ఆలోచనలని పక్కకి నెట్టి, తన పనిలో నిమగ్నమయ్యాడు  విశ్వం.  స్నేహితులు, కొలీగ్స్ తో కలిసిమెలిసి సమయం గడపసాగాడు.  యుక్తి, నైపుణ్యాలు గల యువ థొరాసిక్-సర్జన్ గా గుర్తింపు పొందాడు.  అతని జూనియర్.. డాక్టర్ మెలిస్సా ఓ పోలాండ్ యువతి. విశ్వం పట్ల ఇష్టంగా మెలగసాగింది .  శారద, సుందరంలు కూడా మెలిస్సాతో... విశ్వం సాన్నిహిత్యాన్ని ఆమోదించారు . విశ్వం గతంలోని విషయాలని తెలుసుకుని సహృదయంతో అర్ధం చేసుకుంది మెలిస్సా. సౌందర్య నుండి న్యాయపరంగా విడిపోవాలని భావిస్తేనే లాయర్ ని కలవమని మెలిస్సా కూడా ప్రోత్సహించింది . సౌందర్య ఆంతర్యమేమిటో కనుక్కుని గాని నిర్ణయం తీసుకోలేనన్న ఉద్దేశంతో ఉన్నాడు విశ్వం.
            ***
            విశ్వం, మెలిస్సా లు తమ ట్రైనింగ్ ముగించుకుని ‘బేలార్ కార్డియాలజీ విభాగంలోనే’ పనిచేయాలని నిశ్చయించుకున్నారు . శారద, సుందరంల ఆశీర్వాదాలతోనే ముందుగా... నూతన గృహప్రవేశం కూడా చేసారు.
            ***
            సెలవు దినం అవడంతో తమ నూతన గృహంలో.. పొద్దుటే బాల్కనీలో కూర్చుని  కాఫీ సేవిస్తున్నారు  విశ్వం, మెలిస్సా.  అర్జెంటుగా రమ్మని శారద ఫోన్ చేయడంతో ఆఘమేఘాల  మీద ఆమె ఇంటికి చేరుకున్నారు.

            ***
            ఎదురుగా సోఫాలో ఆదుర్దాగా కూర్చునున్న వారినుద్దేశించి, “నిన్న అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన సౌందర్యని గుర్తుపట్టను కూడా కష్టమైంది విశ్వం. స్పానిష్ నేర్చుకుని...ఇన్నాళ్ళూ 'ప్రత్యామ్నాయ ఉపాధ్యాయిని'గా పనిచేస్తూ తన పిన్నమ్మ ఇంట్లోనే పేయింగ్ గెస్ట్ గా ఉందట. తనకి బ్రెస్ట్-కాన్సర్ వ్యాధి విస్తృతంగా వ్యాపించి ఉందట. అంతే విస్తృతంగా ట్రీట్మెంట్ చేసాక గాని ఏ విషయం చెప్పలేమన్నారట నిపుణులు. ఇక్కడ ఎం.డి.ఆండర్సన్ కాన్సర్ హాస్పిటల్లో ప్రయోగాత్మక  వైద్యానికి నమోదయ్యేందుకు నీ సాయం కోరడానికి వచ్చింది. నీకు గుర్తుందో లేదో.. ఆ జబ్బుతోనే వాళ్ళమ్మ పోయింది. ఆ మాయదారి జబ్బు వల్లనేమో సౌందర్య చాలా పాడయిపోయింది. నాలోనూ ఆమెపట్ల జాలి కలుగుతుంది.  నీతో ఒంటరిగా మాట్లాడుతుందట.” ఏకబిగిన చెప్పింది శారద..

            సౌందర్యని కలిసేందుకు ఆమె ఉన్న గదిలోనికి వెళ్ళగానే, ఎదురుపడ్డ స్త్రీని చూసి నిర్ఘాంతపోయాడు విశ్వం.  రంగు, రూపు కోల్పయిన సౌందర్యని చూసాడు. కన్నీళ్ళతో అతని ఎదుట మోకరిల్లిందామె. “నన్ను క్షమించు విశ్వా. నీతో పెళ్ళికి ముందే ..డేవిడ్ అనే రేడియో జాకీని ప్రేమించాను. నా డేవిడ్ కి అమెరికా జీవితం ఓ కల. మంచి-చెడులు, తప్పొప్పులకి ఏనాడూ విలువివ్వనిదాన్ని. నీతో వివాహాన్ని..నా డేవిడ్ కల తీర్చే ఏకైక మార్గంగా భావించి ..నిన్ను పెళ్ళాడి నీకు నరకం చూపించాను. నేనసలు క్షమార్హురాలను కాను.”  ఏడుస్తూ సొమ్మసిల్లింది.  
            ***
            దేవుని పై భారం వేసి, సౌందర్యకి అత్యుత్తమ వైద్యం చేయించి... కాన్సర్  వ్యాధిని అధిగమించగలనన్న ఆశని ఆమెలో నింపాడు విశ్వం.  ఐదేళ్ల వరకు బ్రెస్ట్-కేన్సర్ నిపుణల పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాటు చేసాడు. పరస్పర అవగాహనతో భార్య నుండి విడాకులు పొంది, ఆమె ప్రేమించిన డేవిడ్ ని అమెరికాకి రప్పించి … సౌందర్య, డేవిడ్ ల వివాహం జరిపించాడు.   సౌందర్యని కాన్సర్ కి సంబంధించిన రంగంలోనే సాంకేతిక విభాగంలో ట్రైనింగ్ కి కుదిర్చాడు.  

            విశ్వంతో సహజీవనం సాగిస్తున్నమెలిస్సా కూడా సుముఖత చూపడంతో..ఆమెని భార్యగా స్వీకరించే సన్నాహాల్లో ఉన్నాడు. వివాహానికి ముందుగానే తల్లితండ్రుల్ని తమ వద్దకి రప్పిస్తున్న విశ్వంతో "నీ తల్లితండ్రులు..నీ ఎదుగలని చూసి, నీ సంతోషాల్లో పాలు పంచుకునే సమయం...నీ వివాహ వేడుకతో మొదలవుతుంది." అంటూ  అభినందించింది శారద.

            ***
            వివాహానంతరం తన ఆశీస్సులు అందిస్తూ... "పెళ్లినాటి ప్రమాణాలని, పవిత్రమైన నాతిచరామి మంత్రాలని .. అంతే నిబద్దతతో స్వీకరించి ..  తనని బాధించి, విడనాడిపోయిన ఓ భార్య జీవితాన్ని బాగుచేసేంత ఔన్నత్యం మన  విశ్వనాధ్ లో ఉందన్నయ్యా.  అటువంటి కొడుకుని కన్నందుకు మీరు, పెంచినందుకు నేను గర్వపడాలి.  విశ్వం వంటి భర్తను పొండడం కూడా మెలిస్సా అదృష్టమే." అంటూ అక్షింతలు వేసి మనసారా వధూవరులని ఆశీర్వదించింది శారద.  

                                              **********  

No comments:

Post a Comment

Pages