శ్రీధర మాధురి - 87 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి - 87

Share This

 శ్రీధర మాధురి - 87

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )


దక్షిణ భారతంలో ఒకచోట  కాదంబరి అనే గొప్ప జానపద నృత్యకారిణి ఉండేది. ఆమె క్రమం తప్పకుండా ఒక ఆలయంలో భైరవుడి ముందు నాట్యం చేసేది.

ఆ ఆలయంలో సోమనాధ శాస్త్రి అనే పూజారి ఉండేవారు. ఆయన దైవారాధన పట్ల అత్యంత అంకితభావాన్ని  కలిగి ఉండేవారు. ఆయన కఠినమైన క్రమశిక్షణ కలవారు. ఆయనకు సంగీతం, నాట్యం అంటే ఇష్టం ఉండేది కాదు. కాని కాదంబరి ఒక నర్తకి అని, ఆయన లేనప్పుడు దైవం ముందు ఆమె నాట్యం చేస్తుందని, ఆయనకు తెలుసు.

ఆలయంలో సోమనాధ శాస్త్రి లేనప్పుడల్లా, కాదంబరి భైరవుడి ముందర నాట్యం చేస్తూ ఉండేది. కొన్నిసార్లు ఆమె కొన్ని గంటల పాటు, దైవం ముందు నాట్యం చేసేది.

ఒకరోజున ఆమె నాట్యం చేస్తూ ఉండగా, గుళ్ళోకి వస్తున్న సోమనాధ శాస్త్రి అడుగుల చప్పుడు వినబడింది. వెంటనే ఆమె నాట్యం ఆపేసి, ఆలయ ప్రాంగణంలో దాక్కుంది. సోమనాధ శాస్త్రి పూజ పూర్తి చేసి, రాత్రి 9 అయ్యింది కనుక, గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు.

ఆయన వెళ్ళాకా, ఆ రాత్రంతా దైవంతో గడపచ్చు కనుక .కాదంబరి చాలా ఆనందపడింది. అందుకే ఆమె గంటల కొద్దీ భైరవుడి ముందు ఆ రాత్రి నాట్యం చేసింది. ఆ తర్వాత అలసిపోయి, గర్భ గుడిలో నిద్రపోయింది.

ఉదయాన్నే సోమనాధ శాస్త్రి ఆలయం తెరిచి, భైరవుడి పూజ కోసం లోపలకు వచ్చి, గర్భగుడిలో సరిగ్గా భైరవుడి విగ్రహం ముందు కాదంబరి పడుకుని ఉండడాన్ని చూసాడు. వెంటనే గుడి బయటకు పరుగెత్తుకు వెళ్లి, ఊరి పెద్దల్ని వెంటపెట్టుకుని వచ్చాడు.

అప్పుడే మెలకువ వచ్చిన కాదంబరి, ఊరంతా తనవంకే తేరిపారా చూడడం గమనించింది. సోమనాధ శాస్త్రి శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించి, మొత్తం గ్రామం పరువు తీసినందుకు కాదంబరిని నిందించాడు. అదీకాక, గర్భగుడి లోనికి స్త్రీ ప్రవేశించి, అగౌరవించినందువల్ల, అది మొత్తం గ్రామానికి ముప్పు తెస్తుందని, ఆలయ ప్రక్షాళన చెయ్యాలని, ఆయన అన్నారు.

పరిణామాలకు భయపడ్డ గ్రామపెద్దలు శాశ్వతంగా గ్రామం వదిలి పొమ్మని, కాదంబరిని శాసించారు. తనను గ్రామంలోనే ఉండనివ్వమని, కాదంబరి ఊరిపెద్దల్ని బ్రతిమాలింది. ఆమె సోమనాధ శాస్త్రి పాదాలపై పడింది. అయినా ఆయన ఆమె పట్ల ఎటువంటి జాలి చూపకుండా, ఆమెపై అరిచారు. అందుకే కాదంబరి బరువైన గుండెతో దారి పొడవునా ఏడుస్తూ ఊరొదిలి వెళ్ళింది.

ఆ గ్రామానికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక శిధిలమైన ఆలయం ఉంది. అందులో ఒక ముని నివసిస్తున్నారు. ఆమె మునికి తన కధంతా చెప్పింది. అప్పుడు సాధువు, తాను ధ్యానంలో ఉన్నప్పుడు ఆమె భైరవుడిని తలచుకుంటూ తన ముందు నాట్యం చేసేందుకు అంగీకరిస్తే, ఆమె అక్కడే తనతోపాటు ఉండవచ్చునని చెప్పారు. కాబట్టి, ప్రతిరోజూ ఆ ముని తీవ్ర తపస్సులో ఉండగా, కాదంబరి తన భైరవుడి గురించే ఆలోచిస్తూ ఆ ముని ముందర నాట్యం చేసేది.

మూడు విశిష్టమైన రోజుల్లో, మూడు రోజులపాటూ దైవాన్ని, గర్భగుడిని ప్రక్ష్యాళన చేసేందుకు సోమనాధ శాస్త్రి గ్రామ ప్రజలతో కలిసి, గొప్ప ఉత్సవానికి ప్రణాళిక వేసాడు. మొదటి రెండు రోజులూ ప్రశాంతంగా గడిచిపోయాయి.

ఈలోపల పవిత్రోత్సవాల రోజున ఆలయాన్ని దర్శించాలన్న తన కోరికను కాదంబరి మునికి తెలియజేసింది.

ముని ఇలా అన్నారు,’కాదంబరి, మనం ఇలా వెళ్తే, అంతా నిన్ను గుర్తుపట్టేస్తారు. నేను కూడా నీతో వస్తాను. మనం దేశ ద్రిమ్మరుల లాగా వేషాలు వేసుకుని వెళ్దాము’, అన్నారు. ఇద్దరూ వేషాలు మార్చుకుని, మూడవ రోజున ఘనంగా జరుగబోయే పవిత్రోత్సవాలను చూసేందుకు బయలుదేరారు.

మూడవ రోజున ఘనంగా  పవిత్రోత్సవాలు మొదలయ్యాయి. గ్రామ ప్రజలంతా గుమిగూడారు. దేశాటనం చేసేవారి వేషాల్లో ఉన్న కాదంబరి, ముని కూడా ప్రజల్లో కలిసిపోయారు. సోమనాధశాస్త్రి ఒక బ్రాహ్మణ సమూహంతో కలిసి, వేద మంత్రాలను చదవసాగాడు. వారు తెర తియ్యగానే అక్కడ దేవుడు కనిపించలేదు. దేవుడి విగ్రహం మాయమయ్యింది. అందరిలో అలజడి చెలరేగింది. ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. సోమనాధశాస్త్రి మూగబోయాడు. ‘ఇదెలా జరిగింది? గత రెండు రోజులుగా దైవం ఇక్కడే ఉన్నారు కదా, రాత్రికి రాత్రే కనబడకుండా పోయారు. దీనికి అర్ధం ఏమిటి? నేనేదైనా తప్పు చేసానా? ఓ దైవమా ! ఏ విధమైనా తప్పు చేసినా, దయుంచి నన్ను మన్నించండి.’

ముని ముందుకు వచ్చి, సోమనాధశాస్త్రితో ఇలా అన్నారు,’ సోమనాధా ! కేవలం నీ వేద మంత్రాలతో నీ దైవం తృప్తి చెందట్లేదని నేను భావిస్తున్నాను. శాస్త్రాల్లో ఉన్న విధంగా నీవు పాటించే ఆచారాలతో ఆయన తృప్తి పడట్లేదు. ఆయనకు వేరేదో కావాలేమోననిపిస్తోంది. గతంలో ఆయనను ఎవరైనా నాట్యంతో అలరించేవారా? ఎవరైనా ఆయన ముందు నాట్యం చేసేవారా?’

సోమనాధుడు ‘అవును, వృద్ధమునీ ! దేవుడి ముందు నాట్యం చేసి, ఆయన్ను అలరించే కాదంబరి అనే ఒక నర్తకిని వెలివేయడం ద్వారా  నేనొక పెద్ద తప్పును చేసాననిపిస్తోంది. ఆమెను గ్రామం నుంచి వెలివేయడం ద్వారా నేను పాపం చేసాను. ఇప్పుడామె ఎక్కడ ఉందో నాకు తెలీదు. నాకు తెలిస్తే కనుక, ఆమెను క్షమాపణ కోరి, వెనక్కు తెస్తాను. అప్పుడు దైవం ఆమె నాట్యానికి ప్రసన్నులై తిరిగి ఈ గుళ్ళో కనిపిస్తారు.’ అన్నాడు.

ఈలోపల కాదంబరి ముందుకు వచ్చి, తానే కాదంబరినని వెల్లడించి, వెంటనే నాట్యం చెయ్యడం మొదలుపెట్టింది. దైవం కనిపించలేదు.

సోమనాధశాస్త్రి మునిని ఇలా అడిగారు,’ దైవమింకా మాచే తృప్తి పొందలేదా? ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు, నేను ఇంకా ఏమైనా చెయ్యాలా?’

ముని నవ్వీ, నవ్వీ, నవ్వీ చివరికి ఇలా అన్నారు,’ఆమె నాట్యం యొక్క సౌందర్యాన్ని చూస్తూ, నన్ను నేను మర్చిపోయాను. నేను ఇంకా చెయ్యవలసింది ఉందని మర్చిపోయాను. మీరందరూ భైరవుడిని, చూసేందుకు నన్నొకపని చెయ్యనివ్వండి,’ అంటూ ముని నేరుగా గర్భగుడిలోకి నడిచి, పీఠంపై కూర్చుని, ప్రతిమగా మారిపోయారు.

తిరుప్పతూర్ లోని ‘యోగ భైరవస్వామి’ ఆలయాన్ని మొట్టమొదటిసారి దర్శించినప్పుడు మహర్షి రాజర్ నాకు ఈ కధను చెప్పారు.  తిరుప్పతూర్ మధురై కి 60 కి.మీ ల దూరంలో ఉంది.

ఓం క్షం యోగ భైరవాయ నమః

అంతా దైవానుగ్రహం, ఆనందంగా ఉండండి.

No comments:

Post a Comment

Pages