శవగంగ ఘోష - అచ్చంగా తెలుగు
'శవ గంగ ఘోష..!'
-సుజాత.పి.వి.ఎల్.
కోట్లున్నా..కోటలున్నా
కోవిడ్ ముందు దిగతుడుపే..
బంధు మిత్రులు..బలగం ఎంతున్నా..
పాజిటివ్ అని తెలిసిందో
పలకరింపు కూడా కరువే..
ఆస్తిపాస్తులున్నా..అంతిమ యాత్ర లేదు..
అంతా మనవాళ్ళే అయినా అనాధలా పోవక తప్పటం లేదు..
విష జీవి విన్యాసానికి
స్వీయ బందిఖానాలో
మగ్గుతున్నా మృత్యువు వదలడం లేదు..
ఏ రకంగానైతేనేం..
కూడబెట్టిన సంపద 
ఒక్క ప్రాణాన్ని నిలుపలేకపోతోంది..
పదవున్నా..ప్రాణం దక్కడం లేదు..
పేర్చిన శవాల దిబ్బలను చూడలేక 
స్మశానం మౌనంగా రోదిస్తోంది..
కరుణ లేని కరోనా..
లయతాళాల్లేని అపశృతి రాగం వినిపిస్తూంటే..
ఊపిరి గొట్టాల్లో 
భయం భైరవ నాట్యం చేస్తోంది..
ఏ జీవుడి గుండెలో దీపం ఆరునో తెలీక..
మృత్యు దేవత చుట్టమై
బతుకు జీవుడ్ని గాఢాలింగనం చేస్తోంది..
ఒక్కొక్కరిని ఒంటరిని చేసి
వికృత విలయతాండవమాడుతున్న
అదృశ్య కీటక హననం కోసం
ఆశగా ఎదురుచూస్తున్న..
అంతిమ సంస్కారానికి నోచుకోలేని..శవ గంగా ప్రవాహంలో కొట్టుకొచ్చిన
పార్థివ శరీరాల ఆత్మలు. .
పంచభూతాలలో కలవలేక ఘోషిస్తున్నాయి..!
****

No comments:

Post a Comment

Pages