ప్రేమకు చిరునామా! - అచ్చంగా తెలుగు

ప్రేమకు చిరునామా!

Share This
 ప్రేమకు చిరునామా!
పెబ్బిలి హైమావతి



"నాస్తి మాతృ సమో దైవం.. నాస్తి మాతృ సమో పూజ్యా.. నాస్తి మాతృ సమో బంధూ... నాస్తి మాతృ సమో గురుః ' అంటారు పెద్దలు!

అలాంటి మణి దీపం ..అమ్మకాని అమ్మ మా పద్మక్క! నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మకు ఎప్పుడూ సుస్తీయే, మా అక్కలిద్దరూ ఇంటి బాధ్యతలన్నీ చూసుకునేవారు. పెద్దక్క లీల పెళ్లయి వెళ్లి పోయాక మొత్తం ఇంటి బాధ్యత పనిభారం చిన్నక్క పద్మ మీద పడింది. ఇంటరు చదువుతున్న అక్క చదువంతటితో ఆగిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి యంత్రంలా ఇంటి పనులన్నీ చక్క బెట్టేది. మా తమ్ముడినీ నన్నూ స్కూలుకు పంపేందుకు వంట చేసి లంచ్ బాక్సులు కట్టేది. మేము అక్క పెట్టినదేదో తిని స్కూలుకు వెళ్లే వాళ్లం.

ఈలోగా నాన్నగారు ఆఫీసుకు రెడీ అయి వస్తే ఆయనకు భోజనం పెట్టి టిఫెన్ బాక్స్ ఇచ్చేది. ఆ తరువాత అమ్మకి మందులు వేసి టిఫెన్ తినిపించి తాను తినేది.. అంట్లు తోమి ఇల్లు సర్ది తన చదువు సంగతి చూసుకునేది. అంత అననుకూలమైన వాతావరణంలో అక్క తనకి చదువు మీద గల ఆసక్తిని చంపుకోలేక ప్రైవేటుగా బిఏ చదువుతోంది.

అమ్మానాన్నలకు వరుసగా లీలక్కా, పద్మక్కా.. ఇద్దరూ ఆడపిల్లలే కలగడంతో.. మగ పిల్లాడి కోసం ఎదురు చూడసాగారు. కానీ పద్మక్క తరువాత పుట్టిన శిశువు లిద్దరూ దురదృష్టవశాత్తు చనిపోవడంతో.. అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బ తిందట. దాంతో నాన్నగారు "ఉన్న పిల్లలిద్దరూ చాలు, నీ ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు నేను ఆపరేషన్ చేయించు కుంటాను " అన్నారట. కానీ దానికి అమ్మ ఎంతమాత్రం అంగీకరించ లేదట.

"అలా చేస్తే నామీద ఒట్టే, పున్నామ నరకం నుండి మనని రక్షించేది ఎవరు?" అంటూ నాన్నగారిని కట్టిపడేసిందట అమ్మ..

చివరికి తమ్ముడూ నేనూ కవలలుగా పుట్టి అమ్మ ఆశ తీరేలా చేశాము. కానీ దురదృష్టవశాత్తు మేము పుట్టాక అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడయి పోయింది. మా ముద్దు ముచ్చట్లేవీ స్వయంగా చూసుకోలేక
పోయింది. అక్కే అమ్మలా మా అందర్నీ చూసుకుంటోంది. మేము సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మాకోసం ఏదో ఒక చిరుతిండి చేసి పెట్టేది. అవి తిని మేము ఆడుకునేందుకు వెళ్లాక రాత్రి వంటకి ఉపక్రమించేది. భోజనాలయ్యాక అన్నీ చక్కబెట్టుకొని వచ్చి తెలియని పాఠాలు మాకు చెబుతూ తను చదువుకునేది.. ఇదీ మా రోజువారీ దినచర్య!

అమ్మ ఆరోగ్యం చెడిన దగ్గర నుండి నాన్నగారి మనసు వికలమై పోయింది. ఆయన ఇంట్లో ఉన్నంతసేపూ అక్కకి పని తగ్గించేందుకు అమ్మ పనులన్నీ నాన్నగారు చేస్తూ గడిపేవారు. చూస్తూండగానే అక్క డిగ్రీ పూర్తి చేసింది. నేనూ తమ్ముడూ ఇంటరు పూర్తి చేశాము. నాన్నగారు. మమ్మల్ని ప్రొఫెషనల్ కోర్సులు చదివించలేనని, వచ్చిన జీతంలో ఎక్కువ భాగం అమ్మ మందులకే ఖర్చవుతోందని చెప్పడంతో ఇద్దరం డిగ్రీలో జాయినయ్యాము. అక్క ఎంఏ లిటరేచరు. చదువుతోంది... అక్క చదవడం చూసి "ఇంత చదువుకున్న నీ కూతురికి మొగుడ్ని తేవాలంటే ఎన్ని లక్షలు గుమ్మరించాలో తెలుసా? చదివింది చాలు గాని ఇంక సరి పెట్టమను!" అంటూ మా మేనత్తలూ ఇతర బంధువులూ హెచ్చరించారు.

కానీ నాన్నగారు " విద్య మనిషికి ఆభరణం లాంటిది... అది మనకు సంపదలు ఉన్నా లేకున్నా మణిదీపంలా ప్రకాశించి దిక్సూచిలా దారి చూపుతుంది. నేను నా పిల్లలకు ఆస్తులూ అంతస్తులు ఏమీ ఇవ్వలేదు.. ఇల్లాలి చదువు ఇంటికి ప్రపంచానికి వెలుగంటారు... అలా నా కూతురు ఇల్లు దిద్దుతూ తన తమ్ములిద్దరినీ చదివిస్తూ తనంతట తాను చదువుకుని వృద్ధిలోకి వస్తుంటే నేనెలా కాదనగలను? చదువుకోనివ్వండి. భగవంతుడు దానికి మంచిదారి చూపకపోడు!" అన్నారు ఆశాభావం తో. అలా అక్క ఏ కాలేజీల్లోనూ యూనివర్సిటీ లోనూ చేరకుండానే ఎంఏ పూర్తి చేసింది. చదువయ్యాక ఒక ప్రైవేటు కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేరింది. 

అక్క ఇంటా బైటా చాలా కష్ట పడుతుందని నాన్నగారు 'ఎందుకమ్మా ఇంటి చాకిరీ తో పాటు ఈ ఉద్యోగం? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కాను?" అన్నారు ఆరాటంగా. "మరేం ఫర్వాలేదు నాన్నగారూ.. వేణీళ్లకు చన్నీళ్లలా తోడ్పడుతుంది నా జీతం. తమ్ముల్లిద్దరివీ డిగ్రీలు పూర్తి అయితే పీజీలకు, అలాగే.. మన ఇంటి పరిస్థితుల దృష్ట్యా అదనపు ఆదాయం ఇప్పుడు చాలా అవసరం కదా!" అంది అక్క నచ్చజెప్తూ.

తమ్ముడు ఎంకాం ఫస్టియర్లో ఉండగా బేంక్ టెస్ట్ లు రాసి సెలెక్ట్ అయి ఉద్యోగం లో జాయిన్ అయిపోయాడు.. నేను రాశాను కానీ సెలెక్ట్ కాలేదు. నేను పీజీ పూర్తి చేశాను... మొదటిసారి ఇంటర్వ్యూ కి బయలు దేరాను. నాన్నగారు అక్కా నాకు బెస్ట్ విషెస్ చెప్పి పంపించారు. నేను కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను.. వారడిగిన దానికి సంతృప్తికరంగానే సమాధానాలు చెప్పాను. తప్పక సెలెక్ట్ అవుతానని అనుకున్నాను. తీరా వారు ఎంపిక చేసిన జాబితాలో నాపేరు లేకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురయ్యాను. ముఖం వేలాడేసుకొని ఇంటికి రావడంతో ఇంట్లో అందరికి అర్థమైపోయింది నాకా ఉద్యోగం రాలేదని.. అందుకని ఎవరూ ఏమీ అడగలేదు. నేను భోజనం మానుకొని ఢీలాపడి కూర్చోవడం చూసి అక్క నా దగ్గరకు వచ్చి "ఏంట్రా రామూ ఇది? ఒక్క ఇంటర్వ్యూ తోనే అంతా ముగిసినట్టేనా..వాళ్లందరికీ వచ్చాయి. నాకు రాలేదని దిగులు పడకురా... కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పదనం ఏమీ లేదురా.. కింద పడిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో లేచి నిలబడి ముందుకు సాగాలి. ఎత్తుకు చేర లేదని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు... ఈరోజు నీకెదురైన ఓటమికి కారణాలు సమీక్షించుకొని రేపటికి సిద్దపడాలి.. ఆలోచించు అన్వేషించి అడుగు ముందుకు వెయ్యి. అప్పుడు అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి.. పద, అన్నం తిందాము!" అంటూ నా చేయి పట్టుకొని తీసుకు వెళ్లింది. 

అక్క ఏం చెప్పినా సరైన అంచనాతోనే చెప్తుంది. అందుకే అక్క మాటలు మాకు శిలాక్షరాలు. నాకు ఉద్యోగం వచ్చింది అక్క చెప్పినట్లే!

తమ్ముడూ, నేనూ ఉద్యోగస్తులం కావడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయాయి. అక్కకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు నాన్నగారు. భద్రాచలం పేపరుమిల్లులో సూపర్వైజర్ గా పని చేస్తున్న సురేంద్ర గారితో అక్క వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. బావగారు ఇంటికి పెద్దకొడుకు.. తండ్రి లేకపోవడం వలన కుటుంబ భారమంతా ఆయన మీదే పడింది. 

పెళ్లయ్యాక అయినా అక్క సుఖపడుతుంది అనుకున్నాను. ఉద్యోగం లో బదిలీ అయినట్లు ఇల్లు మారింది తప్ప అక్క జీవితంలో పెద్దమార్చేమీ కలగ లేదు. ఇక్కడ మిమ్మల్ని బాధ్యత గా చదివించేది. అక్కడ తనమరుదులు ఇద్దర్నీ ఆడపడుచునూ చదివించసాగింది. పైగా కోడలిగా అక్కమీద మరిన్ని బరువు బాధ్యతలు పడ్డాయి. అక్కా బావగారూ. వారి అవసరాలను తీర్చడం కోసం తమ అవసరాలను కుదించుకోసాగారు. అక్కడ అక్కకి ఉద్యోగం కూడా లేక పోవడంతో ఇంటి వద్దనే ట్యూషన్లు చెప్పసాగింది. ఇలా కొవ్వొత్తిలా కరిగి పోతూ అందరి జీవితాలలో వెలుగులు నింపసాగింది. 

అలా సంవత్సరాలు గడిచిపోయాయి. నేనూ తమ్ముడూ పెళ్లి చేసుకొని ఎవరి సంసారపు గొడవల్లో వాళ్లు పడిపోయాము. అమ్మా నాన్న కాలం తీరి వెళ్లిపోయారు. అక్కకి పిల్లలు లేకపోయినా తన మరుదులనూ ఆడపడుచునే తమ బిడ్డలుగా ఎంచి వారికోసం అక్కా బావగారూ ఎంతో కష్ట పడ్డారు. వారి శ్రమ ఫలించి అందరూ జీవితంలో స్థిరపడ్డారు. ఎవరి జీవితాలు వారికి అయ్యాక వాళ్లముగ్గురికి ఏదైనా అవసరం పడితే తప్ప అన్నయ్యా, వదినా గుర్తుకు రారు. అలా అవసరం తీరాక అక్కాబావలనే కాదు, వాళ్ల అమ్మగారిని పట్టించు కోవడం మానేశారు. అయినా వారిపై మమత చావక వారి కోసం ఏవేవో చేస్తూ ఇంకా తాపత్రయ పడుతూనే ఉన్నారు. నాకు వాళ్లింకా కష్టపడడం ఇష్టం లేక అక్కతో మాటలు బంద్ చేశాను.. అలా అయినా తన పద్ధతి మార్చుకొని ఇప్పుడైనా వారి కోసం వారు బ్రతుకుతారని.. కానీ అలాంటిదేమీ జరగ లేదు. తన బాధలు చూడలేక చెప్పినా వినడం లేదని ఒకలాంటి విరక్తిలో పడిపోయాను నేను.

ఆడపడుచు కుమారి పురిటికి పుట్టింటికి వచ్చింది. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఒక్క ఆడపిల్ల కనుక కూతురికి అచ్చట్లు ముచ్చట్లు బాగా జరగాలని అక్క అత్తగారి ఆశ... కానీ అందరూ సంపాదన పరులే అయినా ఎవరూ.. కుమారీ విషయం ఎత్తలేదు. అయినా అత్తగారు అన్ని లాంఛనాలు జరిపించవలసిందే అంటూ పట్టుబట్టింది.. పేపరుమిల్లు సమ్మె వలన సురేంద్ర కి మూడు నెలల నుండి జీతాలు లేవు.. అలాంటి స్థితిలో కొడుకు ఇవన్నీ ఎలా జరిపిస్తాడు అని ఆలోచించలేదామె.. పైగా ఏ చిన్న లోపం కనిపించినా... దీంతో నీకెలాగూ ఏ శోభలూ లేవు. అందుకని నా కూతురికి తూ తూ మంత్రం జరిపిద్దామని చూస్తున్నావు!" అంటూ మనసు గాయపడేలా మాట్లాడేది. దాంతో ఉన్నా లేకపోయినా అప్పుచేసైనా ఆమె కోరిన విధంగా చేయసాగారు.. కుమారి ప్రసవించాక బారసాల నాడు బాబుని ఇంత కష్టపడి అన్నీ చేసిన అక్క చేతికి ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదట. మరుదులూ తోటికోడళ్లూనూ.. కేవలం పనికోసమే ఆమె అన్నట్లు చూశారు. అందరూ వెళ్లిపోయాక మనసు భారం దిగేలా ఏడుస్తున్న అక్క దగ్గరకు వచ్చి బావగారు "ఊరుకో పద్మా ఏడవకు, అదే వాళ్ల అసలు నైజం... అలాంటి సంస్కార హీనుల కోసం నీ కన్నీళ్లు వృధా చేసుకోకు!" అంటూ ఓదార్చారట. ఇలా అక్క దేనికో దానికి కష్ట పడుతూ అవమానాలు పొందుతోంది అని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత నాది.

రెండేళ్ల తరువాత అక్కే ఫోన్ చేసింది నాకు..." హలో రామూ ఎలా ఉన్నావురా? నాతో మాట్లాడడమే మానేశావేంట్రా!" అంది బాధగా.

 "నాకేం నేను బాగానే ఉన్నాను... నామాట వినకుండా నీకు తోచినట్టు నువ్వు చేసుకు పోతూంటే ఏంచేయాలి నేను?" అన్నాను..

 'అరే,నాన్నా.. నువ్వు కూడా అలా అంటే ఎలారా.. ఇంతేనా నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది? మిమ్మల్ని ఎలా చూశానో వాళ్లని కూడా అలాగే నావాళ్లనుకొని చూశాను.. మామీద లేకపోయినా మీ బావగారికి నాకూ పెంచిన మమకారం పోలేదురా. ఏం చేయను?సరే, అవన్నీ ఎందుకులే కానీ.. మీ బావగారికి పదిహేను రోజుల క్రితం మైల్డ్ గా హార్డేటాక్ వచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది.. రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకు వచ్చాను.. వాళ్ల ముగ్గురినీ చూడాలని ఉందని అడిగారు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా అత్తగారు ఫోన్ చేసి విషయం చెప్పారని అన్నారు అంతే తప్ప అన్నయ్యకు ఎలా ఉంది అని ఒకరూ అడగలేదు. అలా అడిగితే మేము వాళ్లని ఏదైనా ఆర్థిక సాయం అడుగుతామని అనుకున్నట్లున్నారు. అందుకనే ఎవరూ రాలేదు.... ఇప్పుడు మీ బావగారు నీతో ఏదో మాట్లాడాలని ఉందంటే ఫోన్ చేస్తున్నాను. ఒకసారి వచ్చి వెళ్లరా!" అంది దీనంగా. 

బావగారికి అలా అయిందని వినడంతో నే నా మనసు గిలగిల లాడిపోయింది "ఏంటక్కా ఇంత జరిగినా. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు!" అన్నాను నేను నిష్టూరంగా. 

"ఎక్కడరా ఒక్కదాన్నీ అన్నీ చూసుకోవలసి వచ్చింది.. అయినా నీ మనసు నాకు తెలియదా... వెంటనే బయలుదేరి రా!" అంటూ ఫోన్ పెట్టేసింది నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే బయలు దేరాను. నన్ను చూడగానే బావగారి ముఖంలోకి కాంతి వచ్చింది. నా చేతిని ఆర్తిగా పట్టుకొని వచ్చావా రాము మామీద కోపం తగ్గిందా?" అనడిగారు.

బావగారిని ఆ స్థితిలో చూడడంతోనే నాకు కన్నీళ్లు ఆగలేదు..."అయ్యో అదేంలేదు బావగారూ.. మీమీద నాకు కోపం ఏమిటి?" అన్నాను బాధగా.

"నాకు తెలుసులే నీమనసు నవనీతమని.. నిన్నిప్పుడు ఎందుకు పిలిపించానంటే .. నాకేదైనా అయితే మీ అక్క బాధ్యతను నువ్వు తీసుకోవాలని రిక్వెస్ట్ చేద్దామని...." అంటున్న బావగారి మాటలను అక్క పూర్తి చెయ్యనివ్వ లేదు. 

"అందుకేనా వీడిని రమ్మన్నారు. మీరలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకండి, మీకేం కాదు!" అంది అక్క ఏడ్చేస్తూ.

"కాదు పద్మా, నన్ను చెప్పనివ్వు.." అంటూ నావైపు తిరిగి " రాము. మా తమ్ముళ్లను మా చెల్లిని మేము కన్న బిడ్డల్లా చూసుకున్నాము. కానీ వాళ్ళు మమ్మల్ని అవసరానికి వాడుకున్నారే గాని కొంచెం కూడా మమకారం లేదు. నాకింత సుస్తీ చేస్తే చూసేందుకు ఎవరూ రాలేదు. మీ అక్క నా కోసం ఇంత అవస్థ పడుతుంటే.. ఇలాంటప్పుడైనా మా అమ్మని ఎవరూ తీసుకు వెళ్తామని అనలేదు...అసలు వాళ్లకి బాధ్యత గానీ మానవత్వం గానీ లేనే లేదు. ఇప్పుడే ఇలా ఉంది రేపు నాకేదైనా అయితే మీ అక్క పరిస్థితి ఏమిటి? తనని నువ్వే చూసుకోవాలి అందుకే పిలిచాను. మీ అక్కకి పెన్షన్ వస్తుంది కనుక ఆర్థికపరమైన ఇబ్బంది ఏమీ ఉండదు. నా అనే అండను నీవు తప్ప ఎవరూ ఇవ్వలేరు అని నా నమ్మకం! " అన్నారు ఆయాసపడుతూ.

బావగారికి నామీద గల నమ్మకానికి ఆనంద పడాలో.. వారిని ఆ దుస్థితిలో చూడవలసి వచ్చినందుకు బాధ పడాలో అర్ధం కాలేదు నాకు. నేను రెండు చేతులతో ఆయన చేతులు గట్టిగా పట్టుకొని "అక్క విషయంలో మీరేమీ దిగులు పడకండి బావగారూ.. తనని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను.. అవన్నీ తరువాత సంగతులు.. ముందు మీరిద్దరూ నాతో బయలుదేరండి విశాఖపట్నం... అక్కడ మంచి మంచి స్పెషలిస్టులు ఉన్నారు వారికి చూపిస్తాను" అన్నాను ఉద్వేగంగా. 

"నాకు తెలుసు రామూ నీ మనసు. ఈ పరిస్థితుల్లో ప్రయాణం చేయలేను!" అన్నారు నీరసంగా.

"పరవాలేదు బావగారూ నేను జాగ్రత్తగా కారులో తీసుకు వెళతాను.. అందుకే కారు తెచ్చాను!"
అన్నాను నచ్చ జెప్తున్నట్లుగా. అక్క బావగారి వైపు ఆశగా చూస్తూ 

"వెళ్దామండి రామూతో.. అక్కడ ఇక్కడి కంటే మంచి డాక్టర్లు ఉన్నారు!" అంది. మా ఇద్దరి మాటా తోసిపుచ్చలేక బావగారు సరేనన్నారు. అక్క నిశ్చింతగా సామాన్లు సర్దుకోసాగింది. అలా ప్రేమకు చిరునామా అయిన ఆ పుణ్య దంపతులను నా ఇంటికి తీసుకు వెళ్ళే అవకాశాన్ని దక్కించు కున్నాను.

No comments:

Post a Comment

Pages