స్వాతంత్ర్యానికి వార్ధక్యం - అచ్చంగా తెలుగు

స్వాతంత్ర్యానికి వార్ధక్యం

Share This

                                                      స్వాతంత్ర్యానికి వార్ధక్యం

డా. పోడూరి శ్రీనివాసరావు



స్వాతంత్రానికి పుట్టినరోజంట

అందరూ సంబరంగా చేయాలంట

ఎంతో ఆశగా, ఆతృతగా ఎదురుచూశాము 

ఎదురు చూసిన మనకు నిరాశే మిగిలింది.

          స్వర్ణశోభితంగా వస్తుందనుకున్న

          స్వతంత్ర భారతమాత...

          అనూహ్యంగా... వార్ధక్యంతో

          వణుకుతూ దర్శనమిచ్చింది.

డెబ్బది ఐదు వసంతాలకు చేరువవుతూ...

చేతికర్ర ఊతంతో... బక్కచిక్కిన దేహంతో..

చింకి చెరగు, మాసికల వస్త్రాలతో...

సిగ్గుపడుతూ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైంది.

          ఎదురు చూస్తుండగానే ఏళ్ళు... ఏళ్ళు గడిచిపోయాయి

          ఎన్నో అనుభవాలు, అభివృద్ధి ఊహించుకున్నాము  

          కానీ.. సాధించిన, చూసిన అభివృద్ధి వేరు

స్వాతంత్రం అంటే వచ్చింది కానీ...

అభివృద్ధి రాజకీయనాయకుల

కనుసన్నల్లో బందీ అయిపోయింది

ప్రజలు రాజకీయ నాయకుల చేతుల్లో బందీలే!

          ఎలక్షన్లు వస్తున్నాయి

          పార్టీల గెలుపు ఓటముల

          సమీకరణాలు మారుతున్నాయి

          ప్రభుత్వాలు మారుతున్నాయి.

ప్రణాళికలు మారుతున్నట్లే

ప్రభుత్వ, పార్టీల మానిఫెస్టోలు  

కూడా అటూ ఇటూ మారిపోతున్నాయి

అభివృద్ధి మాత్రం - అందకుండా పోతుంది

          దివిటీలా వెలుగుతున్న సూర్యుని కాంతి ముందు

          వెలవెలబోతూ ... కాన రాకున్న నక్షత్రాల్లా...  

          జరుగుతున్న, కనబడుతున్న

          అభివృద్ధి మాత్రం - మిథ్యలా అనిపిస్తోంది.   

          ప్రకృతి ఎంతో అందంగా శోభాయమానంగా

          వర్ణ భరితంగా మనసు దోచినవేళ

          ఆశలు ఆశయాలు కలబోసి హఠాత్తుగా

          మురిసి... మూకుమ్మడిగా... దాడి చేసినవేళ 

మూడు కాళ్ల ముదుసలి సైతం

అమృతోత్సవ స్వతంత్ర భారతి సైతం...

రెక్కలు విప్పి స్వచ్ఛ శ్వేత పావురంలా

గగనతలంలో విహారం చేస్తుంది.

          మనమంతా హుషారుగా ఉండాలంటే...

          శరీరం దూదిపింజలా తేలి పోవాలంటే

          ఆశావహ దృక్పథం అలవడాలి

          ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలి. 

బడ్జెట్ ల కేటాయింపులు, జలవివాద ధోరణులు

అంతర్రాష్ట్ర కలహాలు, మధ్యలో కేంద్రానికి సమాధానాలు

వ్యవస్థను, వివస్త్రను చేసి దారుణానికి ఒడగడుతుంటే

ఇక ప్రగతి సంగతి దేవుడెరుగు - అధోగతిపాలే కదా!

          నాణానికి మరోవైపులా అంతా

          శుభదృష్టే.... ఆశావాహజనకమే!

          సారి అయిన అవగాహనతోగురిచూసి

          సంధిస్తే... స్వర్ణ పతకం మనదే కదా!

అభివృద్ధిని కాంక్షిస్తూ... అవగాహనతో

అడుగు ముందుకేస్తే విజయ పతాకం మనదే

డెబ్బది సంవత్సరాల్లో... ఏం సాధించాం అనేకంటే

మన సమర్థ పాలన మనకేం ఇచ్చింది? మనకు నేర్పింది

          అనుకుంటే...

          మెరుగుపడ అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలు,

          వాణిజ్య వ్యవహారిక పరిజ్ఞానాలు

          రోదసీపధాన్నే కాదు..... క్రీడా నేపధ్యాన్నే కాదు.....

 

 

మనం సాధిస్తున్న విజయపరంపర..

ఇది డెబ్ళై అయిదేళ్ల మన విజయప్రస్తానం,

ఇదే అంకుఠిత దీక్ష... మన పక్షానే ఉంటే

మనం అగ్రరాజ్యాలనధిగమించడం....

          పండు పున్నమి వెన్నెలను

          తళతళ మెరిసే తారకలను

          అక్కున చేర్చుకుని

          కౌగిలించుకున్నట్లే!

          మనకల నెరవేనట్లే!!

          మనం విజయపధాన సాగినట్లే!!

-డా. పోడూరి శ్రీనివాసరావు

హైదరాబాద్ - 98494 22239

 

No comments:

Post a Comment

Pages