ఈ దారి మనసైనది - 42 - అచ్చంగా తెలుగు

                                                         ఈ దారి మనసైనది - 42 

అంగులూరి అంజనీదేవి 


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్వితకు  ధైర్యం చెప్పి, మామూలు మనిషిని చేస్తాడు  ధీరజ్. మన్విత నానమ్మను ధీరజ్ తన ఊరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ధీరజ్ ఆశయాన్ని నెరవేర్చే దిశగా అడుగులేస్తుంది వర్ధనమ్మ.)

డాక్టర్లుగా మనం సమర్దులం అయినంత మాత్రాన తెలివిగల వాళ్లమయినంత మాత్రాన, రాత్రింబవళ్లు శ్రమించినంత మాత్రాన సరిపోదు. తగినంత సమాచారాన్ని సేకరించుకోవాలి. అందుకే నేను స్టేట్స్ కి వెళ్తానంటున్నాను. అక్కడ చదివి గొప్ప అనుభవాన్ని సంపాయించుకోవాలి. ఎంతో తెలుసుకోవాలి. ఏదో సాధించాలి. ఇక్కడే వుంటే నా ఆశయం, ఆవేశం తీరవు. మెడిసిన్ ఎంత అభివృద్ధిలోకి వస్తున్నా అంతులేని సమస్యలు పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిల్లో కొన్నైనా తెలుసుకోవాలి.అన్నాడు అనురాగ్.

            “తెలుసుకోవాలి. శ్రమించాలి. అధిరోహించాలి. కాదనను. మీరు సంపాయించుకునే అనుభవం కాని, సేకరించే వైద్య విజ్ఞానం కాని డబ్బుకోసమేగా ! ఉన్న దేశానికి, తల్లి దండ్రులకి దూరంగా పోయి, తిరిగొచ్చి సంపాయించే ఆ డబ్బు ఎవరికోసం? హైటెక్ సిటీలో వుండే సాఫ్ట్ వేర్లు కూడ రోడ్డు మీద బండ్ల ముందు నిలబడి బిర్యానీ తింటూ డబ్బు సంపాయిస్తున్నారు. పనికి, డబ్బుకి అంకితమై పోతున్నారు... ఇంతకీ వాళ్లలో వుండే ఆ డెడికేషన్ అంతా బిర్యానీ కోసమా లేక అందులో యింకేమైనా పరమార్థం వుందా?” అంది దీక్షిత.

            మృదువుగా నవ్వి, ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు.

            " ఐనో దీక్షా ! నాకు దూరంగా వుండలేక దానికి, దీనికి లింక్ పెట్టి మాట్లాడుతున్నావు. అయినా నేను వెళ్లేది డబ్బుకోసం అధికారం కోసం, కీర్తి కండూతి కోసం కాదు. పేషంట్ల కోసం ... ఆ పేషంట్లలో కన్పిస్తున్న అంతుపట్టని రోగాలకి ట్రిటిమెంట్ కనుక్కోవడం కోసం ఏ టీటిమెంట్ యివ్వాలో తెలియక అర్ధాంతరంగా చనిపోయే వాళ్లని బతికించడం కోసం... నువ్వు కూడా నాతో వచ్చి పి.జి చెయ్యి. ఎకనామికల్గా అవసరమైతే నేను ఏర్పాటు చేస్తాను. నాక్కూడా నిన్ను విడిచివుండాలని లేదు.అన్నాడు అనురాగ్. | అతనా మాటల్ని ప్రేమతో అంటున్నాడని తెలుసు. కానీ ...

            "ఇప్పటికే మా అన్నయ్య చదువుకి మల్లారెడ్డి సార్ హెల్ప్ తో 3రూపాయల వడ్డికి అప్పుచేశాం. నా చదువుకి మామయ్యవాళ్ల పొలం అమ్మాం. అది చాలక ఇంకా నా చదువుకి ఎంత అవసరమైతే అంత వాళ్లేయిచ్చారు. వాళ్లిప్పుడు ఢిల్లీలో వుంటున్నారు. ఇంకెవరి దగ్గర చేయి చాచాలని లేదు. నన్నిలా వుండ నివ్వండి !అంటూ అతని చేతిలో వున్న తన చేతిని మృదువుగా విడిపించుకొని, రెండు చేతుల్ని టేబుల్ పై పెట్టి నిటారుగా కూర్చుంది. ఆమెలోని స్వాభిమానాన్ని అర్థం చేసుకున్నట్లు ఆమె చేతిని తిరిగి తన చేతిలోకి తీసుకున్నాడు.దీక్షా ! మన సూపర్ సీనియర్ డా|| ధీరజ్ రెడ్డి మీ ఊరిలో హాస్పిటల్ పెట్టబోతున్నాడు. నువ్వా డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్గా వుండు. నేనిక్కడ లేని ఫీలింగ్ నీకు రానివ్వకుండా నీకు కాల్ చేసిమాట్లాడుతుంటాను. నా పి.జి. అయిపోగానే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడైతే నేను వెళ్లక తప్పదు. ఏం చేద్దాం చెప్పు ! కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోకతప్పదు.అన్నాడు. ఆ మాటలు క్యాజువల్గా అందామనుకున్నా బాధగానే బయటకి వచ్చాయి.నేనూ అదే అనుకుంటున్నాను. మల్లారెడ్డిసార్ కూడా డా|| ధీరజ్ రెడ్డితో మాట్లాడతానన్నారు. డా|| ధీరజిరెడ్డి ఎవరోకాదు. మల్లారెడ్డిసార్ తోడల్లుడి కొడుకు.అంది దీక్షిత. అనురాగ్ నిశ్చింతగా ఫీలయ్యాడు. వాళ్లు అర్డర్ ఇచ్చిన ఐటమ్ వచ్చింది.

            తింటూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలకి, స్వీట్ నథింగ్స్ కి అంతంలేదు. వాళ్లిప్పుడు డాక్టర్లు కాదు. ప్రేమికులు.

* * *

            రోజులు గడుస్తున్నాయి.

            పాకాలలో డా|| ధీరజ్ రెడ్డి పెట్టిన హెల్త్ కేర్ మల్టీస్పెషాలిటి హాస్పటల్... వచ్చే పేషంట్లకి, వెళ్లే పేషంట్లకి తెరిపి లేకుండా ఎందరో పేషంట్లకి ఉపశాంతిని కల్గిస్తోంది. ఆ చుట్టు పక్కల పల్లెవాసులు ఏ ఆపద వచ్చినా గతంలో వెళ్లినట్లు సీటీకి వెళ్లకుండా ధీరజ్ రెడ్డి హాస్పిటలకే వస్తున్నారు. అతి తక్కువ టైంలోనే ఆ హాస్పిటల్ కి మంచి పేరు వచ్చింది. కారణం ఆయన చదివింది జనరల్ మెడిసిన్.

            మన్విత హౌస్ సర్జన్ పూర్తయిన వెంటనే డా|| ధీరజ్ రెడ్డి, దగ్గర జూనియర్ డాక్టర్గా వుంది. హాస్పిటల్లోనే అప్స్టెయిర్లో వుండే గదిలో నానమ్మతో వుంటుంది. రాత్రి, పగలు వాళ్లిద్దరు హాస్పటల్లోనే వుంటారు. ధీరజ్ మాత్రం ఇంటికెళ్లి టైం ప్రకారం హాస్పిటల్ కి వస్తాడు. డా|| దీక్షిత కూడా అంతే !

            హాస్పిటల్ ముందుగాని, లోపలగాని - వర్ధనమ్మ నాటిన మొక్కలు రోజు, రోజుకి ఎదిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఆమె రోజు ఆ చెట్లకి నీళ్లు పోస్తూ వాటిని ప్రాణంగా చూసుకుంటుంది.

ఆమె మెట్లు దిగి క్రిందికి రాగానే డా|| మన్విత గారి నానమ్మగా అమెకెంతో గౌరవం ఇస్తుంటారు పేషంట్లు. వాళ్ల తాలూకు బంధువులు కొందరు ఆమెతో మాట్లాడకుండా వెళ్లరు. అది చూస్తూ... అంత గొప్ప మనవరాలు తనకి వున్నందుకు వర్థనమ్మ గర్వపడని రోజు లేదు. పైకి కనబడకుండా మురిసి పోని క్షణం లేదు. కానీ ...

            ఒకప్పుడు క్యాజువాల్టి లో .. ఆ డెత్ సంఘటన జరిగాక మన్విత మీద ఎలాంటి విమర్శలు వచ్చాయో వర్థనమ్మకి తెలుసు.

            “రాజు గారి నోట్లో తాటి చెట్టు మొలిచిందట.అన్న సామెతలా పుకార్లు షికార్లు చేసి అవి చిలవలు,ల పలవలుగా మారి... తమకుతెలిసిన దాన్ని పదిమందికి చెప్పాలన్నట్లు దానికి మరికాస్త జోడించి, ఒకరి నుండి ఒకరికి చేరవేస్తూ చివరకు దాని రూపాన్నే మార్చి " మన్విత చేతిలో మనుషులు పోతున్నారటగా..అన్న దాకా వచ్చింది.

            ఆ మాటలు మన్వితకు ఇబ్బంది కల్గించినా... కెరీర్ విషయంలో అవే మైలు రాళ్లు అయ్యాయి.

(ఇంకా ఉంది)

***


No comments:

Post a Comment

Pages