చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 9 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 9

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 9

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene

 


(సీమన్ వెనుక అనుసరిస్తానని బెస్ తో చెప్పి, జార్జ్ రహస్యంగా అతన్ని అనుసరిస్తుంది.  పట్టణ సరిహద్దు వరకు వెళ్ళిన అతను అక్కడ ఆగి ఉన్న కారులో వెళ్ళిపోయాడు.  ఆ కారుని ఒక స్త్రీ నడుపుతోందని జార్జ్ గమనించింది.  జార్జ్ ని వెతుకుతూ వెళ్ళిన నాన్సీ, బెస్ లు టీ రూముకి తిరిగి వస్తారు.  ఇరెన్ గా తనను పరిచయం చేసుకొన్న నాన్సీ, మిసెస్ హేంస్టెడ్ ని సీమన్ యింటి గురించి అడుగుతుంది.  మాటల సందర్భంలో ఆ వృద్ధ మహిళ డీప్ రివర్లో కోట గురించి చెప్పసాగింది.  తరువాత. . . .) 

@@@@@@@@@@@@@@@@@@@  

"కొంతమంది విదేశీయులు దీన్ని నిర్మించారు.  అది దయ్యాలకొంపలా మారే వరకూ అక్కడే నివసించారు" మిసెస్ హేంస్టెడ్ బదులిచ్చింది.  

  "దయ్యాలకొంపనా?" బెస్ అడిగింది.

  "అది ఒకప్పుడు అని నేను చెబుతున్నా!" మిసెస్ హేంస్టెడ్ బదులిచ్చింది.  "ఆ తరువాత ఎవరూ ఆ కట్టడాన్ని పట్టించుకోలేదు. ..... దానికి మరొక బురుజు కట్టవలసి ఉంది.. . . .చివరకు దాన్ని అలా వదిలిపెట్టారు.  దాని తరువాత మరొక విషాదం చోటు చేసుకొంది.. . .ఒక పిల్లవాడు కందకంలో ములిగిపోయాడు.  ఒక వ్యక్తి ఆ కందకం పైనున్న వంతెనపై ఎగిరిపడి నుజ్జయిపోయాడు....."

  "ఓహ్! చాలు.  దయచేసి మాకా విషయాలు చెప్పొద్దు" అంది బెస్.  

  మిసెస్ హేంస్టెడ్ ఆపేలా లేదు.  చాలా ఏళ్ళ వరకూ దానిలో ఎవరూ నివసించలేదని, కానీ దాని మీద పన్నులను మాత్రం యూరపులో నివసిస్తున్న వ్యక్తి ఎవరో చెల్లించారని చెప్పిందామె.  

  "కాబట్టి ఈ పట్టణం ఆ ప్రాంతం విషయంలో ఏమీ చేయలేదు.  ఈ మండలం కూడా దాన్ని ఏమీ చేయలేదు.  రాష్ట్ర పోలీసులు అప్పుడప్పుడు వచ్చి అక్కడ సవ్యంగా ఉందో, లేదో చూసి పోతుంటారు."

   హఠాత్తుగా మిసెస్ హేంస్టెడ్ గోడకు వేలాడుతున్న ఒక పాత ఫ్రేం చిత్రపటాన్ని(మాప్) చూపించింది.  "అటు చూడు" అని అటు వైపు చూపించింది.  "దాన్ని దగ్గరగా చూస్తే, ఈ డీప్ రివర్ లోయను వాస్తవానికి చంద్రమణి లోయ అని పిలుస్తారని మీరు గమనిస్తారు.  అయితే అసలు పేరు యిలా ఎందుకు మార్చబడిందో ఎవరికీ తెలియదు.  నా ఊహ ప్రకారం కోటలో నివసించే వాళ్ళకు మాత్రమే ఈ మార్పు వివరాలు తెలుసు.  ఆ పేరు వాళ్ళకు బాగా నచ్చటం వల్లనే తమ ప్రాంతానికి వాళ్ళు చంద్రమణి కోట అని పిలుచుకొనేవారు."

  ఈ సమాచారం వింటున్న నాన్సీ మరియు బెస్ ఒకరి మొహం ఒకరు చూసుకొన్నారు. గడచిన రెండు రోజుల్లో "చంద్రమణులు" అన్న పదం వారి దృష్టికి రావటం యిది రెండవసారి.  ఈ చంద్రమణి కోటకి,  భావగర్భితంగా నాన్సీకి పంపబడ్డ విలువైన రత్నానికి ఏదైనా సంబంధం ఉందా? 

  "విచిత్రమైన విషయాల గురించి చెప్పాలంటే," మిసెస్ హేంస్టెడ్ గుర్తుకు తెచ్చుకొంటూ అంది, "మిసెస్ హోర్టన్ కేసు ఉంది."

  నాన్సీ, బెస్ తమ ఉత్సాహాన్ని అణుచుకోవటం కష్టమనిపించింది.

  "హోర్టన్?" నాన్సీ తిరిగి అంది.

  "అవును" మిసెస్ హేంస్టెడ్ అంది.  "ఆమె యిల్లు పట్టణానికి చాలా దూరంగా ఉంది.  ఆమె ఎప్పుడూ స్నేహశీలి కాదు, అందుకే యిక్కడ జనాలకు ఆమె బాగా తెలియదు.  ఆమె ఎక్కువగా ఎవరితో కలుపుగోలుగా ఉండదు.  ఆమె కొడుకు, కోడలు చనిపోయాక, తన  మరణం వరకూ ఎవరూ ఆమె గురించి వినలేదు, ఆమెను చూడలేదు."

  "ఆమెకేం జరిగింది?" నాన్సీ అడిగింది. 

  "ఇలా జరిగింది" అని మిసెస్ హేంస్టెడ్ వివరించింది.  "ఆమె కొడుకు చనిపోయిన సమయంలో, వాళ్ళింట్లో పనివాళ్ళలో ఒక జంట అకస్మాత్తుగా వెళ్ళిపోయారు.  వారి జాగాలో ఒక కొత్త జంట వచ్చి చేరారు.  దాని తరువాత, ఆ యింటికి ఆహారం బయటి నుంచి పంపిణీ చేయబడేది,  కానీ డబ్బు చెల్లింపులు మాత్రం బయటనే పరిష్కారమయ్యేవి.  ఆ యింటికి వెళ్ళే వ్యాపారస్తులు ఏనాడూ  ఆ యింట్లో వాళ్ళను కళ్ళతో చూడలేదు."   

 "మిసెస్ హోర్టన్ విచిత్రంగా మారిపోయిందని చుట్టుపక్కల జనాల్లో చెప్పుకొనేవారు.  వ్యక్తిగతంగా, మిసెస్ హోర్టనా లేక ఆమె పనివాళ్ళా. . .ఎవరు విచిత్రమైనవాళ్ళన్నది నాకు తెలియదు.  ఎందుకంటే, ఆమెకు ఆఖరుసారిగా జబ్బు చేసినప్పుడు, పనివాళ్ళు వాస్తవంగా ఈ ఊరి వైద్యుణ్ణి కాకుండా వేరే డాక్టర్ని ఎందుకు పిలిచారో, ఆమె చనిపోయినప్పుడు, ఉత్తరక్రియలు జరిపించటానికి వేరే ఊరి వ్యక్తిని ఎందుకు రప్పించారో మీకు తెలుసా?  అన్నింటికంటే దారుణం ఏమిటంటే, ఆమె అంతిమ క్రియను రహస్యంగా జరిపించారు.  అదంతా పూర్తయ్యేవరకూ ఈ ఊళ్ళోని ఒక్క ఆత్మకి కూడా ఆ విషయం తెలియదు."

నాన్సీ, బెస్ ఏమీ వ్యాఖ్యానించలేదు.  వారి బుర్రల్లో అనేక రకాల ప్రశ్నలు పరుగులు పెట్టాయి.  ఉన్నట్లుండి బెస్ నోటిలోనుంచి ఒక ప్రశ్న తన్నుకొచ్చింది,  "మిసెస్ హోర్టన్ దగ్గర ఉన్న ఆమె చిన్న మనుమరాలికి ఏం జరిగింది?"  

   ప్రశ్న అడిగిన వెంటనే బెస్ తప్పు చేసినట్లు బాధపడింది.   అయితే, ముసలామె ఆ ప్రశ్నను పనికిమాలిన దానిగా భావించకపోవటం, ఆమెకు మరియు నాన్సీకి ఉపశమనాన్ని యిచ్చింది.  

  "చిన్న మనుమరాలా?" ఆమె వ్యాఖ్యానించింది.  "మిసెస్ హోర్టన్ కొడుక్కి ఒక చిన్న పాప ఉందని, ఈ చుట్టుపక్కల ఎవరికీ తెలియదు."  ఆమె తనలో నవ్వుకొంది.  "అక్కడ ఎవరైనా పాప ఉంటే, దాని గురించి నేను విని ఉంటే, మీరు మీ జీవితాన్ని పణంగా పెట్టి పందెం వేయవచ్చు!"

  ఇద్దరు అమ్మాయిలు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.  ఎందుకంటే, ఆ సమయంలో మిసెస్ హేంస్టెడ్ కూతురు ఆ గదిలోకి వచ్చింది.  "అమ్మా! ఈ రోజంతా నీదే అనిపించుకొన్నావు.  ఇక పడుకొనే సమయమైంది" అందామె.

  వెంటనే నాన్సీ, బెస్ అక్కడనుంచి బయల్దేరారు.  జార్జ్  కోసం తమ పరిశోధన్ని కొనసాగించాలని వారు గ్రహించారు.  వారు రోడ్డు మీదకు రాగానే, తాము అంతకు ముందు చూసిన పోలీసు స్టేషను దిక్కుకు తిరిగారు.

  వారి హృదయాలు, ఆలోచనలు అందోళనతో నిండిపోయాయి.  ఇద్దరు అమ్మాయిలు మౌనంగా నడిచి వెళ్తున్నారు.  దేదీప్యమానమైన లైట్ల వెలుతురులో యువతతో రద్దీగా ఉన్న సోడా దుకాణాన్ని దాటుతుండగా, అకస్మాత్తుగా వారికి బాగా పరిచయమైన ఈల వినిపించింది.

ఆ దుకాణంలో నుంచి జార్జ్ సైగ చేస్తూ వారిని పిలుస్తోంది.  

    "ఓ దేవుడా! నీకు ధన్యవాదాలు!" అంటూ బెస్ ఉపశమనంతో నిట్టూర్చింది.   

  నాన్సీ తన మీదనుంచి పెద్ద బరువు దిగిపోయినట్లు భావించింది.  ఇద్దరూ ఆనందంగా ఆ దుకాణంలోకి వెళ్ళారు.  

  "నువ్వు మా జీవితాల్లో ఎన్నడూ అనుభవించని, అతి దారుణమైన భయాన్ని కలిగించావు.  ఏమిటి. . . ."బెస్ తన బందువుని తిట్టటం మొదలెట్టింది.  

  "నేనెక్కడ ఉన్నానో టీ రూములోని మీకు తెలియజేద్దామని ఫోను దగ్గరకు వెళ్తుండగా, మీరు రావటం కనిపించింది" జార్జ్ అమ్మాయిలకు చెప్పింది.   "నేను తినటం పూర్తయ్యేవరకూ కూర్చోండి.  జరిగినదంతా  మీకు చెప్తాను."   ఒక ఆడమనిషి నడిపిన కారులో సీమన్ వెళ్ళిపోయిన కథను ఆమె చెబుతుంటే, యిద్దరు అమ్మాయిలు శ్రద్ధగా విన్నారు.   

  "నేను పట్టణానికి తిరిగి వస్తున్నాను.  మధ్య దారిలో  ఒక వ్యక్తి నన్ను వెంబడించటం గమనించాను.  ఈ సమయానికి, అతనెవరో బాగా చూడాలంటే, చీకటి దట్టంగా ఉంది.  కానీ అతను బ్రాస్ కెటిల్ నుంచి నేను వెంటపడిన వ్యక్తి  కాదు."

  "అతను చూడటానికి ఎలా ఉంటాడు?" బెస్ అడిగింది.

  (సశేషం)

No comments:

Post a Comment

Pages