శివం - 75 - అచ్చంగా తెలుగు
శివం - 75 
రాజ కార్తీక్ 

(హర సిద్దు న్యాయ విచారణ చేస్తున్నాడు. బందీ పోటు ను పట్టి గుడి కి తీసుకు వచ్చిన తర్వాత)

కత్తిని అటుగా తిప్పి అడగవలసినవి అడిగి, ఇక చివర అస్త్రంగా వేటు వేయబోయాడు హరసిద్ధు. కత్తి కొన పాక్షికంగా తగలటం వల్ల రక్తం రావటం కూడా మొదలైంది...

బందిపోటు 'వద్దు బాబు వద్దు! బాబు వద్దు!' అని హడలిపోయి భయ అవస్థలో ఉన్నాడు.

హర సిద్దు "చెప్పు మరైతే ఎవరు? ఎవరు మహారాజు మీద దాడి కి నిన్ను ప్రేరేపించింది..?"

గుడి తలుపులు వేసి ఉన్నాయి. ప్రహరీ  నుండి చీమ తప్ప ఏదీ బయటికి వెళ్లలేదు.

హర సిద్దు "ఎవరు ఆ 'న' గుణింతం మీద నామకరణం చేసుకున్న నీచుడు రాజద్రోహి?" అని‌ అడిగాడు మళ్లీ.

ఆ గుడిలో ఉన్న సమూహంలో 'న' అక్షరం మీద మొదలయ్యే ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పైగా రాజపరివారాన్ని ఎటూ తప్పించుకోవడానికి వీలులేకుండా కట్టేసి,  ఒకవేళ ముందుకు జరిగిన బాణాలు వదిలే విధంగా ఎక్కుపెట్టి సైనికుల్ని సిద్ధంగా ఉంచాడు హర సిద్దు...

హర సిద్దు "ఆలస్యం అమృతం విషం నీ ప్రాణంతో చెలగాటమిది. నిదానమే ప్రధానం అనుకోవటానికి ఇది ఎదగవల్సిన పని కాదు. తప్పు తేల్చవలసిన పని." అంటూ కత్తి తీసుకొని మరొక వైపు బలంగా వేయబోయాడు.

బందీ పోటు "నాగా చారి" అని గట్టిగా అరిచాడు.

రాజ ప్రముఖులందరూ బిత్తరపోయారు. ఏంటి?  గత 50 సంవత్సరాలుగా రాజ్యంలో నమ్మకంగా ఉంటూ, కోశాగారం ధనాగారం పర్యవేక్షించే నాగ చారి ఇదంతా చేశాడా..?

ముసలివాడైన మహారాజు తనకు తీరని అన్యాయం జరిగిన విధంగా  కొంత  తూలి పోయాడు...

నాగా చారి మాత్రం ముందుగానే తాళ్లతోకట్టడంవల్ల, మౌనంగా తల దించుకొని తన పన్నాగం బయటపడింది అని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

హర సిద్దు వెంటనే "సరే. వారు ఎవరైనా వారికి మరణం తప్పదు. అందులోనూ ఇది రాజద్రోహం! నమ్మకస్తుడైన అంతఃపురపు బంటు మాత్రమే, ఇలా రాజు గారి గురించి సమాచారం ఇవ్వగలరు, ఇది ముమ్మాటికీ క్షమించరాని చర్య. ఇతనికి విధించే శిక్ష చూసి వేరొకరు మళ్లీ ఇటువంటి పని చేయడనికి గజగజ వణకాలి..." అన్నాడు.

అక్కడ అందరూ మన హర సిద్ధుని చూసి..
 "అబ్బా! భలే వాడు రా! బందిపోట్లు ను బురిడీ కొట్టించాడు, వాళ్లని మానసికంగా ఎంతో  కృంగ తీసి... వారితో పోరాడి, ఇది కచ్చితంగా రాజు గారికి ఎవరో చేసిన వెన్నుపోటు చర్య అని గ్రహించి... అంతఃపురం లో ఇక్కడికి వచ్చిన వారందరికి కాళ్లు చేతులు కట్టేసి,  తప్పించుకోకుండా ఎక్కుపెట్టిన బాణాన్ని వేసి... వారందరికీ గుబులు పుట్టించాడు. విర్రవీగిన బందిపోటు చేత నిజం చెప్పించాడు. కథానాయకుడు అయ్యాడు" అని అందరూ అనుకుంటుంటే నాకు ఎంతో ఆనందం వేసింది.

 అందరిలోనూ నేను ఉన్నా, నా నా భక్తుల్లో అధికంగా ఉంటా. ఎలా అయితే  బిడ్డ చేసిన మంచి పనిని పొగుడుతూ, బిడ్డని ప్రశంసిస్తుంటే తండ్రి ఏవధంగా ఆనందపడతాడో, ఆ విధంగా హార సిద్దు ను చూసి ఎంతగానో పొంగిపోయాను. భక్తులారా మీరు కూడా ఇలా ధర్మంగా ఎదిరించి పోరాడి, చాకచక్యంగా ప్రవర్తించి, న్యాయాన్ని గెలిపించండి. మిమ్మల్ని చూసి కూడా అంతే ఆనందపడతాను.

వృద్ధుడైన మహారాజు ధర్మయ్య ను ఆసరాగా తీసుకుని, నాగాచారి దగ్గరికి వెళ్ళాడు.

మహా రాజు "నాగయ్య, నేను ఏనాడైనా నిన్ను ఒక పల్లెత్తు మాట అన్నానా? పేరుకు నేనే రాజు అయినా, నీవు నా సేవకుడవు అయినా, గత అయిదు దశాబ్దాలుగా నిన్ను నా స్నేహితుడిగానే చూశాను. కానీ నువ్వు ఏం చేశావు? నీకేం కావాలో నేను ఇవ్వనా, వృద్ధుడైన నన్ను చంపితే నీకేం వస్తుంది, మనల్ని ఎవరు చంపినా చంపక పోయినా, మనమే మరణిస్తాం. నేను లేని రాజ్యం ఏమై పోతుంది, ఎందుకు ఇలా చేశావు నాగయ్య?" అని ప్రాణస్నేహితుడు అడిగినట్టు బాధపడుతూ అడుగుతున్నాడు.

హర సిద్దు మాత్రం కత్తి ఇంకొక సారి బందీ పోటు మీద పెట్టాడు.

బందిపోటు "మీరు లేకపోతే యువ రాణి, వారి అబ్బాయి..."

ఇక అంతా హర సిద్దు కి అర్థమైంది.

హర సిద్దు "మహారాజా మీకు అర్థం కాలేదా? నాకు అర్థమైంది , ఈ రాజ్యానికి మీ తర్వాత అండ లేదు, ఏవో జాతక ఫలితాల వల్ల మీ కూతురు కి వివాహం కావట్లేదని విన్నాను, మిమ్మల్ని పక్కకు తప్పించి ఈ నాగయ్య తమరి మాటగా మీ తదనంతరం అందరినీ నమ్మించి, బందిపోటు మీద  పాపం వేసి, ఎలాగో  స్నేహితులు గా మీ కుటుంబానికి తెలిసి ఉంటుంది కాబట్టి . "మీ నాన్నగారు నాతో ఇలా అన్నారు" అని తన కొడుకుని మీ కుమార్తెకిచ్చి వివాహం జరిపి, ఈ రాజ్యానికి యజమాని అవుదామని గుంటనక్క వలే పన్నాగం పన్నాడు. కానీ ఆ కుంభ స్వామి దయవల్ల, ఆ బొజ్జ లింగం కృపవల్ల మీరు బతికారు" అన్నాడు.

మహారాజు "లేదు బాబు! నీవల్లే నేను బతికాను, దేవుడు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మంచికి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆ రూపం నువ్వు అయ్యావ్" అన్నాడు కృతజ్ఞాతగా.

ధర్మయ్య కూడా అదే మాటగా చెప్పి, హర సిద్ధుని ఎంతో ప్రశంసించాడు.

హార సిద్ధుని కి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనుషులు తనని ఒక ధనం లేని వాడిగా కాకుండా, బొజ్జ లింగస్వామి ప్రతినిధిగా చూస్తున్నారు. స్వతంత్రంగా తను ఒక పని చేస్తే ఎలా ఉంటుందో, దాని పర్యవసానం చూసి, తన పనితనాన్ని, అందరూ ప్రశంసిస్తుంటే, ఆదరణ లేని తన విద్య, క్రుంగిపోయిన తన మనస్సు మళ్లీ యథాస్థితికి వచ్చాయి.

హర సిద్దు "మహారాజా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు ఇతనికి కఠిన శిక్ష వేయండి, ఎవరికైనా క్షమాభిక్ష పెట్టొచ్చు కానీ నమ్మకద్రోహి పొరపాటున కూడా పెట్టకూడదు" అన్నాడు.

మహారాజు "అవును హార సిద్దు. రేపు ప్రతిష్ట అవ్వగానే ఉత్సవం తర్వాత విచారించి వీళ్ళ వెంట ఇంకా ఎవరు ఉంటారో తెలుసుకొని, మా రాజ్య చట్టాల ప్రకారం వీరికి దండన విధిస్తాను. వీరందర్ని కట్టుదిట్టమైన భద్రత తో చీకటి కొట్టం లో వేయండి" అని ఆజ్ఞాపించాడు.

హర సిద్దు "మహారాజా పనిలోపని నాగాచారి కుమారుని కూడా అదుపులోకి తీసుకోండి" అన్నాడు.

ధర్మయ్య "ఉండవలసిన వాడివి నువ్వు " అని అతని భుజం గట్టిగా తట్టాడు.

హర సిద్దు "నువ్వు కూడా బాబాయ్, ఎన్ని చెప్పినా మహారాజు పక్కనే ఉండి, నువ్వు చేయాల్సినవన్నీ మా కన్నా బాగా చేశావు అందుకే  రాజు గారికి చిన్న గిటు కూడా పడలేదు" అంటూ సరదాగా మాట్లాడాడు.

నేరస్తులు అందర్నీ ఒకసారి చూసి, తనతో వచ్చి, ధైర్యంగా పోరాడిన సైన్యాన్ని కొనియాడి, దోషులను తీసుకు వెళ్ళమన్న రాజాజ్ఞ కోసం అర్ధించాడు..

మహారాజు తల ఊపడంతో ఆజ్ఞ ఖరారైంది...

అందరూ అక్కడ 'జయహో మహారాజా! జైహో హార సిద్దు!' అన్నారు.

హర సిద్దు "ఆలయంలో ఒక భగవంతునికి తప్ప, ఎవరికీ జయ ధ్వనాలు చేయకూడదు.." అన్నాడు.

అందరూ నన్ను గట్టిగా స్మరించారు.

ఇక హర సిద్ధు, ధర్మయ్యల చలోక్తులతో .. అందరూ సరదాగా నవ్వుకున్నారు.
మహారాజు చాలాసేపు అక్కడే ఉండి, మనస్ఫూర్తిగా నవ్వుకొని, హర సిద్ధుని అంతఃపురానికి విందుకు ఆహ్వానించారు. 

హార సిద్ధుడు ముందు "ఈరోజు రాజ పరివారంతో విందు చేస్తే, మళ్లీ రేపు కూడా అదే కావాలనిపిస్తుంది" అని మనసులో అనుకుంటూ తటపటాయించినా... ధర్మయ్య ప్రోద్బలంతో విందు కి వెళ్ళటానికి ఒప్పుకున్నాడు.

ఇక ఆ ఘట్టం అలా ముగిసిపోయింది....

హర సిద్ధుడు బొజ్జ లింగానికి అభిషేకం చేస్తున్నాడు.‌ హరసిద్ధుని చేతిలో ఉన్న పెద్ద పళ్లెంలో, ధనమున్న మూటలు తనకు దక్షిణగా   మోయలేనంత పడ్డాయి.   

చూద్దాం హార సిద్దుడు తర్వాత ఏం చేయబోతున్నది...

No comments:

Post a Comment

Pages